top of page

ముడుపులిస్తేనే ‘మూవ్‌మెంట్‌’!

  • Writer: NVS PRASAD
    NVS PRASAD
  • Jun 26
  • 3 min read
  • బదిలీ అయినా కొత్త స్థానాల్లో చేరలేని ఉద్యోగులు

  • చేయి తడిపినవారి చేతికే ఆర్డర్‌

  • గిరిజన ప్రాంతాల బదిలీల్లోనూ అవకతవకలు

  • ఖాళీ అయ్యే సీట్లను వెంటనే భర్తీ చేయాలన్నది రూల్‌

  • కానీ అలా చేయకుండా వదిలేస్తున్న అధికారులు

  • దాంతో ట్రాన్స్‌ఫర్‌ అయినా కదల్లేక పలువురి ఆవేదన

ree
(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)
  • ఆ ఉద్యోగిని పేరు వై.మోహిని. వైద్య ఆరోగ్యశాఖలో నాన్‌ టీచింగ్‌ పీహెచ్‌ఎన్‌గా హిరమండలంలో పని చేస్తున్నారు. ఈమెను మెడికల్‌ గ్రౌండ్స్‌ కింద తాజా బదిలీల్లో పోలాకికి పంపించారు. మెడికల్‌ గ్రౌండ్స్‌ అంటే ట్రైబల్‌ ఏరియా నుంచి ప్లెయిన్‌ ఏరియాకు రావడానికి కొని తెచ్చుకున్న మెడికల్‌ సర్టిఫికెట్‌ కాదు. ఈమె శతశాతం క్యాన్సర్‌ పేషెంట్‌. ప్రస్తుతం కీమోథెరపీ చేయించుకుంటున్నారు. దీనికి తోడు రేడియేషన్‌ ట్రీట్మెంట్‌కు వైజాగ్‌ వెళ్లి వస్తున్నారు. ఈ శిక్ష చాలదన్నట్టు మూడు నెలల క్రితం ఈమె భర్త మరణించారు. క్యాన్సర్‌ పేషెంట్‌ అయిన తనకు సేవ చేసేందుకు, తోడుగా ఉండటానికి ఎవరూ లేకపోవడంతో పోలాకిలో ఉన్న తల్లి వద్దకు వెళ్లిపోడానికి ఆమె దరఖాస్తు చేసుకున్నారు. నిబంధనల మేరకు బదిలీకి అన్ని అర్హతలు ఉన్న ఈమెను పోలాకికి పంపించినట్లు చూపించిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు హిరమండలం నుంచి రిలీవ్‌ చేస్తూ మూవ్‌మెంట్‌ ఆర్డర్‌ మాత్రం ఇవ్వలేదు. ఎందుకంటే.. ఎవరి లెక్కలు వారివి. తన ట్రీట్‌మెంట్‌కు, భర్త అంత్యక్రియలకు కలిపి మోహిని మెడికల్‌ లీవ్‌ పెట్టగా దాన్ని శాంక్షన్‌ చేయడానికి డబ్బులు దండిన ఘనత మన వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులదే. ఇప్పుడు మోహినీకి బదిలీ అత్యావశ్యం కాబట్టి మెడికల్‌ లీవ్‌ శాంక్షన్‌కే డబ్బులిచ్చిన ఆమెకు ఇప్పుడు మూవ్‌మెంట్‌ ఆర్డర్‌ ఉత్తపుణ్యానికే ఎందుకివ్వాలన్న కోణంలో తిప్పుతున్నారు.

  • ఆయన పేరు భాస్కరరావు. వయసు 60. భామిని పీహెచ్‌సీలో కమ్యూనిటీ హెల్తాఫీసర్‌గా పని చేస్తున్నారు. రెండేళ్ల క్రితం ఎల్‌.ఎన్‌.పేటకు బదిలీ అయ్యారు. దానివల్ల భామినిలో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు కొత్త అధికారి రాకపోవడంతో భాస్కరరావును ఎల్‌.ఎన్‌.పేట పంపలేమంటూ భామినిలోనే ఉంచేశారు. ట్రైబల్‌ యాక్ట్‌ ప్రకారం ఏదైనా గిరిజన ప్రాంతంలో పనిచేసే ఉద్యోగిని బదిలీ చేయాల్సి వస్తే ఆ స్థానంలో వెంటనే వేరొకర్ని నియమించాలని, లేదంటే పాతవారినే కొనసాగించాలనే నిబంధన ఉంది. ఈ నిబంధన ప్రకారం ఒక చేత్తో బదిలీ చేసినప్పుడు మరో చేత్తో నియమించాలన్న కనీస అవగాహన వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టరేట్‌కు లేకపోవడం విడ్డూరం. దీంతో ఎల్‌.ఎన్‌.పేటకు వెళ్లలేకపోయిన భాస్కరరావు కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికీ ఆ కేసు విచారణలో ఉంది. తాజా బదిలీల్లో కూడా మళ్లీ ఆయనకు ఎల్‌.ఎన్‌.పేట బదిలీ అయింది. మరోసారి అదే కథ రిపీట్‌ అయినట్లే.

