భారత్‌కు ‘అధిక రక్తపోటు’!
- DV RAMANA

- Oct 11
- 2 min read

భారతీయుల్లో గతంతో పోల్చుకుంటే ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగిందన్నది వాస్తవం. యోగా, వాకింగ్ వంటి చర్యలతో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే అంతకుమించిన సంఖ్యలో అనారోగ్యం పాలవుతున్నవారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆధునిక జీవనశైలి, ఉద్యోగపరమైన ఒత్తిళ్లు యువతను సైతం రుగ్మత పాల్జేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా భారతీయుల ఆరోగ్యంపై విడుదల చేసిన నివేదిక ఇదే విషయాన్ని మరోమారు స్పష్టంగా పేర్కొంది. ఈ సంస్థ నివేదిక ప్రకారం.. మనదేశంలో 21 కోట్ల మందికిపైగా అధిక రక్తపోటు(హైపర్ టెన్షన్ లేదా హైబీపీ)తో బాధపడుతున్నారు. ఇంకో మాటలో చెప్పాలంటే.. భారత్‌లో హైబీపీ సైలెంట్ కిల్లర్‌లా మారుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. 21 కోట్ల మందికిపైగా హైబీపీతో బాధపడుతుంటే.. వారిలో 19 కోట్ల మందిలో ఈ సమస్య తీవ్రంగానే ఉందని వెల్లడిరచింది. ఈ ముప్పును తగ్గించేందుకు ప్రజలకు ప్రాథమిక సంరక్షణ స్థాయిలో గుర్తింపు, చికిత్స, నియంత్రణకు చర్యలు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వాలను సూచించింది. ప్రపంచవ్యాప్తంగా రక్తపోటు బాధితుల వివరాలతో డబ్ల్యూహెచ్‌వో(ప్రపంచ ఆరోగ్య సంస్థ) ఈ నివేదిక విడుదల చేసింది. ప్రపంచ దేశాల్లో ఈ రుగ్మత చాలా వేగంగా ప్రబలుతోందని అందులో ఆందోళన వ్యక్తం చేసింది. భారతదేశం గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ 30-79 మధ్య వయసు ఉన్న భారతీయుల్లో ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తోందని పేర్కొంది. ఈ ఏజ్ గ్రూపువారిలో సుమారు 30 శాతం మంది హైపర్ టెన్షన్‌తో బాధపడుతున్నారు. ప్రపంచ జనాభాలో సగటున 34 శాతం ఉంది హైబీపీతో బాధపడుతుంటే.. దానికి దాదాపు సమానంగా ఈ వ్యాధి మన దేశంలోనూ విస్తరిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. భారత్‌లో వ్యాధి విస్తరణతోపాటు బాధితుల పరిస్థితి కూడా చాలా ప్రమాదకరంగా ఉందని ఆ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. 173 మిలియన్లకుపైగా అంటే 17.30 కోట్ల భారతీయుల్లో వ్యాధి నియంత్రించలేని స్థితిలో ఉందని కేవలం 17 శాతం మందికి మాత్రమే వ్యాధి నియంత్రించగలిగే స్థితిలో ఉందని పేర్కొంది. ప్రపంచ స్థాయిలో 1.4 బిలియన్ల ప్రజల్లో హైబీపీ సమస్య ఉన్నట్టు రిపోర్టు వెల్లడిరచింది. హైబీపీ సమస్య మరికొన్ని తీవ్రమైన వ్యాధులకు దారి తీస్తుంది. దీన్ని తగ్గించుకోలేకపోతే.. గుండె పోటు, స్ట్రోక్, మూత్రపిండాల వ్యాధి, పెరాలసిస్ వంటి ఇతర వ్యాధులు వేగంగా సంక్రమిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. బీపీతో బాధపడుతున్న వారి సంఖ్య వేగంగా పెరుగుతుండటానికి ప్రధాన కారణం సకాలంలో గుర్తించి చికిత్స, ఇతర నివారణ పద్ధతులు పాటించకపోవడమే. ప్రతి ఐదుగురు హైబీపీ బాధితుల్లో ఒకరు మాత్రమే సరైన