top of page

మళ్లీ తెరపైకి ఆ కుటుంబాల పోరు!

Writer: ADMINADMIN
  • `ఎన్నికల సాక్షిగా మారిన నగర రాజకీయం

  • `ఇన్నాళ్లూ ధర్మాన కోసం ఒకే పార్టీలో మనుగడ

  • `పరస్పరం ఆధిపత్యం ప్రదర్శించేందుకు ఆరాటం

శ్రీకాకుళం నగర రాజకీయ చరిత్రలో ఆ రెండు కుటుంబాలు సుదీర్ఘ కాలం ప్రత్యర్థులుగానే ఉన్నాయి. మధ్యలో ఒకే పార్టీ గొడుగు కింద చేరి ఒకే నాయకుడి గెలుపు కోసం పని చేసినా.. మళ్లీ వారి మధ్య ఉన్న రాజకీయ వైరుధ్యం ఈ ఎన్నికల సందర్భంగా బయటకు వచ్చింది. సిక్కోలు నగర రాజకీయాలను పరిశీలించిన వారికి అనేక ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. ధర్మాన ప్రసాదరావును శ్రీకాకుళం నుంచి గెలిపించడానికి ఈ రెండు కుటుంబాలు పని చేసినా.. ఎవరి రాజకీయం వారిదే అన్నట్లు వ్యవహరించాయి. కానీ ప్రస్తుత ఎన్నికల్లో మళ్లీ సీను మారిపోయింది. పోలింగ్‌ తేదీ దగ్గర పడుతున్న సమయంలో ఒకరు ధర్మాన ప్రసాదరావు గెలుపు బాధ్యతను భుజాలపై వేసుకొని నడుస్తుండగా, మరొకరు టీడీపీ అభ్యర్థి గొండు శంకర్‌ గెలుపు కోసం శక్తివంచన లేకుండా పని చేస్తున్నారు. ఇందులో భాగంగా ఒకరి ప్రాంతాల్లోకి మరొకరు చొరబడే రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

నగరంలో ఏటవతల వరం కుటుంబం, ఏటికి ఇవతల మెంటాడ కుటుంబం ఇప్పుడు రెండు పార్టీల్లో ఉంటూ పరోక్షంగా బలప్రదర్శనకు దిగుతున్నాయి. ఒకప్పుడు ఒకరు అధికారంలో ఉంటే, మరొకరు ప్రతిపక్షంలో కొనసాగారు. వీరిద్దర్నీ ఒకే గూటికి తెచ్చిన ఘనత ధర్మాన ప్రసాదరావుదే అయినా ఈ ఎన్నికల్లో మాత్రం ఎవరికి వారే అన్న రీతిలో పని చేస్తున్నారు. 1995`2000 మధ్య మున్సిపల్‌ చైర్మన్‌గా దూడ భవానీశంకర్‌ పని చేసిన కాలంలో మినహా మిగిలిన కాలంలో ప్రతి కౌన్సిల్‌లోనూ వరం కుటుంబానికి ఎంవీ పద్మావతి పక్కలో బల్లెంలాగే ఉన్నారు. 2005 నుంచి 2010 వరకు ఆమె మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా పని చేసినప్పుడు వరం మున్సిపల్‌ కౌన్సిలర్‌గా ప్రతిపక్షంలో ఉన్నారు. ఆ సమయంలో గుండ లక్ష్మీదేవి, అంధవరపు సూరిబాబు వంటివారు కూడా కౌన్సిలర్లుగా ఉండటంతో అప్పటి వరకు చైర్మన్‌గా పని చేసిన వరం ప్రతిపక్ష నాయకుడి పోస్టు తీసుకోలేదు కానీ, పద్మావతి వ్యతిరేక కూటమిని మాత్రం తెర వెనుక బలంగా నడిపారు. 2010లో వరం కూడా అఫీషియల్‌గా కాంగ్రెస్‌ గూటికి చేరడంతో పద్మావతి, వరం ఒకే పార్టీలో ఉన్నట్టు కనిపించినా, వీరి మధ్య పాత శత్రుత్వం మాత్రం సమసిపోలేదు. 2005 మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ ఎక్కువ వార్డులు గెలిచుంటే వరం మున్సిపల్‌ చైర్మన్‌ అయ్యుండేవారు. కానీ కాంగ్రెస్‌కు మెజారిటీ సీట్లు రావడంతో అనూహ్యంగా పద్మావతి చైర్‌పర్సన్‌ అయ్యారు. 2014, 2019 ఎన్నికల్లో ఈ రెండు కుటుంబాలు ధర్మాన గెలుపు కోసం ఆయనతోపాటు ఒకే పార్టీలో పని చేసినా, ఎవరి దారి వారిదిగా కొనసాగారు. గెలుపు ఓటములను పక్కన పెడితే వీరి వైరం ధర్మానకు తలనొప్పి లేకుండానే కొనసాగింది. కానీ ప్రస్తుత ఎన్నికల్లో వరం వారసులు వైకాపాను వీడి టీడీపీలోకి వెళ్లిపోవడంతో మళ్లీ పాత కథే పునరావృతమవుతోంది.

