
ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించకపోతే జనవరి 10వ తేదీ తర్వాత ‘కేష్‌లెస్’ వైద్యసేవలు కొనసాగిం చలేమని తెలంగాణ హాస్పిటల్స్ అసోసియేషన్ కూడా ఆ రాష్ట్రప్రభుత్వానికి విన్నవించుకుంది. ఆంధ్ర ప్రదేశ్‌లో అయితే ఆరేడు సంవత్సరాలుగా ఈ విన్నపాలు సాగుతూనే వున్నాయి. అప్పుడు జగన్ ప్రభు త్వం, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఈ విన్నపాలు ‘చెవిటివాని ముందు శంఖం ఊదినట్టే’ వున్నాయి. ముఖ్యమంత్రులు అపుడపుడు ముష్టి వేస్తున్నట్టు బకాయిల్లో కొంత కొంత విదిలిస్తున్నారు. చేసిన సేవలపై బకాయిలు తీర్చాలని తరచు సమ్మె నోటీసులు ఇవ్వడం వల్లా డాక్టర్లూ, పదే పదే అడిగించుకోవడం వల్ల ప్రభుత్వాలూ డిగ్నిటీని కోల్పోతున్నాయి. ఈ రెండు పక్షాలకూ ఒకరి మీద ఒకరికి విశ్వాసం, గౌరవ మర్యాదలు సన్నగిల్లుతున్నాయి. ఇందువల్ల అంతిమంగా నష్టపోయేది ప్రజలే! ఆస్పత్రులను డాక్టర్లను డబ్బు లాగేసే వ్యవస్థగా ప్రజలు ఒక విధమైన శత్రుభావాన్ని పెంచుకుంటున్నారు. కరోనా భూతం విరు చుకుపడిన సమయంలో పాలకులకు, నాయకులకు, సంపన్నులకు పేదలకు - డాక్టర్లు ఆకస్మికంగా దేవుళ్లు దేవతలు అయిపోయారు. ఆ మహమ్మారి మాయం కాగానే మళ్లీ పాత కథ మొదలైంది. ఇందుకు మూలం వైద్య ఖర్చులకు, ప్రజల ఆదాయాలకు పొంతన లేకపోవడమే! మైండ్ సెట్ మార్చుకున్న మధ్య తరగతి వర్గాలు తమ బడ్జెట్‌లో వైద్య ఖర్చులను ఒక భాగంగా చేసుకుని హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకో వడం వల్ల అలాంటి వారికి చికిత్సల భారంలేదు. దిగువ ఆదాయవర్గాల ప్రజలను ప్రభుత్వాలే ఆరోగ్యశ్రీ లో చేర్చడం వల్ల వారికి కూడా ఆర్ధిక భారాలు లేవు. ఆయితే ఈ భారాలన్నీ ఆరోగ్యశ్రీ చికిత్సలు చేసిన హాస్పిటల్స్ మీదే పడుతున్నాయి. జీతాలు, కొనుగోళ్లు, అద్దెలు, అప్పులు, వడ్డీలు పెనుభారమై వైద్య చికిత్సలు చేసుకోవలసిన డాక్టర్లు ఫైనాన్షియల్ మేనేజిమెంటుతో చికాకు పడిపోతున్నారు. ప్రభుత్వాన్ని బూతులు తిట్టుకుంటున్నారు. తీరని బాకీలను ఇంకా పెంచుకునే ధైర్యంలేక ‘మా దగ్గర ఆ డాక్టర్ లేరు. ఈ సదుపాయం లేదు’ అని ఆరోగ్యశ్రీ పేషెంట్లను చేర్చుకోవడం లేదు. కొద్ది మంది డాక్టర్లయితే తెగించి డబ్బు కడితేనే వైద్యం అని తేల్చి చెపుతున్నారు. దీంతో ఆరోగ్యశ్రీ పేషెంట్లు బిక్కచచ్చిపోయి ఆస్పత్రులకు వెళ్తున్నారు. ఇదంతా ప్రభుత్వానికి, పాలకులకు