top of page

‘మను’చరిత్ర సృష్టించిందా.. సమం చేసిందా?!

Writer: DV RAMANADV RAMANA
  • ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలతో మనుబాకర్‌ సంచలనం

  • స్వతంత్ర భారత క్రీడాచరిత్రలో ఆమెది కచ్చితంగా కొత్త రికార్డే

  • 1900 ఒలింపిక్స్‌ రన్నింగ్‌లో నార్మన్‌ ప్రిచార్డ్‌కు రెండు రజతాలు

  • అతను భారత్‌ తరఫున పాల్గొన్నాడని కొందరి వాదన

  • కాదు బ్రిటన్‌కు ప్రాతినిధ్యం వహించాడంటున్న మరికొందరు


ఎప్పుడొచ్చామన్నది ముఖ్యం కాదన్నయ్యా.. బుల్లెట్‌ దిగిందా లేదా అన్నదే ముఖ్యం.

కాస్త ఆలస్యం కావచ్చేమో గానీ.. రావడం మాత్రం పక్కా.

..విపరీతంగా వైరల్‌ అయినా ఈ రెండు సినీ డైలాగులు మనూ బాకర్‌కు సరిగ్గా సరిపోతాయి.

ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో భారత పతకాలను వేటను తన పిస్టల్‌తో బోణీ కొట్టిన ఈ యువ షూటర్‌.. అదే చేత్తో బోనస్‌గా రెండో పతకం కూడా సాధించిపెట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు కొట్టిన షూటర్‌గా తన పేరిట రికార్డు నెలకొల్పిన మనూ బాకర్‌.. మొత్తంగా భారత్‌ ఒలింపిక్‌ చరిత్రలో 124 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న రికార్డును సమం చేసిందా? తుత్తునీయలు చేసిందా? అన్న వివాదం ఉన్నా కొత్తగా లిఖితమైన ‘మను’చరిత్ర మాత్రం చాలాకాలం పాటు చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

మంగళవారం.. ప్యారిస్‌ ఒలింపిక్స్‌ విలేజ్‌..

సందర్భం.. పది మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ షూటింగ్‌ టీమ్‌ ఈవెంట్‌లో కాంస్య పతక పోటీ

రెడీ.. వన్‌.. టూ.. త్రీ.. అంటూ రిఫరీలు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన మరుక్షణం..

ఆ ఇద్దరి చేతుల్లో పిస్టల్స్‌ నుంచి తూటా దూసుకుపోయి లక్ష్యంతో పాటు శతాబ్దికిపైగా చెక్కుచెదరకుండా ఉన్న ఒక రికార్డును ఛేదించాయి లేదా సమం చేశాయి.

ఈ ఈవెంట్‌లో పాల్గొన్న భారత జోడీ మనూబాకర్‌, సరబ్‌జిత్‌ సింగ్‌ 16 పాయింట్లు సాధించి దక్షిణ కొరియాకు చెందిన లీ, యోజిన్‌ (10 పాయింట్లు) జోడీని మట్టికరిపించి కాంస్య పతకం అందుకున్న ఆ క్షణంలోనే భారత ఒలింపిక్‌ చరిత్రలో సువర్ణాధ్యాయం నమోదైంది. అంతకుముందు రెండు రోజుల క్రితమే మనూబాకర్‌ పది మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత ఈవెంట్‌లోనూ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం అందుకుంది. దాంతో ఒకే ఒలింపిక్స్‌ పోటీల్లో రెండు పతకాలు సాధించిన షూటర్‌గా మనూ తనకంటూ ప్రత్యేకమైన చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం ప్యారిస్‌ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్‌లో భారత్‌ తరఫున 117 మంది క్రీడాకారులు వివిధ పోటీల్లో పాల్గొంటున్నా వారిలో ఎందరు పతకాలు సాధిస్తారు.. ఎవరు భారత్‌ పేరును పతకాల పట్టికలో చేరుస్తారన్నది అనుమానంగానే ఉండేది. అందుకు తగ్గట్లే పలువురు భారత క్రీడాకారులు తాము పోటీ పడుతున్న క్రీడాంశాల్లో ప్రాథమిక రౌండ్లలోనే పరాజయం పాలై తిరుగుముఖం పడుతున్న వేళ.. షూటింగ్‌ పోటీల్లో పాల్గొంటున్న మనూబాకర్‌ దేశ ప్రజలు తనపై పెట్టుకున్న ఆశలను నెరవేరుస్తూ పది మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత ఈవెంట్‌లో కాంస్యంతో బోణీ కొట్టి భారత్‌ పతకాల పట్టికలో చేర్చింది. అయినా పట్టువీడకుండా అదే విభాగం టీమ్‌ ఈవెంట్‌లోనూ సరబ్‌జ్యోత్‌ సింగ్‌తో కలిసి భారత్‌కు వరుసగా రెండో పతకం అందించి చరిత్ర సృష్టించింది. ఒక్క పతకం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న భారత క్రీడాభిమానులకు రెండు పతకాలు అందించి భారత మహిళల సత్తాను అంతర్జాతీయ క్రీడా వేదికపై సగర్వంగా చాటింది.

