top of page

మన్నం సతీష్‌ ఆల్‌టైమ్‌ రికార్డ్‌

Writer: BAGADI NARAYANARAOBAGADI NARAYANARAO
  • ఉద్యోగాల నుంచి హుద్‌హుద్‌ ఇళ్లవరకు వసూలు

  • గ్రీవెన్స్‌, డీపీవోల్లో నిత్యం ఫిర్యాదులు

  • నివేదికలు తొక్కిపెట్టేస్తున్న అధికారులు

  • కాళ్లరిగేలా తిరుగుతున్న బాధితులు



ఆయనొక ప్రభుత్వ ఉద్యోగి. భార్య కూడా ప్రభుత్వ ఉపాధ్యాయురాలే. జీతానికి కొదవలేదు. అయ్యగారి గీతానికి కూడా అడ్డూ అదుపు లేదు. ఎందుకంటే.. పని చేస్తున్నది పంచాయతీరాజ్‌లో. వద్దంటేనే డబ్బులు వచ్చిపడిపోతాయి. ఇది చాలదని ఉద్యోగాలిప్పిస్తామని, ఇళ్లు మంజూరు చేయిస్తామని, పదోన్నతులు ఇప్పిస్తామని, తాత్కాలిక ఉద్యోగులను పర్మినెంట్‌ చేయిస్తామని, ఇలా చెప్పుకుంటూపోతే ఆయన కోసం రాయాలంటే ఓ గ్రంథం తయారవుతుంది. నిత్యం గ్రీవెన్స్‌లో ఒక్కరి మీదే ఫిర్యాదంటూ వస్తే అది మన్నం సతీష్‌బాబుదే. జిల్లాలో ఏదో ఒకచోట ఆయన బాధితులు గ్రీవెన్స్‌లో కనిపిస్తుంటారు. ఇతగాడు ఉద్యోగంలో ఉన్న రోజుల కంటే సస్పెండవటం వల్లో, విధులకు హాజరుకాకుండా మోసపోయినవారి నుంచి తప్పించుకోడానికి అజ్ఞాతంలో ఉన్నదే ఎక్కువ. 2014 నుంచి ఈయన మీద వరుసగా ఫిర్యాదులు వస్తున్నా, ఇంకా విధుల్లో ఉండటం, ఇంకా అనేక ప్రాంతాల్లో ప్రజలు మోసపోవడం ఆశ్చర్యం.

మన్నం సతీష్‌బాబు మందస మండలం లోహరిబంద పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్నాడు. తరచూ ఫోన్‌నెంబర్లు మారుస్తూ బాధితులకు చిక్కకుండా ఉద్యోగానికి సెలవు పెట్టి తప్పించుకు తిరుగుతున్నారీయన. ఈ విధంగా సుమారు 15 ఏళ్లుగా బాధితులను మోసం చేస్తునే ఉన్నాడు. కాంట్రాక్ట్‌ ఉద్యోగిగా 2003లో పంచాయతీ కార్యదర్శిగా విధుల్లో చేరిన సతీష్‌ జిల్లా కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా చలామణి అవుతూ ఉద్యోగాలను రెగ్యులర్‌ చేయిస్తానని డబ్బులు వసూలుచేసి సహోద్యోగులను పెద్ద ఎత్తున మోసం చేస్తూ వచ్చాడు. దీన్ని కొన్నేళ్లు భరించిన కాంట్రాక్ట్‌ ఉద్యోగులంతా సతీష్‌పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి జిల్లా బాధ్యతల నుంచి తప్పించారు. అధికారులను మేనేజ్‌ చేసిన రాష్ట్ర సంఘం ప్రతినిధిగా అవతారమెత్తి రాష్ట్రస్థాయిలో ఉద్యోగాలిప్పిస్తానంటూ నిరుద్యోగ యువతను మోసం చేయడం ప్రారంభించాడు.

అధికారుల సహకారం

రెగ్యులర్‌ ఉద్యోగిగా మారిన తర్వాత కోటబొమ్మాళి మండలం కొత్తపేట కార్యదర్శిగా విధుల్లో చేరిన తర్వాత సతీష్‌ను ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నారనే అభియోగాలతో 2014 అక్టోబర్‌లో సస్పెండ్‌ చేసి క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. అంతకు ముందు విధుల్లో అలసత్వం వహించిన కారణంగా మెళియాపుట్టిలో కార్యదర్శిగా పనిచేసిన సతీష్‌ను సస్పెండ్‌ చేశారు. ఆ తర్వాత సరుబుజ్జిలి మండలం మతలబుపేట పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తూ గోనెపాడు ప్రభుత్వ పాఠశాల ప్రహరీ నిర్మాణ పనుల బిల్లు చెల్లించడానికి రూ.6వేలు లంచం డిమాండ్‌ చేసి రూ.5 వేలు తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడి సస్పెండ్‌ అయ్యాడు.