నాలుగు దశాబ్దాల వైరం

1981 నుంచి ఈ కుటుంబాల మధ్య రాజకీయ వైరం కొనసాగుతోంది. 1981`86 మధ్య వరం తొలిసారి మున్సిపల్‌ చైర్మన్‌గా వ్యవహరించారు. ఆ సమయంలో నగరంలో 26 వార్డులు, 32 మంది కౌన్సిలర్లు ఉండేవారు. అంటే ఆరు వార్డుల్లో ఇద్దరేసి చొప్పున కౌన్సిలర్లను ఎదుర్కొనే విధానం ఉండేది. జనరల్‌ వార్డులో మరో బీసీ అభ్యర్థిని నిలబెట్టే ఆనవాయితీ నడిచేది. అలాగే ఎస్సీ, మైనార్టీలకు రిజర్వయిన వార్డులో ఒక జనరల్‌కు అవకాశం ఉండేది. ఈ సమయంలోనే వరం చైర్మన్‌గా బరిలో ఉన్నారు. ఇక్కడ మున్సిపల్‌ చైర్మన్‌ కావాలంటే 17 మంది కౌన్సిలర్ల మద్దతు కావాలి. అయితే వరం శిబిరంలో అప్పటికి 15 మంది మాత్రమే ఉన్నారు. ఇదే సమయంలో మండలవీధి నుంచి కౌన్సిలర్‌గా ఎన్నికైన మెంటాడ చిన్నారావు (ఎంవీ పద్మావతి మామ) చనిపోయారు. వాస్తవానికి చిన్నారావు వరంతో పాటు చైర్‌పర్సన్‌ బరిలో ఉన్న చిట్టిబాబు రాజు గ్రూపునకు చెందిన కౌన్సిలర్‌. చిన్నారావు చనిపోవడంతో 17 మంది కౌన్సిలర్ల మద్దతున్న రాజుకు 16 మందే మిగిలారు. ఆ సమయంలో జరిగిన ఉపఎన్నికలో మామ స్థానంలో ఎంవీ పద్మావతి పోటీ చేసి గెలుపొందారు. అయితే ఇంకా 18 ఏళ్లు నిండనందున పద్మావతి పోటీకే అనర్హురాలని, ఇక ఆమె గెలుపును ఎలా పరిగణనలోకి తీసుకుంటారంటూ అప్పట్లో వరం ఫిర్యాదు చేశారు. కానీ పద్మావతికి 18 ఏళ్లు నిండిపోయాయని, వివాహం కూడా జరిగినందున మైనార్టీ తీరలేదన్న వాదన సరికాదంటూ ధ్రువపత్రాలు సమర్పించడంతో ఆమె తొలిసారి కౌన్సిల్‌లో అడుగు పెట్టగలిగారు. ఆ తర్వాత కౌన్సిలర్లు చైర్మన్‌ను ఎన్నుకునే ప్రక్రియలో ఎవరు వరానికి ఓటేశారనే విషయం ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయినా వరం మాత్రం చైర్మన్‌ అయ్యారు. ఆ తర్వాత ఇండిపెండెంట్‌గా పోటీ చేసే విధానాన్ని పక్కన పెట్టి ప్రభుత్వం పార్టీ సింబల్‌ మీద మున్సిపల్‌ ఎన్నికలను నిర్వహించినప్పుడు వరం మరోసారి మున్సిపల్‌ చైర్మన్‌ అయ్యారు. అప్పుడు కూడా పద్మావతి మున్సిపల్‌ కౌన్సిలర్‌గా పని చేశారు.

