top of page

భోలేనాథ్ ఆశీస్సులతో.. దూసుకెళ్తున్న వైభవ్

  • Guest Writer
  • May 29
  • 1 min read
తజ్‌పూర్ కుర్రాడి తుఫాన్ బ్యాటింగ్‌కు ప్రపంచం ఫిదా

ఐపీఎల్-2026 ఎలిమినేటర్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడిన వైభవ్, 29 బంతుల్లో 97 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా ప్యాట్ కమిన్స్ వంటి అంతర్జాతీయ స్థాయి బౌలర్లను కూడా ధైర్యంగా ఎదుర్కొన్న తీరు అభిమానులను మంత్ర ముగ్ధులను చేసింది. అయితే బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లా తజ్‌పూర్ గ్రామానికి మాత్రం ఇది కొత్తేమీ కాదు. చిన్నప్పటి నుంచే వైభవ్ ప్రతిభను చూస్తూ వచ్చిన గ్రామస్థులు, అతడు మరోసారి తన సహజ శైలిలోనే బౌలర్లపై దాడి చేశాడని గర్వంగా చెబుతున్నారు.

వైభవ్‌కు ఐదేళ్ల వయసు నుంచే బౌలింగ్ చేస్తున్న రవి ప్రకాశ్ ఝా మాట్లాడుతూ.. ‘వైభవ్ ఎనిమిదేళ్ల వయసులోనే బీహార్ అండర్-19 జట్టుకు ఎంపికయ్యాడు. పాట్నాలో జరిగిన అండర్-12 మ్యాచ్‌లో 153 పరుగులు చేసి 15 సిక్సర్లు బాదాడు. అందులో ఏడు బంతులు స్టేడియం బయటకు వెళ్లిపోయాయి’ అని గుర్తుచేశాడు. 2022లో 12 ఏళ్ల వయసులోనే బీహార్ రంజీ ప్రాబబుల్స్‌లో చోటు సంపాదించిన సమయంలో అతడి వయసుపై అనుమానాలు వ్యక్తమయ్యాయని, అనంతరం బీసీసీఐ బెంగళూరులో బోన్ టెస్ట్ నిర్వహించి అన్ని అనుమానాలకు తెరదించిందని ఝా తెలిపాడు. ‘క్రికెట్ అనేది మానసిక ధైర్యం ఆట. వైభవ్‌పై భోలేనాథ్ ఆశీస్సులు ఉన్నాయి’ అని ఝా వ్యాఖ్యానించాడు.

ఇదిలా ఉండగా, మాజీ భారత స్పిన్నర్ ఆర్. అశ్విన్ కూడా వైభవ్ ఆటలో వచ్చిన మార్పులను ప్రశంసించాడు. షార్ట్ బాల్స్‌తో ఇబ్బంది పెట్టిన బౌలర్లకు త్వరగా సమాధానం కనుగొన్న వైభవ్, బౌన్సర్లపై అప్పర్ కట్ షాట్లు ఆడటంలో విశేషంగా మెరుగుపడ్డాడని తెలిపాడు. ప్రఫుల్ హింగే, మొహ్సిన్ ఖాన్, మహ్మద్ సిరాజ్ వంటి బౌలర్లు తొలుత వైభవ్‌ను ఇబ్బంది పెట్టినా, తర్వాత వారిపైనే ఎదురుదాడి చేసి తన ప్రతిభను చాటుకున్నాడు. ముఖ్యంగా హింగే బౌలింగ్‌లో వరుస సిక్సర్లు బాదిన తీరు అభిమానులను అలరించింది. శుక్రవారం మరోసారి మహ్మద్ సిరాజ్‌తో వైభవ్ పోరు ఆసక్తికరంగా మారనుంది. ఒకవైపు వేగం, వ్యూహాలతో సిరాజ్ సిద్ధమవుతుండగా.. మరోవైపు భయమెరగని ఆటతీరుతో వైభవ్ మరో తుఫాన్ ఇన్నింగ్స్‌కు సిద్ధమవుతున్నాడు.

- టైమ్స్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో..

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page