top of page

మళయాళమూ..మనమూ!!

Writer: ADMINADMIN

వాళ్లెంత బాగా తీస్తారండీ, మనోళ్లూ ఉన్నారు ఎందుకు, అట్లా ఎప్పటికి తీయాలి వీళ్లు అనేది తరచుగా వినిపించే మాట. తీయరు వేరు. తీయలేరు వేరు. అంటే మనవారికి ప్రతిభ లేదని అభిరుచి లేదని ప్రధాన అభియోగం. మనోళ్లు తీయని మాట నిజమే కానీ తీయలేరు అనే మాట నిజమేనా అన్నది చూద్దాం. వారు తురుముఖానులు అయితే మనోళ్ళు అత్తురుము ఖానులు ఎట్లయ్యారు? మార్కెట్‌ ను పక్కనబెట్టే అభిరుచి ప్రధానమైన కల్చరల్‌ సెంట్రిక్‌ ఆందోళన సరైనదేనా అనేది చూద్దాం.

కూసింత నోస్టాల్జియా తప్పేట్టు లేదు. నా చిన్ననాట కూడా మలయాళ సినిమా సందేశాత్మకమే. కాకపోతే కుర్రాళ్ళు గుసగుసలాడుకుని సైలెంట్‌గా చూసొచ్చి యవ్వనోద్రేకంతో చర్చించుకునేంత సందేశాత్మకం. మా ప్రాంతపు టమాటా రైతులు ఒంగోలు మార్కెట్‌కు వెళ్లి అక్కడ రామా టాకీస్‌లో చూసొచ్చి అరుగుల మీద చొంగకార్చుకుంటూ చర్చించుకునేంత సందేశాత్మకం. సినిమా నిండా ఆడవాళ్ల తొడలు రొమ్ములు మూలుగులు చూపించి ఆఖర్న ఈ ధోరణి సమాజ ఆరోగ్యానికో వ్యక్తి ఆరోగ్యానికో హాని చేయును అని చెప్పేంత సందేశాత్మకమన్నమాట. ఇపుడు నలభై దాటిన వారిలో చాలామందికి ఇది అనుభవంలో ఉండాలి. అప్పటికే అక్కడ ఆదూర్‌ లాంటివారున్నారు. మాకా సులువేదీ! మాలాంటి సి గ్రేడ్‌ ప్రాంతాలకు మళయాల సినిమాలంటే అవే అప్పటికి. పదేళ్ళుగా పరిస్థితి మారింది. ఇపుడు సెన్సిబిల్‌ సినిమాకు రియలిస్టిక్‌ సినిమాకు కేరాఫ్‌ అడ్రస్‌ మళయాళం. ఇక్కడొక రైడర్‌ అవసరమేమో తెలీదు. నేను ఎ క్లాస్‌ సెంటర్కు వచ్చి ముప్పైయేళ్లు. సి క్లాస్‌ సెంటర్లలో మలయాళం మారిందో లేదో తెలీదు. ఓటీటీల వల్ల యాక్సెస్‌ పెరిగింది కాబట్టి అక్కడా ఇమేజ్‌ మారి ఉండొచ్చు.

