
వైవిధ్యాన్ని, విభిన్నతలను రద్దు చేసి దేశం ఒకటే, దేశంలో సర్వం ఒకటే అంటూ ఆ ఒకటి ఏదో తామే నిర్ణయించి నిర్మిస్తున్నారు. ఈ జాతీయతకు ఒక మతం ఉన్నట్టుగానే, ఒక ప్రాంతం కూడా ఉంది. ఒకటో రెండో మూడో సామాజిక వర్గాల పునాది కూడా ఉంది. ఆ తీవ్ర జాతీయతకు, దాని ద్వారా లబ్ధి పొంది సువిశాలమైన వ్యాపార మార్కెట్‌ను సృష్టించుకునే ఆర్థికవర్గాలకు ఒకే ప్రాబల్య భాష, సర్వవ్యాపిత భాష చాలా అవసరం. అందుకే గత పది పదేళ్లుగా చాప కింద నీరులా హిందీని విస్తరింపజేశారు.
మాతృభాషలు అన్నీ సమానమే అని భారత ప్రధాని నరేంద్రమోదీ అన్నారంటే.. ఆ ప్రకటనకు మురిసి ముక్కలవ్వాలనిపిస్తుంది. ఆదివాసీ భాషలు అపురూపమైనవి వాటిని కాపాడుకోవాలని ఆయన అంటే, మా బంగారు తండ్రే అని మెచ్చి మొటికలు విరవాలనిపిస్తుంది. భాషల మధ్య పగలు ప్రతీకారాలు కూడదని అంటుంటే, ఆ సూక్తి ముక్తావళికి పరవశించిపోవాలనిపిస్తుంది. కానీ, ఈ సుభాషితాలు స్వచర్మ ధారివేనా? లేక బంగారు వన్నెతో మెరిపిస్తున్న మాయలేడివా?
మానవళి అంతా సమానంగా లేదు. అనేక హెచ్చుతగ్గులు, అగాధాలు, అంతరాలు ఉన్నాయి. సకల రంగాలలో, తలాలలో ఉన్న ఎగుడుదిగుడులు స్పర్థలుగా, ఉద్యమాలుగా, తీవ్రమైన ప్రయోజనాల ఘర్షణగా పరిణమిస్తాయి. మరి ఇటువంటి ప్రపంచంలో, ఇటువంటి దేశంలో మాతృభాషలన్నీ సమానంగా ఉన్నాయా? ఉండగలవా? ఉన్నాయన్నది అమాయకపు అంచనాయా? ఒక ఆకాంక్షయా? లేక మభ్యపరిచే మాటనా?
భాషల మధ్య పోటీలు, అభద్రతలు, ఉద్రిక్తతలు, అసమానతలు, ఆధిపత్యాలు ఉన్నాయంటున్నామంటే అవి కేవలం పలికే అక్షరధ్వనుల మధ్య, రాసే లిపిసంకేతాల మధ్య ఉండే సమస్యలో శత్రుత్వాలో కావు. ఆయా భాషలు మాట్లాడే ప్రజల మధ్య ఉండే అసమసంబంధాలు. భాషల అభివృద్ధి కోరుతున్నామంటే అర్ధం, ఆ భాషా వ్యవహర్తల అభివృద్ధిని కోరుతున్నామని.
ఆధిపత్యాలు నెరిపే మనుషుల లాగే వారి భాషలు కూడా పెత్తనం చేస్తాయి. వెనుకబడుతున్న భాషలన్నీ, యాసలన్నీ వెనుకబాటులో ఉన్న సమాజాలకు చెందినవే. భాషలకు చెందిన ఆధిక్యభావనలన్నీ ఆ భాషా వ్యవహర్తల ఆధిక్య భావనలే. అధికారభాషలన్నీ అధికార నిర్వహణకు సాధనాలే. సమాజంలోని ప్రాబల్య, శిష్ట శ్రేణుల భాషలు, యాసలు అధిక గౌరవం పొందడమే కాక, అధికార సమాచార వినిమయానికి మాధ్యమాలుగా, ప్రధాన కథనాలకు రాజభాషగా ఉంటాయి. భాషా ప్రయుక్త రాష్ట్రాల డిమాండ్‌లు అన్నీ ప్రాబల్య భాషాసమాజం కింద నలిగిపోతున్న బలహీన భాషాసమాజాల ఆకాంక్షలే. ప్రాంతీయ న్యాయాన్ని కోరిన ఉద్యమాలన్నీ భాషా సామాజిక న్యాయంలో కొరవడిన అంతర్గత న్యాయాన్ని సాధించుకునేందుకే! ఏ సందర్భంలో ఎవరిని ఉద్దేశించి భాషల సమానత్వం గురించి ప్రధాని మాట్లాడారో మొదట చూద్దాం.