ఒకే ఒక్క మనూబాకర్‌

స్వతంత్ర భారత క్రీడాచరిత్రలో ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి క్రీడాకారిణిగా మనూబాకర్‌ కొత్త చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్‌లో భారత చరిత్ర ఏమంత ఘనంగా లేదు. గత రెండు మూడు ఒలింపిక్స్‌లోనే కొద్దిగా పతకాలు సాధిస్తున్నారు. మనూబాకర్‌కు ముందు ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన క్రీడాకారులుగా కుస్తీవీరుడు (రెజ్లింగ్‌) సుశీల్‌కుమార్‌, బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు ఖ్యాతి పొందారు. కానీ వారిద్దరూ ఒకే ఒలింపిక్స్‌లో వాటిని సాధించలేదు. చైనా రాజధాని బీజింగ్‌లో జరిగిన 2008 ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో తొలి కాంస్య పతకం సాధించిన సుశీల్‌కుమార్‌ ఆ తర్వాత 2012లో లండన్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించాడు. కాగా తెలుగు అమ్మాయి పీవీ సింధూ 2016లో బ్రెజిల్‌లోని రియోలో జరిగిన ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌ పోటీల్లో రజతం, ఆ తర్వాత 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం అందుకుంది. ప్రస్తుత ప్యారిస్‌ ఒలింపిక్స్‌లోనూ సింధూ పతకం సాధిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. కానీ మనూబాకర్‌ మాత్రం ప్రస్తుత ఒలింపిక్స్‌లోనే వరుసగా రెండు పతకాలు సాధించడం విశేషం. ఇక్కడితో ఈ పతకాల వేట ఆగిపోలేదు. ఆగస్టు మూడో తేదీన జరగనున్న షూటింగ్‌ విభాగంలోని మరో ఈవెంట్‌లో పాల్గొననున్న మనూ అక్కడ విజయం సాధించి మరో పతకం సాధించే అవకాశం ఉంది.

రికార్డు బ్రేకా.. సమమా?!

ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించడం ద్వారా మనూబాకర్‌ 124 ఏళ్ల రికార్డును బ్రేక్‌ చేశారని కొందరు చెబుతుంటే.. కాదు సమం చేశారని మరికొందరు వాదిస్తున్నారు. స్వతంత్ర భారత క్రీడా చరిత్రలో మనూబాకర్‌ రికార్డు సృష్టించారనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఒలింపిక్స్‌ చరిత్రలో చూసుకుంటే అంటే స్వాతంత్య్రానికి ముందు 124 ఏళ్ల క్రితం 1900 ఒలింపిక్స్‌లో కూడా ఒక భారత క్రీడాకారుడు మనూ మాదిరిగానే రెండు పతకాలు సాధించారని అంటున్నారు. ఈ రకంగా చూస్తే అప్పటి రికార్డును మనూ సమం చేశారని కొందరు పేర్కొంటున్నారు. ప్యారిస్‌లోనే జరిగిన 1900 ఒలింపిక్స్‌లో నార్మన్‌ ప్రిచర్డ్‌ అనే బ్రిటిష్‌ ఇండియన్‌ రెండు పతకాలు సాధించాడు. అతని తర్వాత మరే భారతీయ అథ్లెట్‌ కూడా ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించలేకపోయాడు. ఇప్పుడు మనూబాకర్‌ దాన్ని సుసాధ్యం చేసింది. అయితే 1900 ఒలింపిక్స్‌లో నార్మన్‌ ప్రిచార్డ్‌ భారత్‌ తరఫున కాకుండా ఇంగ్లండ్‌ తరఫున పాల్గొన్నాడని, అందువల్ల ప్రస్తుతం ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయురాలిగా మనుబాకర్‌ నిలుస్తుందని మరికొందరు వాదిస్తున్నారు. నార్మన్‌ ప్రిచార్డ్‌ కోల్‌కతాలోనే జన్మించాడు. అక్కడే పెరిగాడు. స్థానిక సెయింట్‌ గ్జేవియర్‌ కాలేజీలో చదువుకున్నాడు. అథ్లెట్‌గా ఇక్కడే తర్ఫీదు పొందాడు. 1900 ఒలింపిక్స్‌లో భారత్‌ తరఫునే ప్రాతినిధ్యం వహించి 200 మీటర్ల పరుగు, 200 మీటర్ల హర్డిల్స్‌ విభాగాల్లో రజత పతకాలు సాధించాడని భారత్‌ ఒలింపిక్‌ చరిత్రకారుడు గులు ఎజెకిల్‌ను ఉటంకిస్తూ ప్యారిస్‌ ఒలింపిక్స్‌ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. అయితే ప్రిచార్డ్‌ బ్రిటీషర్‌ అని ఇండియాలో పుట్టి పెరిగినా 1900 ఒలింపిక్స్‌కు ముందు ఇంగ్లండ్‌కు తిరిగి వెళ్లిపోయాడని బ్రిటన్‌ ఒలింపిక్‌ చరిత్రకారుడు ఇయాన్‌ బుచానన్‌ను ఉటంకిస్తూ అదే వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా లండన్‌ అమెచ్యూర్‌ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ టీమ్‌ ద్వారా ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడని పేర్కొనడం విశేషం.

పోయిన చోటే వెతుక్కున్న మను

పోయినచోటే వెతుక్కోవాలంటారు పెద్దలు. మనూబాకర్‌ కూడా అదే చేసి సాధించింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో పోటీపడిన ఆమెను దురదృష్టం వెక్కిరించింది. పోటీ జరుగుతున్న సమయంలో తన పిస్టల్‌ చెడిపోయింది. దాన్ని రిపేర్‌ చేసే సరికి పుణ్యకాలం గడిచిపోయింది. ఆలస్యమైనా పోటీలో పాల్గొని తృటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకుంది. దాంతో నాలుగేళ్లు కసిగా సాధన చేసి ప్రస్తుత ఒలింపిక్స్‌లో ఒకటి కాదు రెండు పతకాలు ఒడిసిపట్టింది. బాక్సర్లు, రెజ్లర్లకు పేరుగాంచిన హర్యానాలోని రaజ్జర్‌లో జన్మించిన ఈ అమ్మాయి పాఠశాలలో టెన్నిస్‌, స్కేటింగ్‌, బాక్సింగ్‌ వంటి క్రీడల్లో పాల్గొనేది. తంగ్‌ టా అనే మార్షల్‌ ఆర్ట్స్‌లో పాల్గొని జాతీయ స్థాయిలో పతకాలు సాధించింది. తనకు 14 ఏళ్ల వయసున్నప్పుడు 2016 రియో ఒలింపిక్స్‌ను టీవీల్లో చూసిన తర్వాత మనసు మార్చుకుని షూటింగ్‌ వైపు మళ్లింది. తనకు స్పోర్ట్స్‌ షూటింగ్‌ పిస్టల్‌ కావాలని కోరగా తండ్రి రామ్‌కిషన్‌ మారుమాట్లాడకుండా కొనిచ్చాడు. దాంతో సాధన చేస్తూ మనుబాకర్‌ అతి తక్కువ కాలంలోనే స్టార్‌ షూటర్‌గా ఎదిగింది. 2017 జాతీయ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో ఒలింపియన్‌, మాజీ ప్రపంచ నంబర్‌ వన్‌ క్రీడాకారిణి హీనా సిద్ధూ పది మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో నమోదు చేసిన పాయింట్లను 242.3 పాయింట్లతో బ్రేక్‌ చేసి షాకిచ్చింది. 2017 ఆసియా జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం గెలుచుకుంది.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page