top of page

మనిషి ఊసేలేని మహా కావ్యాలెందుకూ..!

Writer: ADMINADMIN

ఒకాయన లాయర్‌ దగ్గరికెళ్లి ‘సార్‌.. ఈ రామాయణ మహాభారతాలు అన్నీ ఒకటేనా లేక వాటిలో ఏదైనా తేడా ఉందా?’ అని అడిగాడు. ‘ఆ.. ఆ... తేడా ఉంది.. రామాయణం కిడ్నాపు కేసు. మహాభారతం భూమి తగాదా కేసు’ అని తనదైన శైలిలో జవాబిచ్చాడు ఆ లాయరు.

రామాయణ మహాభారతాలు భారతదేశంలో రెండు మహా కావ్యాలుగా ఏళ్ల తరబడి చలామణి అవుతున్నాయి. అయినా అందులోని పలు అంశాలు ఇప్పటికీ చర్చించబడుతూనే ఉన్నాయి. తల్లిదండ్రుల మాట జవదాటకుండా ఉండడం, భార్యాభర్తల అన్యోన్యత, అన్నదమ్ముల అనుబంధం, స్నేహానికి ప్రాధాన్యమివ్వడం, రాజనీతి, మధ్యవర్తిత్వం, కొంత దైవత్వం, కొంత మానవత్వం, స్త్రీ, పురుషుల ఆకర్షణకు కులాలు అడ్డు రాకపోవడం వంటి వాటిని ఎలుగెత్తి చెపుతూ వాటికి గొప్పదనాన్ని ఆపాదించారు. మౌఖిక ప్రచారంలో ఉన్న కథలు, తాళపత్ర గ్రంథాల్లోకి, తర్వాత కాగితాల మీదికి వచ్చాయి. అవే కథలు ఎందరో రచయితలు తమ తమ వర్ణనలు జోడిస్తూ తిరగరాయడం వల్ల దేశంలో వేల వేల సంఖ్యల్లో ఈ కావ్యాలు తయారయ్యాయి. ఈ కథలు పరిణతి చెందని సమాజం లోంచి పుట్టుకొచ్చాయి గనుక, ఆధునిక దృష్టికోణం ముందు ఇవి నిలబడడం లేదు. నేటి పరిణతి చెందిన సమాజంలోంచి వీటిని విశ్లేషించుకుంటే, ఈ కావ్యాల్లో మానవ సంబంధాలు సరిగా లేవేమోననిపిస్తుంది. నైతికత అసలే లేదనిపిస్తోంది. అందులోని పాత్రలు వాటికి తోచిన విధంగా అవి ప్రవర్తించడం పైగా, వాటి ప్రవర్తనంతా ధర్మ సమ్మతమే అని నమ్మబలకడం కనిపిస్తుంది. పరిణతి లేని పరిపక్వతలేని, నియమ నిబద్ధత లేని సమాజం అభివృద్ధి చెందుతున్న దశలో సృష్టించబడ్డ కథలు ఇలాగే ఉంటాయని మనం గ్రహించుకోవాలి.

నిజానికి నేటి ఆధునికులకు ఇందులోని పాత్రలు, వాటి వ్యక్తిత్వమూ అనుసరణీయం కాదు. మానవ ప్రవృత్తితో హాయిగా కథల్ని నడపలేక కిన్నెరలు, కింపురుషులు, దేవతలు, యక్షులు, గంధర్వులు, రాక్షసులు, మహిమలు, దివ్యానుభూతులు, అతీంద్రీయ శక్తుల వంటి వాటినన్నింటినీ ఆనాటి రచయితలు ఇందులో ప్రవేశపెట్టారు. అందుకే అవి మనిషి కథలు కాకుండా పోయాయి. రచన అనేది సృజనాత్మక ప్రక్రియ, నిజమే, కాని, ఇందులో ఏ మాత్రమూ వాస్తవిక సృజనాత్మకత లేదు. అవాస్తవిక సృజనాత్మకత ద్వారా ఇవి మానవ జాతిని భ్రమల్లోకి, భయాల్లోకి నెట్టడం జరిగింది. మాయలు, మర్మాలు అభూత కల్పనలు రాసుకోవడంలో సనాతన భారతీయ సమాజం ఎంతో ఎత్తుకు ఎదిగింది. ఒప్పుకోవాల్సిందే. ఈ ఆధునిక కాలంలో ఒక వెల్లువలా దూసుకొస్తున్న వైజ్ఞానిక అవగాహన కోణం, మానవీయ కోణం లోంచి చూస్తే మాత్రం ఇలాంటి కావ్యాలు, కథలు దయనీయంగా, కుప్పగూలిపోతున్నాయి. నేటి ఆధునికుడు తన ఇంగిత జ్ఞానాన్ని నిద్రబుచ్చి వింటేనే ఈ కావ్యాన్ని ఆనందించగలడు. అతనిలో ఇంగితం నిద్రలేస్తే.. అసలవి నిలవవు. మానవీయ విలువల్ని భ్రష్టు పట్టించే అపరిపక్వ కథనాలుగా వాటిని పక్కన పెట్టాల్సి వస్తోంది. అటు దేవుళ్ల కథలూ కాక, ఇటు మనుషుల కథలూ కాక, ఎటూ నిగ్గు తేల్చుకోలేని సంశయాత్మక కథనాలుగా ఇవి మిగులుతాయి.