తెలియనిది కాదు. డబ్బు సమస్యలు ఎప్పుడూ వున్నవే! ఎప్పటికీ వుండేవే! అయినా వ్యక్తులకు నేరుగా ప్రయోజనం ఇచ్చే ఒక్క సంక్షేమ పధకం కూడా ఆగలేదు. మరి దిగువ ఆదాయవర్గాల వారికి భరోసా ఇచ్చే ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎందుకు చిన్న చూపు చూస్తు న్నారు? బడ్జెట్‌లో 2 శాతం మాత్రమే వున్న ఆరోగ్యశ్రీని ఎప్పుడూ అప్పుల్లోనే వుంచడానికి కారణం నిధు లు లేకపోవడమేనంటే నమ్మమంటారా? ఆరోగ్యపరిస్ధితులు బాగోలేవు. ప్రపంచవ్యాప్తంగా అక్కడక్కడా అంతుచిచ్చని వైరస్ ప్రజల్ని భయపెడుతున్నాయి. ఏ కారణంగా ఎక్కడ ఎక్కడ అకాలమరణాలు వెల్లు వెత్తుతున్నాయో అధ్యయనాలు కూడా ప్రారంభమే కాలేదు. ఇపుడు మళ్లీ ఒక చైనా వైరస్ ఆసియా దేశా లను చుట్టుముట్టేస్తోంది. ఇదే గనుక విజృంభిస్తే ‘మేమున్నాము మీకేమి భయంలేదు’ అని భరోసా ఇవ్వడానికి ఏ డాక్టరైనా ముందుకి వస్తారా? తక్షణ చికిత్సలకు మందులు భద్రపరచగల కొనుగోలు శక్తి ఏ డాక్టర్‌కి వుంటుంది. గతంలో కరోనాకి అడ్డంపడిన స్ఫూర్తిని, బాధ్యతను ఆరోగ్యశ్రీ దెబ్బతగిలిన ఏ డాక్టరైనా ఏ ఆస్పత్రి అయినా స్వచ్ఛందంగా తీసుకోగలుగుతారా? ప్రాణాన్ని నిలబెట్టిన వ్యక్తిగతమైన సంతృప్తి, ఆత్మానందము ఏ డాక్టర్‌కైనా మిగులుతాయా? ప్రభుత్వ అలసత్వమే నిర్లక్ష్యమో, డాక్టర్లకేంటి అనే దృక్పధమో తప్ప ఆరోగ్యశ్రీ బకాయిలు కొండలా పెరిగిపోతూండటానికి మరో పెద్ద కారణం కని పించదు. డాక్టర్లకు ఇది కేవలం డబ్బు సమస్య మాత్రమే కాదు. డబ్బుతో పాటు డాక్టర్ల గౌరవ మర్యాద లు డిగ్నిటీ? చిన్నబుచ్చుకుంటున్న సమస్య. అవసరానికి వైద్యం చేసి డబ్బుకోసం లేదు లేదు అనిపిం చుకుంటున్న ఆత్మగౌరవ సమస్య! ఎందరికో మేలు చేసే ఆరోగ్యశ్రీ పథకం మీద మీకు నమ్మకమూ, గౌరవమూ లేకపోతే ఎలా? అందులో మంచి మీరు తీసుకుని చెడు డాక్టర్లకు పులిమెయ్యడం ఏ విధంగా సమంజసం? ఆరోగ్యశ్రీ నియమ నిబంధనలను అతిక్రమించిన ఆస్పత్రుల మీదా డాక్టర్ల మీదా కఠినమైన చర్యలు తీసుకోవలసిందే! అదే సమయంలో కనీసం మూడు నెలలకైనా బకాయిలు పూర్తిగా చెల్లించే ఏర్పాటు కూడా చేయవలసిందే!! ముఖ్యమంత్రులూ! ఆరోగ్యశ్రీ ఆస్పత్రులను ఆర్ధిక సమస్యల నుంచి బయటపడెయ్యండి! డాక్టర్ల డిగ్నిటీని నిలబెట్టండి! ప్రభుత్వము, నాయకులు, ఆస్పత్రులు, డాక్టర్లు, పేషెంట్ల మధ్య పరస్పర గౌరవ మర్యాదలు పెరిగే వాతావరణాన్ని తీసుకురండి!!
Comments