సరే, వర్తమాన మలయాళం సినిమా ఊపేస్తోంది. నేనైతే సబ్‌ టైటిల్స్‌ అవసరం లేకుండానే చూడగలుగుతున్నా. నాలుగైదేళ్ల క్రితం రాసినట్టున్నా, లిజో తలస్సెరి గురించి, ఫవాద్‌ ఫాజిల్‌ గురించి- రాబోయేరోజుల్లో ఎక్కువగా వినబోయే పేర్లు అని. వింటున్నాం, చూస్తున్నాం తరచుగానే. కుంబలంగి నైట్స్‌లో ఫవాద్‌ కళ్ళతో నటించిన తీరు చూసి అర్రె అనిపించె. జల్లికట్టు, ఈ మాయు చూసి లిజోస్‌ తలస్సెరి తలకు బట్టె. ఆ తర్వాత ఎన్నో, ఎంత మంది నటులో. అభిరుచి కలిగిన సెన్సిబిల్‌ ప్రేక్షకులకు, రియలిస్టిక్‌ సినిమా ఇష్టపడే వారికి మలయాళ సినిమా ఆశ్రయంగా మారింది అనేది వాస్తవం. ఇపుడు మనదగ్గరకి వద్దాం. ఇక్కడెందుకు లేరు, ఎందుకు ‘‘తీయలేరు’’. ప్రధానంగా మన మార్కెట్‌ వేరు. మన మార్కెట్‌ వందల కోట్ల మీదుగా వేలకోట్లకు వెళ్ళిపోయింది. ఆ బడ్జెట్లో రియలిస్టిక్‌ సినిమాను ఆశించడం అత్యాశ. సినిమా అనేది ప్రధానంగా వ్యాపారం, తర్వాతే కళ అని అర్థం చేసుకుంటే పని సులువవుతుంది. కళే ప్రధానం అని భావించే వారు ఉండరని కాదు. అరుదు. అలా భావించి వచ్చిన వారు కూడా పైకి పైపైకే పోవాలని అనుకుంటారు. తెలుగు సినిమా సక్సెస్‌ బెంజ్‌ కార్లనుంచి ప్రైవేట్‌ జెట్ల దాకా ప్రయాణించింది. ఇపుడదే ఎవరికైనా ప్రమాణం. బాహుబలే ప్రమాణం. భావజాలమో కళో నమ్ముకుని అదే బాటలో మాత్రమే ప్రయాణించే వారు ఉండొచ్చు. కొందరికి అదొక పరిమితిగా ఉండొచ్చు, మరికొందరికి విశ్వా సమే ప్రధానం బోయినం కాదు అనేంత గట్టి పట్టు ఉండొచ్చు. ఆర్‌ నారా యణమూర్తి టాంటి వారు అక్కడక్కడా ఉండొచ్చు. కళ అయినా కాకపోయినా ఏదో విశ్వాసమూ అదీ! విశ్వాసమూ కళ రెండూ తెలియడం పెద్ద కళ. పెద్ద సినిమా అవకాశాలు ఇంకా రాక చిన్న సినిమాలు తీసేవారే ఎక్కువ. కాబట్టి మనకు రియలిస్టిక్‌ సినిమా అనేది అనివార్యత నుంచి వస్తున్నదే ప్రధానంగా. అదే తీయాలని పట్టుదలగా ఉన్న వారు తక్కువ. తెలీక కాదు, చేత కాకకాదు. అజ్ణానము చేతనో మూర్ఖత్వము చేతనో ఎంత మాత్రమూ కాదు. లక్ష్యమే మసాలా సినిమా. మ్మమ్మమాస్‌ అనేది మన ఊత పదం. ఈ మసాలా సినిమాలు తీసేవారిలో కూడా చాలామంది అలా కదిలిస్తే తార్కోవిస్కీ, కురసోవా, గొడార్డ్‌, ఫెలినీ, కియరోస్తమీ, మాజిది మాజిది, స్కోర్సెస్‌, నోలన్‌ అనే అంటారు. పర్సనల్‌గా కదిలించి చూస్తే తెలుస్తుంది. తెలీనివారు