2017లో స్త్రీలపై లైంగిక దాడుల గురించి వేసిన కమిటీ
ఏడేళ్ల తర్వాత నివేదికను పాక్షికంగా విడుదల చేసిన కేరళ ప్రభుత్వం
అట్టుడికిపోతున్న మలయాళ సినిమా
- దుప్పల రవికుమార్

మన తెలుగు సినిమా ప్రియులకు మొన్నటి కరోనా వరకు మలయాళ సినిమాల గురించి పెద్దగా తెలియదనే చెప్పాలి. పైగా మాలీవుడ్ మల్లు సినిమాలు అంటే సి గ్రేడు సినిమా హాళ్లలో ఆ మలయాళ సినిమాల మధ్య పోర్న్ చిత్రాల బిట్లు నాలుగైదు పెడతారని మాత్రమే తెలుగు వీక్షకులకు తెలిసేది. కాని, కరోనా తర్వాత ఇటీవల విడుదలైన మలయాళ చిన్న సినిమాలు మలయాళ సినీరంగం మీద గొప్ప గౌరవాన్ని కలిగించాయి. మానవ సంబంధాల్లోని అతి సూక్ష్మమైన సంబంధాలను నిలుపుకోవడంలో చేయవలసిన త్యాగాలను, నిజజీవితంలోని చిన్న చిన్న వైరుధ్యాలను, మనిషిని అప్పుడప్పుడూ మృగంగా మార్చే, మరికొన్నిసార్లు దేవునిగా మార్చే మనిషి బలహీనతలను ఒడిసిపట్టుకుని నిలువెత్తు వెండితెరపై హృద్యంగా ఆవిష్కరించడం మలయాళ సినిమా వారికే చెల్లిందని గొప్పగా చెప్పుకున్నాం. మమ్ముట్టి, మోహన్‌లాల్, పృధ్వీరాజ్ సుకుమారన్, దుల్కర్ సల్మాన్, ఫహద్ ఫాసిల్, నివిన్ పాలే, దిలీప్, జయసూర్య, సురేష్ గోపి, బిజు మీనన్, ఊర్వశి, శోభన, మంజు వారియర్, రేవతి, శ్రీవిద్య, పార్వతి తిరువోతు, నయనతార లాంటి మలయాళ నటీమణులు మన తెలిగింటి నటులైపోయారంటే అతిశయోక్తి కాదు. అలాంటిది మలయాళ సినిమా కళామతల్లి సిగ్గుతో చితికిపోయే కొన్ని అవమానకర విషయాలు ఇప్పుడు వెలుగు చూడడం విచారకరం.
నిన్న మంగళవారం కేరళలో బాంబు పేలింది. మలయాళ సినిమా ఒక్కసారి ఉలిక్కిపడిరది. ఏడేళ్ల తర్వాత పాక్షికంగా విడుదల అయిన ఒక నివేదిక అందరినీ భుజాలు తడుముకునేట్టు చేసింది. పినరయి విజయన్ నేతృత్వంలో నడుస్తోన్న కేరళ ప్రభుత్వం ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయింది. ఏడేళ్లుగా నివేదిక గతి ఏమయిందని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు కేరళ ప్రభుత్వాన్ని తూర్పారబట్టాయి. మలయాళ సినిమా రంగంలో స్త్రీలు ఎదుర్కొంటున్న పలు రకాల వివక్షలపై 2017లో కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హేమ నేతృత్వంలో ఒక కమిషన్‌ను కేరళ ప్రభుత్వం వేసింది. జస్టిస్ హేమ నేతృత్వంలో రూపొందిన ఈ నివేదికను ప్రభుత్వం కావాలనే తొక్కిపెట్టిందని విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. మొత్తానికి సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకుని కేరళకు చెందిన పదముగ్గురు సీనియర్ జర్నలిస్టులు నివేదిక కోసం ప్రయత్నించారు. వారికి కేవలం 55 పేజీల నివేదికను ఆర్‌టిఐ కమిషనర్ అందించారు. అందులో ఉన్న విషయాలు సోమవారం పత్రికల్లో, వెబ్‌సైట్లలో ప్రచురించడంతో ఒక్కసారిగా కేరళలో కలకలం రేగింది.
జుగుప్స కలిగిస్తున్న సినిమా పెద్దలు!
