భువన మోహనుడు..బాధిత బాంధవుడు!
- Guest Writer
- Oct 28
- 3 min read
30న డీబీఎం పట్నాయక్ శతజయంతి
గుణుపూర్‌లో నిర్వహణకు సన్నాహాలు

( డాక్టర్ జతిన్ కుమార్)
గిరిజన హక్కుల పరిరక్షణే ధ్యేయంగా.. విప్లవ ఆలోచనా ధోరణితో జీవితాలనే పోరాటాలకు అంకితం చేసిన ఎందరో యోధులు చరిత్రకు చిక్కక మరుగైపోయారు. అంటువంటి వేగుచుక్కల్లో పేరెన్నికగన్నవాడు డి.భువనమోహన్(డీబీఎం)పట్నాయక్. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఈ పోరాట యోధుడు ఒడిశాను తన పోరాట వేదికగా మలచుకున్నారు. అందుకే ఇప్పటికీ ఆయన్ను ఆక్కడి కమ్యూనిస్టు ఆలోచనాపరులు స్మరించుకుంటుంటారు. ఆ క్రమంలోనే ఆయన శతజయంతి కార్యక్రమాలను ఈ నెల 30న గుణుపూర్‌లో నిర్వహిస్తున్న సందర్భంగా డీబీఎం పట్నాయక్ పోరాట పంథా, విజయాల పరంపరపై ఒక మననం.
రాటుదేలిన కమ్యూనిస్టు నేత
రాజాం సమీపంలోని భాగింపేట గ్రామంలో 1925 అక్టోబర్ 25న జన్మించిన భువనమోహన్ 1949లో న్యాయవాద డిగ్రీ(లా) పూర్తి చేశారు. ఆ తర్వాత తన మకాంను ఒడిశాలోని నవరంగపూర్‌కు మార్చారు. 1951లో గుణుపూర్ పట్టణానికి మారారు. అక్కడే న్యాయవాద వృత్తి చేపట్టి ఆదివాసీల కేసులు వాదించడం మొదలుపెట్టారు. వారి కేసులే కాకుండా ఆదివాసీలు ఎదుర్కొంటున్న ఇతర ఆర్థిక, సామాజిక సమస్యలపైనా పోరాటాలు మొదలుపెట్టి వారికి అండగా నిలిచారు. తుదిశ్వాస విడిచేవరకు ఆ పోరాటాలకే అంకితమాయ్యరు. పట్నాయక్ దంపతులకు ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 1950లలోనే కమ్యూనిస్టు ఉద్యమంలో చేరిన మొదట ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో, తర్వాత సీపీఐ(ఎం)లో పని చేశారు. సీపీఎం ఒడిశా రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కూడా పనిచేశారు. అనంతర పరిణామాల్లో 1967 మేలో ఏఐసీసీఆర్‌లో చేరి ఒడిశా రాష్ట్ర కన్వీనర్‌గా వ్యవహరించారు. చారు మజుందార్ ఏర్పాటుచేసిన సీపీఐ (ఎంఎల్)లో చేరిన ఆయన 1970లో అరెస్టయ్యారు. అయితే చారు మజుందార్ అనుసరించిన హింసాత్మక అతివాద ధోరణిని వ్యతిరేకిస్తూ 1972 నవంబర్‌లో పార్టీని త్యజించి ఆరుగురు ప్రముఖుల్లో ఈయన ఒకరు. చివరికి 1989-91 మధ్య భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమైక్యతా కేంద్రం(యూసీసీఆర్‌ఐ-ఎంఎల్)లో అధ్యయనంలో నిమగ్నమయ్యారు. న్యాయవాద వృత్తిని డీబీఎం ఎప్పుడూ సంపాదన మార్గంగా చూడలేదు. ఆరు దశాబ్దాలకు పైబడిన ఆయన న్యాయవాద జీవితం మొత్తం తాడిత పీడిత ప్రజల హక్కుల పరిరక్షణకే అంకితమైంది. ఎంత దూరమైనా వెళ్లి పేద గిరిజనుల తరఫున న్యాయ పోరాటం చేసేవారు. 1952 కుజింద్ర పోరాటం నుంచే వివిధ విప్లవ, ప్రజా సంఘాల్లో ఆయన కీలకపాత్ర పోషించడం మొదలైంది. బాధిత ప్రాంతాలు సందర్శించి ప్రజలను చైతన్యపరచి ఉద్యమ దిశగా నడిపించడం ద్వారా ఒక నమ్మకమైన నాయకునిగా ఎదిగారు. తాను ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులైనప్పటికీ అధికారంలో ఉన్నవారు మాత్రమే పీడితులకు సాయం చేయగలరన్న వాదనను ఆయన ఎన్నడూ విశ్వసించలేదు. సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ‘సమాన పనికి సమాన వేతనం’ అనే సూత్రం అమలుకు డీబీఎం ఒడిశా హైకోర్టులో చేసిన పోరాటం వేలాది కార్మికులకు సహాయపడిరది. 1960 దశకంలో శ్రీకాకుళం జిల్లాలో జరిగిన రైతాంగ పోరాటాల్లోనూ డీబీఎం చురుగ్గా పాల్గొన్నారు. ఫలితంగా చాన్నాళ్లు అజ్ఞాతంలో ఉండాల్సి వచ్చింది.