మందులు, తీసుకుంటూ, జీవన శైలిలో మార్పులు చేసుకుంటూ వ్యాధిని నియంత్రించగలుగుతున్నారు. నిర్లక్ష్యం చేసేవారు, అదుపులో పెట్టుకోలేని వారు లక్షల సంఖ్యలోనే అకాల మరణాలకు గురవుతున్నారు. తక్కువ, మధ్య ఆదాయ ఆర్థిక వ్యవస్థలు ఉన్న దేశాల్లో ప్రజలు ఈ వ్యాధి కారణంగా ఆర్థికంగా కూడా చితికి పోతున్నట్టు పేర్కొంది. ఫలితంగా గత ఐదేళ్లులో 3.7 ట్రిలియన్ డాలర్ల ఆదాయాన్ని ప్రపంచ దేశాలు కోల్పోయినట్టు అంచనా వేసింది. మన దేశానికి సంబంధించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) అధ్యయన వివరాల ప్రకారం ఆహారపు అలవాట్లు రక్తపోటు పెరగడానికి కారణమవుతున్నాయి. చాలామంది ఆహార పదార్థాల్లో ఉప్పు ఎక్కువగా వేసుకుంటుంటారు. ఈ అలవాటే కొంపముంచుతుంది. అలాగే కారం, మసాలాలు అధికంగా దట్టించి స్పైసీ ఫుడ్‌ను ఈ కాలం పిల్లలతోపాటు పెద్దవారు కూడా లొట్టలేసుకుని తింటుంటారు. ఇటువంటి ఆహారాలు బీపీతోపాటు ఇతర రోగాలను తెచ్చిపెడతాయని తెలియక కొందరు, తెలిసినా జిహ్వాచాపల్యాన్ని చంపుకోలేక ఇంకొందరు అడ్డూఆదుపూ లేకుండా తినేస్తుంటారు. వీటి ప్రభావం కొన్నేళ్ల తర్వాత కనిపిస్తుంది. ఇవి కాకుండా కుటుంబాల నిర్వహణ, ఉద్యోగాల్లో పెరుగుతున్న ఒత్తిళ్లు, ఊబకాయం వంటి సమస్యలు హైబీపీకి దారితీస్తున్నాయని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. చాలా కాలంగా హైబీపీ కేసులు పెరుగుతున్న విషయాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం దాన్ని అదుపు చేసే చర్యలు తీసుకుంటోంది. 30 ఏళ్లుపైబడిన వారందరికీ స్క్రీనింగ్ టెస్టులు చేస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య నిర్వహించిన పరీక్షల్లో సుమారు 11.1 మిలియన్ల మందికి రక్తపోటు, 6.4 మిలియన్ల మందికిపైగా షుగర్ ఉన్నట్టు తేలింది. దాంతో వ్యాధిగ్రస్తులకు మందులు ఇవ్వడం, స్క్రీనింగ్‌లు, ఫాలోఅప్‌లు చేయడం వంటివి విస్తృతం చేశారు. భారత ఇరుగు పొరుగు దేశాల్లోనూ బీపీ సమస్య ఎక్కువగానే ఉంది. పాకిస్తాన్‌లో దాదాపు 42 శాతం మందికి ఈ వ్యాధి సోకింది. 34 మిలియన్ల మంది నియంత్రణలో లేని వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. భూటాన్, శ్రీలంక, నేపాల్ దేశాల్లోనూ ప్రపంచ సగటు కంటే ఎక్కువగానే బీపీ రోగులు ఉన్నారు. బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, దక్షిణ కొరియా లాంటి దేశాల్లో బీపీ నియంత్రణ చర్యలు బాగున్నట్టు డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. బంగ్లాదేశ్‌లో ఒకప్పుడు 15 శాతంగా ఉన్న నియంత్రణ రేటు ఇప్పుడు 56 శాతానికి చేరుకుంది. మిగతా దేశాలు కూడా ఇదే బాట పడుతున్నట్టు వెల్లడిరచింది. రక్తపోటు నియంత్రణకు మార్గాలు ఉన్నాయి. అయితే దానికి రాజకీయ నిబద్ధతతోపాటు వైద్యంపై పెట్టే ఖర్చు, ఆరోగ్యకరమైన వ్యవస్థలను బలోపేతం చేయాలి. ప్రతి గంటకు వెయ్యి మందికిపైగా హైబీపీ వల్ల వచ్చే స్ట్రోక్‌లు, గుండె సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరించాలి.










Comments