
డిన్క్, సింక్, డిన్క్వాడ్ ఈ పదాలు విన్నారా? ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు యువతరం గ్రూపుల్లో చక్కెర్లు కొడుతున్న పదాలు. మీరూ ఓసారి గూగుల్ చేయండి. డిన్క్ (డబుల్ ఇన్కమ్ విత్ నో కిడ్) తరహా ఆలోచన ఉన్నవారు భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుంటారు. వారిలో కొంతమందికి పిల్లలు కనే తీరుబడి ఉండదు. మరికొందరిలో ఆర్థికంగా స్థిరపడిన తర్వాత చూద్దాంలే అన్న భావన ఉంటుంది. మరి కొందరిలో పిల్లలపై ఆసక్తి అస్సలు ఉండదు. వీకెండ్స్‌లో ఇరువురు సంతోషంగా విహార యాత్రలు చేస్తూ కాలం గడిపేయాలన్న తీరు వీరిది.
యునైటెడ్ స్టేట్స్ సెన్సస్ బ్యూరో ఆధారంగా ఫోర్బ్స్ చెప్పినదాని బట్టి 2023 నాటికి అమెరికాలో 42 శాతం వివాహితులు ఈ తరహా గ్రూపులో ఉన్నట్టు నివేదికలు చెప్తున్నాయి. ఇది ఆ ముందు ఏడాది కంటే 7 శాతం ఎక్కువ. అయితే కెరీర్ దృష్ట్యా పిల్లలు వద్దు అనుకునేవారు ఇందులో లేకపోలేదు. కాస్త మంచి కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చి ఒక మోస్తరు జీతం వచ్చేవరకు వేచి చూడాలనుకున్నవారు కొందరు. ఇక రెండో కేటగిరీ వారు సింక్స్ (సింగిల్ ఇన్కమ్ విత్ నో కిడ్స్). వీరు పిల్లలు వద్దు అనుకోవడానికి కారణం కేవలం ఆర్థికపరమైన సమస్యలు. ఇద్దరిలో ఒక్కరు తెచ్చే జీతంతో పిల్లల్ని పెంచి, చదివించలేమన్న భయం వీరిది. మరొకరికి ఉద్యోగం వచ్చాక చూద్దాంలే అనుకుంటూ ఉంటారు. మూడో వర్గం వారు డిన్క్వాడ్ (డబుల్ ఇన్కమ్ విత్ నో కిడ్స్ బట్ విత్ ఏ డాగ్). వీరు డిన్క్ మాదిరిగానే ఇద్దరు ఉద్యోగాలు చేస్తుంటారు. పిల్లలు లేకుండా ఓ కుక్కను పెంచుకుంటారు. దాన్ని పిల్లలతో సమానంగా చూసుకుంటారు. అయితే అది కుక్క మాత్రమే కానక్కర్లేదు. మరే ఇతర పెంపుడు జంతువైన కావొచ్చు.
..ఇది మొత్తానికి విశ్వవ్యాప్తంగా యువకుల్లో ఉన్న ఆలోచన. ఈ తరహా ఆలోచన ఇప్పుడిప్పుడే మన దేశంలో కూడా పెళ్ళైన వారిలో మొదలయింది. ఒకప్పుడు ఆఫిస్ నుంచి ఇంటికి వచ్చాక పిల్లలతో ఆడుకోవాలని, వారితో గడపాలని అనుకునేవారు. పిల్లలు ఇళ్లలో తిరిగితే ముచ్చట పడేవారు. ఇప్పుడు ఇన్ఫోసిస్ మూర్తి గారి దయవల్ల రోజుకు 12 గంటలకు పైగా పని చేయాల్సిన దౌర్భాగ్యం. సాఫ్ట్‌వేర్‌లో నిరంతరం మారుతున్న డైనమిక్స్ మరోవైపు. ఈ రోజు నేర్చుకున్నది రేపటికి పాతది అయిపోతుంది. నిరంతరం అప్‌డేట్ అవ్వాలి. కొత్త టెక్నాలజీ తెలుసుకోవాలి. కంపెనీలు తరుచూ మారుతుండాలి. లక్షల్లో తీసుకున్న బ్యాంక్ అప్పుకీ నెలసరి వాయిదాలు కట్టాలి. ఇచ్చిన ప్రాజెక్టు గడువులో పూర్తిచేసి తీరాలన్న ఒత్తిడి. ఇన్నింటి మధ్య పిల్లలు అవసరమా అన్న ఫీలింగ్ ఒకటయితే, ఇద్దరూ ఉద్యోగాలకు పోతే వారిని ఎవరు చూసుకుంటారన్న అనుమానం మరొకటి. ఏదైతేనేం ఇప్పుడు పిల్లలు వద్దు.. ఎలాగో ప్రస్తుతం ఇలా గడవని అనుకున్నవారే ఎక్కువ. దీనివల్ల దేశంలో వృద్ధాప్యపు రేటు పెరిగి పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. ఇదే ఇప్పుడు అన్ని దేశాలలో సమస్య.
- సీహెచ్ దుర్గాప్రసాద్
Comments