మేయర్‌ పదవి చుట్టూనే రాజకీయం

2000`2005 మధ్య కాలంలో పైడిశెట్టి జయంతి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా పని చేసినప్పుడు పద్మావతి కాంగ్రెస్‌ ఫ్లోర్‌లీడర్‌గా వ్యవహరించారు. ఈ సమయంలో కాంగ్రెస్‌ పార్టీని, కౌన్సిలర్లను బలంగా జనంలోకి తీసుకువెళ్లడంలో ఆమె సక్సెస్‌ కావడంతో 2005 ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ రాజశేఖరరెడ్డి పద్మావతిని ఏరికోరి చైర్‌పర్సన్‌ను చేశారు. వాస్తవానికి ఆ ఎన్నికల్లో చైర్మన్‌ పదవి జనరల్‌ కేటగిరీకి కేటాయించారు. కానీ బీసీ మహిళ అయిన పద్మావతిని 100 గేట్లు దాటించి రాజశేఖరరెడ్డి చైర్‌పర్సన్‌ను చేశారు. ఆ సమయంలో కౌన్సిల్‌లో వరం ఉన్నారు. ఇలా ఈ రెండు కుటుంబాల మధ్య సమకాలీన రాజకీయాల్లో చైర్మన్‌ కిరీటం మారుతూవచ్చింది. ఇప్పుడు అదే మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా రూపాంతరం చెందడంతో మేయర్‌ పదవి కోసం కూడా ఈ రెండు కుటుంబాలు పోటీ పడుతున్నాయి. ధర్మాన ప్రసాదరావు వైకాపాలో చేరిన దగ్గర్నుంచి వరం కుటుంబం అదే పార్టీలో ఉన్నా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వద్ద వీరికి యాక్సెస్‌ లభించలేదు. అదే సమయంలో పద్మావతి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా ఉన్న రోజుల్లో కుర్రాడిగా ఉన్న ఆమె తనయుడు స్వరూప్‌ ఇప్పుడు వైకాపా యువజన విభాగం అధ్యక్షుడయ్యారు. దీనికి తోడు సీఎంవోలోనూ పట్టు సంపాదించడంతో మేయర్‌ అభ్యర్థిత్వం వైకాపా తరఫున మెంటాడ కుటుంబానికి తప్ప వేరే వారికి రాదని అర్థమైపోయింది. దీంతో మళ్లీ మెంటాడ కుటుంబం ఒకవైపు, వరం కుటుంబం మరోవైపు చీలిపోయి పని చేస్తున్నాయి. టీడీపీలో చేరిన తర్వాత పైడిశెట్టి జయంతి కళింగ కోమట్లు అధికంగా ఉన్న పెద్ద బరాటంవీధిలో రెండు రోజుల క్రితం ఇంటింటికి వెళ్లి టీడీపీ అభ్యర్థిని గెలిపించమని కోరారు. తాజాగా బుధవారం పెద్ద బరాటం వీధి తన పరిధిలోనే ఉండటం వల్ల ధర్మాన ప్రసాదరావుకు ఓటేయాలంటూ పద్మావతి ఇంటింటికీ వెళ్లారు. ఇప్పుడు ఏటవతల ప్రాంతంపై బలంగా దృష్టి సారిస్తున్నారు. హయాతీనగరంలో టీడీపీలో ఉన్న యాదవ సామాజికవర్గానికి చెందిన ఒక నేతను వైకాపా గూటికి తేవడానికి ఇప్పటికే రంగం సిద్ధమైపోయింది. అలాగే వరం ఏరియాలో మటన్‌ షాపు ఎర్రయ్య కుమారులు వైకాపాలో పద్మావతి గ్రూపులో కొనసాగుతున్నారు. ఇప్పుడు టీడీపీ గూటికి చేరిన వరం కుటుంబ సభ్యుల చుట్టూ ఉన్న నాయకులను వైకాపాలోకి తీసుకురావడానికి బలమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో తప్పులేదు. రాజకీయాల్లో ఇది సహజం. కాకపోతే పార్టీ మారిన వరం కుటుంబ సభ్యుల మీద వ్యక్తిత్వ హననానికి వైకాపా నాయకులు సోషల్‌ మీడియా వేదికగా పాల్పడుతున్నారు. ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావు పోటీ చేసినా, సవలాపురపు రమణమాదిగ పోటీ చేసినా పదవుల కోసమే. ఎవరికి ఏ పార్టీలో బెర్త్‌ ఖాళీ ఉంటే అక్కడ కర్చీఫ్‌ వేసుకుంటారు. అంతే తప్ప సిద్ధాంతాలు, మేనిఫెస్టోలు, నచ్చాయని చెప్పడం ఆత్మవంచనే. ధర్మాన ప్రసాదరావు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్‌ భూస్థాపితం అయిపోయిందని తెలుసుకున్న తర్వాతే వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. అందువల్ల వైకాపా నాయకులు వండి వారుస్తున్న సందేశాలను సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేయడం సరికాదని పలువురు భావిస్తున్నారు. దరిద్రమేమిటంటే.. తెలుగుదేశానికి ఓటేయాలని తిరుగుతున్న నాయకులే వరం వారసుల మీద సందేశాలు తయారుచేసి, వైకాపా నాయకుల ద్వారా ట్రోల్‌ చేయిస్తున్నారు. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నవారైనా భవిష్యత్తులో అదే పార్టీలో ఉంటారన్న గ్యారెంటీ లేని రోజులివి.

 
 
 

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page