top of page

మత్తులో తూలి.. మృత్యు కాలువలోకి

  • Writer: Prasad Satyam
    Prasad Satyam
  • Jul 18
  • 1 min read
  • భార్య, ఇద్దరు కుమార్తెలను అనాథలను చేసిన వ్యసనం

  • మద్యం మహమ్మారికి మరో బలి.. రోడ్డున పడిన కుటుంబం

  • కాలువపై పలకలు లేవు.. బెల్ట్ షాపులకు అడ్డు అదుపూ లేదు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

బలగమెట్టు రామమందిరం ఎదురుగా ఉన్న కాలువలో పడి అదే ప్రాంతానికి చెందిన సత్యనారాయణ (35) అనే వ్యక్తి మృతిచెందాడు. శుక్రవారం రాత్రంతా తాగి, వేకువజామున 3 గంటలకు లేచి ఇంటికి వెళ్లే క్రమంలో తూగి ఒకసారి పడిపోయాడు. మళ్లీ లేచి తమాయించుకునే లోపే కొత్తగా నిర్మించిన కాలువలో పడి మరణించినట్లు సీసీ ఫుటేజ్ చెబుతుంది. పాలకొండ రోడ్డు విస్తరణలో భాగంగా పెద్ద కాలువలు నిర్మించారు. అయితే రోడ్డు పూర్తి కాకపోవడంతో దీనిపై పలకలు అమర్చలేదు. రాత్రి వైన్‌షాపు తెరిచివుంచినంత వరకు అక్కడే తాగి తూగిన సత్యనారాయణ, ఆ తర్వాత బెల్ట్‌షాపు నుంచి కూడా మందు తెచ్చుకొని తాగి లేవలేకపోయాడని స్థానికులు చెబుతున్నారు. వేకువజామున 3 గంటలకు లేచే ప్రయత్నంలో కాలువలో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రాంతంలో విపరీతంగా బెల్ట్‌షాపులు నడుస్తున్నాయి. సెల్‌ఫోన్లు, వాచీలు తాకట్టు పెట్టుకొని మరీ మద్యం అరువు ఇవ్వడం, అక్కడే తాగే ఏర్పాట్లు చేయడంతో బలగ ప్రాంతంలో బెల్ట్‌షాపుల బారిన పడి చాలా కుటుంబాలు చితికిపోతున్నాయి. దీనికి తోడు కాలువపై పలకలు వేయకపోవడం కూడా ప్రాణం పోవడానికి ఒక కారణం. అయితే సీసీ ఫుటేజ్‌లో మాత్రం తప్పతాగి తూలిపోవడం వల్లే కాలువలో పడినట్లు క్లియర్‌గా కనిపిస్తుంది. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గతంలో కార్ డ్రైవర్‌గా పని చేసిన సత్యనారాయణ ఇప్ప్పుడు లారీకి వెళ్తున్నట్టు తెలుస్తుంది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page