  • కంచిలి మండలం మఠం సరియాపల్లిలో ఎంపీహెచ్‌ఈవోగా సుదీర్ఘ కాలంగా పని చేస్తున్న కె.వేణుకు అదే మండలంలోని మాణిక్యపురానికి బదిలీ అయింది. ఇది కూడా స్పౌజ్‌ కోటాలో. ఈయనకు కూడా ఇంతవరకు మూవ్‌మెంట్‌ ఆర్డర్‌ ఇవ్వలేదు.

..ఇలా చెప్పుకుంటూపోతే జిల్లా వైద్యఆరోగ్యశాఖ పరిధిలో జరిగిన తాజా బదిలీల్లో స్థానచలనం ఖరారైనా మూవ్‌మెంట్‌ ఆర్డర్‌ అందుకోని వారెందరో ఉన్నారు. దీనికి కారణామేంటయ్యా అంటే.. టెక్నికల్‌, అడ్మినిస్ట్రేటివ్‌ గ్రౌండ్స్‌ను సంబంధిత అధికారులు లేదా సూపరింటెండెంట్లు సాకుగా చూపుతారు. కానీ తెరవెనుక జరుగుతున్న భాగోతం వేరు. ఒక మూవ్‌మెంట్‌ ఆర్డర్‌కు రూ.2వేలు నుంచి రూ.5వేల వరకు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ సొమ్ము ముడితే తప్ప ఆర్డర్‌ కాగితాన్ని ఉద్యోగుల చేతిలో పెట్టడంలేదని తెలిసింది. సాధారణ బదిలీల్లో భాగంగా వందలాది మందికి స్థానచలనం కలిగి కొత్త ప్లేసుల్లో జాయినైతే, వారిలో కొందరికి మాత్రం మూవ్‌మెంట్‌ ఆర్డర్లు ఇవ్వకపోవడానికి కారణం సొమ్ములు ముట్టకపోవడమేనన్న ఆరోపణలు ఉన్నాయి. రూ.2 వేల కోసం ఇన్ని బాధలెందుకు? అన్న అనుమానం రావచ్చు. కానీ ఇప్పటివరకు మూవ్‌మెంట్‌ ఆర్డర్‌ అందని వారందరి నుంచి పెద్దమొత్తాన్ని ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. బదిలీ అయిన వారికి ఆ స్థానం ఎంత అవసరమో తెలిసిన డీఎంహెచ్‌వో కార్యాలయ సిబ్బంది సాకులు చూపుతూ మూవ్‌మెంట్‌ ఆర్డర్లు ఇవ్వడంలేదు.

ట్రైబల్‌ చట్టాల దుర్వినియోగం

నిబంధనల మేరకు ట్రైబల్‌, ట్రైబల్‌ సబ్‌ప్లాన్‌ ఏరియాల్లో ఎక్కువ కాలం పని చేసినవారిని తప్పనిసరిగా మైదాన ప్రాంతాలకు బదిలీ చేయాలి. అదే సమయంలో ప్లెయిన్‌ ఏరియాలో ఉన్న వయసు పైబడని ఉద్యోగులను ట్రైబల్‌ ప్రాంతాలకు పంపాలి. గిరిజన ప్రాంతంలో పని చేస్తున్న 50 ఏళ్లు దాటిన ఉద్యోగులను కచ్చితంగా మైదాన ప్రాంతానికి తీసుకురావాలి. కానీ భామిని సీహెచ్‌వో భాస్కరరావుకు 60 ఏళ్లు. మరో రెండేళ్లలో రిటైరైపోతారు. ఇప్పటికే ట్రైబల్‌ ఏరియాలో ఎక్కువ కాలం పని చేశారు. అయినా ఆయన స్థానంలో వేరొకర్ని నియమించడానికి హెల్త్‌ డైరెక్టర్‌ కార్యాలయం ముందుకు రావడంలేదు. సారవకోటలో హెల్త్‌ సూపర్‌వైజర్‌గా పని చేస్తున్న ఆర్‌.సంతోష్‌కుమార్‌ విశాఖపట్నం టీబీ కంట్రోల్‌ ఆఫీస్‌కు బదిలీ అయ్యారు. కానీ ఆయనకు కూడా మూవ్‌మెంట్‌ ఆర్డర్‌ ఇవ్వలేదు. సారవకోట ట్రైబల్‌ ఏరియా అయినందున ఆయన స్థానంలో కొత్తవారిని నియమించలేదన్న నిబంధనను అడ్డు పెట్టుకుని అక్కడే ఉంచేశారు. వాస్తవానికి ఈ ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయాలి. ఎక్కడైనా ఓ పోస్టు ఖాళీ అయితే దాన్ని ప్రమోషన్‌ కోటాలో నింపాలి. ఆ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జాబితా కూడా సిద్ధంగా ఉంది. కానీ అలా చేయకుండా ట్రైబల్‌ ఏరియాకు ఎవరూ వెళ్లడంలేదంటూ ఉన్నవారినే అక్కడ అదిమిపెట్టేస్తున్నారు.

