top of page

మడమ తిప్పిన ట్రంప్‌

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Feb 28
  • 2 min read

జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే డోనాల్డ్‌ ట్రంప్‌ మాటలు మారుతున్నాయి, అలాంటి వారు మడమతిప్పటమే తరువాయి. సహజంగానే వ్యాపారి అయిన ఆ పెద్దమనిషి తనదైన శైలిలో అందరితో బేరసారాలాడుతున్నారు, బిస్కెట్లు వేస్తున్నారు. ఏది లాభసాటిగా ఉంటే దాన్నే అనుస రిస్తారు. అధికారాన్ని చేపట్టిన నెల రోజుల తర్వాత బుధవారం తొలిసారిగా ట్రంప్‌ మంత్రివర్గ తొలి సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఖనిజాల మీద ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ ఉక్రెయిన్‌ భద్రత గురించి సాధారణం కంటే ఎక్కువగా ఎలాంటి హామీలు ఇవ్వటం లేదని ట్రంప్‌ చెప్పాడు. అంతేకాదు, శాంతి ఒప్పందం కుదరాలంటే పుతిన్‌ కొన్ని రాయితీలకు అంగీకరించాల్సి ఉంటుం దని కూడా చెప్పారు. ఒకవైపు స్తంభింపచేసిన నిధులపై ఆంక్షలను ఎత్తివేస్తూ ఆయుధాలు కొను గోలు చేసేందుకు తైవాన్‌కు అవకాశం కల్పించిన ట్రంప్‌ దాని రక్షణ గురించి అడగ్గా వ్యాఖ్యా నించేందుకు నిరాకరించటమే కాదు, చైనా పెట్టుబడులను అమెరికాకు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఇది అమెరికా వైఖరికి భిన్నంగా ఉంది. అందించిన మిలిటరీ, ఆర్థిక సాయాన్ని తీర్చే స్థితిలో ఉక్రెయిన్‌ లేనందున అక్కడ ఉన్న 500 బిలియన్‌ డాలర్ల విలువ గల విలువైన ఖనిజాలు, సహజ సంపదలున్న ప్రాంతాలను తమకు అప్పగించాలని అమెరికా డిమాండ్‌ చేసినట్లు వార్తలు వచ్చాయి. తీరా ఇప్పుడు వాటిని వెలికి తీసేందుకు రెండు దేశాలు కలసి ఒక సంస్థను ఏర్పాటు చేసి, తద్వారా వచ్చే రాబడిలో సగాన్ని దాని ద్వారా ఉక్రెయిన్‌ రక్షణ, పునర్‌నిర్మాణానికి ఖర్చు చేయాలని అంగీకరించినట్లు చెబుతున్నారు. అమెరికా ఇచ్చిన సాయానికి అది ఖనిజాలను స్వాధీనం చేసుకుంటే తామిచ్చినదాని సంగతేమిటనే ప్రశ్న నాటోలోని ఐరోపా ధనిక దేశాల నుంచి రావటం అనివార్యం. అందువలన ఉమ్మడి సంస్థ పేరుతో అమెరికా పెత్తనంలోకి వెళ్లేట్లుగా చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఒకటి స్పష్టమైంది. గత మూడు సంవత్సరాలుగా ఉక్రెయిన్‌ ప్రతిఘటనలో రష్యాకు తగిలిన ఎదురుదెబ్బలు, ఓటమి అంటూ పశ్చిమదేశాలు, వాటి కనుసన్న లలో నడిచే మీడియా వండివార్చిన కట్టుకథలు, కృత్రిమ వీడియోలు వాస్తవం కాదని, ఉక్రెయిన్‌ ఓడిపోవటం తప్ప మరొకటి జరగదని తేలిపోయింది. నైవేద్యంగా పెట్టిన వాటిని దేవుడు తినడని పూజారికి తెలిసినంతగా భక్తులకు తెలియదు. అలాగే ప్రతిదాన్ని డాలర్ల లాభాలతో కొలిచే ట్రంప్‌ కు ఉక్రెయిన్‌ మీద పెట్టే ప్రతి డాలరునూ రాబట్టుకోవటం కష్టమని, అందువల్లనే ఖనిజాల ఒప్పం దం అని కూడా చెబుతున్నారు. విజయం సాధించినట్లు పుతిన్‌ చెప్పుకోవచ్చు గానీ అది ఉక్రె యిన్‌లో గెలిచో మరొక దానితోనో కాదని ట్రంప్‌ యంత్రాంగ చర్యలతో అనే కొత్త పల్లవిని పశ్చిమ దేశాల విశ్లేషకులు ఎత్తుకున్నారు. శుక్రవారం జెలెన్‌స్కీ వాషింగ్టన్‌ వెళతాడని, ఒప్పందం మీద సంతకాలు చేస్తాడని వచ్చిన వార్తలు కార్యరూపం దాలిస్తే ఒప్పంద అంశాలు వెల్లడైన తర్వాత మాత్రమే ఒక స్పష్టత వస్తుంది. ఒకవైపు చైనా మీద ఇక యుద్ధమే శరణ్యం అన్నట్లుగా సుంకాలు విధించేందుకు పూనుకున్నట్లు చెబుతున్న ట్రంప్‌ బుధవారం చైనాలో అంతర్భాగం ` తిరుగుబాటు రాష్ట్రంగా ఉన్న తైవాన్‌ రక్షణ గురించి వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. చైనా నేతతో తనకు మంచి సంబంధం ఉందని, చైనా పెట్టుబడులను కోరుతున్నట్లు చెప్పాడు. నిజానికి ఇది చైనాకు బిస్కెట్‌ వేయటం తప్ప మరొకటి కాదు. తైవాన్‌కు 87 కోట్ల డాలర్ల మిలిటరీ సాయంతో సహా 530 కోట్ల డాలర్లను ఇచ్చేందుకు గతంలో నిర్ణయించిన అమెరికా ఆ నిర్ణయాన్ని స్తంభింపచేసింది. తాజాగా నిధుల విడుదలకు నిర్ణయించింది. అలాంటపుడు బలవంతంగా తైవాన్‌ స్వాధీనానికి చైనాను అనుమతిస్తారా అన్న ప్రశ్నకు మాట్లాడేందుకు నిరాకరించినంత మాత్రాన వైఖరిని మార్చుకున్నట్లు కాదు. ఉక్రెయిన్‌ మీద ట్రంప్‌ మాటలను చూస్తుంటే తైవాన్‌ను కూడా వదిలించుకుంటారా అన్నది జనాభిప్రాయంగా ఉందని, ఇలా అయితే అమెరికా వాగ్దానా లను ఎవరూ నమ్మరని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక వాపోయింది. ఖనిజాల ఒప్పందంతో ట్రంప్‌ను సంతుష్టీకరించేందుకు ఉక్రెయిన్‌ ఎలా చూస్తున్నదో తైవాన్‌ కూడా అమెరికా నుంచి ఏడు నుంచి పది బిలియన్‌ డాలర్ల విలువ గల ఆయుధాలను కొనుగోలు చేస్తామని లీకులు వదిలింది. కొద్ది రోజులుగా ట్రంప్‌ చెబుతున్న మాటలు, చేస్తున్న ప్రకటనలకు తేడా ఉంది. అందుకే అవి ఏ విధంగా మారతాయి, ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తాయన్నది ఊహించటం కష్టం.

Comentários


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page