ప్రభుత్వం నియమించిన అనుభవజ్ఞుల కమిటీ మలయాళ సినిమా రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న అగచాట్లపై సీరియస్ అధ్యయనం చేసింది. ఇంకా సినిమా ప్రారంభం కాకముందే కొంతమంది నటీమణులను శారీరకంగా లొంగదీసుకోవడం గురించి తెలుసుకుని ప్రజలు నివ్వెరపోతున్నారు. కొన్ని అసహ్యకరమైన పనులు చేయడానికి అంగీకరించిన నటీమణులను ఆ పనుల స్థాయిని బట్టి ప్రత్యేక కోడిరగ్ ఇవ్వడం వంటి జుగుప్సాకరమైన విషయాలు ఇప్పుడు బయటకు పొక్కాయి. నిజానికి ఈ కమిటీని ప్రభుత్వం 2017లో నియమించగా, రెండేళ్లకే అంటే 2019లోనే కమిటీ తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. 2017లో కేరళలో ఒక ప్రమాద వార్త సంచలనం కలిగించింది. నడుస్తున్న వాహనంలో ఒక నటీమణిపై అత్యాచారం జరిగింది. పోలీసులు మలయాళ సూపర్‌స్టార్ దిలీప్‌ను ఎనిమిదో ముద్దాయిగా అరెస్టు చేసారు కూడా. ఇప్పటికీ ఆ కేసు నడుస్తోంది. ఈ ఒక్క విషయమే కాకుండా, మొత్తంగా మలయాళ సినిమా రంగ పరిశ్రమ మహిళలు పనిచేయడానికి అనువుగా ఉందో లేదో తేల్చమని కేరళ ప్రభుత్వం ఆ కమిటీని ఆదేశించింది. మరి ఎందుచేతనో ప్రభుత్వం ఆ నివేదికను వెల్లడిరచలేదు. మలయాళ సినిమా పరిశ్రమ పరువు పోతుందని భావించారేమో తెలియదు గాని, నివేదికను కేరళ ప్రభుత్వం నేలమాళిగలో నిక్షిప్తం చేసింది. ఐదేళ్ల తర్వాత కమిటీ నివేదికను పాక్షికంగా ఇప్పుడు బయటపెట్టించగలిగారు. 51 మంది సినిమా పరిశ్రమకు చెందిన వివిధ హోదాల్లో పనిచేసిన మహిళలతో సంప్రదించి, 295 పేజీలతో రూపొందించిన నివేదికలో విడుదలకు ముందే 63 పేజీలను తొలగించారు. అందులో ఏముందో ఎప్పటికీ తెలియకపోవచ్చని సినిమా రంగ అభిమానులు అనుమానిస్తున్నారు. ప్రభుత్వం నియమించిన కమిటీ రూపొందించిన నివేదికలో పదాలను, పేరాలను, సమాచారాన్ని నిషేధించడమేమిటో ఎవరూ అర్థం చేసుకోలేకపోతున్నారు.
నిజానికి ఆ నివేదిక ప్రారంభ వాక్యాలు ఇలా సాగుతాయి.. ‘‘వినీలాకాశం మార్మికమైంది. దూరం నుంచి చూసేవారికి తళుకులీనే తారలు, అందాల చందమామ వీనులవిందుగా కనిపిస్తాయి. కాని, తరచి చూసినవారికి అదే ఆకాశం భిన్నంగా కనిపిస్తుంది. ఆ నక్షత్రాలు తళుకులీనడం లేదు. చందమామ అందంగానూ లేదు. అందుకే మా నివేదిక మిమ్మల్ని హెచ్చరిస్తోంది. మీరు చూసేదేదీ నమ్మకండి. అది నిజం కాదు. కొన్నిసార్లు లవణమే చక్కెరలాగా గోచరిస్తుంది’’.
నటులుగా, దర్శకులుగా పేరున్న కొంతమంది మగరాయుళ్లు తమ ప్రవర్తనతో కొందరు నటీమణులను ఆశ్చర్యపరిచినట్టు నివేదికలో తెలుస్తోంది. వీరి అకృత్యాలు భరించలేక తల్లులను, సోదరీమణులను తమతో పాటు తెచ్చుకున్నట్టు కొందమంది చెప్పారట. మద్యం మత్తులో వారిని కూడా అనుభవించడానికి కొందరు సినిమా పెద్దలను ప్రభుత్వం దాయాలనే కొన్ని పేర్లను నివేదిక నుంచి తొలగించినట్టు అనుమానిస్తున్నారు. తాము బస చేసిన హోటల్ గదుల తలుపులను అర్ధరాత్రి తట్టడం, బలవంతంగా తమ గదుల్లోకి ఆ సమయంలో వచ్చేయడం, అలాంటి దుర్ఘటనలు ఎవరితోనైనా పంచుకున్నప్పుడు చంపేస్తామని బెదిరించడం లాంటి అనేక అవమానకరమైన పనులను, సినిమా రంగ పెద్దలు చేసిన నిర్వాకాలు వారు బయటకు చెప్పడం ఆ నివేదికలో స్పష్టంగా నమోదైంది. ఇష్టంలేకుండా కేవలం అవకాశాల కోసం