కాదు. పవన్‌ కల్యాణ్‌కు ఏమీ తెలీకనే కొడుక్కి అకిరా అని పేరు పెట్టుకున్నాడా! కొందరు మసాలా డైరక్టర్లకు కూడా కురసోవా అంటే పిచ్చి. కానీ మన మార్కెట్‌ ఇకో సిస్టమ్‌ వేరు. త్రివిక్రమ్‌ తొలిరోజుల్లో చిరునవ్వుతో అనే సినిమాకు రాశాడు.. ఇటాలియన్‌ డైరక్టర్‌ రాబర్డ్‌ బెనిగ్నే లైఫ్‌ ఈజ్‌ బ్యూటిపుల్‌ నుంచి ఆరేడు కామెడీ సీన్లు యథాతథంగా దించాడు. అప్పుడు హైదరాబాద్లో జరిగిన అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్కు ఆయన కూడా అటెండ్‌ అయ్యారేమో అని డౌట్‌. తర్వాతేం చేశాడు. ఏమేం డైరక్ట్‌ చేశాడు! అదన్నమాట. అవతల వందలు వేల కోట్లు ఊరిస్తున్నపుడు ఎవరైనా కామెడీలు కాకరకాయలతో సరిపెట్టుకుంటారా! ఆ మధ్య అంటే ఓ పదేళ్ళ క్రితం దగ్గుబాటి సురేశ్‌ బాబును ఓ గంట సేపు ఎంగేజ్‌ చేయాల్సి వచ్చింది. సభా మర్యాద కోసం నేనేదో మక్బల్‌ బఫ్‌ (తండ్రీ కూతురు) అన్నా. ఆయన మొత్తం ప్రపంచపర్యటన చేయించారు. మొన్నటికి మొన్న రైటర్స్‌ మీట్లో కలిసిన మిత్రులు ఆర్‌ సామల సీన్లకు సీన్లు సీక్వె న్సులు చెప్పేస్తున్నారు, అవతలి వారు పేరు ప్రస్తావించగానే. సారాంశం ఏమిటంటే హైదరాబాద్‌ ఫిల్మ్‌ క్లబ్లోనో ఓటిటిలోనో నాలుగు సినిమాలు చూసిన మనకే ఇంతుంటే అదే జీవితంగా ఎంచుకున్న వారికి ఇంకెంత ఉండాలి సినిమా పరిజ్ణానం. అది కామన్‌ సెన్స్‌. సో అది తెలియకపోవడం వల్లో నైపుణ్య లోపం వల్లో కాదు. అభిరుచి లోపం వల్ల అనేది కూడా పూర్తి సత్యం కాదు. అభిరుచులెలా ఉన్నా అవతల ఊరించే కథ వేరు. మార్కెట్‌ డైనమిక్స్‌. మలయాళంలో కూడా ఓ కేజిఎఫ్‌ వస్తే బాహుబలి ఎంటర్‌ అయితే అది ట్రెండ్‌గా మారితే అక్కడ రియలిస్టిక్‌ సినిమా ఏ రూపం తెచ్చుకుంటుందో చెప్పలేం. ఇప్పటికి అక్కడ మార్కెట్‌ చిన్నది. ఓటీటీల పుణ్యమా అని ఇటీవల అందరికీ తెలుస్తున్నారు. కొద్దిగా విస్తరిస్తోంది. రియలిస్టిక్‌ సినిమాకు నటన అవసరం. జీవితాన్ని, మనిషిని ఆవిష్కరిస్తున్నపుడు నటించి తీరాలి. లేకపోతే పండదు. హెలికాప్టర్‌ ఛేజ్లు, గ్రాఫిక్సులు ప్రధానమైన చోట నటన అసవరం లేదు. మెగాస్టార్స్‌కు అస్సలు అవసరం లేదు. దానర్థం వారికి రాదని కాదు. చంటబ్బాయ్‌ చిరంజీవికి నటన అవసరం. ఇంద్ర చిరంజీవికి అవసరం లేదు. ఆ మధ్య వర్మో, తేజో మంచి మాట చెప్పారు. స్టార్లు ఏ పాత్ర వేసినా వారే కనిపించాలి. పాత్ర