(10న ప్రపంచ దృష్టి దినోత్సవం)
‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం’ అన్నారు. ఈ అందమైన ప్రపంచాన్ని చూసే హక్కు ప్రతిఒక్కరికి ఉంది. మరి పుట్టినప్పటి నుంచి ఈ ప్రపంచం నుంచి శాశ్వతంగా దూరం అయ్యే వరకు మన కళ్లను ఎంతో భద్రంగా చూసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఏడాది ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా ‘మీ కళ్లను ప్రేమించండి పసివాళ్ళుగా’ అనే నినాదంతో ప్రపంచవ్యాప్తంగా కంటి సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ప్రపంచ దృష్టి దినోత్సవం చరిత్ర:
ప్రపంచ దృష్టి దినోత్సవం అనేది అంధత్వం, దృష్టి లోపం గురించి అవగాహన పెంచడంపై దృష్టి సారించడానికి ఏటా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ప్రత్యేక వార్షిక దినోత్సవం. ఈ దినోత్సవాన్ని మొదటిగా లైన్స్ క్లబ్ ఫౌండేషన్ స్థాపించింది. దీనిని మొదటిసారిగా 1984లో జరుపుకున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత అంతర్జాతీయ అంధత్వ నివారణ సంస్థ(ఐఎపిబి)తో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఈ ప్రయత్నానికి సహకరించింది. ఐఎపిబి అనేది గ్లోబల్ కూటమి. దీనిలో 100 కంటే ఎక్కువ దేశాల నుంచి వివిధ రకాల స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీవోలు కలసి పనిచేసి ప్రతి వ్యక్తికి అవసరమైన కంటి సంరక్షణ ప్రాప్యత ఉన్న ప్రపంచాన్ని సృష్టించారు. ప్రతి ఏడాది అక్టోబర్ రెండవ గురువారం ప్రపంచ దృష్టి దినంగా పాటిస్తూ ప్రపంచవ్యాప్తంగా కంటి ఆరోగ్యం ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాలు వ్యాసరచన పోటీలు, డ్రాయింగ్, పెయింటింగ్, ఫొటోస్, చెట్లు నాటడం వంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్యపరుస్తున్నారు.
మీ చిన్నారులలో గమనించండి :
అప్పుడే పుట్టిన బిడ్డ విషయంలో కంటి సంరక్షణలో తల్లి పాత్ర చాలా కీలకం. బిడ్డ కళ్లను పరిశుభ్రంగా ఉంచి వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. తల్లి పుట్టిన బిడ్డ కళ్లను గమనిస్తూ కదలికలను కూడా నిదానంగా గమనిస్తూ ఉండాలి. తన మొదటి స్తన్యాన్ని తప్పనిసరిగా బిడ్డకు ఇవ్వాలి. కళ్లల్లో ఎటువంటి మార్పులు గమనించినట్లయితే వెంటనే వైద్యుని సంప్రదించాలి. చిన్నారులు పాఠశాలకు వెళ్లక ముందు ఇంటి వద్ద వారి విషయంలో భద్రత చాలా అవసరం. వేడిగా, వాడిగా ఉన్న వస్తువులు వారికి అందుబాటులో ఉంచరాదు. వారి కళ్లలో మెల్ల ఉన్నా, ఏదైనా వస్తువును గమనించేటప్పుడు ఇబ్బందికరంగా చూస్తున్నా వెంటనే నేత్రవైద్యుని సంప్రదించాలి. ఐదేళ్ల లోపు చిన్నారులకు ఒకసారి సాధారణ కంటి పరీక్ష తప్పనిసరిగా చేయించాలి. ఇక పాఠశాలకు వెళ్లే విద్యార్థులు బ్లాక్‌బోర్డ్‌పై ఉన్న అక్షరాలు చూడటంలో ఇబ్బంది ఉన్నా, పుస్తకాన్ని దగ్గరగా చూస్తున్నా, టీవీని దగ్గరకు వెళ్లి చూస్తున్నా, ఏదైనా వస్తువును గమనించినపుడు వంకరగా చూస్తున్నా వెంటనే నేత్రవైద్యుని సంప్రదించాలి. విద్యార్థి దశలో ప్రతి ఏడాది కంటి పరీక్ష చేయిస్తూ వారి చూపుని పరిరక్షించాలి. దృష్టిలోపం ఉన్నట్లయితే తప్పనిసరిగా నిత్యం కళ్లద్దాలు పిల్లలు ధరించినట్లు తల్లిదండ్రులు బాధ్యత వహిస్తూ వైద్యుని సలహాలు పాటిస్తూ ఉండాలి. కళ్లలో ఏదైనా వ్యర్థపదార్థం పడినా, గాయమైనా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించాలి.
