top of page

మన దేశ బడ్జెట్‌ పేరు గొప్ప ఊరు దిబ్బ

Writer: ADMINADMIN
  • అంచనాలు ఆకాశంలో ఆచరణ పాతాళంలో..

  • ఎనిమిది పథకాలు ` పదేళ్లు ` కానరాని అభివృద్ధి

  • కార్పొరేట్‌ మీడియా సాయంతో ప్రతి ఏటా గట్టెక్కుతున్న నిర్మల

- దుప్పల రవికుమార్‌

ప్రతి ఏటా గంటల తరబడి బడ్జెట్‌ ప్రసంగాలు మన దేశ ఆర్థిక మంత్రి చేస్తూనే ఉన్నారు. అది కూడా గత పదేళ్లుగా. అందులో ఆకర్షణీయమైన పథకాలను, వాటి పేర్లను మన కార్పొరేట్‌ మీడియా వారాల తరబడి ఊదరగొడుతుంది. తేబోతున్న పథకాలతో ఈ దేశ ప్రజల తలరాతలు మారిపోవడం తథ్యమని ఒక ఊహా ప్రపంచంలో ప్రజలను ఊరేగించడం మన దేశంలో మీడియాకు అలవాటైపోయింది. కాని, అంతకుముందు సంవత్సరం ఆడంబరంగా ప్రకటించిన పథకాల ఆచరణకు సంబంధించిన వివరాల గురించి అడిగే నాధుడే లేకుండాపోయాడు. నిండు పార్లమెంటులో ఘనంగా ప్రకటించిన కొన్ని పథకాలలో పురోగతి ఎలా ఉందో పరిశీలిద్దాం. ఎన్నికలప్పుడు వివిధ రాష్ట్రాలలో ప్రధాని పర్యటిస్తూ డబుల్‌ ఇంజన్‌ సర్కారు గురించి గప్పాలు కొడతారు. అక్కడా ఇక్కడా ఒకే ప్రభుత్వం ఉంటే ఆ రాష్ట్రం స్వర్గసీమ అయిపోతుందని ఓటర్లను ఊరిస్తారు. కానీ గత పదేళ్లుగా గుజరాత్‌లో తప్ప ఈ దేశంలోని రాష్ట్రాల్లో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ఇదంతా కేవలం అధినేతల వాగాడంబరమే తప్ప కార్యశీలత కాదని తెలుస్తోంది.

మన దేశంలో 2019లో పిఎం కుసుం అని, రైతులకు నాణ్యమైన విద్యుత్తును అందించే ఒక పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2020 ఫిబ్రవరి ఒకటో తేదీన బడ్జెట్‌ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ దీనిగురించి రెండుసార్లు ప్రస్తావించారు. పొలాల్లో వాడే పంపుసెట్లకు కిరోసిన్‌, డీజిల్‌ వాడుతూ పడే అవస్థల నుంచి విముక్తి చెందించి, పూర్తిగా సోలార్‌ ఆధారిత పంపుసెట్లను 20 లక్షల మంది రైతులకు అందించడం ద్వారా వారి ఆదాయాన్ని రెట్టింపు చేయాలని ప్రయత్నిస్తున్నట్టు ప్రకటించారు. మరో 15 లక్షల మంది రైతులకు గ్రిడ్‌ కనెక్షన్‌ సదుపాయాన్ని కల్పిస్తామని, ఈ పిఎం కుసుం పథకం రెన్యువబల్‌ ఎనర్జీ మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తుందని చెప్పారు. 2019 నుంచి 2022 వరకు మొత్తంగా 34,422 కోట్ల రూపాయల వ్యయంతో 30,800 మెగావాట్ల సౌరవిద్యుత్తును వాడనున్నట్లు చెప్పారు. దీనిని మూడు దశలుగా విభజించుకుని లక్ష్యాలను చేరనున్నట్లు పథకం రచించారు. ఒకటో దశలో పది వేల మెగావాట్ల సూక్ష్మ తరహా విద్యుత్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయడం ద్వారా, రెండవ దశలో 20 లక్షల సౌర వ్యవసాయ పంపుసెట్లను పంపిణీ చేయడం ద్వారా, మూడో దశలో 15 లక్షల గ్రిడ్‌ అనుసంధానిత వ్యవసాయ పంపులను అమర్చేందుకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. కాని, పథకం ప్రారంభమైన తర్వాత నాలుగేళ్లలో కేవలం 1,515 కోట్ల రూపాయలను మాత్రమే కేంద్రం ఖర్చు చేసింది. వార్తాపత్రికల పతాక శీర్షికల్లో ప్రచురించిన వాటిలో ఇది కేవలం ఐదు శాతం! 2023లో ఇంధన వనరుల మంత్రిత్వ శాఖపై నియమించిన స్టాండిరగ్‌ కమిటీ ఆ శాఖ పిఎం కుసుం పథకంపై ఖర్చు చేసిన వ్యయాన్ని చూసి తీవ్రంగా నిరాశ చెందినట్టు ప్రకటించింది. నిధులు వెచ్చించకపోతే లక్ష్యాలను చేరుకోలేమని నిరూపించడానికి ఈ లెక్కలు చాలు. వాస్తవానికి 2023 కల్లా మొదటి దశలో 10వేల లక్ష్యానికి గాను కేవలం 27.75 మెగావాట్ల విద్యుత్‌ ప్లాంట్లను, రెండో దశలో 20 లక్షల పంపుసెట్లకు గాను 78,940 సోలార్‌ పంపుసెట్లు, మూడో దశలో గ్రిడ్‌ కనెక్టివిటీ ద్వారా 15 లక్షల కనెక్షన్లకు గాను 1,026 కనెక్షన్లు ఇచ్చారు.

పథకాల పేర్ల పటాటోపమే!

2019 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో అప్పటి ఆర్థిక మంత్రి పీయుష్‌ గోయెల్‌ అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల కోసం పిఎం శ్రమయోగి మాంధాన్‌ పేరుతో ఒక పెన్షన్‌ పథకాన్ని ప్రవేశపెట్టారు. అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులు నెలనెలా చాలా తక్కువ మొత్తంలో చెల్లించి ఈ పెన్షన్‌ పథకంలో చేరినట్లయితే వారికి అరవై ఏళ్ల వయసు నుంచి ప్రతి నెలా రూ.3వేల కనీస పెన్షన్‌ అందివ్వనున్నట్టు తెలిపారు. రానున్న ఐదేళ్లలో (అంటే 2024 నాటికి) తక్కువలో తక్కువ పదికోట్ల మంది కార్మికులు ఈ పథకంలో చేరడం ద్వారా ప్రపంచంలోనే అతి పెద్ద పెన్షన్‌ పథకం కాగలదని ఆయన డాంబికంగా చెప్పారు. గత వారం ఈ పథకపు వెబ్‌సైట్‌ డ్యాష్‌ బోర్డును చూసినప్పుడు పది కోట్ల సంగతి దేవుడెరుగు, కేవలం 45 లక్షల మంది ఈ పథకంలో చేరారు. కార్మికులు నెలనెలా వచ్చే రూ.3వేలు తక్కువనుకున్నారా, ముప్పై ఏళ్ల తర్వాత వచ్చే రూ.3వేలు పెరగబోయే ద్రవ్యోల్బణంలో రూ.700 కాగలదని భయపడ్డారా అన్నది మనం తేల్చలేం. మనం శంకిస్తున్నది ప్రభుత్వ చిత్తశుద్ధినే.

గ్రామాల్లో ప్రతి ఇంటికీ కుళాయి అందించాలన్న ఉద్దేశంతో చేపట్టిన జల్‌జీవన్‌ మిషన్‌ ప్రారంభించిన రెండేళ్లకు పట్టణాల్లో కూడా ఇదే తరహా పథకం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావించింది. అమృత్‌ 2.0 అనే పేరుతో పథకాన్ని ప్రకటించింది. 2021లో ప్రవేశపెట్టిన ఈ పథకంలో 2,87,000 కోట్ల రూపాయలు వెచ్చించాలని, గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ దీనిని పర్యవేక్షిస్తుందని అప్పటి ఆర్థిక మంత్రి నిర్మల నిండు సభలోనే ప్రకటించారు. షరా మామూలే. తెల్లవారి పేపర్లలో గగ్గోలు. పట్టణ రూపురేఖలు మారిపోనున్నట్టు ఊకదంపుడు. కేటాయించిన బడ్జెట్‌తో 4,370 స్థానిక సంస్థలలో 2.86 కోట్ల గృహాలకు మంచినీటి కుళాయిలు అందివ్వడంతో పాటు 500 అమృత పట్టణాలను గుర్తించి ద్రవ వృధా యాజమాన్య పద్ధతులు చేపట్టాలని చెప్పారు. ఇందులో ఉన్న చిన్న తిరకాసును పత్రికల పతాక శీర్షికలు రాయలేదు. ఇందులో కేవలం 26 శాతం నిధులు మాత్రమే కేంద్రం భరిస్తుందని, మిగిలిన 74 శాతం నిధులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని మెలిక ఉంది. ఇంకా ఒక ఏడాది మిగిలి ఉన్నప్పటికీ, ఇప్పటిదాకా ఈ పథకం కింద 27 వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసారు. అంటే సగటున ఏడాదికి ఏడు కోట్లు ఖర్చు పెట్టారు.