బదిలీ రిక్వెస్ట్‌కు.. మళ్లీ ఇప్పుడూ.. అమ్యామ్యా!

జిల్లాలో ఆరు పీహెచ్‌ఎన్‌ పోస్టులు ఉంటే వాటిలో ఇద్దరికి మాత్రమే మూవ్‌మెంట్‌ ఆర్డర్లు ఇచ్చారు. మిగిలినవారికి చుక్కలు చూపిస్తున్నారు. సారవకోటలో పని చేస్తున్న అరవింద్‌కుమారికి రిమ్స్‌ అర్బన్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ సెంటర్‌కు బదిలీ అయింది. బొంతులో పని చేస్తున్న మణిమంజరికి సింగుపురం పీహెచ్‌సీకి బదిలీ కాగా.. గుత్తావల్లిలో చిలకవేణి, మెళియాపుట్టిలో సుహాసిని కూడా బదిలీ అయింది. అలాగే ఎం.సింగుపురంలో పీహెచ్‌ఎన్‌గా పని చేస్తున్న డి.బి.నిర్మలాదేవికి రేగిడి ఆమదాలవలసకు బదిలీ అయింది. అయినా వీరెవరికీ ఇంతవరకు మూవ్‌మెంట్‌ ఆర్డర్‌ ఇవ్వలేదు. వీటన్నింటికీ కారణం.. చేతులు తడపకపోవడమే. సాధారణంగా కోరుకున్న చోటకు బదిలీ జరిగిందన్నప్పుడే కొంత మొత్తం ముట్టజెబుతారు. అది కాకుండా మళ్లీ మూవ్‌మెంట్‌ ఆర్డర్‌ ఇవ్వడానికి కూడా డబ్బులు తీసుకుంటున్నారు. ఇందులో తిలా పాపం తలా పంచుకుంటున్నారు. డీఎంహెచ్‌వో కార్యాలయంలో ప్రతి పనికి ఓ రేటుంటుందని అందరికీ తెలుసు. అయితే లంచం తీసుకుంటున్న కేసులో ఒక డీఎంహెచ్‌వో, ఒక సీసీ జైలుకెళ్లి ఎన్నో రోజులు కాకముందే.. అక్కడి ఉద్యోగులు ఏమాత్రం భయపడకుండా వసూళ్లలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టడం గమనార్హం. గత డీఎంహెచ్‌వో, ఆయన సీసీ డబ్బులు ఎలా తీసుకుంటూ దొరికిపోయారో ఓ కేస్‌ స్టడీగా తీసుకొని ఏసీబీకి దొరక్కుండా ఎలా తీసుకోవాలో ఓ పథకం తయారుచేసి మరీ వసూలు చేస్తున్నట్టు తెలిసింది. దీనిపై ప్రశ్నించాల్సిన యూనియన్‌ ప్రతినిధులు కూడా బదిలీల ప్రాపకం కోసం పాకులాడటంతో ఉద్యోగులు ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. శ్రీకాకుళం హెడ్‌క్వార్టర్‌కు సమీప ప్రాంతంలోనే ఏఎన్‌ఎంగా పని చేస్తున్న దుర్గాబాయి అనే యూనియన్‌ ఆఫీస్‌ బేరర్‌ తన స్థానం పదిలం చేసుకోవడానికి మరోసారి యూనియన్‌ కార్డు వాడేశారు. సాధారణ ఉద్యోగికైతే ఐదేళ్లు, యూనియన్‌ ఆఫీస్‌ బేరర్‌కైతే తొమ్మిదేళ్లు బదిలీ నుంచి మినహాయింపు ఉంటుంది. కానీ ఈమె 16 ఏళ్లుగా ఈ చుట్టుపక్కలే పని చేస్తున్నారు. మళ్లీ తాజా బదిలీల్లో కూడా దూర ప్రాంతాలకు వెళ్లకుండా మేనేజ్‌ చేసుకోవడం వల్ల యూనియన్‌ నాయకులకు చెప్పి ప్రయోజనం లేదనే భావనలో ఉద్యోగులు ఉన్నారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page