ఆధునిక జీవనశైలి- కంటిచూపుపై దుష్పరిణామాలు
పూర్వం తల్లి చందమామని చూపిస్తూ ఆహారం తినిపించేది. ఇప్పుడు సెల్‌ఫోన్ చూపిస్తూ ఆహారం తినిపిస్తున్నారు. పసిబిడ్డల కళ్లలో అతి సున్నితమైన రెటీనాపై ప్రసరించే రేడియేషన్ వల్ల కంటిచూపు త్వరితగతిన మందగించే ప్రమాదం ఉంది. అలాగే పిల్లలు ఎక్కువగా సెల్‌ఫోన్ చూడడం, వీడియో గేమ్స్ ఆడడం వల్ల మెల్లకన్ను, దృష్టి లోపంతో పాటు వారి మానసిక ప్రవర్తనలో మార్పులు వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల వీలైనంత వరకు పిల్లలకు సెల్‌ఫోన్ అందుబాటులో ఉంచరాదు. ఇక సాఫ్ట్‌వేర్ రంగంలో పని చేసేవారు, కళాశాలలో చదువుకునేవారు కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ ఉపయోగించినపుడు కళ్ల పట్ల శ్రద్ధ వహించాలి. స్క్రీన్‌పై వెలుతురు పడకుండా, కంటిపై నేరుగా గాలి తగలకుండా, కళ్లకు మధ్యలో విశ్రాంతినిస్తూ అవసరమైతే వైద్యులు సూచించిన కంటి చుక్కల మందు ఉపయోగిస్తూ కళ్లను పరిరక్షించుకోవాలి.
పెద్దలు, వయోవృద్ధుల్లో తీసుకోవలసిన భద్రత:
35 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతిఒక్కరికి చదివేటప్పుడు ఇబ్బందికరంగా ఉంటుంది. నేత్రవైద్యలు సూచించిన కళ్లద్దాలు తప్పనిసరిగా ధరించాలి. మీకు మధుమేహం, రక్తపోటు ఉన్నట్లయితే ప్రతి ఏడాది తప్పనిసరిగా నేత్ర వైద్యుని సంప్రదించాలి. దీనివలన మీరు శాశ్వత అంధత్వానికి గురికాకుండా మీ కళ్లను కాపాడుకోవచ్చు. కుటుంబంలో ఎవరికైనా గ్లకోమా వ్యాధి ఉన్నట్లేనా ప్రతి ఏడాది మీకు సంపూర్ణ కంటి పరీక్ష తప్పనిసరి. వైద్యులు మందులు సూచిస్తే క్రమం తప్పకుండా వాడుతూ ఎప్పటికప్పుడు నిపుణులను సంప్రదిస్తూ ఉండాలి. మీ కళ్లను నిత్యం పరిశీలిస్తూ కంటి పరీక్షలు చేసుకున్నట్లయితే అవి జీవితాంతం మిమ్మల్ని కాపాడుతాయి.
ఒత్తిడితో కూడుకున్న జీవన శైలి మీ కంటిపై ప్రభావం చూపిస్తుంది, ముఖ్యంగా నలభై ఏళ్లు పైబడగానే బీపీ, మధుమేహ వ్యాధికి గురవుతున్నారు. నిర్లక్ష్యం వహిస్తే శాశ్వతంగా చూపు కోల్పోయి ప్రమాదం ఉందని గమనించండి. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండండి.
వృద్ధుల్లో నేత్ర పర్యవేక్షణ:
60 సంవత్సరాలు దాటిన చాలామందికి సాధారణంగా శుక్లాలు, అనగా కేటరాక్ట్ వస్తుంది. కేటరాక్ట్ ఉన్నవారు శస్త్ర చికిత్సతో మాత్రమే తిరిగి చూపు పొందవచ్చు. శస్త్రచికిత్స అనంతరం వైద్యుని పర్యవేక్షణలో తప్పనిసరిగా ఆరు వారాల వరకు వైద్యులు సూచించిన మందులు ఉపయోగించాలి. కళ్లను ప్రేమతో కాపాడుకోండి.. అవి జీవితాంతం మిమ్మల్ని కాపాడతాయి.
కంటి సంరక్షణతో మెరుగైన చూపు

మీ కళ్లను ఎప్పుడూ సురక్షితంగా ఉంచటం వల్ల మీరు కంటి ఆరోగ్యంతో, చిన్నారుల కంటి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్ల వారు జీవితాంతం మెరుగైన కంటిచూపుతో జీవిస్తారు. తల్లిదండ్రులు చిన్నారులను పాఠశాలలో చేర్చే ముందు నేత్ర వైద్యునితో తప్పనిసరిగా దృష్టి పరీక్ష చేయించాలి. మధుమేహ వ్యాధి, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, 40 సంవత్సరాలు పైబడిన వారు ప్రతి ఏడాది తప్పనిసరిగా నేత్రవైద్య నిపుణులను సంప్రదించడం వల్ల శాశ్వత అంధత్వానికి గురికాకుండా ఉంటారు.
ఎంఆర్‌కే దాస్, ఆప్తాలమిక్ అధికారి,
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, డీజీ పురం, సంతబొమ్మాళి మండలం
Comments