టీచర్స్ అర్థమయ్యేలా పాఠం చెప్పేవారు. పిల్లలు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివేవారు. ఆ అమ్మాయికి ఏడో తరగతిలో కూడా మంచి మార్కులొచ్చాయి. ‘ఇంత తెలివితేటలున్న అమ్మాయిని ఈ స్కూల్ చదివిస్తున్నావేంటి? ఇక్కడ చదివితే ఐఐటీ వస్తుందా? కనీసం ఎనిమిదో తరగతి నుంచి ఐఐటీ ఫౌండేషన్ కోర్స్ అందేలా చూడు’ తల్లికి పక్కింటివారి హితబోధ. స్కాలర్షిప్ టెస్ట్‌లంటూ పత్రికా ప్రకటనల్లో హోరెత్తించే ఉత్తర భారత దేశానికి చెందిన ఐఐటీ కోచింగ్ షాపు.. దిల్‌సుఖ్‌నగర్ బ్రాంచ్‌లో కూతుర్ని ఎనిమిదిలో చేర్పించింది.
‘ఏడు దాకా బాగా చదివేది. ఇప్పుడు ఇంటికి రావడంతోటే సెల్‌ఫోన్. ఎంత చెప్పినా వినదు. మా బంధువు మీ గురించి ఫేస్‌బుక్ ద్వారా తెలుసుకొన్నారు. దయచేసి మా అమ్మాయికి కౌన్సిలింగ్ ఇవ్వండి సార్’.
నాతో ఆ తల్లి..
ఇంటికొచ్చాక రోజుకు మూడు నాలుగు గంటలు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన స్కూల్ స్నేహితులతో చాట్ చేస్తోంది. తన క్లాసులో అందరూ ఇదే చేస్తారు. ఐఐటీ ఫౌండేషన్ పేరుతో పెద్ద తరగతుల పాఠాలను టీచర్స్ చెప్పిపోతుంటారు. అవి అర్థం కావు. బట్టీ కొట్టాలి. మార్కులు తక్కువొస్తే సెక్షన్స్ మార్చేస్తారు. అక్కడ పరిస్థితి మరింత దారుణం. క్రీడలు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లాంటి క్లాసులు పేరుకే ఉంటాయి. చదువంటే విరక్తి పుడుతోంది. ఇంటికొచ్చాక స్నేహితులతో చాట్ చేస్తే కాస్త రిలీఫ్.
.. ఇవీ ఎనిమిదో తరగతి అమ్మాయి నుంచి నేను గ్రహించిన విషయాలు.
తల్లి కూతురుతో స్నేహితురాలిగా వ్యవహరిస్తోంది. కూతురు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పాస్‌వర్డ్ తెలుసు. అమ్మాయి ఇంకా పూర్తిగా గతి తప్పలేదు. చెడు సావాసాలు ఇంకా మొదలెట్టలేదు. మొబైల్ అడిక్షన్ మొదటి దశలో ఉంది. సుమారుగా అరగంట కౌన్సిలింగ్ చేసి ఎన్‌ఎల్‌పీ ఇచ్చాను. తండ్రి అమీర్‌పేట్‌లో ఒక కోచింగ్ సెంటర్ నడుపుతాడు. పెద్దబ్బాయి పదో తరగతి. రెండోవాడు ఎనిమిది. ఇద్దరూ ఎస్‌ఆర్ నగర్‌లోని తెలుగు ఐఐటీ కోచింగ్ షాప్‌లో చదువుతారు. మొబైల్‌కి పూర్తిస్థాయి బానిసలు. వద్దంటే తిరగబడుతారు. కోపం.. అసహనం.. చిరాకు. తండ్రి అని కూడా చూడకుండా నోటికేది వస్తే అది మాటలాడుతారు.
‘స్కూల్ వారిని కలవలేదా?’ అడిగాను.
