
కాలం చెక్కిలిపై ఘనీభవించిన ఒంటరి కన్నీటి చుక్క తాజమహల్ అంటాడు రవీంద్రనాథ్ ఠాగూర్ అద్భుతమైన కట్టడం, ప్రేమ మందిరంగా ప్రసిద్ధి చెందిన తాజ్‌మహల్ కోసం. 19 సంవత్సరాల వివాహ బంధంలో, 14 మంది సంతానాన్ని కన్నది షాజహాన్ భార్య ముంతాజ్ మహల్. ఇందులో ఏడుగురు పిల్లలు పసికందులుగానే మరణించారు. 36 గంటలపాటు పురిటినొప్పులతో అల్లాడి, 14వ బిడ్డ గౌహర్ బేగంకి జన్మనిస్తూ, అధిక రక్తస్రావంతో ముంతాజ్ మహల్ 1631లో మరణిం చింది. ఆ కాసిన్నేళ్ల సంసార జీవితంలోనే మహారాణి, గర్భాన 14 మంది సంతానాన్ని పుట్టించిన షాజహాన్ మహారాజు, చివరికి భార్య జ్ఞాపకంగా ఆ మహా కట్టడపు శాశ్వత సమాధిని ఆమె కోసం నిర్మించాడు. అతి చిన్న వయసులోనే అంత హింసను అనుభవించి, అన్నేసి గర్భాలను మోసి, రక్త స్తావంతో ముంతాజ్ మహల్ ఎందుకు మరణించాల్సి వచ్చింది అన్న సంగతి లోకానికి ఎన్నడూ పట్ట లేదు. స్త్రీలు కేవలం సంతానాన్ని ఉత్పత్తి చేసే గర్భాలు మాత్రమేనా, వాళ్లు మనుషులు కాదా, వాళ్ల శరీరం వాళ్లది కాదా, తమ శరీరం పైన, తమ పునరుత్పత్తి శక్తి పైన వాళ్లకు హక్కు లేదా? ఒకవేళ, మేమిక పునరుత్పత్తి చేయమని స్త్రీలు తిరగబడితే మానవజాతి ఏమవుతుంది వంటి ప్రశ్నలు ఆనాటి నుండి, ఇప్పటివరకు కూడా ఈ సమాజానికి, పురుషులకు, మన కుటుంబాలకు పట్టలేదు. కాబట్టే, మొన్నటికి మొన్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అక్టోబర్ 20న ‘పార్లమెంటు స్థానాలు మనకు తగ్గిపోతున్న తరుణంలో 16 మంది పిల్లల్ని ఆడవాళ్లు ఎందుకు కనకూడదు’ అని అన్నాడు. అంటే, ఆయన మాట ప్రకారం ముంతాజ్ మహల్ కంటే మరో ఇద్దరిని ఎక్కువ మంది పిల్లలని ఈ ‘ఆధునిక మహిళలు’ కనాలన్న మాట. అలా ముంతాజ్ మహల్లా బిడ్డల్ని కంటూ, కంటూ మరణించే ఆడవాళ్ల కోసం తమిళనాడులో ఎన్ని తాజ్‌మహల్‌లు ఆయన సిద్ధం చేస్తున్నాడో ఏమో మనకు తెలియదు. కానీ, మహిళలకు ఇలాంటి పిలుపులు ఇస్తున్న ఆయనకు మాత్రం ఇద్దరు పిల్లలే ఉన్నారు. ఇక అక్టోబర్ 19న చంద్రబాబు ఇద్దరు కన్నా ఎక్కువ మంది పిల్లల్ని కనాలని, తక్కువ మంది పిల్లలున్న వారిని స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హులను చేసేలా ఒక చట్టాన్ని తీసుకు వస్తామని అన్నారు. నిజానికి ఇలాంటి మాటలను చంద్రబాబు 2014 నాటి నుంచే మాట్లాడుతు న్నారు. చంద్రబాబు నాయుడుకి కూడా ఏకైక కుమారుడు లోకేష్ మాత్రమే ఉన్నారు. ప్రకృతి ఇలాంటి పనిని స్త్రీలకు ఇచ్చింది కానీ, పురుషులకే గర్భాలు వచ్చే స్థితి వుంటే ఇలాంటి వాచాలతను రాజకీయ నాయకులు ప్రదర్శించేవారా? ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలకు ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతికపరమైన అనేక అంశాల్లో అనేక తేడాలు ఉన్నాయి. అంతేకాకుండా, ఉత్తరాది రాష్ట్రాల కన్నా దక్షిణాది రాష్ట్రాలు ఆరోగ్యం, విద్య, ఆర్థిక వనరులు, ఉపాధి అవకాశాలు, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి ఇటువంటి అంశాలలో ఎంతో మెరుగ్గా ఉన్నాయి. ఈ రాష్ట్రాలలో గత అనేక ఏళ్లుగా అనుసరించిన పాలసీలు కూడా ఈ ముందడుగుకి ఒక కారణం. 2026 నాటికి జనాభా శాతం ఇప్పటికన్నా మరింత తగ్గుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 25 లోక్‌సభ స్థానాలు 20కి, తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 17 సీట్లు 15కు, తమిళనాడులో 39 సీట్లు 30కి, కేరళ లో 28 సీట్లు 26కి, కర్ణాటకలో 20 సీట్లు14కు తగ్గే అవకాశం ఉందని ఒక అంచనా. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్‌ను గనుక చేస్తే, చట్టసభలలో శాశ్వతంగా ఉత్తరాది రాష్ట్రాలకి మెజారిటీ దక్కుతుంది. కాబట్టి వాటికీ అనుకూలమైన పాలసీలను, చట్టాలను మెజారిటీ పేరుతో చేసుకోవడం సులువు అవుతుంది. స్టాలిన్, చంద్రబాబు ఉద్దేశాలు వేరైనా, వారిలానే అనేక సందర్భాలలో ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి నాయకులు కూడా భారతీయ సంస్కృతిని, నాగరికతను కాపాడటం కోసం, హిందూ సమాజ హితం కోసం, పెరిగిపోతున్న ముస్లిం జనాభాను అడ్డుకునేందుకు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని హిందూ స్త్రీలకు పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే నేషనల్ ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రాంను ప్రారం భించిన మొట్టమొదటి దేశం భారతదేశం. యునిసెఫ్ ఇటీవలి నివేదిక ప్రకారం, భారత దేశంలో వున్న లింగవివక్ష ఫలితంగా 50లక్షల మంది బాలికలు, స్త్రీలు భారత జనాభా నుంచి అదృశ్యమవుతు న్నారు. మన దేశంలో ప్రతీ రోజూ చట్టవిరుద్ధంగా 2వేల ఆడ శిశు గర్భస్రావాలు జరుగుతున్నట్లు ఒక అంచనా. అంతేకాదు, అత్యధిక ప్రసూతి మరణాలు జరిగిన దేశాల్లో భారతదేశం ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఇలా ఆడబిడ్డలను చంపేయకుండా భూమి మీదకు తెస్తే జనాభా ఎందుకు తగ్గుతుంది? దక్షిణాదిలోనే మహిళా శాతం ఎందుకు తక్కువుంది? అనేది ఆలోచించాల్సిన అంశం.
Comments