top of page

భార్యను వదిలేశాడని భర్త ఇంటిపై దాడి

Writer: BAGADI NARAYANARAOBAGADI NARAYANARAO
  • తలుపులు బద్దలు గొట్టి.. ఇంట్లోకి చొరబడి..

  • పోలీసులు స్పందిచలేదని బాధితుల ఆరోపణ

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

భార్యను విడిచిపెట్టేశాడన్న అక్కసుతో కుటుంబ సభ్యులు, కుల పెద్దలతో కలిసి భర్త ఇంటిపై దాడిచేసిన ఘటన శుక్రవారం సాయంత్రం పలాస`కాశీబుగ్గలో చోటుచేసుకుంది. పట్టణంలోని తంగుడు హరికృష్ణపై ఆయన భార్య పొందూరుకు చెందిన పొట్నూరు లక్ష్మణరావు కుమార్తె కవిత శుక్రవారం ఎమ్మెల్యే గౌతు శిరీషను కలిసిన అనంతరం కాశీబుగ్గ సర్కిల్‌ కార్యాలయంలో గ్రీవెన్స్‌ నిర్వహిస్తున్న ఎస్పీ మహేశ్వర్‌రెడ్డిని కుటుంబ సభ్యులు, కళింగ కోమటి పెద్దలతో కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం నేరుగా భర్త హరికృష్ణ ఇంటి వద్దకు వెళ్ల్లారు. దీన్ని గమనించిన హరికృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు తలుపులు వేసుకొని ఇంటిలోనే ఉండిపోయారు. దీంతో కవితతో వచ్చిన ఆమె కుటుంబ సభ్యులు, కులపెద్దలు కలిసి గ్రిల్స్‌ను బలవంతంగా తొలగించి, తలుపులను తెరిచారని హరికృష్ణ తెలిపారు. దీన్ని అడ్డుకొనే ప్రయత్నం చేసిన హరికృష్ణ కుటుంబ సభ్యులపై దాడికి ప్రయత్నించారని ఆరోపించారు. తలుపులు తెరిచిన తర్వాత కవితను, ఆమె బిడ్డను ఇంట్లో పెట్టి వారికి కాపలాగా కొంత మంది కళింగకోమటి పెద్దలు ఇంటి బయట ఉన్నారు. గ్రిల్స్‌ను తొలగిస్తున్న సమయంలో 112కు మూడుసార్లు ఫోన్‌ చేసిన తర్వాత పట్టణ పోలీస్‌స్టేషన్‌ నుంచి సిబ్బంది వచ్చి అక్కడ జరుగుతున్న తంతును చూసి వెళ్లిపోయారని హరికృష్ణ పేర్కొన్నారు. ఆ తర్వాత స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఎవరూ స్పందించలేదన్నారు.

పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న అంశాల మేరకు 2013లో హరికృష్ణ, కవితకు వివాహం జరిగిన తర్వాత వీరికి 2015లో ఒక కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టిన కొన్ని నెలల తర్వాత కుటుంబ కలహాలు ప్రారంభమయ్యాయి. 2022లో కవిత పుట్టింటికి వెళ్లిపోయారు. ఆ తర్వాత 2023లో ఎచ్చెర్ల పోలీస్‌ స్టేషన్‌లో కవిత భర్త హరికృష్ణపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు సందర్భంగా హరికృష్ణ తన కుటుంబ సభ్యులు, కొందరు పెద్దలతో కలిసి ఎచ్చెర్ల వెళ్లారని తెలిపారు. సమస్యకు పరిష్కారం కోసం వెళ్లిన హరికృష్ణను పోలీసులతో చితక్కొట్టించినట్టు పేర్కొన్నాడు. ఆ సందర్భంగా జరిగిన పరిణామాల నేపథ్యంలో హరికృష్ణ సోంపేట న్యాయస్థానాన్ని విడాకుల కోసం ఆశ్రయించాడు. ఇద్దరి మధ్య వివాదం నడుస్తున్న సందర్భంలో సెప్టెంబర్‌ 3న తన ఇంటి వద్దకు వచ్చి తనపై కవిత బంధువులు దాడికి దిగినట్లు స్థానిక పోలీసులకు హరికృష్ణ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై కేసు నమోదు చేయకపోవడంతో స్థానిక కోర్టులో ప్రైవేట్‌ కేసు దాఖలు చేశారు. ఆ వ్యవహారం ఇంకా ఎటూ తేలకముందే మరోసారి హరికృష్ణ ఇంటి మీద దాడి జరిగింది. అత్తారింటికి వచ్చిన కవితకు ఎవరూ హాని తలెట్టకుండా నలుగురు కానిస్టేబుల్స్‌ను హరికృష్ణ ఇంటి వద్ద ఏర్పాటుచేశారు. దాడి చేసినవారిలో కొందరు టెక్కలి టీడీపీ నాయకులుగా చెలామణి అవుతున్నవారేనని చర్చ సాగుతుంది. అంతకు ముందు స్థానిక ఎమ్మెల్యే ఇదే అంశంపై కళింగకోమటి పెద్దలతో కలిసి మీడియాతో మాట్లాడం, ఆ తర్వాత బాధితుల ఇంటిపై దాడి జరగడంతో పలాసలో హాట్‌టాపిక్‌గా మారింది.

హరికృష్ణ భార్య కవితను విడిచిపెట్టేశాడు కాబట్టి ఆమెకు న్యాయం చేయాలనే ఆలోచనతోనే అందరూ బాధిత మహిళకు సపోర్టుగా నిలబడ్డారనే వాదన కూడా ఉంది. వాస్తవంగా వీరి మధ్య వివాదం కోర్టుల్లో నడుస్తుందనే విషయం ఎస్పీ మహేశ్వరరెడ్డికి, ఎమ్మెల్యే గౌతు శిరీషకు వివరించకుండా కవిత బంధువులుగా చెప్పుకుంటున్న టీడీపీ నాయకులు దాచిపెట్టారని విశ్వసనీయ సమాచారం. మరోవైపు హరికృష్ణతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై దాడి, ఇల్లు ధ్వంసం ఘటనపై కేసు నమోదు చేయకుండా స్థానిక పోలీసులు తాత్సారం చేయడంతో ఫిర్యాదును పోస్టు ద్వారా ఎస్పీకి, డీఎస్పీకీ, సీఐకి పంపించారు. దీనిపై స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు హరికృష్ణపై దాడి, ధ్వంసంపై తక్షణమే కేసు నమోదు చేయాలని ఆదేశించడంతో శనివారం ఎఫ్‌ఐఆర్‌ 509/2024తో కేసు నమోదు చేశారు. ఈ దాడి ఉద్దేశపూర్వకంగా జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. న్యాయస్థానంలో విడాకులు కేసు నడుస్తుందని, సెప్ట్టెంబర్‌లో దాడి జరిగిన ఘటనపై స్థానిక కోర్టులో ప్రైవేట్‌ కేసు నమోదు చేశామని తెలిసినా కవిత కుటుంబ సభ్యులు కుల పెద్దలను తీసుకువచ్చి దాడికి పాల్పడ్డారని, పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే దాడి జరిగేది కాదని చెబుతున్నారు. హరికృష్ణ తన కుటుంబంపై పోలీసులు వ్యవహరించిన తీరుపై హైకోర్టును ఆశ్రయిస్తున్నట్టు తెలిసింది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page