బెదిరించి లొంగదీసుకున్న ఒక నటి, మరునాడు అదే దురహంకారపూరిత నటుడితో మొగుడూ పెళ్లాలుగా రొమాంటిక్ సీన్లలో నటించాల్సి రావడం ఒక పెద్ద శిక్ష. దీంతో ఆమె పదిహేడు టేకులు తీసుకున్నప్పుడు, సెట్లోనే బహిరంగంగా ఆ దర్శకుడు ఆమెను బూతులతో మందలించడాన్ని కూడా ఆ నివేదికలో పొందుపరిచారు. కొన్నిసార్లు కొంతమంది మహిళా ఆర్టిస్టులకు సెట్లలో కనీస మానవ హక్కులు మృగ్యమవడం, బట్టలు మార్చుకోవడానికి ప్రత్యేక గదులు లేకపోవడం, మలమూత్ర విసర్జనలకు బాత్రూములు లభించకపోవడం వంటి అనేక విషయాలు ఇప్పుడు బయటకు పొక్కాయి. ఇలాంటి విషయాల గురించి ఎవరితోనైనా చర్చించినట్లయితే, ఆయా నటులను సోషల్ మీడియాలో రకరకాల మీములతో మానసికంగా హింసించడం చాలా మామూలు విషయమని దీనిబట్టి తెలుస్తోంది. కొంతమంది నిర్మాతలు, దర్శకులు, నటులు, ప్రొడక్షన్ యూనిట్ ఒక పవర్ నెక్సస్‌గా ఏర్పడి ఈ దారుణాలకు ఒడిగట్టినట్టు స్పష్టమవుతోంది. ఇది కేరళలో బయటపడిరది. మిగిలిన చోట్ల గుంభనంగా ఉంది. అంతే తేడా!
మరి ఇలాంటి నివేదిక వెల్లడయితే కమ్యూనిస్టు పార్టీలపై విషం చిమ్మే ఇతర పార్టీలు ఊరుకుంటాయా? వెంటనే తమ విమర్శన అస్త్రాలు సంధిస్తున్నాయి. కేరళకు చెందిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు శశిథరూర్ కేరళ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోసారు. ప్రభుత్వం ఇలాంటి నివేదికను ఐదేళ్ల పాటు తొక్కిపట్టి ఉంచడం అవమానకరమే కాదు ఆశ్చర్యకరం అని కూడా అన్నారు. అంతేకాకుండా మహిళా ఐపిఎస్ అధికారులతో ఒక కమిటీ రూపొందించి, నివేదికలో బాధితులు పేర్కొన్న విషమకరమైన పరిస్థితులపై లోతైన విచారణ చేయాలని కేరళ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. కేరళ మహిళా కమిషన్ కూడా సత్వరం స్పందించి, సంబంధిత అధికారులు వెంటనే రంగంలోకి దిగాలని ఆదేశించారు. పోష్ చట్టం ప్రకారం, మహిళలందరికీ పని ప్రదేశాలలో లైంగిక అత్యాచారాల నిరోధక వాతావరణం ఉండాలి. అయితే వ్యక్తిపూజ అత్యున్నత స్థాయిలో ఉన్న సినిమారంగంలో ఆ వాతావరణం లేదని హేమ కమిటీ నివేదిక విచారం వ్యక్తం చేసింది. ఇందులో తమ చేదు అనుభవాలను వివరించిన మహిళల వివరాలను గోప్యంగా ఉంచినప్పటికీ, ఈ నివేదిక ఆధారంగా సంబంధిత నేరాలకు పాల్పడిన వారిపై ప్రాథమిక దర్యాప్తు నివేదిక (ఎఫ్‌ఐఆర్) నమోదు చేయాలని చివర్లో ఈ నివేదిక కోరడం ఒక కొసమెరుపు. గుప్పెడు మంది మగ నటులు, దర్శకులు, నిర్మాతల చేతుల్లో మలయాళ సినిమా పరిశ్రమ విలవిల్లాడుతోందని నివేదికలో వాపోయారు. సినిమా రంగంలో మొత్తం 30 వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మహిళా సినీ కార్మికులు 17 రకాలైన వివిధ రూపాల లైంగిక హింసను, వివక్ష, దోపిడీలను ఎదుర్కొంటున్నారని వివరించారు. కాగా హేమ కమిటీలో విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.హేమతో పాటు, సీనియర్ తెలుగు సినీనటి శారద, విశ్రాంత ఐయ్యేఎస్ అధికారి కె.బి.వల్సల కుమారి ఉన్నారు. మరి ఇలాంటి పైశాచికత్వం కేవలం కేరళకే పరిమితమా అంటే కాదనే చెప్పాలి. కేరళలో ఆ తేనెతుట్టెను కదిపారు. మిగిలిన చోట్ల గుంభనంగా ఉంది. అదే తేడా. మిగతా స్టోరీ అంతా షేమ్ టూ షేమ్. పేర్లు మారుతాయి. అంతే!
Comments