బక్క భాషల మీద సవారీ చేస్తున్న బాహుబలి భాషను మందలిస్తూ ఆయన ఆ మాట అనలేదు. అన్నిటినీ తొక్కుకుంటూ దూసుకువస్తున్న రథచక్రాల నుంచి తమ భాషను, అస్థిత్వాన్ని కాపాడుకోవడానికి పోరాడాలనుకుంటున్న బలహీనులకు ఆ మాటలు ఉపదేశిస్తున్నారాయన. మూడు భాషల సూత్రాన్ని అమలుచేయాలన్న జాతీయ విద్యావిధానం (2020) నిర్దేశాన్ని వ్యతిరేకిస్తూ తమిళనాడు ప్రభుత్వం, అక్కడి అధికార డిఎంకె, ప్రతిపక్ష పార్టీలు కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మోదీ అలా మాట్లాడారు. త్రిభాషా సూత్రాన్ని అమలుచేయడానికి నిరాకరిస్తున్నందుకుగాను, తమిళనాడు ప్రభుత్వానికి సమగ్ర శిక్షా పథకం కింద రావలసిన 2 వేల కోట్లకు పైగా నిధులను కేంద్రం నిలిపివేసింది. అంటే ఆ విధానాన్ని అమలుచేయించడానికి పలు రూపాల్లో ఒత్తిడి తెస్తోంది కేంద్రం. ముఖ్యంగా ఆర్థిక ఒత్తిడిని కేంద్రం ఉపయోగిస్తోందన్న మాట.
మరి, మూడుభాషలు నేర్చుకోవడానికి ఏమిటి నెప్పి? రాజకీయ, సామాజిక కారణాలే కాక విద్యావిషయిక కారణాలు కూడా తమిళనాడు వైఖరికి కారణం. త్రిభాషావిద్య పిల్లల మీద భారం అవుతుందని, చిన్నవయస్సులో పిల్లలు విద్య మీద ఆసక్తి కోల్పోయి డ్రాప్ అవుట్ అవుతారని నిపుణులు చెబుతారు. తమిళనాడు సమాజం హిందీ వ్యతిరేక ఉద్యమాలు ఉధృతంగా చేసిన చరిత్ర కలిగినది. తమిళులు ఇప్పటి దాకా రెండు భాషలు మాత్రమే నేర్చుకుంటున్నారు. అవి ఇంగ్లీషు, తమిళం. ఫలితంగా తమ విద్యార్థుల ప్రమాణాలు బాగా మెరుగుపడ్డాయని ఆ రాష్ట్రం చెప్పుకుంటోంది. హిందీ నుంచి తమిళనాడు తనకు పెద్ద రక్షణ కవచాన్నే నిర్మించుకుంది.
అయినా దేశంలో చాలాచోట్ల పదోతరగతి దాకా మూడు భాషలు నేర్చుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలలో మూడోభాషగా హిందీ తీసుకున్నా అందులో మంచి మార్కులు రావాలన్న నియమమేమీ లేదు. అదసలు నిర్ణాయకమైన సబ్జక్టే కాదు. మరి, జాతీయ విద్యావిధానం హిందీని నిజంగానే మూడుభాషలలో ఒకటిగా నిర్బంధం చేసిందా? అటువంటి ప్రయత్నం జరిగింది కానీ, కస్తూరి రంగన్ కమిటీకి తమిళనాడు నుంచి ఇతర రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వచ్చిన మీదట మాతృభాష, ఇంగ్లీషు కాక మరేదైనా భారతీయ భాషను తీసుకోవచ్చునని వెసులుబాటు ఇచ్చారు. కావాలంటే తమిళులు మూడో భాషగా తెలుగు తీసుకోవచ్చు, బెంగాలీ తీసుకోవచ్చు, పంజాబీ తీసుకోవచ్చు. హిందీయే తీసుకోవాలని ఏమీ లేదు. అన్ని భాషలూ సమానమే అని మోదీ అన్నమాటలను ఈ నేపథ్యంలో అర్థం చేసుకోవాలి. ఆ సమానత్వంలో మాయలేడి మెరుపులున్నాయేమో తెలుసుకోవాలి.