1972 నుంచీ అమలులో ఉన్న మరో పథకానికి పేరు మార్చారు. ఉద్యోగాలు చేసే మహిళలకు తోడ్పాటునందివ్వడానికి ఎక్కువ మహిళా ఉద్యోగినులు ఉన్న పట్టణాల్లో ప్రైవేటు హాస్టళ్ల నిర్మాణానికి, వాటి మరమ్మతులకు కేంద్రం సాయం అందిస్తుంది. 2017లో ఈ పథకానికి ఇదే దేశంలో మొదటిసారి అన్నట్టు శక్తి నివాస్‌ అనే పేరు పెట్టారు. ఈ ఏడాది బడ్జెట్‌ చదివినప్పుడు నిర్మల దీనిని ప్రస్తావించారు గాని, నిధుల ఊసెత్తలేదు. జులై 27న రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ స్త్రీ శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ అధికారులు ఈ పథకం కింద గత రెండేళ్లలో రూపాయి ఖర్చు పెట్టలేదని, కొత్త హాస్టళ్లకు అనుమతులు ఇవ్వలేదని, గడచిన ఐదేళ్లలో కేవలం 13 శక్తి నివాస్‌ హాస్టళ్లు నిర్మించినట్లు తెలియజేశారు. అట్టుంటది మరి మనతోని! 2022లో మరో రాజ్యసభ ఎంపీ అడిగిన ప్రశ్నకు ఇప్పటివరకూ ఇలా ప్రైవేటు హాస్టళ్లు దేశంలో 500 పనిచేస్తున్నాయని ప్రభుత్వం సమాధానమిచ్చింది. ఇందులో ఇంకా విచిత్రమేమంటే, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ దేశాల మొత్తం జనాభా కంటే కాస్త ఎక్కువే జనాభా ఉన్న బీహార్‌ రాష్ట్రంలో, గడచిన రెండు దశాబ్దాలుగా దాదాపుగా ఎన్డీయే అధికారంలో ఉన్నప్పటికీ అక్కడ ఒక్క శక్తి నివాస్‌ హాస్టల్‌ నిర్మాణం జరగలేదు. త్రిపుర, ఉత్తరాఖండ్‌, జమ్ము కశ్మీర్‌ రాష్ట్రాల్లో కూడా ఈ హాస్టళ్లు లేవు. అత్యధికంగా కేరళలో 114 హాస్టళ్లు ఉన్నాయి.

ఏడు చేనేత పార్కుల జాడ ఎక్కడో!

ఫిబ్రవరి 2021లో తన బడ్జెట్‌ ప్రసంగంలో చేనేత కార్మికులు పడుతున్న అగచాట్లను చెప్పి దేశ ప్రజలకు కన్నీళ్లు తెప్పించారు మన తెలుగింటి కోడలు నిర్మల. అక్కడితో ఆగకుండా భారీ పెట్టుబడుల టెక్స్‌టైల్స్‌ పార్కు (మిత్రా)లను రాబోయే మూడేళ్లలో దేశవ్యాప్తంగా ఏడిరటిని వినియోగంలోకి తేనున్నట్టు ప్రకటించారు. చేనేత పరిశ్రమకు మరింత ఊతం ఇవ్వడమే కాక, భారీ పెట్టబడులు రానున్నాయని, నిరుద్యోగం అంతరించిపోతుందని మన మిడిమేళపు పత్రికలు రాసేసాయి. ఏడు నెలలు తిరగకుండానే పథకానికి కేంద్ర కేబినెట్‌ సమ్మతించింది. రాబోయే ఐదేళ్లలో 4,445 కోట్ల రూపాయలు వెచ్చించి ఏడు పార్కులు నిర్మిస్తున్నట్టు తెలిపారు. కాని, గత నెలలో రాజ్యసభలో సభ్యుడు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ పిఎం మిత్రా పథకాన్ని ఐదేళ్లు కాకుండా ఏడేళ్ల కాలవ్యవధికి పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అదే మాదిరిగా ప్రకృతి వ్యవసాయం గురించి మన ప్రభుత్వం మనల్ని వెంగళప్పల్ని చేసింది. కోటి మంది రైతులకు తగిన సాంకేతిక శిక్షణనిచ్చి, 15వేల బయో ఇన్‌పుట్‌ రీసోర్స్‌ సెంటర్లను ఏర్పాటు చేసి, ప్రకృతి వ్యవసాయం రాబోయే రెండేళ్ల నేర్పిస్తామని 2022లో చెప్పిన నిర్మలా సీతారామన్‌, అదే పాటను రాబోయే మూడేళ్లలో చేసేస్తామంటూ 2023 బడ్జెట్‌లో చదివి వినిపించారు. అంటే 2022లో ఒక్కరైతు కూడా ప్రకృతి వ్యవసాయం చెయ్యలేదోమనని మనం కంగారుపడకూడదు. ఇలా ఆర్థిక శాఖ మంత్రి ప్రధాన మంత్రిని మించిపోతూ బడ్జెట్‌ ప్రసంగాలలో డాబులు కొడుతున్నారు. మన రక్షణ శాఖ మంత్రి చెప్పే రోత కోతల గురించి మరోసారి ముచ్చటించుకుందాం.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page