top of page

మన ఓటు భద్రమేనా?

Writer: ADMINADMIN
ఈవీఎంలలో దాక్కున్న ప్రజాస్వామ్యం!!

మన ఓటుహక్కును బాధ్యతగా వినియోగించుకున్న తర్వాత మన అభిప్రాయాన్ని ఓటు రూపంలో చెప్పిన తర్వాత కూడా ఫలితాల్లో అదే ప్రతిబింబిస్తుందని నమ్మడానికి ఏదో ఒక అనుమానం పెనుభూతంలా మనను వెంటాడుతుంది. అది మన ఓటు పెట్టె (ఈవీఎం) ఎంతవరకూ నమ్మదగ్గది అని అనుమానం! ఇదిగో ఇలా ఎన్నికలు పూర్తయ్యాయో లేదో, దేశంలో ఏదో ఒక రాజకీయ పార్టీ నాయకుడు మాకు ఈవీఎంలలో నమ్మకం లేదంటాడు. అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక మేజిక్కు చేసి, తామే గెలిచేలా ప్రొగ్రాం సెట్‌ చేసి ఉంటారని అనుమానిస్తాడు. దానికి కొందరు వంత పాడతారు. మరికొందరు అలాంటిదేమీ లేదంటారు. చంద్రబాబునాయుడు సైతం తాను ఓడిపోయినప్పుడల్లా ఈవీఎంలను అనుమానించడం, తద్వారా ఎన్నికల ప్రక్రియను అవమానించడం మనకు తెలిసిందే. ఇంతకూ ఏది నిజం?

చాలా అభివృద్ధి చెందిన దేశాల ఎన్నికలలో ఈవీఎంలనబడే ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్లకు ఆమడ దూరంలో ఉన్నారు. ఇంకా పాత చింతకాయ పచ్చడి మాదిరిగా పేపర్‌ బ్యాలెట్లనే ఉపయోగిస్తున్నారు. అమెరికాలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే వేర్వేరు ఎన్నికల నియమ నిబంధనలు ఉండడం వల్ల వారు మెషీన్ల జోలికి పోలేదు. జర్మనీలో కొంతమేర ప్రయత్నం చేశారు గాని, వారి అత్యున్నత న్యాయస్థానం వద్దని చెప్పాక మెషీన్లను వాడడం మానుకున్నారు. ఇంగ్లండు, ఫ్రాన్సు, ఇటలీ, నెదర్లాండ్‌ లాంటి దేశాలు కూడా తమ ఎన్నికలలో ఇప్పటికీ పేపర్‌ బ్యాలెట్‌నే వాడుతున్నాయి. చైనా గురించి అడక్కండి. అది ప్రజాస్వామ్య దేశం కాకపోవడం వల్ల ఎన్నికలు జరగవు. అవసరాన్ని బట్టి ఇప్పటికీ చేతులెత్తే పద్ధతే వినియోగంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 123 దేశాలు తమ దేశపు ఎన్నికలలో ఓటింగ్‌ మెషీన్లను బ్యాన్‌ చేశాయి. కాని, మన దేశం అది పెద్ద ప్రజాస్వామ్య దేశం కావడం వల్ల మనం ఖర్చులు తగ్గించడానికి, పర్యావరణ హితానికి, ఎన్నికలను సాఫీగా నిర్వహించడానికి వీలుగా ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్ల వైపు మొగ్గు చూపాం.

హ్యాకింగ్‌ అసాధ్యమేమీ కాదు!

వద్దన్న దేశాలు వద్దనడానికి ఏకైక కారణం వాటిలో విశ్వసనీయత లేకపోవడమే. ఎలక్ట్రానిక్‌ పరికరాలను, కంప్యూటర్లను హ్యాకింగ్‌ చేయడం ఇప్పుడు చాలా సులువు కాబట్టి ప్రజల అభిమతానికి వ్యతిరేకంగా హ్యాకర్లు ఫలితాలను తారుమారు చేయగలరనే ప్రమాదాన్ని శంకించడం వల్ల ఆయా దేశాలు వాటిని వద్దనుకున్నాయి. ఎంత ఖర్చయినా, నిదానంగా జరిగినా సరే పేపర్‌ బ్యాలెట్‌ దగ్గరే ఆగిపోయాయి. మన దేశంలో ఇప్పుడు మనం వాడుతున్న ఈవీఎం మెషీన్లను భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) కంపెనీ తయారు చేస్తుంది. దానిలో సాంకేతికతను ఎలక్ట్రానిక్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఇసిఐఎల్‌) అందిస్తుంది. ఈ రెండూ పూర్తిగా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఆధ్వర్యంలో పని చేస్తాయి. ఇవి తయారుచేసిన మెషీన్ల మీద ఆరోపణలు చేసిన ప్రతిసారీ మన భారత ఎన్నికల కమిషన్‌ రాజకీయ పార్టీల ప్రతినిధులను పిలిపించి తాము వినియోగిస్తున్న మెషీన్లు చాలా మంచివని నిరూపించే ప్రయత్నం చేస్తోంది. అయితే రెండు మూడు సార్లు విదేశాలలో మన మెషీన్ల డొల్లతనం గురించిన బాహాట ప్రదర్శన జరిగింది.