మూడో భాష ఎంపికలో స్వేచ్ఛ ఉందని చెబుతున్నారు కానీ, మూడో భాషకు అవకాశమివ్వడమే హిందీ విధింపునకు దొడ్డిదారి మార్గమని తమిళులు వాదిస్తున్నారు. ఇది నిజమేనా? మూడో భాష అంటూ ఉంటే అది తప్పనిసరిగా హిందీయే అయ్యేట్టుగా పరిస్థితులున్నాయి మరి. తమిళనాడు విద్యార్థి మూడో భాషగా అస్సామీ తీసుకుంటే ఆ భాష బోధించే ఉపాధ్యాయులు దొరుకుతారా? అలాగే బెంగాలీ, ఒడియా, గుజరాతీ, రాజస్థానీ.. ఏదైనా కానీ ఇతర ప్రాంతాలకు వెళ్లి చెప్పే టీచర్ల లభ్యత ఉంటుందా? మరి హిందీ సంగతి? దేశవ్యాప్తంగా హిందీప్రచార సంస్థలున్నాయి. హిందీ చదువుకుంటే భాషోపాధ్యాయులుగా ఉద్యోగం దొరుకుతుందన్న ఆశ ఉంది. అన్నిటికి మించి కేంద్రప్రభుత్వం హిందీ ఉపాధ్యాయుల లభ్యతను పెంచడానికి బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించి చర్యలు తీసుకుంటోంది. అటువంటి కార్యక్రమం ఇతర భాషలకు ఉందా? హిందీయేతర భారతీయ మాతృభాషలకు ప్రచారం, మార్కెట్, ఉద్యోగావకాశాలు ఎంతవరకు ఉన్నాయి? కాబట్టి, త్రిభాషా సూత్రంలోని స్వేచ్ఛ నేతి బీర మాత్రమే.
మాతృభాషల్లో ఉన్నత వృత్తి సాంకేతిక కోర్సులను అందుబాటులో ఉంచడం జాతీయ విద్యావిధానం అందిస్తున్న వరంగా కేంద్రప్రభుత్వం చెబుతుంది. తెలుగులోనో తమిళంలోనో డాక్టరీ, ఇంజనీరింగ్ చదువుకోగలగడం గొప్ప విషయం. ఉర్దూలో వైద్యం, ఇంజనీరింగ్ పాఠ్యాలను రూపొందించడానికి ఒకనాడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రత్యేకంగా అనువాద విభాగం ఉండేది. ఎంతో శ్రద్ధతో సాంకేతిక పరిభాషను వాళ్లు రూపొందించారు. కానీ, ఆ కృషి మధ్యలో నిలిచిపోయింది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి హిందీని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వాలన్నీ ప్రయత్నిస్తూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నిటిలోనూ హిందీభాషాధికారులను నియమించారు. రోజుకో హిందీమాటను బోర్డు మీద రాసి పెట్టడం వారి విధుల్లో ఒకటి. హిందీ పక్షోత్సవాలు పేరుతో ప్రతి ఏటా ప్రతి కేంద్ర ప్రభుత్వ సంస్థలోనూ కార్యక్రమాలు జరుగుతాయి. బ్యాంకుల్లో, కేంద్ర సంస్థల్లో ప్రతి ఫారమ్, ప్రతి డాక్యుమెంటు హిందీలో కూడా రూపొందించవలసిందే. హిందీ సంస్థలు, సంస్థానాలు వివిధరంగాల అంశాలను హిందీలో చెప్పడానికి అదే పనిగా కృషిచేస్తూ వస్తున్నాయి.
