top of page

మబ్బును చూసి ముంతలో నీళ్లు వలకబోయొద్దు

Writer: DV RAMANADV RAMANA

అత్తారింటికి దారేది? ఆ సినిమా పవన్‌ కళ్యాణ్‌ను సూపర్‌స్టార్‌ను చేసింది. సగటు ప్రేక్షకులందరికీ ఆ సినిమా రెడీమేడ్‌గా నచ్చేస్తుంది. మామూలుగా సినిమాలు కోసం సన్నాయి నొక్కులు నొక్కే జనాన్ని పక్కన పెడితే అది సూపర్‌ హిట్‌ సినిమా. ఆ సినిమా ఇచ్చిన ఎలివేషన్‌తో పవన్‌ కళ్యాణ్‌ అప్పట్లో పార్టీ పెట్టి ఒక్క సీటు కూడా తీసుకోకుండా చంద్రబాబునాయుడుకి టోకున మద్దతు ఇచ్చి అతన్ని ముఖ్యమంత్రి ని చేయగలిగారు. ఇది కళ్ల ముందు సత్యం. ఆ సినిమాలో అత్త నదియా పోసాని కృష్ణమురళి దగ్గర తీసు కున్న బాకీ తీర్మానం నిమిత్తం ఒక హాల్లో సమావేశం అవుతుంది. బాకీ ఎలా తీరుస్తావని అడిగితే ఒక మల్టీ నేషనల్‌ కంపెనీతో డీల్‌ మాట్లాడుతున్నాను, అది కనుక ఓకే అయితే తన హోటల్‌కు కనీసం 40 శాతం ఆక్యుపెన్సి ఉంటుంది, దాంతో అప్పు తీర్చేస్తానంటే, ఆ సెటిల్మెంట్లో దాదాగా వచ్చిన 30 ఇయర్స్‌ ఇండస్ట్రీ పృధ్వీ చాలా వెటకారంగా ముఖం పెట్టి అది అవ్వదమ్మా అంటాడు. ఆ పక్కనే ఉన్న ఏసీపీ పాత్రలో ఉన్నవాడు ఏముంది హోటల్‌ మీద రైడిరగ్‌ చేసి హోటల్‌కి చెడ్డ పేరు తెస్తాం, దాంతో కంపెనీ వాళ్లు కాంట్రాక్ట్‌ చించేసి వెళ్లిపోతారంటూ మరింత వెటకరిస్తాడు. ఈ కింద రీల్లో జగన్‌ మాటలు వింటే పై సినిమాలో నదియా మాటలు గుర్తొచ్చాయి. 150 సీట్లు గెలిచినవాడు ఐదేళ్లు తిరిగే నాటికి ఇంత పాతాళంలోకి ఏం చేస్తే పడిపోయాననే సోయ ఏ మాత్రం లేకుండా చంద్రబాబు తన వందరోజుల పాలన తోనే జనానికి మొహం మొత్తేశాడు. అందుచేత మిమ్మల్ని మోటివేట్‌ చేస్తున్నాను, రానున్న రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అవర్‌ పార్టీ షుడ్‌ బికమ్‌ స్ట్రాంగెస్ట్‌ పార్టీ ఇన్‌ ద కంట్రీ అని జోకులేస్తుంటే ఎవరికైనా నవ్వు రావడం సహజం. ఇలాంటి విషయాల్లో స్పందించకుండా ఉండలేం. జాతీయ పార్టీలే ప్రాంతీయ పార్టీలతో పొత్తు కోసం అర్రులు చాస్తున్న ఈ రోజుల్లో ఒక ప్రాంతీయ పార్టీ దేశంలోనే స్ట్రాంగెస్ట్‌గా నిలబడటమనేది కల. ఒకవేళ బలమైన పార్టీగా ఎదిగినా జాతీయ పార్టీ దాన్ని బతకనివ్వదు. ప్రాంతీయవాదంతో మొదలైన శివసేనను మహారాష్ట్రలో ఏం చేశారో మనకు తెలుసు. అలా అని ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీ ఎన్నికల సమయంలో ఎలా తిప్పలు పడుతుందో కూడా తెలుసుకోవాలి. బీజేపీ నవీ ముంబయ్‌ జిల్లా అధ్యక్షుడు సందీప్‌ నాయక్‌ పార్టీకి రాజీనామా చేసి శరద్‌పవార్‌ నేతృత్వంలోని ఎన్‌సీపీలో చేరారు. సందీప్‌ తండ్రి గణేష్‌ నాయక్‌కు నవీ ముంబయ్‌లో ఐరోలీ అసెంబ్లీ సీటును బీజేపీ కేటాయించింది. మరో బీజేపీ ఎంపీ నారాయణ్‌ రాణే కుమారుడు నీలేష్‌ రాణే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్‌ షిండే పార్టీలో చేరి కుడాల్‌ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నానని చెబుతున్నారు. జార్ఖండ్‌లో బీజేపీకి హేమంత్‌ సోరెన్‌ గట్టి షాకే ఇచ్చారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే లూయీస్‌ మారండీ, కునాల్‌ సారంగి, లక్ష్మణ్‌ తండు జేఎంఎంలో చేరారు. మూడుసార్లు గతంలో బీజేపీ నుంచి గెలిచిన కేదార్‌ హజ్రా కూడా జేఎంఎంలో చేరిపోయారు. తెలం గాణలో జగిత్యాల కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పార్టీ వీడుతున్నట్టు ప్రకటించారు. మన రాష్ట్రంలో చంద్రబాబు మీద గెలిచివస్తే మంత్రిని చేస్తానని జగన్మోహన్‌రెడ్డి ప్రకటించిన కుప్పం వైకాపా ఇన్‌ఛార్జి భరత్‌ గత కొద్ది రోజులుగా కనిపించడంలేదని స్వయంగా సామాజిక మాధ్యమాల్లోనే పోస్టులు పెట్టారు. హర్యానాలో ఓటమిపాలైన తర్వాత కాంగ్రెస్‌తో కొనసాగాలా? లేదూ స్వతంత్రంగానే బరిలో దిగాలా? అన్న మీమాంసలో ఐఎన్‌డీఐఏ కూటమిలో పార్టీలు ఉన్నాయి. ఏ క్షణంలోనైనా ఇందులో చీలిక రావచ్చు. మహారాష్ట్రలో ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ మీదే ఆయన మేనల్లుడు యోగేంద్ర పవార్‌ను పోటీకి నిలబెట్టడానికి సిన్నద్ధం చేశారు. ఎన్‌సీపీలో శరద్‌ పవార్‌, ఆయన సోదరుడు అజిత్‌ పవార్‌ వర్గాలు రెండు ఉన్నాయి. ఒక ప్రాంతీయ పార్టీ నిలదొక్కుకోవడమే కష్టం. అందులోనూ జాతీయ స్థాయిలో స్ట్రాంగెస్ట్‌ పార్టీగా ఎదగడమంటే మహా కష్టం. రెండుసార్లు వరుసగా గెలిచిన తెలంగాణ ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌ నుంచి బీఆర్‌ఎస్‌ అయిన తర్వాత ఎలా మారిందో చూశాము. చంద్రబాబు కూటమి ఇంకా ఐదేళ్లు అధికారంలో ఉంటుంది. కేవలం వంద రోజుల పాలన చూసి చంద్రబాబు ఫెయిలయ్యారని, ఇక రాబోయేది తమ ప్రభుత్వమేనని జగన్మోహన్‌రెడ్డి ఊహించుకుంటే మబ్బును చూసి ముంతలో నీరు ఒలక బోసుకోవడమే. ఎందుకంటే.. జగన్మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నారన్న సంకేతాలు రాగానే మోడీ` పవన్‌`నేను.. మా త్రయంతో రాష్ట్రం మున్ముందుకే అంటూ మరోసారి బీజేపీతో ఉన్న బంధాన్ని మంగళ వారం డ్రోన్‌ సమ్మిట్‌లో చంద్రబాబు ఉద్ఘాటించారు. ఎన్టీ రామారావు నుంచి పార్టీ చంద్రబాబు చేతిలోకి వచ్చిన తర్వాత ఆ మరుసటి ఎన్నికల్లో వాస్తవానికి చంద్రబాబు ఓడిపోవాలి. కానీ మళ్లీ వరుసగా రెండో సారి అధికారంలోకి వచ్చారు. ముఖ్యమంత్రిగా రాజశేఖరరెడ్డి చనిపోయిన తర్వాత ఆ సానుభూతి పవ నాల్లో 2014లో వైకాపా గెలవాలి. కానీ చంద్రబాబే గెలిచారు. చంద్రబాబును తక్కువ అంచనా వేసి, కేవ లం ఆయన మీద విరక్తే తనను గెలిపిస్తుందనుకోవడం వైకాపా అవివేకం.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page