మతం, కులం.. రెండూ ఉన్మాదాలే!
- DV RAMANA
- Apr 30
- 2 min read

మతం, ఉన్మాదం.. తెలుగు వ్యాకరణం ప్రకారం ఈ రెండూ కలిస్తే మతోన్మాదం. విడివిడిగా ఉన్నా.. కలిసి ఉన్నా.. ఈ రెండూ అత్యంత ప్రమాదకారులే. మతం వాస్తవం.. దానివల్ల పుట్టే ఉన్మాదం వాస్తవం.. రెండిరటి కలయికతో జడలు విప్పి వికృతహాసం చేసే మతోన్మాదం వల్ల జరిగే అనర్థాలు అనల్పం. విస్మరించేద్దామనుకున్నా వీలు కానంతగా సమాజమంతటా పాకిపోయింది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక మతాన్ని అనుసరించే కుటుంబంలోనే పుడతారు. మతాలను, దేవుడిని నమ్మని నాస్తికులపై ఈ సమాజం మూర్ఖులు అన్న ముద్ర వేసేస్తుంది. అందువల్ల అక్కడక్కడ ఒకటి అరా ఉండే నాస్తికులు పెద్దగా లెక్కలోకి రారు. ఆ సంగతి పక్కన పెడితే.. అన్ని మతాల బోధనలు మానవ సమాజ శాంతి, సామరస్యం, దయ, జాలి, కరుణ అనే కనిపించని భావనల చుట్టూనే పరిభ్రమిస్తుంటాయి. వీటి వాంగ్మయం, సాహిత్యం వగైరాలన్నీ పసిఫిక్ మహాసముద్రం కంటే విస్తారంగానూ, లోతుగానూ ఉంటాయి. ప్రవచనకర్తలు తమ పాండిత్యాన్నంతటినీ రంగరించి కొత్త కొత్త కోణాల్లో తమ తమ మతాల ఔన్నత్యాన్ని విశదీకరిస్తూ శ్రోతలందరూ ముక్కున వేలేసుకునేలా.. ఔరా అనిపించేలా గొప్పగా మాట్లాడేస్తుంటారు. పైవన్నీ మన ముందు ఉన్నవే. అవి నిజమా కాదా అనేది తర్వాత విషయం. నిజమైతే సొంత మతం పట్ల అలవిమాలిన ఉన్మాదం, పరమతం పట్ల విపరీతమైన ద్వేషం పుట్టుకురావడానికి కారణం ఏంటి? మతోన్మాదం అనేది ఎంత వాస్తవమో.. పరమత ద్వేషం, అసహనం అనేవి కూడా అంతే వాస్తవం అన్నట్లు పరిస్థితి తయారైంది. హాస్యా స్పదమైన విషయమేమిటంటే మన దేశంలో మెజారిటీ ప్రజలు హిందువులు కాబట్టి.. ఈ దేశం హిందువులదేనని మహా పండితుడినని చెప్పుకొనే ఒక ప్రవచనకారుడే ఉవాచించారు. అది ఎలా వీలవుతుందో ఎవరికీ తెలియదు. మీ ఇంటి గోడ అంగుళం మేరకు పక్కవాడి స్థలంలోకి చొచ్చుకుపోతేనే వాడు వెంటనే నువ్వు భారతీయుడివే కదా, హిందువువే కదా, ఈ దేశం అంతా హిందువులదే కదా అని సర్ది చెప్పుకోడు. ఆ అంగుళం కోసం వీలైతే నీ తల తీసేస్తాడు. అది వాస్తవం. అలాంటప్పుడు మతం, దేశం అనే భావన ఒక వంచనగానే మిగిలిపోతుంది. అందుచేత నువ్వు డబ్బు చెల్లించి దక్కించుకున్న ముక్క తప్ప ఇంకెందులోనూ నీకు హక్కు లేదని ముందు గ్రహించాలి. మనం గీసుకున్న సరిహద్దులను బట్టి నా ఊరు, నా జిల్లా, నా రాష్ట్రం, నా దేశం అనే కొన్ని రకాల ఫీలింగ్స్ కలుగుతాయి. అవి కేవలం ఎవరితో నీ అనుబంధం ముడిపడిరదన్న గుర్తింపు తప్ప మరేమీ కాదనేది మరో వాస్తవం. అసలు మతం అనే భావన, దానికి మనం కట్టుబడటం అనేది లేకపోతే ఈ ద్వేషమనే భావనకు ఆలంబన ఉండదు. కాబట్టి మతం చెప్పిందనే మంచిని పాటింపులోకి తేకుండా మతం చెప్పలేదనే చెడును విడనాడకుండా ఉండటానికి మతమే కారణ మనేది మరొక నిజం. కులం అనేది కూడా ఇంచుమించు అలానే ఉంటుంది. కాకపోతే వేల సంవత్సరాల పాటు ఈ మహోన్నత గడ్డమీద పాటించిన అసమానతల కారణంగా కొంతమంది పెచ్చరిల్లిపోవటం, మరికొంతమంది కునారిల్లిపోవడం మన కళ్ల ముందే జరిగింది. కులజాఢ్యాన్ని మనం ప్రత్యక్షంగానే చూస్తున్నాం. ముఖ్యంగా రాజకీయరంగంలో.. అది కూడా వదిలించుకో వాల్సిన దరిద్రాల జాబితాలో మొదటిది. దానివల్లే ఆయా కులాలవారు ఉత్త గచ్చకాయలను జాతిరత్నాలని చెప్పుకొని పైకెత్తుకుని ముద్దాడేస్తున్నారు. మరొకటి ప్రాంతీయ దురభిమానం. పుట్టిన ప్రతి ఒక్కరికి ప్రాంతం అనేది ఉంటుంది కదా.. మరి దానికోసం వికటాట్టహాసం చేయాల్సిన పనేంటి అంటూ బహుశా చలం గారు వ్యాఖ్యానించినట్లున్నారు. ఆయా ప్రాంతాలకు సరఫరా అయ్యే నీరు, ఆహారపు అలవాట్లు, అక్కడివారి ఆహార్యం, భాష వగైరాల్లో కొద్దిపాటి ప్రత్యేకతలు, వ్యత్యాసాలు ఉండొచ్చుగాక. అంతమాత్రానికే మనకు పాత్ర ఏమాత్రం లేని అంశాలను ఆపాదిం చుకుని గర్వపడిపోతూ ఆత్మవంచన చేసుకోపోవడం హాస్యాస్పదం. పైన తెలిపిన రుగ్మతలన్నీ ఎందుకు కలుగుతున్నాయో మనం అంతా కొద్దిసేపు నిష్పక్షపాతంగా ఆలోచించుకుంటే సమాధా నాలు దొరకనంత జఠిల సమస్యలు కావవి. దానికి కావాల్సింది ఎలాంటి ఉన్మాదాలకు తావులేని మనిషితనం. ఈ విషయాన్ని ఇంకా లోతుగా, సోదాహరణంగా వివరించి మతం, కులం అనే మత్తు నుంచి ప్రజలను రక్షించాల్సిన అవసరం ఉంది.
Kommentare