మండే కాలం ముందుంది!
- DV RAMANA

- Apr 27
- 2 min read
వచ్చేస్తోంది సూపర్ ఎల్‌నినో
వేడి సెగలు, కరువు పరిస్థితులు తప్పకపోవచ్చు
వ్యవసాయాన్ని దెబ్బతీసి ఆహార కొరత సృష్టించే ప్రమాదం
దశాబ్దం క్రితం ఇదే పరిస్థితుల్లో 2500పైగా మరణాలు
అప్రమత్తం కావాలని హెచ్చరిస్తున్న వాతావరణ నిపుణులు
ప్రపంచ చరిత్రలో 30కిపైగా సూపర్ ఎల్‌నినోలు

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేకప్రతినిధి)
సాధారణంగానే వేసవిలో ఎండలు మండిపోతాయి. ఏప్రిల్ నెల దాటకముందే శ్రీకాకుళం లాంటి ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలను టచ్ చేస్తున్నాయి. ఇక దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో దాని దాటిపోయి ప్రచండమైన వేడితో సెగలు పుట్టిస్తున్నాయి. ఇక కార్తెలు ప్రవేశిస్తే.. పెద్దలు చెప్పినట్లు రోళ్లు పగలడం ఖాయమేనేమో అనిపిస్తున్నది. ఎందుకంటే మే నెలల్లో వేసవి తీవ్రత ఎప్పుడూ అధికంగానే ఉంటుంది. కానీ ఈసారి సాధారణం కంటే చాలా ఎక్కువ ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనికి కారణం ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం విస్తరిస్తుండటమేనని అంటున్నారు. అందులోనూ ఈసారి వస్తున్నది సూపర్ ఎల్‌నినోగా అంచనా వేస్తున్నారు. ప్రకృతిలో సంభవిస్తున్న మార్పులు, మానవ తప్పిదాలు భూ వాతావరణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. భూగోళం వేడెక్కుతున్న కొద్దీ వాతావరణం విపరీత పోకడలకు పోతుంటుంది. అందులో భాగమే ఎల్‌నినోలు, సూపర్ ఎల్‌నినోలు. ఎల్‌నినో ప్రభావం ఉంటే వాతావరణంలో ఉండే గాలిని సాధారణం కంటే ఎక్కువగా వేడెక్కించడమే కాకుండా వర్షపాతాన్ని అస్తవ్యస్తం చేస్తుంది. సాధారణంగా పసిఫిక్ మహా సముద్రంలో తూర్పు నుంచి పడమరకు వీచే గాలులు సముద్రం మీది వేడి నీటిని ఇండోనేషియా వైపు నెడతాయి. అయితే ఈ గాలులు బలహీనపడినప్పుడు ఆ వేడి నీరు దక్షిణ అమెరికా వైపు (పెరూ దేశం వైపు) మళ్లుతుంది. దీనివల్ల సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. కానీ ఈ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 0.5 నుంచి 1.5 సెంటీగ్రేడ్ పెరిగితే ఈ పరిస్థితిని ఎల్‌నినో అంటారు. ఒకవేళ ఉష్ణోగ్రతలు దానికంటే రెండు అంతకంటే ఎక్కువ డిగ్రీలు పెరిగితే సూపర్ ఎల్‌నినోగా పరిగణిస్తారు. ఈ పరిస్థితే ఉత్పన్నమైతే ఎండలు మలమల మాడ్చేస్తాయి. తీవ్రమైన కరువుకాటకాలు సంభవిస్తాయి. ఊహించని వరదలు ముంచెత్తే ముప్పు కూడా ఉంటుంది.
దేశంపై ప్రభావం
ఈ సీజనులో సంభవించేది కూడా ఇలాంటి ప్రమాదకరమైన సూపర్ ఎల్‌నినో అని వాతావరణ నిపుణులు చాలా ముందు నుంచే హెచ్చరిస్తున్నారు. ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో), భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనాల ప్రకారం 2027 ప్రారంభంలో ఎల్‌నినో బలహీనపడి లానినో పరిస్థితి ఏర్పడవచ్చని భావిస్తున్నారు. ఒకవేళ లానినో సంభవిస్తే దేశంలో మంచి వర్షాలు కురుస్తాయి. అయితే ప్రస్తుత వేసవిలో మాత్రం ఎల్‌నినో ప్రభావం వల్ల వడగాల్పులు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. భారతదేశంలో రుతుపవనాలపై ఎల్‌నినో ప్రభావంఎక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు బలహీనపడతాయి. ఫలితంగా సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయి. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడమే కాకుండా సాగు నీటికి ఎద్దడి పెరిగి కరువు పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉంటుంది. మనదేశ వ్యవసాయ రంగానికి రుతుపవనాలే ఆధారం. మొత్తం వ్యవసాయ భూమిలో 35శాతం మాత్రమే నీటి పారుదల వసతులు ఉండగా.. మిగతా 65 శాతం పూర్తిగా వర్షపాతంపై ఆధారపడుతుంది. ఎల్‌నినో ప్రభావం ఉంటే నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమవుతుంది. వర్షపాతం తగ్గుతుంది. పొడి వర్షాలు పెరుగుతాయి. ఖరీఫీ పంటలైన వరి, వేరుశనగ, పప్పుధాన్యాలకు నష్టం సంభవించే ప్రమాదముంది. జలాశయాలు, చెరువుల్లో నీటిమట్టాలు తగ్గి తాగునీటి కటకట ఏర్పడుతుంది.
నష్టపోయే ప్రాంతాలు ఇవే..
ఎల్‌నినో సంభవిస్తే తెలుగు రాష్ట్రాలపైనా దాని ప్రభావం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమలో పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి.
`కోస్తా ఆంధ్ర జిల్లాల్లో వర్షపాతం 36 శాతం మేరకు తగ్గిపోవచ్చు.
`ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 1982 మాదిరిగా 49 శాతం మేరకు లోటు వర్షపాతం నమోదు కావచ్చు.
`కృష్ణా, గోదావరి నదుల్లో నీటి ప్రవాహాలు తగ్గిపోయి ఆయకట్టు దెబ్బతినవచ్చు.
` వర్షపాతం తగ్గిపోతే వ్యవసాయ ఉత్పత్తులు పడిపోతాయి. ఫలితంగా ఆహార ధాన్యాల ధరలు ఆకాశాన్నంటుతాయి. కృష్ణా, గోదావరి నదుల నీటి స్థాయులు తగ్గవచ్చు.
`తీవ్రమైన వడగాల్పులు(హీట్ వేవ్‌స్) పెరిగి గతంలో మాదిరిగా వడదెబ్బ మరణాలు పెరిగే ప్రమాదముంది.
గతంలో ఏర్పడిన ఎల్‌నినోలు
వాతావరణ శాఖ నివేదికల ప్రకారం.. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే 1982, 1987, 2002, 2004, 2009, 2014 సంవత్సరాల్లో ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 1900 నుంచి 2024 వరకు కనీసం 30 ఎల్‌నినోలు నమోదయ్యాయి. వాటిలో ముఖ్యమైన కొన్నింటిని పరిశీలిస్తే..
`1972-73లో సూపర్ ఎల్‌నినో సంభవించించి ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయ రంగం దెబ్బతింది. పెరూలో మత్స్య పరిశ్రమ నాశనమైంది.
`1982-83లో సంభవించిన సూపర్ ఎల్‌నినో కారణంగా భారత్‌లో కరువు తాండవిస్తే, ఇండోనేషియా అడవులను కార్చిచ్చు కబళించింది.
`1997-98లో చరిత్రలోనే బలమైన సూపర్ ఎల్‌నినో నమోదైంది. రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగి అత్యధిక వేడి కారణంగా ప్రపంచవ్యాప్తంగా విపత్తులు సంభించినా భారత్‌లో మాత్రం సాధారణ వర్షపాతం నమోదైంది.
`2002-03లో మధ్యస్త ఎల్‌నినో సంభవించగా భారత్‌లో కరువు తాండవించింది. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి.
`2009-10లో ఏర్పడిన మధ్యస్త ఎల్‌నినో ప్రభావంతో మనదేశంలో ఏర్పడిన ఆరు అత్యంత కరువుల్లో ఒకటి నమోదైంది.
`2015-16లో సూపర్ ఎల్‌నినో సంభవించింది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఠారెత్తించాయి. మనదేశంలో ఏకంగా 2500కుపైగా వడదెబ్బ మరణాలు సంభవించాయి.






Comments