కిల్లిపాలెం ఇసుక ర్యాంపు అనుకూలంకాదు
‘సత్యం’ కథనంపై క్షేత్రస్థాయి పరిశీలకు వెళ్లిన గనులశాఖ
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

కిల్లిపాలెంకు నైరుతిలో నాగావళి నదిలో ప్రస్తుతం ఉన్న నీరు మనుషులు తాగడానికే కాదు, పశువులకు కూడా తాగనివ్వొద్దని మైన్స్ శాఖ అధికారులు ఆ గ్రామ ప్రజలకు సూచించారు. కిల్లిపాలెం నదీ గర్భంలో పాతాళం లోతుకు ఇసుక తవ్వకాలు జరిపేశారంటూ ‘సత్యం’ బుధవారం ప్రచురించిన కథనంపై అదే రోజు సాయంత్రం గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్, రాయల్టీ ఇన్‌స్పెక్టర్లు కిల్లిపాలెం వెళ్లి తనిఖీ చేశారు. ఈ ప్రాంతంలో పూర్తిగా ఇసుక లేదని, ఎక్కడికక్కడ పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయని, ఇందులో కలుషితమైన నీరు మాత్రమే నిల్వ ఉందని, దీన్ని తాగు, సాగు, పశువుల ఉపయోగానికి మంచిది కాదన్నారు. నీటిలో ఉన్న పీహెచ్ లెవెల్స్ దారుణంగా పడిపోయాయని, 250 నుంచి 500 పాయింట్ల వరకు ఉండాల్సిన ఆక్సిజన్ లెవెల్స్ కేవలం 8 పాయింట్లు మాత్రమే ఇక్కడ కనిపిస్తుందని పేర్కొన్నారు. అంతకు ముందు గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేసిన రెడ్డి కృష్ణారావు, రెడ్డి భీమారావు, బాణ్ణ జగదీష్‌తో పాటు 15 మందిని వెంట పెట్టుకొని కిల్లిపాలెంలో ఇసుక తవ్విన ప్రాంతాలను పరిశీలించారు. ఇసుక రీచ్ కోఆర్డినేట్ ప్రకారం ఇసుక ఏమాత్రం ఇక్కడ సరిపోదని, ఇక్కడ ఎటువంటి ర్యాంపునకు అనుమతులు ఇవ్వకూడదని కలెక్టర్‌కు వీరు నివేదించారు. 2022 నుంచి 2024 వరకు విపరీతమైన తవ్వకాలు జరిగినందున ఇక్కడ ర్యాంపు ఇవ్వొద్దని ఇక్కడి స్థానికులు కోరుతున్నట్లు మైన్స్ శాఖ అధికారులు కలెక్టర్‌కు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా 2020 నుంచి 2024 వరకు ఇక్కడ పూర్తిగా ఇల్లీగల్ మైనింగ్ జరిగింది. ఇసుక మాఫియా చెలరేగిపోయి నగరానికి దగ్గరగా ఉన్న కిల్లిపాలెం ర్యాంపు నుంచి పెద్ద ఎత్తున తవ్వకాలు జరిపింది. దీనిపై పత్రికల్లో కథనాలు వచ్చినా, స్థానికులు ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాధుడే లేకపోయాడు. దీంతో ఇక్కడ భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. కేవలం కాలువల నుంచి పారుతున్న మురుగునీరు మాత్రమే నాగావళి నదిలో కనిపిస్తుంది.

Comments