
ఉన్నత విద్య కోసం మనదేశానికి చెందిన లక్షలాది విద్యార్థులు విదేశాలకు వెళ్తుంటారు. ఇదేమీ కొత్త విషయం కాదు. దశాబ్దాల తరబడి కొనసాగుతూ వస్తోంది. ఇలా వెళ్లిన వారిలో చాలామంది చదువు పూర్తి అయిన తర్వాత అక్కడే ఉద్యోగావకాశాలు వెతుక్కుని స్థిరపడిపోతున్నారు. కానీ కొన్ని దేశాలు స్టడీ వీసాల్లో భారీగా కోత విధిస్తుండటం ద్వారా భారతీయ విద్యార్థులకు గేట్లు మూసేస్తున్నాయి. భారతీయ విద్యార్థులు అమెరికా, కెనడా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా దేశాల్లో చదువుకొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. అయితే కెనడా, ఆస్ట్రేలియా వీసా నిబంధనలను కఠినతరం చేయడం ద్వారా ఇతర దేశాలు ముఖ్యంగా భారత విద్యార్థుల ఆశలు, అవకాశాలపై నీళ్లు చల్లుతున్నాయి. కెనడాలో అధికారంలో ఉన్న జస్టిన్ ట్రూడో ప్రభుత్వం కొన్నాళ్లుగా భారత వ్యతిరేక విధానాలు అవలంభిస్తోంది. ఆ క్రమంలో ఆ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం భారత విద్యార్థులపైనే ఎక్కువ ప్రభావం చూపుతుంది. విదేశీ విద్యార్థులకు వారానికి 40 గంటలు ఉన్న వర్క్ పర్మిట్‌ను ఇప్పటికే 20 గంటలకు తగ్గించిన కెనడా సర్కార్ తాజాగా భారతీయ విద్యార్థుల సంఖ్యను 50 శాతం వరకు తగ్గించాలని యోచిస్తోంది. ఈ విషయాన్ని కెనడా ఎడ్యుకేషన్ టెక్నా లజీ కంపెనీ అప్లైబోర్డ్ తాజాగా నివేదించింది. దీంతో అక్కడ చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థుల కష్టాలు మరింత పెరగనున్నాయి. చదువుకోవడానికి కెనడాకు వెళ్లే విద్యార్థుల్లో ఎక్కువ శాతం భారతీ యులే. అందులోనూ రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు మరీ ఎక్కువ. దేశంలో పెరుగుతున్న ఇళ్ల కొరత, నిరుద్యోగ సమస్యను అదుపు చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కెనడా ప్రభుత్వ వర్గాలు చెబుతు న్నాయి. ట్రూడో ప్రభుత్వం గత ఏడాది 4.36 లక్షల స్టడీ వీసాలు జారీచేయగా ఈ ఏడాది వీటి సంఖ్య 2.31 లక్షలకు పరిమితం చేయనున్నారు. ఈ ఏడాది మొదటి అర్ధభాగంలోనే సగం వరకు స్టడీ వీసాలు తగ్గించగా, ముందు ముందు మరింత తగ్గించే అవకాశముంది. స్టడీ వీసాల జారీని 50 శాతం తగ్గిస్తే కొంత మంది భారతీయ విద్యార్థులకే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం ఆ దేశంలో సుమారు మూడున్నర లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు. వారి వీసా గడువునైనా పొడిగిస్తారా లేదా అన్నది అను మానమే. కొత్తగా వెళ్లాలనుకునేవారి అవకాశాలు కూడా సగానికి సగం తగ్గిపోతాయన్న ఆందోళన వ్యక్త మవుతోంది. కెనడా తరహాలోనే అస్ట్రేలియా కూడా విదేశీ విద్యార్థులకు గేట్లు మూసేసే నిర్ణయాలు తీసు కుంటోంది. ఈ దేశానికి కూడా భారత్ నుంచి పెద్దసంఖ్యలో విద్యార్థులు స్టడీ వీసాలపై వెళ్లి ఉన్నత విద్య అభ్యసిస్తుంటారు. సంఖ్యాపరంగా భారతీయ విద్యార్థులకు ఇది మూడో గమ్యస్థానంగా చెబుతున్నారు. ఆ దేశంలో ప్రస్తుతం సుమారు 1.70 లక్షల మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇంగ్లీషు మాట్లాడే దేశం కావడం, విదేశీ విద్యార్థులకు పెద్ద ఎత్తున స్కాలర్‌షిప్పులు, అత్యున్నత ఉద్యోగావకాశాలు, మంచి జీతభత్యాలు, శాశ్వత నివాసం పొందే అవకాశాలు ఉన్నందున ఆస్ట్రేలియాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. భారత్ నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా వలసలు బాగా పెరిగిపోవడంతో ఆస్ట్రేలియా వీసా పరిమితులు విధించింది. అలాగే శాశ్వత నివాసం పొందడానికి నిబంధనలు కఠినతరం చేసింది. ఆస్ట్రేలియాలో విద్యనభ్యసిస్తున్న అత్యధిక సంఖ్యాకులు భారతీయులే. అందువల్ల అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారీగా నష్టపోయేది కూడా మన విద్యార్థులే. దాంతో వారంతా తమకు న్యాయం చేయాలంటూ రోడ్డెక్కారు. భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. విదేశీ విద్య కోసం స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియాకు వెళ్లిన భారతీయ విద్యార్థులు తమ చదువులు ముగియ గానే ఆ దేశంలోనే ఉద్యోగం సంపాదించి నివాసం ఉండటానికి మొగ్గు చూపుతూ శాశ్వత నివాసానికి అనుమతి కోరుతూ ఆ ప్రభుత్వానికి దరఖాస్తులు పెడుతున్నారు. అయితే శాశ్వత నివాసానికి సంబంధించి పరిమితులు విధించడం భారతీయ విద్యార్థులను దెబ్బకొట్టింది. తాజా నిబంధనల ప్రకారం విదేశీ విద్యా ర్థులు చదువు పూర్తి కాగానే ఆస్ట్రేలియాను వీడాల్సి ఉంటుంది. ఈ నిర్ణయాన్ని భారతీయ విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ దేశంలో ప్రముఖ నగరాలైన పెర్త్, మెల్‌బోర్న్‌లలో నిరసనలు మిన్నంటాయి. శాశ్వత వీసా కోసం 12 ఏళ్లుగా ప్రయత్నించి విఫలమైన మనో యోగలింగం అనే వ్యక్తి గత నెలలో మెల్‌బోర్న్‌లో ఆత్మాహుతి చేసుకున్న తర్వాత పరిస్థితి మరింత విషమించింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాకు వచ్చినవారు తమ తాత్కాలిక బ్రిడ్జింగ్ వీసాల పరిమితుల నుంచి తప్పించుకునేందుకు శాశ్వత నివాస అను మతి కావాలని, వీసాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. నిరసనల్లో భాగంగా లేబర్ పార్టీ ఎంపీ నివాసాన్ని కూడా ముట్టడిరచారు. నెల రోజులకు పైగా హోం వ్యవహారాల మంత్రి టోనీ బర్క్ కార్యా లయం బయట ఆందోళనకారులు నిరసన దీక్ష చేశారు. దీనిపై భారత ప్రభుత్వం కూడా స్పందించి ఆస్ట్రేలియాతో సంప్రదింపులు జరిపి భారత విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. మరి భారత ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
Kommentare