‘అయ్యో.. ఎన్నోసార్లు సార్.. ’
‘అది మీ ఇంట్లో జరిగే వ్యవహారం. మాకేంటి సంబంధం? మీరు చూసుకోవాలి’ అని ఛీత్కారంగా మాట్లాడారు సార్. నేను విద్యా రంగంలో ఉన్నాను. కానీ పిల్లల విషయంలో దారుణమైన తప్పు చేశాను. ఎలాగైనా సాయం చేయండి సార్. ‘ఆ స్కూల్ చదివే మిగతా పిల్లల సంగతేంటి?’. ‘అమ్మాయిల సంగతి నాకు తెలియదు సార్. వీళ్ల క్లాసులో అబ్బాయిలందరికీ అకౌంట్స్ ఉన్నాయి. స్కూల్ నుంచి రాగానే వాట్సాప్ గ్రూప్స్ ద్వారా గేమ్స్ ఆడుతారు. ఎంతసేపు ఫోన్ వదలరు’.
‘మీ పిల్లలిద్దరూ మొబైల్ అడిక్షన్ రెండో దశలో ఉన్నారు. వారిపై ఇప్పుడు కౌన్సిలింగ్ పనిచేసే అవకాశం తక్కువ. మానసిక వైద్యుడి ద్వారా మందులు ఇవ్వాలి. వాటికి సవాలక్ష సైడ్ ఎఫెక్ట్స్. ఈ పద్ధతి వద్దనుకొంటే సెల్‌ఫోన్ అనుమతించని రెసిడెన్షియల్ స్కూల్‌లో చేర్పించండి. లేకపోతే పరిస్థితి మరింత దిగజారుతుంది. మూడో దశకు వెళితే.. హింసకు దిగుతారు. అప్పుడు ఘోరాలు జరిగిపోతాయి’ చెప్పాను.
ఒక పక్క ఐఐటీ కోచింగ్ షాపులు.. బట్టీ చదువులు.. ఎనిమిదో తరగతిలో ఇంటర్ పాఠాలు. పాఠాలు చెప్పేవారికి, చెప్పించే వారికి సంవత్సరం తిండి ఒకే రోజు తినిపించాలి. అప్పుడు తెలిసొస్తుంది. అది చేసేవాడు లేదు కనుకే.. విచ్చలవిడితనం. చెప్పేవారికే పాఠాలు అర్థం కావు. క్లాసులో పాఠం వల్లెవేస్తారు. అర్థం కాని పాఠాన్ని పదే పదే చదవాలి. పరీక్షలో రాయాలి. మార్కులు తేవాలి. ఇది పెద్ద బాలలకు నేడు ఐఐటీ షాప్స్ విధిస్తున్న శిక్ష. పిల్లలకు చదువంటే ఆసక్తి చచ్చింది. ఎక్కడో రాజస్థాన్ కోటలో ఫ్యాన్‌కు వేలాడకుండా మిగిలిన కొంత మంది ర్యాంకర్లను కొనుగోలు చేసి.. కోట్లు వెచ్చించి.. ప్రకటనలతో తల్లిదండ్రుల బ్రెయిన్ వాష్ చేసే ఐఐటీ ఫౌండేషన్ దుకాణ యజమానులు తమ ఆటలు ఎక్కువ కాలం సాగవని గ్రహించారు. తమ దుకాణాలను విదేశీ వెంచర్ కాపిటలిస్ట్‌లకు అమ్మి వేల కోట్లు కొట్టేసారు.
వంతెన పైనుంచి కింద నీటిలోని తన ప్రతిబింబాన్ని చూసి మరో కుక్క అనుకొని అత్యాశకు పోయి మొరిగి నోటిలో ఉన్న మాంసం ముక్కను నదిపాలు చేసిన శునకం కథను చదవని నేటి తెలుగు తల్లిదండ్రులు మాత్రం ఇంకా ఐఐటీ ఆశల ఊయలలో ఇద్దరిలో ఒక ఐఐటీ గ్రాడ్యుయేట్‌కు ఉద్యోగం రాకపోయినా.. వచ్చిన వారి జీతం నెలకు యాభై వేలు దాటకపోయినా.. తెలుగు వారికి పట్టిన ఐఐటీ పిచ్చి ఇప్పట్లో వదలదు. అది తెలుగు పేరెంట్స్ కంజెనిటల్ డిసార్డర్. ఐఐటీ ఫౌండేషన్ అంటే కాన్సెప్ట్‌ను అర్థం చేసుకొని విశ్లేషణ అనుప్రయుక్తం అనే పద్ధతిలో చదవాలని వీరికి అర్థం కావడానికి జీవిత కాలం సరిపోదు.