మంత్రాలు, బాణాలు, ఆదిమ సమాజంలోనివి. విలువలు, నీతి సూత్రాలూ అప్పటివే. అవేవీ ఈ కాలానికి పనికిరావు కదా? ఆదర్శంగా తీసుకుందామంటే ఒక్క పాత్ర కూడా కనిపించదు. అందులోని పాత్రలు ప్రవర్తించినట్టుగా ఎవరైనా నేటి ఆధునికులు ప్రవర్తిస్తే అతణ్ణి, ఆమెను నేటి లోకం ప్రశంసిస్తుందా? ప్రశంసించదు. ఎందుకంటే మనం చాలా ముందుకొచ్చాం. వైజ్ఞానికంగానే కాదు, నైతికంగా, ఆర్థికంగా నేటి సమాజం పరిణతి సాధించింది. మనిషి ఏమాత్రం భోళాగా కనిపించినా ‘వీడో ఊరి బైతు’ అని ముద్రవేసే జనం.. తిండి విషయంలో, దుస్తుల విషయంలో ఏ మాత్రం అనాగరికంగా కనిపించినా ‘ఆదిమానవుడిలా అదేమిటీ?’ అంటారు. మరి మన పురాతన కావ్యాల్లో లాగా, మహిమల పేరుతో వావివరుసలు లేకుండా ప్రవర్తిస్తే సమాజం ఒప్పుకుంటుందా? శిక్షించకుండా వదిలేస్తుందా? వదిలేయదు కదా? అలాంటప్పుడు అలాంటి అపరిపక్వ వ్యక్తిత్వాల్ని చిత్రించిన అనైతిక కావ్యాల్ని మహోన్నతమైనవిగా ఈ కాలం ఎట్లా గుర్తిస్తుంది? ఏమాత్రం హేతుబద్ధంగా ఆలోచించినా విషయం బోధపడుతుంది.

ఈ కథలు వేల ఏళ్లుగా మన భారతీయ సమాజాన్ని శాసించాయి. నిజమే.. ఆ కథల ఆధారంగా ఎందరో రచయితలయ్యారు. కొందరు జ్ఞానపీఠాలెక్కారు. మరికొందరు విశ్వవిఖ్యాత నటశేఖరులయ్యారు, మత పెద్దలు, పూజారులు, స్వాములు మాత్రమే కాక, నాటక, సినీరంగాల కళాకారులంతా వందల ఏళ్ల పాటు జీవితాలు వెళ్లబోశారు. అంతా నిజమే.. ఒప్పుకోవాల్సిందే. కాని, ఇప్పటికి అవి కాలం చెల్లిపోయాయి. ఆ బాణాలూ, ఆ గధలూ నేటి జీవితంలో లేవు. ఆ రాజ్యాలు, ఆ యుద్ధాలూ లేవు. ఆ అరణ్య వాసాలూ లేవు. ఆ పట్టాభిషేకాలూ లేవు. ఆ ధర్మ రాజులూ లేరు. అందులోని ధర్మ సూక్ష్మాలు, న్యాయ సూత్రాలు, నైతికత ఏమైనా ఈ కాలానికి పనికొస్తుందా? అంటే అదీ లేదు. నేటి తరాలకు అందులోని తాతలు (ఎదగని తనం) స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ వాటిని దుయ్యబట్టడం లేదు. ఆనాటి కవులు, రచయితల అవగాహనను మాత్రం బేరీజు వేసుకోవాల్సి ఉందన్నది మాత్రమే గుర్తు చేస్తున్నాను. అవి కొంతవరకు మనం నడిచొచ్చిన దారిని చూపించగలుగుతున్నాయేమో గాని, మనం ముందు ప్రయాణించాల్సిన దారిని అవి చూపించలేవు. కారణం వాటికి ఆ శక్తి లేదు. ఎదిగిన నేటి సమాజానికే అవి కాలం చెల్లినవిగా కనిపిస్తున్నప్పుడు ఇక అవి భవిష్యత్తులోకి దారులెలా వెయ్యగలవూ? కాలం చెల్లిన నమ్మకాలు, విశ్వాసాల మీద వచ్చిన ఆ కావ్యాలు అలాంటి అనేక ఇతర మతాల, ఇతర భాషల రచనలు ఈ కాలానికి పనికిరావన్నది మాత్రమే మనం గుర్తించాలి.