కాదు. ప్రేక్షకుడు వారికోసం వస్తాడు. ఆ ఇమేజ్‌ వచ్చాక వారు దాన్ని కాపాడుకోవాల్సిందే. చివరకు రుద్రవీణ అన్నా కూడా చిరంజీవి ఇమేజ్‌ కాపాడడానికి అంతటి బాలచందర్‌ కూడా ఎంతో కొంత రాజీపడా ల్సిందే. ఇమేజ్‌కు భిన్నమైన ప్రయోగాలు సాధారణంగా నడవ్వు. సిక్లాస్‌, బిక్లాస్‌ మార్కెట్‌ ఇంకా ప్రధాన పాత్ర పోషించే సమాజాల్లో నువ్వు వారికి తగినట్టు ఉండాలి. లేదంటే ఫ్లాప్‌ భుజాన మోయాలి.. మహేశ్‌బాబు నిజం (అదేదో కళాత్మకమైనది అని కాదు, ఇమేజ్‌కు భిన్నమైనది అని) చెప్తానంటే పోవోయ్‌ అంటారు. ఇమేజ్‌, బ్రాండ్‌ అనేవి వర్తమానంలో ముఖ్యమైనవి. అంతంత పెట్టి ఐ ఫోన్‌ ఎందుకు కొంటారు, అదేమైనా యూజర్‌ ఫ్రెండ్లీ అనా! కాదు. అదొక బ్రాండెడ్‌ ఇమేజ్‌.అక్కడ కూడా మసాలా సినిమా ఉన్నా దాని పరిధి చిన్నది. ముమ్ముట్టి మోహన్‌లాల్‌ లాంటి మంచినటులకు పోలీస్‌ యూనిఫామ్‌ వేసి ఫైట్లు పెట్టి నోరారా నా కొడకా లాంటి డైలాగులు పలికించి మమ అనిపించే బాపతు. మార్కెట్‌ చిన్నది. మనదగ్గర రియలిస్టిక్‌ సినిమా తీశారనుకోండి. ఏమొస్తుంది. మహా అయితే మనలాంటి వాళ్ళు నలు గురు మెచ్చుకుంటారు. ఇంకా మహా అయితే ఒకటో రెండో వేదికల మీద కనిపించి మనతో పాటు చాయో, బీరొ తాగుతారు. ఆర్గానిక్‌ ప్రాడక్ట్స్‌, పర్యావరణ స్పృహ లాంటి వేదికలమీద కూడా కనిపించొచ్చు. ఆటోలోనో మారుతి లోనో ఇంటికిపోతారు. అవతల బెంజ్‌ నుంచి ప్రైవేట్‌ జెట్ల దాకా మార్కెట్‌ పెరిగాక ఎవరైనా ఎందుకు ఆగుతారు అక్కడ. వారికి ప్రత్యేకంగా భావజాలమో, కళో, ఏదో ఒక పట్టుదల ఉంటే తప్ప. ఆ పట్టుదల ఎన్నాళ్ళు ఆగుతుంది ఈ మార్కెట్‌ ముందు. అరుదు. మన మార్కెట్కు మన సినిమాలకు ఆ సెన్సిబిలిటీ అక్కర్లేదు. ఆ రియలిస్టిక్‌ నటనా అవసరం లేదు. ఇపుడూ, తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్లు లేకుండా పోయారు అని వలపోత ఉంది కదా! గ్రామీణ సమా జమే ప్రధానమైన పోయిన సమయంలో కుటుంబ కథా చిత్రాలుండేవి. పాలేరు/పేదరైతు వర్సెస్‌ జమీందారు, కోడలు వర్సెస్‌ అత్త, పట్నం వర్సెస్‌ పల్లె వగైరా ఘర్షణలుండేవి. పాత్రకు పుష్టి ఉన్నపుడు నటనలోనూ అవ సరమవుతుంది. ఆ ఘర్షణ పలికించడానికి నటన నటన తెలిసిన కళ్ళు అవసరం. సావిత్రి అవసరం. సావిత్రి ఏం చేస్తుంది ఇప్పటి సినిమాల్లో. అడపా దడపా ఫాన్సీగా గ్రామీణం అన్నా కోనసీమ అరటి