మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. బాధ్యత లేని నిర్ణయం
- BAGADI NARAYANARAO

- Oct 14
- 3 min read
పీపీపీ విధానాన్ని అడ్డుకుని తీరతాం
ప్రజా ఉద్యమంతో ప్రభుత్వ మెడలు వంచుతాం
కూటమి సర్కార్‌కు మాజీ మంత్రి ధర్మాన హెచ్చరిక

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేరుతో ప్రజలను ప్రైవేటు ఆస్పత్రులకు బలిచ్చే కార్యక్రమం వెంటనే ఆపాలని, లేదంటే వైయస్సార్సీపీ తరఫున ఉద్యమిస్తామని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శ్రీకాకుళంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... విద్య, వైద్య రంగాలను ప్రైవేటు యాజమాన్యాల కిందకు తీసుకువెళ్ళి, విద్యార్ధులు, పేదల జీవితాలతో చెలగాటం ఆడేందుకు కూటమి సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజా పోరాటంతోనే అడ్డుకుంటామని స్పష్టం చేశారు. బాధ్యతారహితంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్కార్ మెడలు వంచి, దానిని ఉపసంహరించుకునే వరకు వెనకడుగు వేయబోమని పేర్కొన్నారు. ప్రజారోగ్యాన్ని బలిపీఠం మీద పెడితే బాధ్యతయుతమైన ప్రతిపక్షంగా సహించేది లేదని అన్నారు. ఆయన ప్రెస్‌మీట్.. ఆయన మాటల్లోనే..
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ప్రైవేటీకరణపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
ప్రజల ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యతగా భావించాలి. కానీ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసి నాణ్యమైన వైద్యం పొందే పేదవాడి హక్కును కాలరాసింది. ఉచిత వైద్యాన్ని అందని ద్రాక్షగా మార్చేశారు. దీనిపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల్లోనూ తీవ్రమైన చర్చ జరుగుతోంది. గత వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేసినా రాష్ట్రంలోని వైయస్ జగన్ నేతృత్వంలో సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజల ప్రాణాలను కాపాడగలిగాం. నాడు కరోనా విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొన్న రాష్ట్రం ఏపీ మాత్రమే. ప్రజారోగ్యం, సమస్యల పరిష్కారం పట్ల వైయస్ జగన్ కి ఉన్న చిత్తశుద్దిని దేశం మొత్తం చూసింది. ఆయన స్పందించిన తీరుకు ప్రపంచ నలుమూలల నుంచి ప్రశంసలు అందుకున్నారు. కరోనా భయాన్ని అడ్డం పెట్టుకుని ప్రైవేటు ఆస్పత్రులు ప్రజలను దోచుకుంటున్న తరుణంలో ఉచితంగా వైద్యం అందించి కరోనాను ఎదుర్కోవడంలో ప్రభుత్వ ఆస్పత్రులు పోషించిన పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రభుత్వ ఆస్పత్రులతో సమర్థవంతంగా పనిచేయించుకోవడంలోనూ గత వైయస్ జగన్ నేతృత్వంలోని అధికారులు విజయవంతంగా పనిచేశారు. కరోనా సందర్భంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకున్న ఎన్నో కుటుంబాలు ఒకపక్క కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధతోపాటు ఇంకోపక్క ఆర్థికంగా చితికిపోయి ఇప్పటికీ ఆ కష్టాల నుంచి తేరుకోలేకపోతున్నారు. కరోనా లాంటి దుస్థితిని చూశాక కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయాలన్న నిర్ణయం తీసుకోవడం ప్రతిఒక్కర్నీ తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఏర్పాటైన ప్రభుత్వాలు ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి ప్రభుత్వ సంపదన ప్రైవేటుకు దోచిపెట్టడం ధర్మమేనా అని ఆలోచించుకోవాలి. కూటమి ప్రభుత్వం వైద్యం పట్ల ప్రజల్లో భరోసా కల్పించలేకపోతోంది. ఇప్పుడు కరోనా లాంటి విపత్తు ఎదురైతే ప్రాణాలతో ఉంటామన్న ఆశ నేడు ప్రజల్లో సన్నగిల్లిపోయింది.
ఆస్పత్రుల దోపిడీకి అడ్డుకట్ట వేయాల్సిందిపోయి...
