top of page

మంకీపాక్స్‌తో ముప్పెంత?

Writer: DV RAMANADV RAMANA

కరోనా తర్వాత ప్రపంచాన్ని దాదాపు అదే స్థాయిలో మరో వైరస్‌ భయపెడుతోంది. దాదాపు అదే వేగంతో విస్తరిస్తోంది. మంకీపాక్స్‌ లేదా ఎంపాక్స్‌ అని వ్యవహరిస్తున్న ఈ వైరస్‌ భారత్‌తో సహా ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. నాలుగేళ్ల క్రితం కరోనా ప్రభావంతో లక్షలాది మరణాలను చూసిన ప్రజలు మంకీపాక్స్‌ వల్ల కూడా తీవ్ర ముప్పు ఉంటుందేమోనని భయపడుతున్నారు. ఇప్పటికే ఈ వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా 116 దేశాలకు విస్తరించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించింది. 2022 నుంచే.. అంటే రెండేళ్ల లోనే ఈ వ్యాప్తి జరిగిందని, లక్ష కేసులు నమోదయ్యాయని వెల్లడిరచింది. ఇప్పటివరకు 537 మరణాలు సంభవించాయి. కాగా మన దేశంలో రెండేళ్లలో 30 ఎంపాక్స్‌ కేసులు నమోదయ్యాయి. మరణాలు మాత్రం లేవు. గత మార్చిలో చివరి కేసు నమోదు కాగా.. ఆ తర్వాత ఇంతవరకు కేసులు నమోదు కాలేదు. సరికొత్త భయాలు నెలకొన్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన హెల్త్‌ అడ్వయిజరీ కాస్త ఊరట కలి గించేలా ఉంది. కోవిడ్‌ తరహాలో ఈ వైరస్‌ అత్యంత ప్రమాదకారి కాదని పేర్కొంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చని స్పష్టం చేసింది. కోవిడ్‌ తరహాలోనే ముందు జాగ్రత్త చర్యలు తీసుకో వాల్సి ఉంటుందని వివరించింది. భారత్‌లో దీని ప్రభావం అంతగా లేదని పేర్కొంది. అయితే పొరుగుదేశమైన పాకిస్థాన్‌కు ఈ వైరస్‌ పాకడంతో భారత ప్రభుత్వం హెల్త్‌ అలెర్ట్‌ జారీ చేసింది. 1958లో తొలిసారి ఈ వైరస్‌ను కోతుల్లో గుర్తించారు. 1970లో తొలిసారి ఓ మనిషిలో ఈ వైరస్‌ లక్షణాలు గుర్తించారు. కోతుల నుంచి వచ్చింది కనుక దీనికి మంకీపాక్స్‌ అనే పేరు పెట్టారు. ఎక్కువగా ఆఫ్రికా దేశాల్లోని మారుమూల ప్రాంతాల్లో మంకీపాక్స్‌ కేసులు భారీగా నమోదయ్యేవి. 2022 నుంచి వైరస్‌ విస్తరణ వేగం పుంజుకుని ఒక దేశం నుంచి మరో దేశానికి వ్యాపిస్తుండటంతో ప్రపంచం ఉలిక్కిపడిరది. అప్పటినుంచే శాస్త్రవేత్తలు కూడా దీనిపై దృష్టి సారించి చికిత్స, నియంత్రణ చర్యలపై పరిశోధనలు ప్రారంభించారు. వైరస్‌ సోకిన వారికి శరీరంపై పొక్కులు ఏర్పడటం, జ్వరం, గొంతు ఎండిపోవడం, తల కండరాల నొప్పులు, వెన్నునొప్పి, నిస్సత్తువ వంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. మందులు తీసుకున్నా, తీసుకోకపోయినా రెండు నుంచి నాలుగు వారాలపాటు వైరస్‌ ప్రభావం చూపించి, ఆ తర్వాత తగ్గిపోతుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిని ఇది అధికంగా బాధిస్తుంది. కొన్ని సందర్భాల్లో మరణానికి కూడా దారితీస్తుందంటున్నారు. వైరస్‌ శరీరంలోకి ప్రవే శించిన తర్వాత ఒకటి నుంచి 21 రోజుల్లోపు దాని ప్రభావం కనిపించడం మొదలవుతుంది. కరోనా మాదిరి గానే ఈ వైరస్‌ బారిన పడకుండా ఉండాలంటే పరిశుభ్రంగా ఉండాలి. కాళ్లూచేతులు శుభ్రంగా కడుక్కోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మంకీపాక్స్‌ వైరస్‌లో రెండు వేరియంట్లు ఉన్నాయి. వీటిని