`చోరీ సొత్తు రికవరీల్లో వాటాలు
`సర్కిళ్ల స్థాయినిబట్టి నెలవారీ కలెక్షన్లు
`ఇసుక, జూదం వ్యవహరాల్లోనూ మంత్లీలు
`సొంత ఖాతాలోకి పోలీస్ సంక్షేమ సంఘం ఆదాయం
‘మేడం సార్.. మేడం అంతే’.. ఏదో సినిమాలోని ఈ డైలాగ్ రెండున్నరేళ్లుగా జిల్లా పోలీసు శాఖలో నినాదంగా మారి పై నుంచి కిందిస్థాయి వరకు మేడమ్ సేవలో తరించేలా చేసింది. పోలీసు అధికారులే విస్మయం చెందే స్థాయిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మేడమ్‌కు అన్ని స్థాయిల నుంచి క్రమం తప్పకుండా మంత్లీలు వెళ్లే ఏర్పాట్లు ఉండేవని ఇప్పుడు చెప్పుకుంటున్నారు. అందుకే అక్రమార్కులకు కొమ్ము కాశారనే ఆరోపణలు పోలీస్ శాఖలోనే వినిపిస్తున్నాయి. ఈ అవినీతి ఆరోపణల కారణంగానే ఏడాది క్రితం ఆమెను బదిలీ చేస్తారని సంకేతాలు వచ్చినా.. ఎందుకో తర్వాత దానికి బ్రేక్ పడిరదని పోలీస్ శాఖలో చర్చ జరుగుతోంది. జిల్లాలో ప్రతి సర్కిల్‌కు ఇండెంట్ పెట్టి మరీ ఖరీదైన వస్తువులు సమకూర్చుకోవడం మేడమ్‌కు వెన్నతో పెట్టిన విద్య అని పోలీస్ వర్గాలే చర్చించుకుంటున్నాయి. ప్రతి నెలా నిర్వహించే నేర సమీక్ష సమావేశానికి ముందే అన్ని సర్కిల్స్ నుంచి మంత్లీలు కచ్చితంగా అందిపోవాల్సిందే. లేదంటే.. మంత్లీలు సమర్పించని సర్కిల్ అధికారికి సమావేశంలోనే ఏదో ఒక సాకుతో చీవాట్లు, తలంటడాలు తప్పేది కాదని ఇప్పుడు చెబుతున్నారు.
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
`ఏడాది క్రితం సీసీఎస్ పోలీసులు ఒడిశా నుంచి 46 తులాలు బంగారు ఆభరణాలు రికవరీ చేసి జిల్లాకు తీసుకువచ్చారు. ఆభరణాలను సీసీఎస్ ఎస్సై ద్వారానే రాత్రికి రాత్రి మళ్లీ ఒడిశాలోని బరంపురం పంపించి కరిగించి.. అందులో 38 తులాలు నొక్కేసి కేవలం ఎనిమిది తులాలే రికవరీ అయినట్లు చూపించారన్న ఆరోపణలు వినిపించాయి.
`ఏడాది క్రితం నరసన్నపేట సర్కిల్‌కు వంద గ్రాములు బంగారం ఇండెంట్ పెట్టి చివరకు 60 గ్రాముల బంగారం బిస్కెట్‌ను తీసుకున్నారంటున్నారు. ఏఆర్ నుంచి సివిల్ విభాగానికి కన్వర్షన్ చేసుకున్న ఒక సీఐకి ఈ బాధ్యత అప్పగించారని తెలిసింది. నరసన్నపేటలో బంగారం వ్యాపారులు పెద్దసంఖ్యలో ఉన్నందున వంద గ్రాముల బంగారం బిస్కెట్ ఇవ్వాలన్న మేడమ్ ఆదేశాల మేరకు సీఐ బంగారు వర్తకుల నుంచి 80 గ్రాములు కలెక్ట్ చేసి 60 గ్రాములు మాత్రమే మేడమ్ చేతిలో పెట్టారట.
`ఆమదాలవలస సర్కిల్ నుంచి లక్షలు విలువైన ల్యాప్‌టాప్, టెక్కలి సర్కిల్ నుంచి ఆండ్రాయిడ్ టీవీని ఇండెంట్ పెట్టి తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
`వీటితో పాటు జిల్లాలోని ప్రతి సర్కిల్ నుంచి దాని స్థాయిని బట్టి ప్రతి నెలా రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇచ్ఛాపురం సర్కిల్ నుంచి గరిష్టంగా రూ.లక్ష, కనిష్టంగా కొత్తూరు సర్కిల్ నుంచి రూ.40వేలు వసూలు చేసేవారని, టెక్కలి సర్కిల్ నుంచి రూ.80 వేలు వసూలు చేశారని ప్రచారం ఉంది.
`సాధారణ బదిలీల సమయంలో 30 శాతం అలవెన్స్ వచ్చే పోస్టులకు రూ.లక్ష వసూలుచేసి పోస్టింగ్ ఇచ్చారన్న ఆరోపణలు వినిపించాయి. ఇలా పోటీపడి రూ.లక్షలు సమర్పించుకొని అనేక మంది పోస్టింగ్‌లు తెచ్చుకున్నారు. మంత్లీలతో పాటు ప్రతి సర్కిల్ నుంచి నెల నెలా ఖరీదైన కాస్మోటిక్స్‌ను ఆన్‌లైన్‌లో తెప్పించి మేడమ్ కార్యాలయానికి అందించారని విమర్శలున్నాయి. పేకాట, పిక్కాట ఆడిరచే వారి నుంచి మంత్లీలు వసూలుచేసి ఇవ్వాలని అన్ని సర్కిళ్లకు మౌఖిక ఆదేశాలు పంపించి, మందస, ఇచ్ఛాపురం, టెక్కలి, పాతపట్నం, కొత్తూరు సర్కిళ్ల పరిధిలో పేకాట శిబిరాల నిర్వహణకు మేడమ్ పర్మిషన్ ఇచ్చి ప్రతి నెలా రూ.లక్ష చొప్పున వసూలు చేసేవారని తెలిసింది.