కొత్త విద్యావిధానం ప్రకారం, సాంకేతిక, వృత్తి విద్యాకోర్సులను మాతృభాషలలో నేర్చుకోవడం అన్నది హిందీకి మాత్రమే సులభ సాధ్యమయ్యే విషయం. ముందుముందు ఈ దేశీయభాషలలో ప్రొఫెషనల్ కోర్సులు చేసేవారు ఎక్కువగా హిందీవారే అయ్యే అవకాశం ఉంది. మాతృభాషలోనే యుపిఎస్‌సి పరీక్షలు అనేకం రాయగలిగే అవకాశం, ఇప్పటికే హిందీవారిని తక్కిన వారికంటె మెరుగైన స్థానంలో ఉంచింది. అందరి పేరుతో చేస్తున్నట్టు చెబుతున్న కొన్ని సంస్కరణలు హిందీని దృష్టిలో పెట్టుకుని మాత్రమే చేస్తున్నారేమో అనిపిస్తుంది.
ఎందుకంత వ్యతిరేకత హిందీ అంటే? హిందీ వ్యాప్తి, హిందీ మాతృభాషగా కలిగిన వారి ఆధిక్యాన్ని దేశంలో సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో పెంపొందిస్తుంది కాబట్టి. ఆధునిక జాతీయవాదంలో భాష ఒక ముఖ్యమైన ప్రాతిపదిక. రాజ్యానికి విధేయతలను నిర్మించడానికి, విశాల మార్కెట్‌కు వినియోగదారులను సృష్టించడానికి, ప్రాబల్య భాషాశ్రేణుల సాంస్కృతిక విస్తరణలకు జాతీయ ఏక భాష అవసరం. ఐరోపాలో అనేక జాతిరాజ్యాలు భాష ప్రాతిపదికన ఏర్పడ్డాయి. అనేక భాషల రాజ్యాలలో మెజారిటీ, మైనారిటీ సమస్యలు ఉత్పన్నమయ్యాయి. భారతదేశంలో జాతీయతను, వలసాధిపత్యానికి వ్యతిరేకంగా వివిధ, విభిన్న జనవర్గాలను కూడగడుతూ నిర్మించే క్రమంలోనే, ఒక ప్రాబల్య భాషను జాతీయ ప్రధాన భాషగా చేసే ప్రయత్నం కూడా అంతర్వాహినిగా జరిగింది. దానిని గుర్తించి అప్రమత్తమైన వివిధ భాషా మైనారిటీలు, అందుకు ప్రతిగా ఉద్యమాలు మొదలుపెట్టాయి. జాతీయోద్యమానికి నాయకత్వం వహించిన కాంగ్రెస్ పార్టీనే హిందీవాదిగా ఇతర భాషావాదులు పరిగణించారు. ప్రధానంగా జాతీయోద్యమంలోను, స్వాతంత్య్రానంతర భారతదేశంలోనూ తమకు న్యాయమైన భాగస్వామ్యం దక్కాలన్న ఆకాంక్షయే భాషావాద ఉద్యమాల్లోనూ వ్యక్తమైంది. ఆ ఆకాంక్ష తమిళనాడులో పెరియార్, ద్రవిడ కజగంలలో హిందీ వ్యతిరేకతగా, బ్రిటిషాంధ్రలో అది తమిళ వ్యతిరేకతగా, నైజామాంధ్రలో మరాఠీ, ఉర్దూ ప్రాబల్యానికి వ్యతిరేకతగా వ్యక్తమయింది. దేశంలోని తక్కిన ప్రాంతాల్లో కూడా తమ తమ భాషల, జాతుల, ఉపజాతుల, తెగల గుర్తింపు కోసం అనేక గొంతులు ఎలుగెత్తాయి.
