పవన్ కళ్యాణ్ ఆశయాలు ఆలోచనలను కొనసాగిద్దాం
నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు స్వాతిశంకర్
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)

రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి నడుము బిగించి ముందుకు సాగుతున్న మహోన్నత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అని నిరూపించుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ అన్నారు. జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకొని సోమవారం బైరిసింగుపురంలో సిక్కోలు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో, శ్రీకాకుళం నగరంలోని ఇందిరా విజ్ఞాన్ భవనంలో జాడ సాయి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు, ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న స్వాతి శంకర్ మాట్లాడుతూ కోట్ల రూపాయల ఆదాయాన్ని, సుఖవంతమైన సినీ జీవితాన్ని వదులుకుని ప్రజల కోసం నిలబడిన నిజమైన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. పవన్ కళ్యాణ్‌పై కొందరు వ్యక్తిగత దాడులు చేశారని, అయినా అవమానాలను, దాడులను తట్టుకుని నిలబడిన పోరాట యోధుడు ఆయనని వివరించారు. చీకటిపాలనను అంతం చేసే క్రమంలో ఓటు చీలనివ్వబోమని మొదట చెప్పిన వ్యక్తి పవన్ అని, వైకాపా ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి పవన్ కళ్యాణ్ చూపిన తెగువ మరువలేనిదన్నారు. దేశంలో ఏ నాయకుడు ఆలోచించని విధంగా తన పుట్టినరోజున రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటాలని పిలుపునిచ్చిన గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి పవన్ అని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా అడవులను పెంచాలని, ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని పవన్ కోరారని, పలాసలో అడవులను పెంచేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైందన్నారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు పాఠశాలల్లో, కళాశాలలో మొక్కలు అధికంగా నాటుతున్నారని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. యువత ముందుకు వచ్చి రక్తదాన శిబిరాలు కూడా నిర్వహించడం అభినందనీయమన్నారు. గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తూ, రాష్ట్రంలో ఒక్క రోజులోనే 13వేల గ్రామసభలు నిర్వహించిన ఘనత పవన్ కళ్యాణ్‌కి దక్కుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కనీవినీ ఎరుగని విధంగా 21 ఎమ్మెల్యేలు, రెండు ఎంపీ సీట్లు గెలిచికొని దేశ రాజకీయాల్లోనే ఒక గొప్ప చరిత్రను సృష్టించారని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ఆశయాలను, ఆలోచనలను సాధించే దిశగా ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, మొక్కలు నానడం వంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించిన వీర మహిళలకు, జనసేన నాయకులకు, జనసైనికులకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.
Comments