తోటలు, రాయలసీమ విలన్లతోనే సరి. ప్లాట్‌ మారిపోయింది. వర్తమానపు సీన్‌ వేరే. ఇపుడు సినిమా హీరో సెంట్రిక్‌. కొందరి విషయంలో డైరక్టర్‌ సెంట్రిక్‌. దానర్థం కల్చరల్‌ కారణాలు అస్సలుండవని కాదు. ఉంటాయి. ప్రతిగడ్డకూ ఉండే సాంస్కృతిక వారసత్వం, దానికి వారిచ్చే విలువ, ప్రేక్షకుల కల్చరల్‌ స్థాయి వగైరా ఉంటాయి. మలయాళం, కన్నడ, మహారాష్ట్ర, అస్సొం సినిమాల వెనుక అది కూడా పని చేస్తుంది. మనలాగే కమర్షియల్‌ అయినప్పటికీ తమిళంలో కూడా ఆ పాయ ఒకటి ప్రవహిస్తా ఉంటది. పెద్ద పెద్ద మెగాస్టార్లు డైరక్టర్లకు కోట్లు ఎదురిచ్చి మరీ కొన్ని సినిమాలు చేయడం చూస్తుంటాం. మాస్‌ మసాలా సినిమా నటులు కూడా సెన్సిబిల్‌ సినిమాలు ప్రొడ్యూస్‌ చేయడం చూస్తుంటాం. కమర్షియల్‌ ఇమేజ్‌ కాపాడుకుంటూనే ఏదో తరహాలో ఇందులోనూ పాల్గొనే పద్ధతి చూస్తుంటాం. మన కథ వేరు. మనం ప్రయాణించిన తీరు వేరు. ఇవ్వన్నీ నిజమే అయినా వీటికంటే పెద్ద నిజం మార్కెట్‌. ప్రధానం అనేది ఒకటుంటుంది కదా! అయితే ఏంటి, ఈ పనికిమాలిన సినిమాలు మంచివంటారా అని కన్నెర్ర చేయకండి క్రిష్ణంరాజును ఆవహించుకుని. మంచి చెడుల సమస్య కాదు. అర్థం చేసుకోవడానికి సంబంధించిన అంశం. అర్థం చేసుకోవడం వేరు, అంగీకరించడం వేరు. ఓటిటిలు, మల్టీప్లెక్సుల పుణ్యమా అని ఇక్కడ కూడా కొంత మార్కెట్‌ పెరుగుతోంది, సెన్సిబిల్‌ సినిమాలకు. మరీ ప్రైవేట్‌ జెట్ల స్థాయి కాకపోయినా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని చిన్న సినిమా తీస్తే మారుతిలో ప్రయాణించగలిగినంత మేర అయితే మార్కెట్‌ ఉంది. కొత్తవాళ్లకు అదే ఉత్సాహం. వస్తున్నారు. వారిని నమ్మి అపుడే వందల కోట్లు బడ్జెట్‌ పెట్టే నిర్మాతలు, నటించే స్టార్లు దొరకరు కాబట్టి అలాంటి సినిమాలు అడపా దడపా వస్తుంటాయి. ఎంత నైపుణ్యం అభిరుచి ఉన్నా కాస్తో కూస్తో పెట్టుబడి పెట్టే నిర్మాత కోసం పరితపించే ప్రాణాలు ఎన్నో. సినిమా పోయినా అతని టేకింగ్‌ బాగుందయ్యా అని నలుగురిలో పడి వారు పైకెదిగినా ఇకొందరయితే వస్తూనే ఉంటారు. కళో విశ్వాసమో ప్రధానమైన వారు కొందరెలాగూ ఉంటారు, ఎంత తక్కువ సంఖ్య అయినప్ప టికీ. ప్రస్తుతానికి వారితో సరిపెట్టుకోవాల్సిందే.

- జి.ఎస్‌.రామ్మోహన్‌

ความคิดเห็น


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page