దేశంలో సమైక్యభావాన్ని కలిగించడానికి హిందీని జాతీయభాషగా గుర్తించడం ఉపయోగపడుతుందని గాంధీజీ అన్నారు. గాంధీ విషయంలో ఏమంత సుముఖత లేని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఐదేళ్ల కిందట ఉన్నట్టుండి గాంధీ చాటున దాక్కుని హిందీ ద్వారా దేశంలో ఐక్యత సాధించవచ్చునని అన్నప్పడు పెద్ద గగ్గోలు పుట్టింది. నిజానికి గాంధీ హిందీవాది అయినప్పటికీ భాషల మధ్య ప్రజాస్వామిక సంబంధాలు ఉండాలని, బలవంతంగా ఎవరి మీదా ఏ భాషనూ విధించకూడదని అనేక సందర్భాలలో చెప్పారు. ఆయన సమైక్యతా సాధనంగా గుర్తించింది హిందుస్థానీ (హిందీ, ఉర్దూ మిశ్రమభాష)యే తప్ప, సంస్కృత పద భూయిష్ఠమైన ‘స్వచ్ఛ’ హిందీ కాదు. వివిధ మతవర్గాలు, అట్టడుగు సామాజిక, ఆర్థిక వర్గాలు అర్థం చేసుకోగలిగే, మాట్లాడగలిగే భాష జాతీయభాషగా ఉండాలని అన్నారు. ద్రావిడ ఉద్యమం నుంచి వచ్చిన ప్రతిఘటనను గాంధీజీ పరిగణనలోకి తీసుకుని, అందరి సమ్మతి లేనిదే జాతీయభాషగా ఏ ఒక్కదానినీ రుద్దకూడదని సూచించారు. ఫలితంగా ఇప్పటికీ హిందీ మన జాతీయభాష కాలేకపోయింది, కేవలం అధికార భాష మాత్రమే కాగలిగింది. తక్కిన 21 భాషలతో సమానంగా. కాకపోతే, కేంద్ర ప్రభుత్వ వ్యవహారాలు, సమాచారాలు ఇంగ్లీషు లేదా హిందీ భాషలలో సాగడానికి మాత్రం రాజ్యాంగంలో ఏర్పాటు చేసుకున్నారు.
గాంధీ, అంబేద్కర్, నెహ్రూ, పటేల్ వంటి నిర్మించదలచినది ప్రగతిశీలమైన, లౌకిక జాతీయత. అందులో సమ్మిశ్రతత్వం ముఖ్యమైన గుణం. కానీ, నేడు తీవ్రజాతీయతను, మతభావోద్వేగాల ప్రాతిపదికపై నిర్మిస్తున్నారు. ఇతరత్వాన్ని కల్పించి, దాని మీద ద్వేషం కల్పించడం ద్వారా ‘తమ’ వారిమధ్య ఐక్యత సృష్టించాలనుకుంటున్నారు. వైవిధ్యాన్ని, విభిన్నతలను రద్దు చేసి దేశం ఒకటే, దేశంలో సర్వం ఒకటే అంటూ ఆ ఒకటి ఏదో తామే నిర్ణయించి నిర్మిస్తున్నారు. ఈ జాతీయతకు ఒక మతం ఉన్నట్టుగానే, ఒక ప్రాంతం కూడా ఉంది. ఒకటో రెండో మూడో సామాజిక వర్గాల పునాది కూడా ఉంది. ఆ తీవ్రజాతీయతకు, దాని ద్వారా లబ్ధి పొంది సువిశాలమైన వ్యాపార మార్కెట్‌ను సృష్టించుకునే ఆర్థికవర్గాలకు ఒకే ప్రాబల్య భాష, సర్వవ్యాపిత భాష చాలా అవసరం. అందుకే గత పది సంవత్సరాలుగా చాప కింద నీరు వలె హిందీని విస్తరింపజేశారు.
చట్టాల పేర్లు కూడా ఇప్పుడు హిందీలోనే. జాతీయ వ్యవహారాలు, ప్రసంగాలు అన్నీ హిందీలోనే. మైలురాళ్ల మీద పేర్లు కూడా హిందీలోనే. హిందీ వ్యాప్తి, హిందీ రాష్ట్రాల ప్రాబల్యం, ప్రాంతీయ పార్టీల క్షీణత అన్నీ ఒకే సందర్భంలో జరుగుతూ ఉండడం నేటి వాస్తవం.
కానీ, ఈ ఆధిక్యభాష బుల్‌డోజర్‌ను ఒక్క తమిళనాడు, తోడుగా ఒకటో రెండో రాష్ట్రాలు, తప్ప ఎవరూ అడ్డుకోవడం లేదేమిటి? తెలుగు రాష్ట్రాలు కనీసంగా కూడా నిరసన తెలపడం లేదెందుకు? జాతీయ విద్యావిధానం. చదువు, సంస్కారాల మీద కేంద్రప్రభుత్వం పట్టును మరింత బిగింపజేస్తుంది. పర్యవసానాలు ఎట్లా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ద్రావిడ పార్టీలు మినహా తక్కిన ప్రాంతీయ పార్టీలు తమ అడుగుజాడలను తామే మరచిపోయాయి. ముప్పు ముంచుకు వస్తున్నా వారికి బోధపడడం లేదు.
-కె.శ్రీనివాస్, ది వైర్ కోసం
Kommentare