top of page

మాటల్లేవ్‌.. మాట్లాడుకోవడాలు లేవ్‌!!

  • Guest Writer
  • Nov 2
  • 3 min read

మూకీ సినిమా యుగం ముగిసాక టాకీ సినిమా తరం మొదలయ్యాక మన దేశంలో వచ్చిన డైలాగులు లేని మొట్టమొదటి, చిట్టచివరి సినిమా ఈ పుష్పక విమానమే ఏమో ! ప్రపంచంలోనే రెండవ సినిమా. మొదటిది 1982లో వచ్చిన అమెరికన్‌ మూవీ కోయానిస్కీయసి. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, నిర్మాణంలో భాగస్వామ్యం అంతా సింగీతం వారే.

ree

సినిమాలో కొన్ని సన్నివేశాల్ని, నటుల్ని ప్రేక్షకులు మరచిపోలేరు. కేవీ రెడ్డి గారి శిష్యరికం ఆ సన్నివేశాల సృష్టిలో తెలిసిపోతుంది. నిరుద్యోగి హీరో ఇచ్చే డబ్బుల్ని బట్టి టీ పోసే కుర్రాడు, ఆ టీలో కాకి లాగా అవీ ఇవీ వేసి గ్లాసుని నిండుగా చేసి గర్వంగా టీని సేవించటం, కమల్‌ హాసన్‌-బిచ్చగాడు పి యల్‌ నారాయణ ధన ప్రదర్శన, ఏంటిక్స్‌ షాపులో హీరోహీరోయిన్ల సైగలు, హోటలుకి పుష్పక్‌ అనే పేరు, హోటల్‌ బాల్కనీల నుండి ప్రేమాయణం, తన గదిలో బంధించబడిన కోటీశ్వరుని మలాన్ని గిఫ్ట్‌ పేకేట్టుగా చేసి బయట వదిలేయటం వంటి సీన్లను నలభై ఏళ్ళు కావస్తున్నా మరచిపోలేదు.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకొకటి అమల తండ్రి మేజిక్‌ షో. ఎంత గొప్పగా దూర్చారో సింగీతం వారు. ఆ మెజీషియన్‌ పాత్రను వేసిన నటుడి పేరు కె యస్‌ రమేష్‌. అతను నటుడు, నిర్మాత, దర్శకుడు మాత్రమే కాకుండా మెజీషియన్‌ కూడా. గొప్పగా ఎంపిక చేసుకున్నారు. మరో గొప్ప అంశం పాత్రల రాక, వాటి నిష్క్రమణ. నాటకాలలో ఎలా అయితే ఒక్కో పాత్ర ఎంటరయి, ముగింపుకి ఎలా ఒక్కోటి ఒక్కోటి నిష్క్రమిస్తాయో అలాగే నిష్క్రమిస్తాయి ఇందులో కూడా నిశితంగా పరిశీలిస్తే.

సినిమా చూస్తున్నంత సేపు డైలాగులు లేవు అని అనిపించదు. అలాంటి అద్భుతమైన బేక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్కుని అందించారు యల్‌ వైద్యనాధన్‌. ఆయనకు కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు కూడా వచ్చింది ఈ సినిమాకు. ఈనాటి ఢాం ఢాం సంగీత దర్శకులకు ఈ సినిమాని కట్టేసి చూపాలి. అలాగే ఎక్కడా బోరించదు. అంతటి బిర్రయిన స్క్రీన్‌ ప్లేకి అంతే గొప్ప ఎడిటింగుని అందించారు డి వాసు. ఆయనకు కూడా బెస్ట్‌ ఎడిటర్‌ అవార్డు వచ్చింది.

మన వాళ్ళు ఇప్పుడు పాన్‌ ఇండియా సినిమాలని ఓ డబ్బా కొట్టుకుంటూ ఉంటారు. 1987 లోనే ఇది గొప్ప పాన్‌ ఇండియా సినిమా. పలు ప్రాంతాల్లో విడుదల కావటమే కాకుండా పలు భాషల నటీనటులు నటించారు. అమల, బాలీవుడ్‌ నటులు సమీర్‌ ఖక్కర్‌, టినూ ఆనంద్‌, బ్లాక్‌బస్టర్‌ హిందీ ఆరాధన సెకండ్‌ హీరోయిన్‌ ఫరీదా జలాల్‌, తమిళ నటుడు ప్రతాప్‌ పోతన్‌, కన్నడ నటి రమ్య, తెలుగు నటుడు పియల్‌ నారాయణ, ఇలా ఎంతో మంది.

హిందీ బెల్టులో పుష్పక్‌ టైటిలుతో, తమిళనాడులో పెసం పదం టైటిలుతో, కేరళ కర్నాటకలలో పుష్పక విమానం టైటిలుతో విడుదల అయింది. అన్ని ప్రాంతాల్లో ఇప్పటి లాగా ప్రి రిలీజ్‌ శబ్ద కాలుష్యం, ప్రభుత్వాలతో తగాదాలు, టికెట్‌ రేట్ల పంచాయతీ వంటి న్యూసెన్స్‌ లేకుండా మామూలు టికెట్లతో ఢంకా బజాయించింది.

