top of page

భారతీయుల్లేకపోతే అమెరికాకు అథోగతే!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Sep 24
  • 2 min read
ree

ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఇంకే ఉద్దేశంతోనైనా ఇక మీదట అమెరికాలో అడుగుపెట్టాలంటే.. అక్కడ జీవించాలంటే వీసా ఫీజు రూపంలో లక్ష డాలర్ల(ఇండియన్‌ కరెన్సీలో రూ.88 లక్షలు) ట్రంప్‌ సర్కారుకు ముడుపు కట్టాల్సిందే. అలాగే అమెరికన్‌ కంపెనీల్లో భారతీయులకు బదులు స్థానికులనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ట్రంప్‌ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల భారతీయుల రాక, ఉద్యోగాల్లో చేరిక తగ్గుతుందని, దానివల్ల అమెరికన్‌ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నది ట్రంప్‌ ప్రభుత్వ ఆలోచన. కానీ ఈ నిర్ణయాల వల్ల అమెరికన్లకు ఉద్యోగాలు కల్పిస్తున్నామన్న ప్రచారం చేసుకోవచ్చేమో గానీ.. వాస్తవాలను పరిశీలిస్తే భారతీయ టెకీలు, ఇతర రంగాల్లో భారతీయ ఉన్నతోద్యోగులు లేకుండా ఆయా రంగాలు సక్రమంగా నడిచే పరిస్థితి లేదని అంటున్నారు. ఈ విషయం తెలిసినందునే ఆమెరికన్‌ దిగ్గజ కంపెనీలు తమ సంస్థల సీఈవోలు, ఇతర పెద్ద పదవుల్లో భారతీయ నిపుణులను ఏరికోరి మరి నియమించుకుంటున్నాయి. అమెరికన్లతో పోలిస్తే తక్కువ వేతనాలకే ఎక్కువ స్కిల్స్‌ను భారతీయ నిపుణుల నుంచి పొందవచ్చు. ఈ వెసులుబాటు ఆయా సంస్థల ఉత్పత్తి, ఆర్థిక వ్యవస్థలకు భారీగా ఊతమిస్తోంది. అందువల్లే అమెరికాతో సహా ఇతర మల్టీనేషనల్‌ కంపెనీలు టాప్‌ పోస్టుల్లో.. ఇంకా చెప్పాలంటే తమ కంపెనీలకు సారధ్యం వహించే పోస్టుల్లో భారతీయులను కూర్చోబెట్టడానికే ఆసక్తి చూపుతున్నాయి. కానీ అదే వ్యాపార రంగం నుంచి అధ్యక్షుడు ట్రంప్‌కు మాత్రం ఈ సత్యం ఇంకా బోధపడినట్లు లేదు. అందుకే తమ దేశం ఉత్పాదకతపై వ్యతిరేక ప్రభావం చూపించే నిర్ణయాలు తీసుకుంటున్నారు. భారతీయులకు ఉద్యోగాల్లేకుండా చేయడం, వారిని దేశం నుంచే పంపేయాలనుకోవడం ఇటువంటి అనాలోచిత నిర్ణయాలే. కొత్తగా భారతీయులు అమెరికాలో ప్రవేశించకుండా కట్టడి చేసే ఉద్దేశంతో హెచ్‌ 1బి వీసా దరఖాస్తు ఫీజును లక్ష డాలర్ల పెంచడం కూడా ఈ కోవలోకే వస్తుంది. అమెరికా కంపెనీలు ప్రత్యేక రంగాల్లో విదేశీ వృత్తి నిపుణులను, ఇతరత్రా స్కిల్స్‌ కలిగినవారిని తమ సంస్థ సొమ్ముతో హెచ్‌ 1బి వీసా ఇప్పించి మరీ ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. మూడేళ్ల కాలపరిమితి ఉండే ఈ వీసాను మరో మూడేళ్ల వరకు పొడిగించవచ్చు. ఆర్థిక నిపుణులు, వ్యాపార ప్రముఖుల దృష్టిలో ఈ వీసా పథకం అమెరికా సంస్థలు ప్రపంచ స్థాయిలో పోటీ పడటానికి సహాయపడుతుంది. ఈ పథకం వ్యాపారాలు, ఉత్పత్తులు పెంచడానికి, కొత్త ఆవిష్కరణలు చేయడానికి, దేశీయంగా అధిక సంఖ్యలో ఉద్యోగాల సృష్టికి సహాయపడుతుందని మేథావులు, వృత్తి నిపుణులు వాదిస్తున్నారు. కానీ ట్రంప్‌ ప్రభుత్వ వైఖరి దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది. హెచ్‌1బి వీసా పథకం అమెరికా ఉద్యోగ కార్మికుల అవకాశాలను దెబ్బతీసేంతగా దుర్వినియోగం అవుతోందని ట్రంప్‌ పరిపాలన ఆరోపిస్తోంది. పెంచిన ఫీజు అమల్లోకి వస్తే చాలా కంపెనీలు.. ముఖ్యంగా చిన్న సంస్థలు, స్టార్టప్‌ కంపెనీలు హెచ్‌1బి వీసా ద్వారా విదేశీ ఉద్యోగులను నియమించడం మానేస్తాయని, దీనివల్ల అమెరికన్లకు ఉద్యోగాలు దొరకవచ్చేమోగానీ.. ఆశించినంత నైపుణ్యం లభించదు. ఉత్పాదకత పెరగదని పారిశ్రామిక, వ్యాపారవర్గాలు భావిస్తున్నాయి. అందుకే భారతీయులను ఉద్యోగాల్లోకి తీసుకోవద్దని ట్రంప్‌ హెచ్చరించినా, హెచ్‌1బి వీసా ఫీజు గణనీయంగా పెంచేసినా పారిశ్రామిక సంస్థలు పెద్దగా ఖాతరు చేయడంలేనట్లు కనిపిస్తోంది. ట్రంప్‌ ఆంక్షలు ప్రకటించిన తర్వాత కూడా అమెరికాలోని రెండు బడా కంపెనీలు తమ సంస్థ సీఈవోలుగా భారతీయ నిపుణులను నియమించుకోవడమే దీనికి నిదర్శనం. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాత మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ సంస్థల సీఈవోలుగా భారతీయులైన సత్య నాదెళ్ల, సుందర్‌ పిచాయ్‌ వ్యవహరిస్తున్నారు. ఇంకా చాలా సంస్థలను భారతీయ మూలాలు ఉన్నవారే అత్యున్నత పోస్టుల్లో ఉండి నడిపిస్తున్నారు. చివరికి ట్రంప్‌ ఆంక్షలు విధించాక కూడా ఆ ట్రెండ్‌ మారలేదంటే.. పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు అవి ఎంత నష్టదాయకమో అర్థం చేసుకోవచ్చు. అమెరికా టెలికాం దిగ్గజంగా పేరొందిన టీ మొబైల్‌ కంపెనీ తమ సంస్థ సీఈవోగా శ్రీనివాస్‌ గోపాలన్‌ను నియమించింది. అలాగే చికాగోకు చెందిన దిగ్గజ బేవరేజెస్‌ కంపెనీ మోల్సన్‌ కూర్స్‌కు సీఈవోగా రాహుల్‌ గోయల్‌ నియమితులయ్యారు. వీరిద్దరూ ఆయా కంపెనీల్లో గత కొన్నేళ్లుగా వివిధ హోదాల్లో సేవలందిస్తున్నారు. ఇటువంటి నిపుణుల సేవలను వదులుకునేందుకు అమెరికన్‌ సంస్థలు సిద్ధంగా లేవని దీంతో స్పష్టమవుతోంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page