మొదటిసారి 2010లో అమెరికాలోని మిషిగాన్‌ యూనివర్శిటీలో అలెక్స్‌ హాల్డర్‌మాన్‌ తన భారతీయ విద్యార్థులతో మెషీన్లను హ్యాక్‌ చేయవచ్చని నిరూపించారు. అయితే ఆయన చేసింది, మన మెషీన్‌లోని హార్డ్‌వేర్‌ మార్చడం ద్వారా. అంటే ఈవీఎంను తస్కరిస్తే మాత్రమే అది సాధ్యం అవుతుందన్న మాట. ఆయన అదే విషయం చెప్పాడు. స్ట్రాంగ్‌ రూంలో ఉన్న మెషీన్లకు పొంచివున్న ముప్పు ఏమీ లేదని చెప్పక చెప్పినట్టే అయింది. అయితే దీనిని రిమోట్‌గా కూడా చేయవచ్చని వారు సూత్రీకరించారు. దీనినే మరికొంచెం మెరుగుపరిచి, హార్డ్‌వేర్‌ను మార్చి, బయటి నుంచి వైర్‌లెస్‌ ఇంటర్‌ఫేస్‌ ద్వారా పోలయిన ఓట్లలో పది శాతం ఓట్లను ఒకటవ స్థానం నుంచి మూడవ స్థానానికి విజయవంతంగా చేర్చి చూపించింది న్యూఢల్లీిలో ఆమ్‌ ఆద్మీ పార్టీ. కేంద్ర ప్రభుత్వం వాడుతున్న ఈవీఎంలను పరిహసించడానికి 2017 మే నెలలో వారు చేసిన ప్రదర్శనను యావత్‌ ప్రపంచమూ ఆశ్చర్యంగా చూసింది. ఒక్కో ఈవీఎంను తీసుకుని, దాని హార్డ్‌వేరును మార్చడం ద్వారా ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి దేశంలో వాడే కొన్ని మిలియన్ల మెషీన్లతో కుదరని పని.

ఈ మధ్యకాలంలో మరో ఫిర్యాదు వినిపించింది. బెల్‌ కంపెనీలో ఒక ఉద్యోగి దేశద్రోహం చేయాలనుకుని ఈవీఎం మెషీన్లలోకి తక్కువ ఫ్రీక్వెన్సీలో పనిచేసే వైర్‌లెస్‌ ప్రాసెసర్‌ ఒకటి ఎక్కించాడని, దానిని తాను నిరూపిస్తానని, లండన్‌లో ఒక గుర్తు తెలియని వ్యక్తి ముందుకొచ్చాడు. తీరా ప్రదర్శన రోజు ముఖానికి ముసుగు వేసుకుని వీడియో కాన్ఫరెన్స్‌లో పలకరించాడు. తన మనుషులు పది మందిని హైదరాబాద్‌లో పోలీసులు చంపేశారని, తనకు ఈవీఎం దొరకలేదని వాపోయాడు. ఆ ఎపిసోడ్‌ అక్కడితో ముగిసిపోయింది. కాని అనుమానాలు మాత్రం అలానే ఉండిపోయాయి.

ఓడినవారికి ఓదార్పు కావాలి

నిజానికి మన ఈవీఎం మెషీన్లు కేవలం ఒక కాలిక్యులేటర్‌ లాంటివి. కాలిక్యులేటర్‌ను ఎలాగైతే మనమేం చేయలేమో, ఈవీఎంలను కూడా ఎవరేం చేయలేరు. వాటిలో ఉండే ప్రొగ్రామింగ్‌ ఒక్కసారే పనిచేస్తుంది. ఓటింగ్‌కు సంబంధించిన సోర్స్‌ కోడ్‌ రెండోసారి మార్చడానికి వీలు పడదు. ప్రయత్నం చేస్తే మొదటిది చెరిగిపోతుంది. మెషీన్‌ను కంప్యూటర్‌తో గాని, ఇంటర్‌నెట్‌తో గాని కనెక్ట్‌ చేసే వీలుండదు కాబట్టి, హ్యాకింగ్‌ బారిన పడే అవకాశమే లేదు. లెక్కింపు సమయం (ఆలస్యంతో సహా) అంచనా వేసుకుని బ్యాటరీ అమర్చుతారు కాబట్టి ఛార్జింగ్‌ పరమైన ఇబ్బందులు కూడా ఉండవు. ఆ విధంగా మన దేశపు ఈవీఎంలను ఆదర్శంగా ఎన్నో దేశాలు తీసుకుంటున్నాయి. కాని ఇక్కడ అసలు సమస్య హ్యాకింగ్‌ గురించి కాదు.. అకౌంటబులిటీ గురించి.