క్లాడ్‌`1, క్లాడ్‌`2గా వ్యవహరిస్తున్నారు. క్లాడ్‌`2 కంటే క్లాడ్‌`2 వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. న్యుమో నియా, బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్లు, శ్వాసకోస సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. దీనివల్ల మరణాల రేటు గరిష్టంగా పది శాతం వరకు ఉంటుందంటున్నారు. తక్కువ ప్రమాదస్థాయి కలిగిని క్లాడ్‌`2 వేరియంట్‌ వల్ల శరీరంపై పొక్కులు ఏర్పడతాయి. జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనివల్ల సంభవిస్తున్న మరణాల రేటు ఒక్క శాతం కంటే తక్కువే. ఎక్కువ ప్రమాదకారి అయిన వేరియంటే ఇప్పుడు విస్తరిస్తోంది. లైంగిక సంబంధాల వల్ల ఇది వ్యాప్తి చెందుతుందంటున్నారు. నేరుగా ఒకరినొకరు తాకడంతో పాటు నోరు, ఇతర అవయవాల నుంచి వచ్చే స్రవాల వల్ల ఇది వ్యాపిస్తుంది. తాజాగా ఈ వైరస్‌ మన పొరుగున ఉన్న పాకిస్థాన్‌కు వ్యాపించి నట్లు గుర్తించారు. దాంతో మనదేశంలోకి కూడా ప్రవేశించవచ్చన్న ఉద్దేశంతో కేంద్ర ఆరోగ్యశాఖ అన్ని రాష్ట్రా లను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. పాకిస్థాన్‌లోని కూబర్‌ ఫక్తుంఖ్వాకు చెందిన ఒక వ్యక్తి ఇటీవల సౌదీ అరేబియా నుంచి తిరిగివచ్చాడు. అతనిలో ఎంపాక్స్‌ లక్షణాలు కనుగొన్నారు. దాంతో మనదేశంలోనూ అన్ని ఎయిర్‌పోర్టుల్లోనూ తనిఖీలు పటిష్టంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ముఖ్యంగా బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ సరిహద్దులపై దృష్టి సారించాలని సూచించింది. చర్మంపై దద్దుర్లు వంటి కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది. ఈ లక్షణాలు కనిపించిన వారిని ఐసొలేషన్‌లో ఉంచాలని రాష్ట్రాలకు సూచించింది. కరోనా సమయంలో నిర్వహించినట్లు అన్ని ఆస్పత్రుల్లోనూ ప్రత్యేక వార్డు లు సిద్ధం చేయాలని ఆదేశించింది. ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా నేతృత్వంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి అన్ని రాష్ట్రాలకు గైడ్‌లైన్స్‌ పంపారు. ఎంపాక్స్‌ చికిత్స కోసం రాష్ట్రాల స్థాయిలో ప్రత్యేక ఆస్పత్రులను గుర్తించాలని సూచించింది. అలాగే కరోనా సమయంలో చేసినట్లే అనుమానితులకు ఆర్టీ పీసీఆర్‌ టెస్ట్‌లు చేయించాలని, అందుకోసం పరీక్ష కేంద్రాలను సిద్ధం చేసుకోవాలని చెప్పింది. ఇక కేంద్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఎంపాక్స్‌ వేరియంట్లను గుర్తించేందుకు 32 టెస్టింగ్‌ ల్యాబ్‌లు పని చేస్తున్నాయని వెల్లడిరచింది. అయితే దీనిపై భయపడాల్సిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉంటే చాలని ఢల్లీిలోని సఫ్దర్‌ జంగ్‌ ఆస్పత్రి కమ్యూనిటీ మెడిసిన్స్‌ విభాగాధిపతి డాక్టర్‌ జుగల్‌ కిషోర్‌ అన్నారు. యూరప్‌, ఆఫ్రికా దేశాల్లోనే దీని వ్యాప్తి అధికంగా ఉందని, ఆసియా దేశాల్లో దీని ప్రభావం పెద్దగా లేదని ఆయన చెప్పారు. అయినా ముందుజాగ్రత్తలు మాత్రం తప్పనిసరి అని స్పష్టం చేశారు.

 
 
 

Kommentare


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page