దేవతలూ, రాక్షసులు.. వారి మధ్య యుద్ధాలు తప్ప మనిషి, మనిషి ఔన్నత్యం అందులో ఎక్కడా కనబడదు. అందుకు కారణం మనిషి తనను తాను గుర్తించుకోక ముందు, తన ఉనికిని తాను, తన శక్తిని తాను గుర్తించుకోకముందు రాసుకున్న రచనలవి. ఈ చరాచర జగత్తంతా ఏ పరమేశ్వరుడో సృష్టించిందని అతని ఆజ్ఞానుసారం మనిషి నడుచుకోవాల్సి ఉంటుందన్న భావనతో రాసుకున్న రచనలవి. సమాజం ఆ భావం నుంచి జారిపోకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్న కొన్ని వర్గాలు ఇప్పటికీ ఈ 21వ శతాబ్దంలో కూడా ఉండనే ఉన్నాయి. ఆధ్యాత్మికత, ధార్మికత అని వేరు వేరు పేర్లతో చలామణి అవుతూనే ఉన్నాయి. ఇవి కేవలం హిందూ మతానికే పరిమితం కాదు. అన్ని మతాలలో, అన్ని దేశాలలో, అన్ని మత గ్రంథాలలో.. సంబంధిత కావ్యాలలో వర్థిల్లుతూనే ఉన్నాయి. అయితే మానవుడి విజయ పరంపరను శ్లాఘించని బోధనలేవైనా వృధాయేనని మనం భావించాలి. వ్యక్తిగత భయాలు, విశ్వాసాలు ఉన్నవారిని వెనకే వదిలేయాలి. అలాంటి వారివల్ల సమాజం ముందుకు రాలేదు. ఇకపై కూడా ముందుకు పోదు. ఆత్మవిశ్వాసం, తెగువ, ధైర్యం, తపన, త్యాగబుద్ధి గల మనుషులతోనే ప్రపంచం ముందుకు వచ్చింది. ఇకముందు కూడా వారితోనే ముందుకు పోతుంది.

మానవ బలహీనతల్ని వాడుకునే, సొమ్ము చేసుకునే రాజకీయ, సినీ, టీవీ, వ్యాపార రంగాలవారిపై కూడా మనకు పెద్దగా ఆశలు ఉండనక్కరలేదు. వారంతా వారి పబ్బం గడుపుకోవడంతోనే తీరిక లేకుండా ఉంటారు. శాశ్వత ప్రాతిపదికన రాగల కాలాలలో ఈ ప్రపంచానికి కావాల్సినవేమిటో ఆలోచించే బుద్ధిజీవుల సంఖ్య పెరగాలి. సామాన్యుడి అవగాహన పెరగాలి. ఆలోచన రాటుదేలాలి. ఏ దేశ ప్రబంధాలలోనైనా, ఏ మత గ్రంథాలలోనైనా, ఏ సనాతన కావ్యాల్లోనైనా మానవుడి వైజ్ఞానిక విజయ పరంపర ఉండడానికి అవకాశం లేదు. అందుకే ఉండదు.. ఎందుకంటే అవి రాయబడ్డ కాలంలో సమాజం చాలా ప్రాథమిక దశలో ఉంది. ఆలోచనలు పదునెక్కలేదు. వాస్తవాలు వెలికిరాలేదు. మనిషేం చేయగలడూ? అంతా ఆ దేవుడే చేయిస్తున్నాడని అనుకునే ఎదగని దశ అది.

