top of page

మధ్యతరగతి జీవులను ఆకర్షించిన బడ్జెట్‌

Writer: DV RAMANADV RAMANA

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ పైపైన చూస్తే పాక్షికంగానైనా మధ్యతరగతి జీవులను ఆకర్షించేదిగా కనిపిస్తుంది. ఈ బడ్జెట్‌లో 12 లక్షల వరకు ఆదాయపన్ను ఉండదు అన్న ప్రతిపాదన బాగా హైలట్‌ అయ్యింది. అయితే, అటు ఆర్థికమంత్రి ఇటు వేతన జీవులు తరచూ దృష్టి సారించని మరో కీలకాంశం ఉంది. అదే ద్రవ్యోల్బణం. గత మూడు సంవత్సరాలుగా ద్రవ్యోల్బణం అదుపు తప్పే ఉంది. ఈ కాలంలో ప్రత్యేకించి, గత ఐదు ఆరేళ్లలో నిత్య అవసర వస్తువుల ధరలు రెండు, మూడు రెట్లు పెరిగాయి. ఇది ప్రతి కుటుంబానికి అనుభవంలో ఉన్న విషయమే. అదే సందర్భంలో స్వాతంత్య్రానంతరం నిజవేతనాలు దశాబ్దానికి పైగా స్తబ్దతకు లోనవడం ఇదే మొదటిసారి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, స్తబ్దతకు లోనైన వేతనాలు నేపథ్యంలో ఆదాయ పన్ను రాయితీ వల్ల కలిగే నిజమైన ప్రయోజనం, ఊరట నామమాత్రమే. వీళ్ల డబ్బులకు విలువ ఉండాలంటే ద్రవ్యోల్బణంలో ధరలు పెరగకూడదు, రూపాయి విలువ పడిపోకూడదు. మరో పక్క అంతర్జాతీయ మార్కెట్‌లో జరుగుతున్న పరిణామాలను చూస్తే రూపాయి విలువ పతనం శాశ్వత ధోరణిగా కనిపిస్తోంది. రూపాయి విలువ పడిపోతే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల ఖరీదు పెరుగుతుంది. అది కూడా ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచుతుంది. అంతిమంగా సార్వత్రిక ద్రవ్యోల్బణం పెరుగుదుల, వినియోగదారుల కొనుగోలు శక్తి క్షీణతగా ఆర్థిక వ్యవస్థలో స్థిరీకరణించబడుతోంది. ఈ సాంకేతికత పక్కన పెడితే పెరిగే ధరల భారం కారణంగా ప్రజల చేతుల్లో మిగులు నిల్వలు కరిగిపోతాయి. తరిగిపోతాయి. దాంతో పెట్టుబడులు పెట్టి ఉత్పత్తి చేద్దామనుకుంటున్న కంపెనీల లాభాల రేటు కూడా పడిపోతుంది. లాభాల రేటు పడిపోయే సమయంలో అదనపు పెట్టుబడులు పెట్టి అదనపు ఉత్పత్తి సామర్ధ్యాన్ని నెలకొల్పే ప్రయత్నాలు ముందుకు సాగవు. ఫలితంగా ఉత్పాదక సామర్ధ్యం మందగిస్తుంది. అంతిమంగా ఈ పరిణామాలన్నీ సంక్షోభానికి దారితీస్తాయి. ఈ కోణంలో చూసి నప్పుడు బడ్జెట్‌ ప్రతిపాదించిన ఆర్ధిక వ్యూహం, ద్రవ్య వ్యూహం, పెట్టుబడుల వ్యూహం సంక్షోభాన్ని తీవ్రతరం చేసేదిగా ఉందే తప్ప దేశ ఆర్థిక వ్యవస్థను, ప్రజల వినియోగ శక్తిని గట్టెక్కించే పరిస్థితులు కనిపించటం లేదు. ఈ దిశగా ఈ బడ్జెట్‌ ఆశాజనక వాతావరణాన్ని కల్పించటంలో విఫలమైందని చెప్పవచ్చు. వేతనాలు, పనిగంటలపై