గార ఎస్బీఐ కుంభకోణంలో పాత్ర
గత ఏడాది గార ఎస్‌బీఐ బ్రాంచ్‌లో తాకట్టు బంగారం మాయమైన కేసులో భారీగా డబ్బులు దండేసి అసలు నిందితులను తప్పించారన్న ఆరోపణలు మేడమ్‌పై ఉన్నాయి. ఈ కేసులో ఆత్మహత్య చేసుకున్న అసిస్టెంట్ మేనేజర్ స్వప్నప్రియ తల్లి ఈమేరకు జాతీయ మానవహక్కుల కమిషన్‌కు, కొత్త డీజీపీ ద్వారకా తిరుమలరావుకు కొద్ది రోజుల క్రితం లేఖ కూడా రాశారు. క్యాంపు కార్యాలయం వద్ద బందోబస్తు నిర్వహించే ఏఆర్ సిబ్బంది విశ్రాంతి తీసుకునే గదిలో ఫ్యాన్ స్విచ్ వేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై ఒక హోంగార్డ్ మృతిచెందగా, ఆ విషయం వెలుగులో రాకుండా మేనేజ్ చేశారు. మేడమ్ భర్తకు గన్‌మెన్, డ్రైవర్‌తో పాటు ప్రభుత్వ వాహనాన్ని సమకూర్చారని తెలిసింది.
ఆ ఆదాయం సొంత సంక్షేమానికే
జిల్లాలో పోలీసుల సంక్షేమానికి పనిచేస్తున్న అసోసియేషన్‌ను మేడమ్ హయాంలో పూర్తిగా నిర్వీర్యం చేశారనే విమర్శలు ఉన్నాయి. అడహాక్ కమిటీ పేరుతో అందరినీ సభ్యులుగా మార్చేశారు. అసోసియేషన్ లావాదేవీలపై ఎవరికీ లెక్కలు చెప్పాల్సిన అవసరం లేకుండా అక్రమాలకు అవకాశం కల్పించారని తెలుస్తుంది. ఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరంలోని పొట్టి శ్రీరాములు జంక్షన్ వద్ద ఏర్పాటుచేసిన పెట్రోల్ బంకు నిన్నటి వరకు మేడమ్ కనుసన్నల్లోనే నడిచింది. ఆయిల్ కంపెనీ ఇస్తున్న అద్దె రూ.1.50 లక్షలు, అమ్మకాలపై లీటరుకు ఇచ్చే కమీషన్ రూ.3.20పై లెక్కలు ఎవరికీ తెలియవు. అక్కడ ప్రభుత్వ వేతనాలు అందుకుంటున్న హోంగార్డులతో పని చేయిస్తున్నారు. కానీ ప్రైవేట్ వ్యక్తులు విధులు నిర్వహిస్తున్నట్టు చూపించి వారి వేతనాల పేరుతో మేడమ్ తన ఖాతాలోకి మళ్లించుకున్నారని విశ్వసనీయ సమాచారం. నగరంలో వన్‌టౌన్, టూ టౌన్ స్టేషన్లతో పాటు డీఎస్పీ, ఎస్పీ కార్యాలయాల ఎదురుగా ఉన్న మొత్తం 22 షాపుల నుంచి అందే అద్దెలో సగం మేడమ్ ఖాతాలోకే వెళ్లినట్టు ఆరోపణలున్నాయి. మేడమ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రూ.7,500, రూ.9వేలుగా ఉన్న వీటి అద్దెలను వంద శాతం పెంచారు. వీటిల్లో కొంత అనధికారికంగా మేడమ్ ఖాతాలో వెళ్లిపోయిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎచ్చెర్ల పోలీస్‌క్వార్టర్స్ కల్యాణ మండపంలో ఫంక్షన్లు నిర్వహించే ప్రైవేట్ వ్యక్తుల నుంచి వసూలుచేసే రూ.15వేల అద్దెకు రశీదు ఇవ్వడంలేదు. ఈ సొమ్ములెక్కడకు వెళ్తున్నాయో మేడమ్‌కు మాత్రమే తెలుసు. ఎచ్చెర్లలో పోలీసు శాఖకు చెందిన జీడితోట వేలం వేయగా వచ్చిన సొమ్ము ఎక్కడికెళ్లిందో మేడమ్‌కు తెలుసు.
ఇసుక నుంచీ కాసులు
ఇసుక దందాలను ప్రోత్సహిస్తూ అక్రమార్కుల నుంచి స్థానిక ఎస్సైల ద్వారా మంత్లీలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో ఇసుక రీచ్‌లు ఉన్న పోలీస్‌స్టేషన్ల పరిధిలో తనకు అనుకూలమైన వారికి పోస్టింగ్‌లు ఇచ్చి మరీ వసూలు చేయించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి నిజాయితీ కలిగిన పోలీసు అధికారుల సూచనలు పరిగణనలోకి తీసుకోకుండా వారి చర్యలను నియంత్రించారన్న ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఆమెకు రాజకీయ అండ ఉండటంతో వీటిని ఇన్నాళ్లు భరించిన జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది ఇప్పుడిప్పుడే బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు.
Kommentare