మెజీషియన్‌ కె.ఎస్‌.రమేష్‌ నటన అద్భుతం. రకరకాల విన్యాసాలతో భార్యామణిని ఆట పట్టించటం బాగా సరదాగా ఉంటుంది. అమల ముద్దుముద్దుగా నిశ్శబ్ధంగా అందమైన, నాజూకయిన నటనను ప్రదర్శించింది. టినూ ఆనంద్‌. అతని నటన ఇందులో, ఆదిత్య 369 లో మనందరం చూసిందే.

కమల్‌ హాసన్‌ తర్వాత, బహుశా ధీటుగా నటించిన నటుడు పియల్‌ నారాయణ. హీరోకి తన వద్ద దాచుకున్న డబ్బుని కాస్త కాస్త చూపటం ప్రేక్షకులు మరచిపోరు. అనాధ శవంగా చూసినప్పుడు, మునిసిపాలిటీ వాళ్ళు ఎత్తినప్పుడు చాలా సానుభూతి కలుగుతుంది. దాచుకున్న డబ్బంతా గాలికి, జనానికి పోతుంది. ఓ జీవిత సారాన్ని చూపుతాడు దర్శకుడు. అంతుంది ఇంతుంది అని విర్రవీగే ప్రతి మానవుడు అన్నీ గాలికి వదిలేసి శ్మశానం బండి ఎక్కాల్సిందే అనే శ్మశాన వైరాగ్యాన్ని ప్రవచించారు సింగీతం వారు.

మరో పాత్ర ఆ పుష్పక్‌ హోటల్‌ అధినేత ఓ చిన్న టీ స్టాల్‌ స్థాయి నుండి అంత పెద్ద స్టార్‌ హోటలుకు ఓనర్‌ ఎలా అయ్యారో రెండు సార్లు చూపుతారు. అతని ఫోటోలే హీరోకి చివర్లో స్ఫూర్తిని కలిగిస్తాయి. కుఛ్‌ దినోంకా సుల్తాన్‌ లాగా అనుభవించిన హీరోకి జ్ఞానోదయం కలిగి ఫైవ్‌ స్టార్‌ అవతారానికి ముగింపు పలికి తన బతుక్కి మరలి పోతాడు. ఏమీ కాజేయకుండా అన్నీ వదిలేసి పోయిన హీరోని చూసి కోటీశ్వరుడికి కూడా బుధ్ధి వచ్చి భార్యతో కలిసి పోతాడు.

అలా పాత్రలన్నీ నిష్క్రమిస్తాయి. చాలా నాటకీయంగా చూపారు సింగీతం వారు. అమల కూడా వెళ్ళిపోవటం, తాను ఇచ్చిన కాగితం గాలికి పోవటం, వెరశి హీరో మీద కూడా వసంత కోకిల సినిమాలో లాగా కూస్తంత జాలి కలుగుతుంది. అద్భుతమైన పాత్రల సృష్టి.

మొత్తం షూటింగ్‌ బెంగుళూరు లోని ఐటిసి వారి విండ్సార్‌ మేనర్‌ హోటల్‌లోనే జరిగింది. ఈ హోటలుకు నేను 1985/86 ప్రాంతంలో వెళ్ళాను. ఈ హోటలుకి పక్కనే ఓ వీధి సెట్టింగ్‌ కూడా వేసారట. ఈ సినిమా ఆర్ట్‌ డైరెక్టర్‌ తోట తరణిని అభినందించాల్సిందే. సినిమాటోగ్రాఫర్‌ బి సి గౌరీశంకర్‌.

ఈ సినిమాలో ప్రేక్షకులకు భలే మెప్పించే పాత్ర ఆ ఇళ్ళల్లో ఊడ్చే స్వీపర్‌ పాత్ర. ఆ స్వీపర్‌ సింగారం, వయ్యారం, వాటిని కరకర తిందామా అన్నట్లు చూసే ముసలోడు, వగైరా. నిజ జీవితంలో చాలామంది తగులుతుంటారు అలా.

12వ ఐఎఫ్‌ఎఫ్‌ఐ, షాంగై అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో ఈ సినిమా ప్రదర్శించబడిరది. ఉత్తమ చిత్రంగా, కమల్‌ హాసనుకి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్‌ అవార్డులు వచ్చాయి. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నుండి సింగీతం వారికి ఉత్తమ దర్శక అవార్డు కూడా వచ్చింది. కీర్తి, ధనం, గుర్తింపు, అన్నీ పుష్కలంగా వచ్చిన ఈ సినిమాకు సింగీతం వారి సహ నిర్మాత పేరు నాగరాజు. ఆయన మరి ఏ సినిమాను తీయలేదట.

ఇంత గొప్ప కల్ట్‌ క్లాసిక్‌ని చూడకపోతే ఎలా !? యూట్యూబులో ఉంది. తప్పక చూడండి. సినిమా రంగంలోకి కొత్తగా వచ్చిన వారు, వద్దామని అనుకునే వారు ఈ సినిమాను తప్పక చూడాలి, అధ్యయనం చేయాలి. నేర్చుకొనదగు ఎవ్వరు నేర్పిన.

- దోగిపర్తి సుబ్రమణ్యం

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page