కొన్ని శతాబ్దాల నిర్విరామ కృషి వల్ల, మనిషి తనను తాను తెలుసుకున్నాడు. తన కణాన్ని తన రక్తాన్ని, తన అవయవాల్ని, తన మెదడుని అధ్యయనం చేసుకుంటూ వచ్చాడు. మరీ ముఖ్యంగా ప్రాధమిక దశలో జంతుస్థాయి నుంచి క్రమక్రమంగా ‘మనిషి’గా ఎదుగుతూ వచ్చిన వైనాన్ని.. అంటే జీవ పరిణామ క్రమాన్ని నిర్మించుకుంటూ వచ్చాడు. సత్యాన్వేషణలో ఎక్కడా ఆగలేదు. ఇప్పటికీ ఇంకా ముందుకు అడుగులు వేస్తూనే ఉన్నాడు. ఆధ్యాత్మిక, ధార్మిక రంగాలలోని వారు చెప్పే సత్యాన్వేషణ వేరు. వారు చెప్పే సత్యాన్వేషణతో ప్రపంచంలో మార్పులు రాలేదు. అవి మనిషిలోని అంతరంగాన్ని అదుపులో ఉంచుకోవడానికి మాత్రమే పనికొచ్చాయి. మనిషీ, సమాజం ఎదుగుతున్న దశలో ఏదో ఓ ఊతకర్రలాగా ఉపయోగపడ్డాయి. కానీ మనిషి ఎంతకాలం ఊతకర్రతో నడుస్తాడూ? ఆత్మవిశ్వాసమనే వెన్నెముక నిటారుగా నిలబెట్టి ధైర్యంగా నిలబడాలి కదా? తనను తాను గుర్తించుకుని, చుట్టూ ఉన్న తోటివారిని మనుషులుగా గుర్తించి, ఈ భూగోళాన్ని, ఈ వాతావరణాన్ని రక్షించుకోవాలన్న బాధ్యతతో నడుచుకుంటూ ఉండాలి కదా?

వెయ్యేళ్ల నాటి సమాజం కన్నా వందేళ్ల నాటి సమాజం పరిణతి చెందింది. వందేళ్ల నాటి సమాజం కన్నా నేటి సమాజం పరిణతి చెందింది. ఇప్పుడు ఈ కాలంలో బతుకుతూ, వెయ్యేళ్ల నాటి ఆచారాలు, నమ్మకాలు, సంస్కృతి పేరుతో పాటిస్తానంటే వారినేమనాలి? అయినా చారిత్రక ఆధారాలు లేని కల్పిత పాత్రల కోసం అల్లరి మూకలు ‘సంస్కృతి’ పేరుతో చెలరేగిపోవడం ఎవరు హర్షిస్తారూ?

మత విశ్వాసాల్ని పక్కనపెట్టి, వైజ్ఞానిక స్పృహకు విలువనిచ్చినప్పుడు, మూఢ విశ్వాసాల్ని మూలకు పడేసి హేతువాదానికి ప్రాముఖ్య మిచ్చినప్పుడు, పుక్కిటి పురాణాల్ని నమ్మడం మానేసి చరిత్రకు, మానవ విజయగాథకు ప్రాధాన్యమిచ్చినప్పుడు మన దేశం నిజంగానే పురోగమిస్తుంది. మంచిరోజులు అప్పుడే వస్తాయి. వేదాలు దోషరహితమైనవని, వాటి ప్రామాణికతను ప్రశ్నించరాదన్న తొలి సిద్ధాంతాన్ని బుద్ధుడు తిరస్కరించాడు. ఇక తర్వాత వచ్చిన ఇతర కావ్యాల గూర్చి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా?

- డాక్టర్‌ దేవరాజు మహారాజు, సుప్రసిద్ధ సాహితీవేత్త, సైన్స్‌ ప్రొఫెసర్‌

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page