
‘గంజాయి పండిరచినా, కాల్చినా, రవాణా చేసినా, అమ్మినా అదే ఆఖరి రోజు’ ఏపీ సీఎం చంద్ర బాబు బుధవారం కేబినేట్ భేటీ తర్వాత చేసిన కామెంట్స్ ఇవి. గత అయిదేళ్లుగా గంజాయి రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోవడం, నేరాలకు గంజాయి బానిసలే కారణం కావడం.. ఏపీలో ఆందోళన కలిగిస్తోంది. ఉత్తరాంధ్ర మన్యం నుంచి విపరీతంగా గంజాయి సప్లై కావడం, ఆ గంజాయికి ఏపీతో పాటుగా సరిహద్దు రాష్ట్రాల్లో కూడా డిమాండ్ ఉండటంతో ఓ రాజకీయ పార్టీ నేతలు బాగా దండుకున్నారని వార్తలు వచ్చాయి. అప్పట్లో ఓ ఉన్నత పోలీస్ అధికారి పదవి పోవడానికి గంజాయి తోటలు కాల్చడమే కారణమనే వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు గంజాయి విషయంలో సీఎం చంద్రబాబు చాలా సీరియస్‌గా ఉన్నారు. ఈ విషయంలో పోలీసులకు కూడా బలమైన ఆదేశాలు వెళ్లాయి. అందుకే పోలీసులు కూడా ఇప్పుడు గంజాయి విషయంలో చిన్న క్లూ దొరికినా వెంటాడు తున్నారు, వేటాడుతున్నారు. గురువారం చిత్తూరు జిల్లాలో రెండు కేజీల గంజాయి పట్టుకోవడంతో పాటు మారణాయుధాలు కూడా ఇద్దరి నుంచి స్వాధీనం చేసుకోవడం కలకలం రేపిన అంశంగా చెప్పాలి. ఇక తెలంగాణాలో కూడా గంజాయి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. భద్రాచలం, ములుగు అడవుల నుంచి పెద్దఎత్తున గంజాయిని సప్లై చేస్తున్న సంగతి తెలిసిందే. దీనితో ఆ గంజాయిపై తెలంగాణా పోలీసులు భారీ ఎత్తున చెక్‌పోస్ట్‌లు ఏర్పాటుచేసి నిఘా పెంచారు. హైదరాబాద్‌లో గంజాయి ఆయిల్, చాక్లెట్‌లు పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకుంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత నెల రోజుల్లో దాదాపు 40 కేజీలకు పైగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌పై కూడా హైదరాబాద్‌లో పోలీసు లు సీరియస్‌గా నిఘా పెట్టారు. ఈ తరుణంలో ఓ కీలక సమాచారం ప్రభుత్వ వర్గాల్లో చక్కర్లు కొడు తోంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి గంజాయి దేశ వ్యాప్తంగా ఎక్కువగా సప్లై కావడంతో ఉమ్మడి వ్యూహాన్ని అమలు చేసేందుకు సిద్దమవుతున్నారు సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి. బుధవారం చంద్రబాబు మాట్లాడుతూ గంజాయి విషయంలో కొత్త చట్టం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. దీనికి అదనపు బలగాలను కూడా కేటాయిస్తామన్నారు. దీనితో రెండు తెలుగు రాష్ట్రాలు సంయుక్తంగా ఓ చట్టాన్ని రూపొందించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీనికి కేంద్ర సహ కారం కూడా తీసుకునేందుకు ముఖ్యమంత్రులు సిద్ధమయ్యారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా దీనికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఆపరేషన్ కగార్‌తో మావోలను వేటాడుతున్న కేంద్రం.. మావోల ఆర్ధిక వనరులపై దెబ్బకొట్టేందుకు సిద్ధమైంది. వారి ఆర్ధిక వనరులలో గంజాయి కీలకం అనే వార్తలు చూస్తూనే ఉంటాం. చత్తీస్‌ఘడ్‌లో బలగాల కూంబింగ్ పెరగడంతో తెలంగాణా వైపు వస్తున్నారు మావోలు. అందుకే ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లా సరిహద్దుల్లో బలగాలు మోహరించాయి. ఇదే సమ యంలో గంజాయి కూడా అక్రమ రవాణా జరిగే అవకాశం ఉంది. దీనితో రెండు తెలుగు రాష్ట్రాలు సంయుక్తంగా రూపొందించే చట్టానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. గతంలో గంజాయి సమాచారం పోలీసుల వద్ద ఉన్నా పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఏమని ప్రశ్నిస్తే.. తాగేవాళ్ల మీద చర్యలు తీసుకోడానికి చట్టాలు ఒప్పుకోవని, విక్రయించేవారు రాష్ట్రంలో లేరని చెప్పేవారు. కానీ ఈసారి వచ్చిన ప్రభుత్వాలు ఈ అంశంపై కఠినంగా వ్యవహరిస్తున్నాయి. గంజాయి సేవించినవారిని సైతం జైలుకు పంపడానికి వెనుకాడటంలేదు. ఇందుకోసం పోలీసు శైలి ఉపయోగిస్తున్నారు. ఇది గతి తప్పనంతవరకు ఫర్వాలేదు. గంజాయి అమ్ముతున్నారన్న సమాచారం ఉంటే రైడ్ చేయడానికి స్టేషన్‌లో ఉన్న గంజాయిని వారి వద్ద ఉంచి జైలుకు పంపిన సందర్భాలూ ఆఫ్ ది రికార్డుగా మీడియాకు కని పిస్తున్నాయి. రాష్ట్రంలో గంజాయికి కేరాఫ్ అడ్రస్‌గా ఉత్తరాంధ్ర జిల్లాలే మారాయన్నది నిర్వివాదాంశం. ఎందుకంటే.. ఇందులో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు ఒడిశాతో బోర్డర్ పంచుకోగా, విశాఖపట్నం ఉమ్మడిజిల్లాలో అరుకు, పాడేరు వంటి గిరిజన ప్రాంతాలు ఉన్నాయి. గతంలో ఎక్సైజ్ శాఖను నిర్వీర్యం చేసి సెబ్ అనే ఓ కొత్త విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వీరి పని గంజాయి, నాటుసారాపై దాడులు నిర్వహించడం. కానీ ఎక్కడా దీన్ని కంట్రోల్‌లో పెట్టినట్టు మనకు కనపడలేదు. కారణం పక్క రాష్ట్రాల్లో గంజాయి పంట విరివిగా ఉండటం, రాష్ట్రంలో ఆదివాసీలు నివసించే చోట వారిని కాపలాగా పెట్టి స్మగ్లర్లే పంటను పండిరచడం వల్ల చర్యలు తీసుకోవడం కష్టమైంది. అయితే ఈసారి కేంద్ర ప్రభుత్వమే ఇందుకోసం ప్రత్యేక దళాలు నియమించడం వల్ల ఈ ఫోర్స్‌కు మరింత శక్తి సమకూరుతుంది. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా, ఆ మూలాలు రాష్ట్రంలో ఉండటం తల దించుకునే విషయం. అంతర్రాష్ట్రీయ జనాల కోసం ట్రిబ్యునల్ ఉన్నట్టే మాదకద్రవ్యాల నిరోధానికి కూడా ఒక కామన్ అజెండా అవసరం.
תגובות