నిర్బంధాలను లెక్కచేయని ధీరుడు
పోరాటాల కారణంగా పోలీసుల అణచివేత, కుట్ర కేసులు, జైలుశిక్షలు వంటి నిర్బంధాలను ఎదుర్కొన్నారు. 1964-66 మధ్య ప్రభుత్వం ఆయన్ను నిర్బంధించింది. గుణుపూర్, చిత్రకొండ, పార్వతీపురం కుట్ర కేసుల్లోనూ ఆయన్ను ఇరికించారు. పార్వతీపురం కుట్ర కేసులో నిందితుల్లో ఒకరిగా ఉంటూనే.. వారి తరఫున డిఫెన్స్ లాయర్‌గా కూడా వ్యవహరించారు. ఈ కేసుల్లోనే ఆయన 1970 నుంచి 1977 వరకు జైలులో ఉన్నారు. 1977లో జైలు నుంచి విడుదలైన తర్వాత డీబీఎం గుణుపూర్ మున్సిపల్ చైర్మన్‌గా ఎన్నికై 1978-80 వరకు కొనసాగడం విశేషం. బలిమెల ప్రాజెక్టు, జేకే పేపర్ మిల్లు, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు తదితర కార్మిక సంఘాలకు నాయత్వం వహించారు. వంశధార ప్రాజెక్టు నిర్వాసితుల పోరాటాలకు సారధ్యం నిర్వహించారు. చారు మజుందార్ హింసాత్మక మార్గంలో తాను గడిపిన రోజులు తన జీవితంలో ఒక విషాద దశ అని, దానివల్ల నష్టాలను ఎదుర్కొని ఆ పంథా నుంచి బయటపడ్డానని ఆయన చెబుతుండేవారు. 1952 నుంచి 1990 వరకు తను చూసిన, పాల్గొన్న, నాయకత్వం వహించిన ప్రజా ఉద్యమాలు, జమీందారీ వ్యతిరేక రైతు పోరాట అనుభవాల స్ఫూర్తితో ఒక అధ్యయన పత్రం రూపొందించారు. ఈ పోరాటాలకు సర్వోదయ సంస్థల వంటివారు నాయకత్వం వహించడం వల్ల, కమ్యూనిస్టు పార్టీ అనుసరించిన విప్లవ రహిత పార్లమెంటరీ మార్గం వల్ల కూడా చాలా పరిమితుల్లో ఇరుక్కుపోయాయని ఎత్తి చూపారు.
నిరంతర చైతన్యశీలి
ప్రపంచంలో యుద్ధ కాముకులకు, ఆధిపత్య శక్తులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలకు డీబీఎం మద్దతుగా నిలిచారు. సోషలిస్టు చైనాను అధ్యయనం చేసి బలమైన భారత-చైనా స్నేహ ఉద్యమాన్ని నిర్మించడానికి, ప్రపంచ శాంతి కోసం కృషి చేశారు. దేశంలో బలమైన ప్రజాస్వామ్య హక్కుల ఉద్యమాన్ని నిర్మించడానికి ప్రయత్నించారు. వ్యక్తిగా డీబీఎం నిరాడంబరత, అదే సమయంలో ఆయన ఉన్నత ఆలోచనలతో అందరినీ ఆకట్టుకునేవి. ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో తెలంగాణ పోరాట మార్గంలో ప్రజల చైతన్యాన్ని, భాగస్వామ్యాన్ని నిరంతరం పెంపొందించే రీతిలో ఉద్యమ నిర్మాణం కోసం శ్రమించారు. అఖిల భారత స్థాయిలో బలమైన విప్లవ సంస్థను నిర్మించాలని ఆయన జీవితాంతం తపించారు. తప్పును తెలుసుకోవడమే కాదు.. దాన్ని సరిదిద్దుకోవడాన్నీ డీబీఎం జీవితం నేర్పుతుంది. ప్రజల న్యాయవాదిగా పోరాట యోధుడిగా నిరంతరం శ్రమించిన డీబీఎం పట్నాయక్ తన 84వ ఏట 2009లో ఫిబ్రవరి 11న తుది శ్వాస విడిచారు. ఆయనకు నివాళిగా గుణుపూర్ పట్టణం మొత్తం స్వచ్ఛంద బంద్ పాటించింది. గిరిజనులు, రైతులు, కార్మికులు, న్యాయవాదులు, ప్రజాసంఘాల కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి కన్నీటితో డీబీఎంకు కడసారి వీడ్కోలు పలికారంటే ఆయనకు ప్రజల్లో ఎంత ఆదరణ ఉందో అర్థమవుతుంది.










Comments