నాణ్యమైన ఉచిత వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత. నాణ్యమైన వైద్యం కోరుకోవడం రాష్ట్ర ప్రజల ప్రాథమిక హక్కు. వాటిని కూడా నెరవేర్చడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని 16 నెలల పాలనతోనే స్పష్టమైంది. ప్రతి పేదవాడికి ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించాలన్న గొప్ప లక్ష్యంతో నాటి సీఎం వైయస్ జగన్ 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టి ఏడు కాలేజీలను పూర్తి చేశారు. రూ. 500 కోట్ల నిర్మాణ వ్యయంతో 50 ఎకరాల విస్తీర్ణంలో మెడికల్ కాలేజీతోపాటు టీచింగ్ హాస్పటల్స్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. ఏ, బీ, సీ మూడు కేటగిరీల్లో ఫీజులు నిర్ణయించి, 50 శాతం సీట్లకు కేవలం రూ. 15వేల ఫీజు నిర్ణయించారు. నిధుల కొరత కారణంగా ఆస్పత్రి నిర్వహణకు ఇబ్బంది రాకూడదన్న ఉద్దేశంతో 15 శాతం సీట్లను ఎన్నారై కోటా కింద భర్తీ చేయడం జరిగింది. మెడికల్ కాలేజీలను పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలతో అనుసంధానం చేయడం జరుగుతుంది. ప్రతిజిల్లాలో మెడికల్ కాలేజీ చుట్టూ ఒక మెడికల్ హబ్ ఏర్పాటవుతుంది. ఆ జిల్లా పరిధిలో మెడికల్ సిస్టం మొత్తం ఒకే గొడుగు కిందకు వస్తుంది. కాలేజీలు పూర్తయి అందుబాటులోకి వస్తే ప్రైవేటు ఆస్పత్రుల ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుంది. ఇంత విశాల దృక్పథంతో కాలేజీల ఏర్పాటు జరిగితే వాటిని ప్రైవేటుపరం చేయాలనుకోవడం ఎంతమాత్రం సరైన నిర్ణయం కాదు. ప్రజల వైద్యం భారాన్ని మోయలేమని ప్రభుత్వం అనుకుంటుందా? ఇన్ని వ్యవస్థలున్న ప్రభుత్వానికే చేతకానప్పుడు ప్రైవేటు వ్యక్తులు ఎలా చేయగలుగుతారు?
ఆరోగ్యశ్రీని కూడా నిర్వీర్యం చేశారు:
కూలీనాలీ చేసుకుని పేదలు కూడబెట్టుకుంటున్న సొమ్మంతా అనారోగ్యం పేరుతో ప్రైవేటు ఆస్పత్రులు దోచుకుంటుంటే చోద్యం చూడటం చాలా తప్పు. దాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వమే ప్రజారోగ్యాన్ని తీసుకెళ్లి ప్రైవేటు ఆస్పత్రుల చేతుల్లో పెట్టడమంటే ఇది ఇంకా పెద్ద నేరం. 2019లో వైయస్ జగన్ సీఎం అయ్యాక ఆరోగ్యశ్రీని మరింత బలోపేతం చేశారు. ఆరోగ్య ఆసరా కార్యక్రమం ద్వారా రోగి కోలుకునే సమయంలో కూడా ఆ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచారు. కానీ ఇలాంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లులు పెండిరగ్ పెట్టడంతో వైద్యం నిరాకరించే పరిస్థితి తీసుకొచ్చారంటే ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? వీరికి ప్రజారోగ్యం పట్ల చిత్తశుద్ధి లేదని చెప్పడానికి ఇంకేం రుజువులు అవసరం లేదు. వైయస్ కుటుంబం మీద కోపంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేయడం ఏమాత్రం సమంజసం కాదు.
విద్య, వైద్య రంగాలకు వైయస్ జగన్ ప్రాధాన్యం:
వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విద్య, వైద్య రంగాలకు ఎంత ప్రాధాన్యం ఇచ్చారో శత్రువులైనా అంగీకరించక తప్పదు. ఈ రెండు రంగాల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టిన ఘనత వైయస్ జగన్‌కే దక్కుతుంది. నాడు - నేడు ద్వారా కొత్త పీహెచ్‌సీల నిర్మాణం, పాత ఆస్పత్రుల ఆధునికీకరణ, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, ఆరోగ్య ఆసరా, గ్రామాల్లో హెల్త్ క్లీనిక్ ల నిర్మాణం వంటి వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాలో గడిచిన కొన్ని దశాబ్దాలుగా ఉన్న ఉద్దానం కిడ్నీ సమస్యను అన్ని రాజకీయ పార్టీలు వాడుకుని లబ్ధి పొందాయే కానీ, సమస్య మూలాల్లోకి వెళ్లి పరిష్కారం కోసం ఏ ప్రభుత్వాలు ప్రయత్నించలేకపోయాయి. కానీ తొలిసారిగా సీఎం అయినా వైయస్ జగన్ రూ. వంద కోట్లతో (పలాస) ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌తో ఏర్పాటు చేశారు. తానే భూమి పూజ చేసి ప్రారంభించి, నిర్మాణం చేసి, ఆస్పత్రిని ప్రారంభించడం వైయస్ జగన్ ఘనతే. భూగర్భ జలాలు తాగడం వల్లే కిడ్నీ సమస్య వస్తుందన్న వైద్యుల సూచనతో మంచినీటి సమస్య పరిష్కారం కోసం రూ. 800 కోట్లతో హిరమండలం రిజర్వాయర్ నుంచి నీరు తీసుకొచ్చి సర్ఫేస్ వాటర్ అందించారు.










Comments