
కొంతమంది నాయకులు జనాభా గురించి వర్రీ అవుతున్నారు. వాళ్లు బాధపడేది అధిక జనాభా గురించి కాదు.. జనాభా పెరుగుదలలో ఇండియా చైనాను మించిపోతోందని కాదు.. జనాభా ఇంకా పెరగాలంటున్నారు. కొందరు పొలిటికల్‌గా మాట్లాడుతుంటే, కొందరు సమాజం గురించి మాట్లాడు తున్నారు. జనాభా నియంత్రణ, దాని ద్వారా ఎదురయ్యే పరిణామాల గురించి చాలా కాలంగా తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలు ఏదో ఒక రూపంలో తమ స్వరాన్ని వినిపిస్తూనే ఉన్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజన ప్రస్తావన వచ్చినప్పటి నుంచి ఇది ఇంకాస్త పెరిగింది. అమరావతిలో ప్రజలు వృద్ధులు అవుతున్నారని, రాష్ట్రానికి అదొక సమస్యగా మారనుందని చంద్రబాబు అన్నారు. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలను కనాలని మరొకసారి పిలుపునిచ్చారు. ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలను కనకుంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి ‘అనర్హులుగా’ చేస్తూ చట్టం కూడా తీసుకొస్తామన్నారు. స్టాలిన్ అయితే మరో అడుగు ముందుకేసి ఒక్కో జంట పదహారుమంది పిల్లలను ఎందుకు కనగూడదు అని ప్రశ్నించారు. జనాభా నియంత్రణ మీద చంద్రబాబు నాయుడు, స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేయడం ఇదే తొలిసారి కాదు. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలు డీలిమిటేషన్ వల్ల నష్టపోతాయనే ఆందోళన ఎప్పటి నుంచో ఉంది. కేంద్రం, జనాభా ఆధారంగా నిధులను రాష్ట్రాలకు పంచడం మీద ఎంతో కాలంగా దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యమంత్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏజింగ్ గురించి చంద్రబాబు ప్రస్తావించగా, పార్లమెంటులో ప్రాతినిధ్యం గురించి స్టాలిన్ మాట్లాడారు. తాజాగా ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ కూడా ప్రతి కుటుంబం ముగ్గురు పిల్లలను కనాలని అన్నారు. జనాభా తగ్గడం వల్ల చివరకు సమాజమే అంతరిస్తుందని అన్నారు. జనాభా తగ్గడం వల్ల భాషలు అంతరిస్తాయని, సంస్కృతి నశిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధుల జనాభా పెరుగుతోంది అంటే.. పని చేసే జనాభా తగ్గుతోందని అర్థం. ఇది ప్రధానంగా మానవ వనరుల కొరతకు దారితీస్తుంది. సౌత్ కొరియా, చైనా, జపాన్ వంటి దేశాలు ఇప్పటికే ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. పెళ్లి చేసుకున్న వారికి ఆర్థిక ప్రోత్సాహకాలను సౌత్ కొరియా ప్రకటించింది. జపాన్ అయితే మ్యారేజ్ బడ్డెట్ కేటాయించింది. దక్షిణాదిలో జనాభా పెరుగుదల ఆగిపోవడం వల్ల పార్ల మెంటులో ప్రాతినిధ్యం తగ్గుతుందనే ఆందోళనలున్నాయి. తమిళనాడు ముఖ్యమత్రి ఎంకే స్టాలిన్ చెబుతోంది అదే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటకల్లో పెరిగే జనాభా 2.9 కోట్లు. అంటే ఇది మొత్తం పెరిగిన జనాభాలో కేవలం 9శాతం. జనాభా సంఖ్యను బట్టే అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య ఉంటుంది. ఆ సంఖ్య తగ్గితే రాజకీయ బలం తగ్గిపోతుంది. ఎక్కువ సీట్లు ఉన్న రాష్ట్రాలు తమ డిమాండ్లు సాధించుకోవడంలో ముందుంటాయి. నాయకులు ఎక్కువమంది పిల్లలను కనాలని చెబుతున్నారుగానీ అది సాధ్యమయ్యే పనికాదు. పాత కాలంలో ఒక్కో కుటుంబంలో పది మంది పిల్లలకంటే ఎక్కువ మంది సంతానం ఉండేవారు. ఆ కాలంలో జీవన వ్యయం తక్కువ కాబట్టి ఎలాగోలా కష్టపడి పోషించారు. కానీ ఈ కాలంలో అది సాధ్యం కాదు. ఇప్పుడు కాస్ట్ లివింగ్ పెరిగిపోయింది. ఈ ఆధునిక కాలంలో ఎక్కువమంది ఒక్క సంతానంతో సరిపెడుతున్నారు. ఎక్కువమంది పిల్లలను కనాలని చెబుతున్న చంద్రబాబుకు ఎంతమంది పిల్లలు? మోహన్ భగవత్ గాని, చంద్రబాబు గాని చెప్పినదాంట్లో వాస్తవం లేకపోలేదు. కాకపోతే దేశంలో లక్షలాది అఘోరాలకు, సన్యాసులకు ఈ మాట చెప్పి ఆదర్శంగా నిలవాలి. ముఖ్యంగా మనం తొమ్మిది నెలలు మొయ్యం. ప్రాణాలు పణంగా పెట్టి బిడ్డను కనం. మురికి, ముత్రాదులు ఎత్తిపోసి పెంచం. ముఖ్యంగా వాళ్లకు తిండి, తిప్పలు, చదువు, బట్టలు ప్రభుత్వాలు కల్పించవు. ఇవన్నీ కల్పిస్తున్న అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఎవరూ కనం పొమ్మంటున్నారు. ఈమధ్య కాలంలో డిరగ్ అనే ఒక విధానం అవలంభిస్తున్నారు. డబుల్ ఇన్‌కమ్.. నో కిడ్స్. మనకు మాత్రం రోడ్లేయడానికి, కాలువలు ఎత్తడానికి, కూరగాయలు అమ్మడానికి, వ్యవసాయం చేయడానికి, పరిశ్రమల్లో పని చేయడానికి జనం కావాలి. వారిలో మతం గొడవలు రెచ్చగొడుతూ పరిపాలించడానికి, పన్నులేయ డానికి, ఫలానా తిండి తిన్నారని, ఫలానా బట్టలేసుకున్నారని చంపేయడానికి అమాయక జనం కావాలి. ఆధిపత్య కుల సంస్కృతిని బతికించడానికి నిరంతరం బానిసత్వంలో బతికే జనం కావాలి.
コメント