ఇంటర్నేషనల్ స్కూల్స్.. ఇవి ఇప్పుడు విదేశీ వెంచర్ క్యాపిటలిస్టుల చేతిలో. అవును మరి.. లాభాలు ఎక్కడుంటే ఈ విదేశీ గద్దలు అక్కడ వాలిపోతాయి. యునెస్కో వద్దంది. ఇంగ్లాండ్, నెథర్లాండ్, ఫ్రాన్స్ లాంటి అనేక దేశాలు నిద్దురలేచాయి. చేతులు కాల్చుకొని బుద్ధి వచ్చింది దేవుడా అంటూ వారు నిషేదిస్తున్న విధానాలనే ఈ విదేశీ వెంచర్ క్యాపిటలిస్టులు ఇప్పుడు ఇక్కడ మోడరన్ ట్రెండ్ పేరుతో ఇక్కడ ప్రవేశపెడుతున్నారు. స్కూల్‌లో ఉండే ఆరేడు గంటల్లో అయిదారు గంటలు పిల్లలు డిజిటల్ బోర్డుపై వీడియో చూస్తూ గడపాల్సిందే. పాఠం సరిగా రానివారినైనా టీచర్స్‌గా నియమించి శాలరీ బిల్లు తగ్గించుకొనే ప్లాన్ వారిది. ఆహా.. ఓహో.. మా వాడి స్కూల్‌లో మొత్తం డిజిటల్ పాఠాలు. ఇదే లేటెస్ట్.. అనుకొనే బకరా మనస్తత్వం డబ్బున్న తల్లిదండ్రులది. ఐ స్ట్రెయిన్.. మస్క్యులర్ డీజనరేషన్.. టెక్ట్స్ నెక్.. రిపిటేటివ్ స్ట్రెయిన్ ఇంజురీ.. ఈ మాటల్ని పాపం ఈ కొత్త తరం తల్లిదండ్రులు ఇంకా వినలేదు. కనీసం తమ పిల్లలతో మాట్లాడటానికి సమయం దొరకని బిజీ లైఫ్ వారిది.
ఎంత ఫీజు కడితే అంత గొప్ప స్కూల్ అని భావించే ఈ నయా తరం తల్లిదండ్రులు.. ఇంట్లో పిల్లలు హోమ్‌వర్క్ పేరుతో టాబ్స్ మొబైల్స్‌పై చేస్తున్నదేంటో చూడలేరు. చూసినా ఇక ఇప్పుడు పెద్దగా చేసేదేమి లేదు. చేతులు కాల్చుకొన్నాక ఇప్పుడు పాశ్చాత్య దేశాలు మేలుకొన్నాయి. ‘డిజిటలైజేషన్ పిల్లల కోసం కాకుండా విద్యా వ్యాపారుల కోసం జరుగుతోంది’ అని సాక్షాత్తూ యునెస్కో చెప్పింది. ఇంటర్నేషనల్ స్కూల్ చదివిస్తేనే తమ స్టేటస్ నలుగురికీ తెలుస్తుందని భావించే తల్లిదండ్రులు కళ్లు తెరవడానికి ఇంకా చాలా కాలం పడుతుంది. అప్పటికి ఈ పిల్లలు ఇన్సొమ్నియా.. కార్పల్ టన్నెల్ సిండ్రోమ్.. నోమోఫోబియా.. సోషల్ ఐసోలేషన్.. హైపర్ ఆక్టివిటీ డిసార్డర్.. లాంటి నోరు తిరగని రోగాల బారిన పడుంటారు. కార్పొరేట్ వైద్యశాలలకు పండగే పండగ. అన్నట్టు.. ఇప్పుడు అవి కూడా విదేశీ కంపెనీల చేతిలో.. తల్లిదండ్రుల అతి ప్రేమ.. అజ్ఞానం.. వేల/లక్షల పసిమొగ్గల జీవితాలను తుంచేస్తోంది. వీరిని రక్షించడానికి ఏ దేవుడైనా కొండదిగి వస్తాడా? విదేశీ కంపెనీల ధనదాహానికి మన పిల్లల జీవితాలు బలైపోకుండా ఉండాలంటే.. ప్రతి తల్లిదండ్రిలో సరైన అవగాహన అవసరం.
- వాసిరెడ్డి అమర్నాథ్, విద్యావేత్త
留言