ఇంత ట్రాక్‌ రికార్డు కలిగిన మన్నెం సతీష్‌బాబుకు జిల్లా పరిషత్‌, పంచాయతీ శాఖ అధికారులు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. ఈ సహకారంతోనే బాధితులకు సొమ్ము చెల్లించకుండా మంగువారితోటలోని ద్వారకానగర్‌లో మూడంతస్తుల భవనం కట్టుకున్నాడు. ఖరీదైన నాలుగు కార్లను మెయింటెయిన్‌ చేస్తూ పాతపట్నంలో ఒక అద్దెకొంపలో ఉంటూ అక్రమ కార్యకలాపాలను సాగిస్తున్నారు.

నాలుగు సార్లు సస్పెండ్‌

సతీష్‌ నిరుద్యోగుల నుంచి ఉద్యోగాల పేరుతో రూ.లక్షలు వసూలు చేసి కొంత మొత్తం జిల్లాపరిషత్‌, పంచాయతీ శాఖ అధికారులకు ముట్టజెప్పి పనిష్మెంట్‌ నుంచి ప్రతీసారి తప్పించుకుంటున్నారు. సతీష్‌ పని చేసిన టెక్కలి, సంతబొమ్మాళి, శ్రీకాకుళం, మందస, పలాస, కవిటి, వజ్రపుకొత్తూరు, సరుబుజ్జిలి, సంతకవిటి తదితర మండలాల్లో నిరుద్యోగులను టార్గెట్‌ చేసి రూ.కోట్లు వసూలు చేశాడు. జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులుగా, బ్యాంకు మెసేంజర్లుగా, ట్రెజరీలో జూనియర్‌ సహాయకులుగా, ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమ పథకాల ద్వారా ట్రాక్టర్లు, ఆటోలు, వాహనాలు, ఇళ్లు, ఇంటి స్థలాలు, హుద్‌హుద్‌ ఇళ్లు మంజూరు చేయిస్తానని ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షల నుంచి రూ.6 లక్షలు వసూలు చేశాడు. ప్రభుత్వ ఆసరా పింఛన్లు మంజూరు చేయిస్తానని డబ్బులు వసూలు చేసినట్టు సతీష్‌పై అభియోగాలు నమోదయ్యాయి. పలాస మండలం లొత్తూరులో సామాజిక భరోసా పింఛన్ల సొమ్ముతో పరారై ఆ తర్వాత కొన్ని రోజులకు విధుల్లో చేరాడు. 20 ఏళ్ల సర్వీసులో పదుల సంఖ్యలో ఫిర్యాదులు, నాలుగు సార్లు సస్పెన్షన్లకు గురైనా సతీష్‌ దర్జాగా ఉద్యోగం చూస్తూ నిరుద్యోగులను ఇప్పటికీ వంచిస్తున్నాడు. సతీష్‌ అక్రమాలను జిల్లాపరిషత్‌, పంచాయతీ శాఖలో అధికారులు పూర్తి సహకారం అందిస్తున్నారు. సతీష్‌ రోజుల తరబడి విధులకు హాజరుకాకపోయినా, విధి నిర్వహణలో అలసత్వం వహిస్తున్నా, సస్పెండ్‌కు గురవుతున్నా అయిన ఇచ్చే డబ్బులకు దాసోహం అవుతున్నారనే ఆరోపణలున్నాయి.

నివేదిక ఇవ్వకుండా తాత్సారం

జిల్లా పంచాయతీ అధివరికి సతీష్‌ బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో జూలై 20న మందస ఎంపీడీవో కార్యాలయంలో అధికారులు విచారించారు. అదే నెలలో గ్రీవెన్స్‌కు వచ్చిన ఫిర్యాదుపై జెడ్పీ సీఈవోకు నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఫిర్యాదుదార్లతో పాటు సతీష్‌ను జూలై 26న జెడ్పీలోని సీఈవో ఛాంబర్‌లో విచారించారు. అందరి నుంచి లిఖితపూర్వకంగా, మౌఖికంగా వాంగ్మూలాలు సేకరించారు. అదే సందర్భంలో కొందరు మహిళా బాధితులు సతీష్‌తో వాగ్వాదానికి దిగారు. విచారణ పూర్తి చేసి నివేదిక ఇస్తామని చెప్పిన సీఈవో నివేదిక కలెక్టర్‌కు ఇవ్వకుండా కాలయాపన చేశారు. దీనికి కారణం అప్పటి జెడ్పీ సీఈవో డబ్బులు తీసుకొని సతీష్‌ను కాపాడే ప్రయత్నం చేసి విచారణ నివేదిక ఇవ్వకుండా తొక్కిపెట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు. అంతకు ముందు జూలై 11న ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీనిపై ఎస్పీ మహేశ్వరరెడ్డి ఆదేశాలతో శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద బాధితులను ఈ నెల 23న కార్యాలయానికి పిలిపించి విచారించారు. బాధితుల నుంచి వివరాలు సేకరించారు. విచారణలో కొందరు నిరుద్యోగుల నుంచి ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నట్టు సతీష్‌ అంగీకరించారని తెలిసింది. సోమవారం గ్రీవెన్స్‌లో మరోమారు బాధితులంతా ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్‌ తక్షణమే దీనిపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని మరోమారు డీపీవోను ఆదేశించారు. ఈ నెలాఖరున డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పవన్‌ కళ్యాణ్‌ను కలిసి ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page