ఫిర్యాదులు తనపై వచ్చిన ప్రతిసారి భారత ఎన్నికల కమిషన్‌ విచిత్రంగా స్పందిస్తోంది. మన అనుమానాలను తీర్చడం పోయి, తన ప్రజలపై ప్రతి సవాల్‌ విసురుతోంది. దమ్ముంటే తన మెషీన్లలో ఉన్న సమస్యను వివరించమని వాదిస్తోంది. ఈ ధోరణిపై భారత అత్యున్నత న్యాయస్థానం చాలా విసుక్కుంది. ఎన్నికల నిర్వహణ సంస్థ నిర్వర్తించాల్సిన రెండు ముఖ్య ఉద్దేశాలను ఈ సందర్భంగా కోర్టు గుర్తు చేసింది. అందులో మొదటిది విజేతను నిఖార్సుగా ఎన్నిక చేయడమన్నది విస్పస్టం. కాని రెండో ఉద్దేశం కూడా చాలా ముఖ్యమైనది. ఓటమి పాలైన వారికి ఓదార్పునివ్వడం. మన భారత ఎన్నికల కమిషన్‌ విజేతను ప్రకటించడంతో ఆగిపోతుంది. పరాజితులకు వచ్చే సవాలక్ష సందేహాలను తీర్చడంలో విఫలమవుతోంది. దీనినే సుప్రీంకోర్టు ఎత్తి చూపింది. అప్పటి నుంచి పోలయిన ప్రతి ఓటుకు ఒక రసీదు ఇవ్వడానికి ప్రయత్నించమని కోరింది. అది మన దేశంలో సాధ్యం కాదని కమిషన్‌ తేల్చిచెప్పింది. దానితో మెషీన్‌కు అనుబంధంగా వివిపాట్‌ను జతపరిచారు. ఓటరు ఓటు వేసిన తర్వాత సుమారు పది సెకనుల పాటు మెషీన్‌ పక్కనే ఉన్న వివిపాట్‌ మెషీన్‌లో ఎవరికి ఓటు వేసారో అభ్యర్థి పేరు, గుర్తు సుమారు పన్నెండు సెకనుల పాటు వెలుగుతుంది. ఓటరు అది చూసి తన ఓటు నమోదయినట్లు నిర్ధారించుకుంటాడు. అక్కడితో ఆ కమిషన్‌ ఆగిపోయింది. మళ్లీ భారతదేశ పౌరులు సుప్రీంకోర్టు గడపనెక్కితే, అదే ఒక రసీదుగా ఇవ్వడానికి ఇబ్బందేమిటని కోర్టు ప్రశ్నించింది. అప్పుడు ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక ఈవీఎం మెషీనుకు సంబంధించిన వివిపాట్‌ రసీదులు ఇవ్వడానికి ఎన్నికల కమిషన్‌ తలూపింది. ఒకటి లేదా రెండు ఓట్ల తేడాతో అభ్యర్థుల విజయాపజయాలు సంభవించినపుడు ఇద్దరిలో ముసురుకున్న సందేహాలను తొలగించగలిగినపుడే మన ప్రజాస్వామ్యానికి మరింత భరోసా చేకూరుతుంది.

రాజకీయ పార్టీలదే బాధ్యత

ఓడిపోయినప్పుడల్లా ఈవీఎంలను పరిహసించకుండా ఉండడానికి ముందుగా రాజకీయ పార్టీలలో చైతన్యం రావాలి. ఈవీఎంల చుట్టూ ముసురుకున్న సందేహాలను తీర్చడానికి సాధ్యమైనంత వరకూ పారదర్శకంగా ఉండడానికి ఎన్నికల కమిషన్‌ చేసిన సూచనలను రాజకీయ పార్టీలు అర్థం చేసుకోవాలి. బూత్‌లలో రిగ్గింగ్‌ జరగకుండా ఉండడానికి, ఇంక్‌ చిమ్మడం ద్వారా ఓటు రద్దు కాకుండా ఉండడానికి, పారదర్శకమైన పోలింగ్‌ జరగడానికి పేపర్‌ బ్యాలెట్‌ కంటే ఎలక్ట్రానిక్‌ మెషీన్లే ఎంతైనా మేలైనవి. కాని, భారత ఎన్నికల కమిషన్‌ నిర్దేశించిన సూచనలు పాటించినప్పుడే ఇదంతా సాకారమవుతుంది. ఓటింగ్‌ ప్రక్రియ ముగిసిన తర్వాత సాయంత్రం అన్ని రాజకీయ పార్టీల ఏజెంట్లు అంగీకరించిన తర్వాతే ఆ నిర్దిష్ట బూత్‌లో పోలింగ్‌ అధికారి, ఈవీఎం మెషీన్‌పైనున్న క్లోజ్‌ బటన్‌ నొక్కాలి. బీప్‌ సౌండ్‌తో అది ఆగిపోతుంది. కౌంటింగ్‌ రోజు మళ్లీ దానిని స్టార్ట్‌ చేస్తారు. అదే పోలింగ్‌ అధికారి క్లోజ్‌ చెయ్యడం మర్చిపోతే, ఆ బూత్‌లో మళ్లీ ఎన్నికలు నిర్వహించవలసిందే!

` దుప్పల రవికుమార్

 
 
 

תגובות


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page