మూకుమ్మడి చైతన్య ఫలితం
- DV RAMANA
- Nov 30, 2024
- 2 min read

ఎవరూ పెద్దగా విశ్లేషణలకు పోవడంలేదు గానీ.. ఇథనాల్ ఫ్యాక్టరీని తరలిస్తాం లేదా రద్దు చేస్తాం అనే తెలంగాణ ప్రభుత్వ ప్రకటనకు ప్రాధాన్యం ఉంది. జనమంతా ఒక్కటై తిరగబడితే ప్రభుత్వాలు వెనక్కి తగ్గకతప్పదని చెప్పే తాజా ఉదాహరణ ఇది. ఆ ఫ్యాక్టరీ వల్ల నాలుగైదు గ్రామాలు సమస్యలు ఎదుర్కొంటాయి. అన్ని ఊళ్లూ ఏకమయ్యాయి. ఆడా మగా పిల్లా పీచూ అందరమూ కలిసి బైఠాయిం చారు. పోలీసులపైకి రాళ్లు విసరడం, ఆర్డీవో సహా అధికారులను గంటల తరబడి నిర్బంధించడాన్ని మనం సమర్థించలేం గానీ.. ప్రజల్లో రగులుతున్న కోపానికి అది ఓ సూచిక. తెలంగాణ లగచర్లలో కలెక్టర్‌పై దాడి, దిలావర్‌పూర్‌లో ఆర్డీవో నిర్బంధం, పోలీసులపై దాడి వంటి సంఘటనలు సొసైటీలో నిర్బంధ భూసేకరణ, కాలుష్య కారక పరిశ్రమల పట్ల జనంలో పెరుగుతున్న అసహన తీవ్రతను సూచిస్తున్నాయి. ప్రజాభిప్రాయానికి భిన్నంగా వెళ్తే చూసీ చూసీ జనం ఎలా తిరగబడతారో ఇది తెలియజేస్తుంది. లగచర్లలో జనవ్యతిరేకతను అణిచేయడానికి ప్రయత్నించిన ప్రభుత్వం దిలావర్‌పూర్ లో ఎందుకు తగ్గింది..? లగచర్ల అల్లర్ల వెనుక ప్రతిపక్షం ఎగదోస్తున్నదనే భావన కావచ్చు. అది ప్రభుత్వ భూసేకరణ పట్ల వ్యతిరేకత కాబట్టి కఠినంగా వ్యవహరించి ఉంటుంది. అదీ కరెక్టు కాదు, పరిహారం విషయంలో చర్చించి, నచ్చజెప్పి ఉండాల్సింది కానీ ఈ ఇథనాల్ కథ వేరు. అది ప్రైవేటు ఫ్యాక్టరీ. భూసేకరణ కాదు, అది తమ గ్రామాలకు అరిష్ట కాలుష్య కారకమని జనం వ్యతిరేకత. లగచర్ల వేరు. ఈ ఇథనాల్ బీఆర్‌ఎస్ మాజీ మంత్రి తలసాని కుటుంబానిది అని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. తన అల్లుడు, తన కొడుకు భాగస్వాములుగా ఉన్న పీఎంకే డిస్టిలేషన్స్ ఏర్పాటు చేసే ఫ్యాక్టరీ అట. ఓ ప్రైవేటు ఫ్యాక్టరీ కోసం.. అదీ బీఆర్‌ఎస్ నాయకుడి కుటుంబానికి సంబంధించిన ఫ్యాక్టరీ కోసం ప్రజావ్యతిరేకతను తను ఎందుకు ఫేస్ చేయాలనే భావనతో ప్రభుత్వం కూడా లైట్ తీసుకుని, తరలిస్తాం లేదా రద్దు చేస్తాం అనే స్పష్టమైన ప్రకటన చేసి ఉంటుంది. తరలిస్తే, వేరే గ్రామాల్లో కూడా ఇవే పునరావృతమవుతాయి కదా. సో, రద్దు చేయడమే పరిష్కారమేమో, లేదా జనా వాసాలకు దూరంగా, అన్నిరకాల కాలుష్య నివారణ జాగ్రత్త చర్యల పరిమితులు పెట్టి అనుమతించడం బెటరేమో. అయితే, తమ కుటుంబానికి ఆ ఫ్యాక్టరీతో సంబంధం లేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఖండిరచారు. సరే, ఆ వివాదాలు, విమర్శలు, ఖండనల మాటెలా ఉన్నా, నిజానిజాల మాటెలా ఉన్నా, జనంలో కనిపించిన మూకుమ్మడి చైతన్యం కచ్చితంగా విశేషమే. ఆ తిరుగుబాటు వెనుక ఎవరున్నారు అని కాదు ప్రధానం.. తమ ప్రయోజనాల రక్షణకు పల్లెలు తిరగబడి విజయం సాధించడమే అసలు విశేషం..!! దిలావర్‌పూర్‌లోను, లగచర్లలోను ప్రభుత్వం వెనుకకు తగ్గింది. ఇందుకు ఉద్యమకారులైన ప్రజలను, ఆలస్యంగా అయినా ప్రజల స్పందనను గుర్తించినందుకు ప్రభుత్వాన్ని అభినందించాలి. గ్రీన్, వైట్, కాకపోతే మూడు రంగుల ఫార్మా లేదా ఇథనాల్ పేరుతో ప్రభుత్వం కొత్త ఎత్తుగడతో ముందుకు వచ్చే ప్రమాదం లేదా అంటే, అటువంటి అవకాశం ఎప్పుడూ ఉంటుంది. మరింత నిర్బంధంతో విరుచుకుపడే ఎత్తుగడా ఎదురుకావొచ్చు. దక్కిన విజయాన్ని గుర్తించకుంటే, దానిని కాపాడుకోవడం కూడా చేయలేము. ఇది అయితే ప్రజా విజయం అవుతుంది. దానితో పాటు ప్రభుత్వం చేసుకున్న నష్ట నివారణ అవుతుంది. అంతే తప్ప, మధ్యలో బిఆర్‌ఎస్ సంబరపడదానికి ఏమీ లేదు. భుజాలు తడుముకోవాలి తప్ప, చరుచుకోగూడదు. లగచర్ల, దిలావర్ పూర్ విజయాలు తమ గెలుపులైనట్టు బిఆర్‌ఎస్ నేతలు ప్రగల్భించడం హాస్యాస్పదం. రేవంత్ ప్రభు త్వం ప్రజల మీదికి తోలిన విధానాలన్నిటినీ మొదలుపెట్టింది కెసిఆర్ ప్రభుత్వమే. ఇప్పటికీ బిఆర్‌ఎస్ ఘనకార్యాల నుంచి జనం తేరుకోలేకుండా ఉన్నారు. ప్రజల ఉద్యమాల్లో వీళ్లు తలదూరిస్తే, సమస్యలు పీటముడులు పడడం తప్ప మేలు ఉండడం లేదు. ఆత్రంగా రాజకీయ లాభం పిండుకొనడానికి వీళ్లు చేసే ప్రయత్నాలు, నిర్బంధానికి సమర్థనలుగా పనికివస్తున్నాయి. ప్రజలు పాత ప్రభుత్వం నేరాలను మరచి పోయేదాకా, అంతకుమించిన సంఖ్యలో పాపాలు కొత్త ప్రభుత్వం ఖాతాలో పడేదాకా, జనం సొంతంగా నిర్మించుకుంటున్న ఉద్యమాల జోలికి బిఆర్‌ఎస్ రాకపోవడం మేలు. అప్పటిదాకా ఎంగేజ్ కావడానికి, రేవంత్‌తో పోటాపోటీగా తిట్లపురాణం వల్లిస్తూ సోషల్ మీడియా లైకులతో తృప్తిపడడం మంచిది. శ్రీకా కుళం జిల్లాలో కూడా సోంపేట బీలభూముల్లో థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుచేయడం కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వస్తే ప్రాణాలు అర్పించి మరీ పోరాటాల పురిటిగడ్డలో కాలుష్య కారక పరిశ్రమను అడ్డుకున్నారు. ఆ తర్వాత సంతబొమ్మాళిలో మరో థర్మల్ విద్యుత్‌ప్లాంట్ కోసం ఉద్యమాలు చేసినా అడ్డుకోలేకపోయారు. లగచర్ల, దిలావర్‌పూర్ల మాదిరిదే సిక్కోలు రైతుల తిరుగుబాటు కూడా.
Comments