కార్పొరేట్‌ వర్గం లేవనెత్తిన చర్చలో జోక్యం చేసుకుంటూ ఆర్థిక సర్వే కూడా సుదీర్ఘ పనిగంటలు కార్మికుల ఆరోగ్యానికి క్షేమకరం కాదని తేల్చేసింది. లాభాలు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో కార్మికుల వేతనాలు కూడా పెంచేందుకు కార్పొరేట్‌ వర్గం సిద్ధం కావాలని కూడా కేంద్ర ఆర్థిక శాఖ సలహాదారు అనంత నాగేశ్వరన్‌ అభిప్రాయపడ్డారు. ఏతావాతా ప్రతిపక్షాలు లేవనెత్తిన విషయాలనే అయిష్టంగానైనా అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వేతనాలు స్థంభించాయన్న వాస్తవం ఎట్టకేలకు ప్రభుత్వం అంగీకరిస్తోంది. వేతనాలు ద్రవ్యోల్బణం స్థాయిని మించి పెరిగినప్పుడే ప్రజల వద్ద కొనుగోలు శక్తి పెరుగుతుంది. అంతో ఇంతో పొదుపు చేసుకునేందుకు వీలు కలుగుతుంది. కానీ ఈ రెండు లక్ష్యాలను సాధించేందుకు బడ్జెట్‌లో ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు, విధి విధానాలు రూపొందించలేదని నిస్సందేహంగా చెప్పవచ్చు. వేతనాల విషయానికి వస్తే రెండు మూడు కోణాల్లో ఈ సమస్యను మనం అర్థం చేసుకోవాలి. ప్రభుత్వ రంగంలో పరిశ్రమల స్థాపన ఎప్పుడో ఆగిపోయింది. ఉన్న ఉద్యోగాల్లోనే రకరకాల పేర్లుతో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌, టైం స్కేల్‌ ఉద్యోగుల సంఖ్య పెరిగింది. దాదాపు ప్రతి ప్రభుత్వరంగ సంస్థలోనూ, ప్రభుత్వ విభాగంలోనూ 80 శాతం వరకూ ఉద్యోగ భద్రత లేని పరిస్థితుల్లో కాంట్రాక్టు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు పని చేస్తున్నారు. పైగా వీళ్లందరినీ నేరుగా సదరు ప్రభుత్వరంగ సంస్థ నియమించుకోవడానికి బదులు మధ్యలో ఓ ఏజెంట్‌ ద్వారా నియామకాలు జరుగుతున్నాయి. కంపెలు ఇచ్చే జీతంలో ఓ భాగం ఈ ఏజెంట్ల పరం అవుతుంది. దాంతో అరకొర జీతాల్లో కూడా కార్మికుల చేతికి దక్కుతున్నది చాలా తక్కువ. ఈ వ్యవస్థను సంస్కరించకుండా ఏజెంట్ల వ్యవస్థను రద్దు చేయకుండా అసంఘటిత రంగం ద్వారా పని చేసే కార్మికులు ఆ కొద్దిపాటి వేతనాలైనా నేరుగా అందుకునేందుకు అవకాశాలు కనిపిం చటం లేదు. ప్రభుత్వం గత ముప్పై ఏళ్లల్లో ఎన్ని బడ్జెట్‌లు ప్రవేశపెట్టినా ఈ కోణంపై దృష్టిసారించనే లేదు. వేతన సంఘాలు ప్రభుత్వ రంగంలో పని చేసే శాశ్వత ఉద్యోగులకు సంబంధించిన వేతన విధానాన్ని మాత్రమే నిర్ధారిస్తాయి. ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్రామీణ ఉపాధి హామీ పథకంలోనే కనీస వేతనాలు అమలు కావటం లేదు.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page