top of page

మిత్రమండలికి.. సరిపోని కామెడీ డోస్‌

  • Guest Writer
  • Oct 17
  • 3 min read
ree

బన్నీ వాసు వర్క్స్‌ పేరుతో సొంతంగా బేనర్‌ పెట్టి తొలి ప్రయత్నంగా ఆ సంస్థ నుంచి అందించిన ‘లిటిల్‌హార్ట్స్‌’తో పెద్ద హిట్టు కొట్టాడు బన్నీ వాసు. దీంతో ఆయన ప్రొడ్యూస్‌ చేసిన కొత్త చిత్రం ‘మిత్రమండలి’ పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. టీజర్‌.. ట్రైలర్‌ ఫన్నీగా సాగడంతో సినిమాకు మంచి బజ్‌ క్రియేటైంది. ప్రియదర్శి.. నిహారిక ఎన్‌ఎం ప్రధాన పాత్రల్లో కొత్త దర్శకుడు విజయేందర్‌ రూపొందించిన ఈ చిత్రం దీపావళి కానుకగా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం పదండి.

కథ:

జంగిలిపట్నం అనే ఊరులో ఎన్నికలు రావడంతో ఎమ్మెల్యే టికెట్‌ కోసం తుట్టె అనే కులానికి నాయకుడైన నారాయణ (వీటీవీ గణేష్‌).. ఫ్రీడమ్‌ రాజు (సత్య ప్రకాష్‌) మధ్య పోటీ నెలకొంటుంది. అదే ఊరిలో చైతన్య (ప్రియదర్శి).. సాత్విక్‌ (విష్ణు ఓయ్‌).. అభి (రాగ్‌ మయూర్‌).. రాజీవ్‌ (ప్రసాద్‌ బెహరా) అనే నలుగురు స్నేహితులు పనీ పాటా లేకుండా ఖాళీగా తిరుగుతుంటారు. ఓ రోజు సాత్విక్‌.. అభి.. స్వేచ్ఛ (నిహారిక ఎన్‌ఎం)ను చూసి ప్రేమలో పడిపోయి.. ఆమె కోసం కొట్టేసుకుంటారు. కొన్ని రోజులు వాళ్లిద్దరూ స్వేచ్ఛ వెనుక తిరిగాక.. ఆమె నారాయణ కూతురు అని తెలిసి భయపడతారు. అదే సమయంలో నారాయణ తన కూతురు లేచిపోయిందంటూ పోలీస్‌ స్టేషన్లో అనఫీషియల్‌ కంప్లైంట్‌ ఇచ్చి తన కోసం వెతకమంటాడు. మరి స్వేచ్ఛ ఎక్కడికి వెళ్లింది.. ఎవరితో ప్రేమలో పడిరది.. తన వల్ల ఈ నలుగురు స్నేహితులు పడ్డ ఇబ్బందులేంటి.. ఆమె తిరిగొచ్చిందా లేదా.. ఈ విషయాలన్నీ తెరపై చూడాల్సిందే..

కథనం-విశ్లేషణ:

చెప్పుకోవడానికి పెద్దగా కథ ఉండదు. స్క్రీన్‌ ప్లే ఫార్మాట్‌ అంటూ కూడా ఏమీ ఫాలో అవ్వరు. పాత్రలన్నీ నాన్‌ సీరియస్‌ గా కనిపిస్తాయి. సన్నివేశాల్లోనూ సీరియస్నెస్‌ ఉండదు. అన్ని పాత్రలూ కలిసి అల్లరల్లరి చేస్తుంటాయి. ఎంత సీరియస్‌ సిచువేషన్‌ అయినా.. కామెడీ టర్నే తీసుకుంటుంది. సిల్లీగా అనిపించినా సరే.. ప్రేక్షకులను నవ్వించడమే ధ్యేయంగా సన్నివేశాలు సాలుతాయి. వినోదం పంచడానికి టాలీవుడ్‌ దర్శకులు ఎంచుకున్న కొత్త రూటిది. జాతి రత్నాలు.. మ్యాడ్‌.. ఓయ్‌.. సింగిల్‌.. లిటిల్‌ హార్ట్స్‌.. ఈ కోవలో పలు చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకులను నవ్వించాయి. ఐతే ఈ ఫార్ములా ప్రతిసారీ వర్కవుట్‌ అవుతుందనే గ్యారెంటీ లేదు. పంచులు పేలకపోతే.. కామెడీ పండకపోతే ఇలాంటి ప్రయత్నాలు బూమరాంగ్‌ కూడా అవుతుంటాయి. ‘మిత్రమండలి’లో పై సినిమాల్లో మాదిరి కొంతమేర కామెడీ వర్కవుట్‌ అయింది. అక్కడక్కడా నవ్వులు పండాయి. కానీ సినిమా అంతా అలాగే నవ్వించి ఉంటే.. ఇది కూడా పై జాబితాలో చేరేది. కానీ కథ మరీ పలుచనైపోవడం.. సరైన కామెడీ సిచువేషన్లు క్రియేట్‌ చేయకపోవడం.. నవ్వులు అనుకున్నంతగా పండకపోవడంతో ‘మిత్రమండలి’ ప్రేక్షకులకు మిశ్రమానుభూతినే మిగులుస్తుంది.

‘మిత్రమండలి’ దర్శకుడు..

‘జాతిరత్నాలు’ డైరెక్టర్‌ అనుదీప్‌.. ‘మ్యాడ్‌’ డైరెక్టర్‌ కళ్యాణ్‌ శంకర్‌ లకు స్నేహితుడు. పైగా రూం మేట్‌ అట. వాళ్లిద్దరి సహవాసం వల్లో.. లేక ట్రెండును ఫాలో అయిపోదాం అనుకున్నాడో కానీ.. అచ్చంగా అలాంటి కథతో నవ్వులు పంచడానికే ప్రయత్నించాడు. వాటిలో మాదిరే తింగరిగా అనిపించే నలుగురు కుర్రాళ్లు.. వాళ్లు చేసే అల్లరి చుట్టూ తిరిగే కథ ఇది. ఆ క్యారెక్టర్లు మాత్రమే కాక.. సినిమాలో ప్రతి పాత్రా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటుంది. సిల్లీగా మాట్లాడుతుంటుంది. కానీ ఆ క్యారెక్టర్లు ప్రేక్షకులకు క్రేజీగా అనిపిస్తే.. డైలాగుల్లో పంచ్‌ ఉంటే.. సిచువేషన్‌ కూడా ఫన్నీగా అనిపిస్తే కామెడీ వర్కవుట్‌ అవుతుంది. కానీ ‘మిత్రమండలి’లో అది అనుకున్న స్థాయిలో జరగలేదు. ప్రియదర్శి.. విష్ణు ఓయ్‌.. సత్య.. వెన్నెల కిషోర్‌.. ప్రసాద్‌ బెహరా.. రాగ్‌ మయూర్‌.. ఇలా ఎవరికి వాళ్లు కామెడీ పండిరచడంలో కింగులే అయినా.. వారిని సరిగా ఉపయోగించుకోలేదు. వారి ప్రతిభకు తగ్గ పాత్రలను క్రియేట్‌ చేయలేకపోయారు. ఈ ఆర్టిస్టులందరూ అక్కడక్కడా కొంచెం నవ్వించారు. కానీ డోస్‌ సరిపోలేదు. మధ్య మధ్యలో ఒక జోక్‌ పేలడం.. కాస్త హుషారు రావడం.. అంతలోనే తర్వాతి సన్నివేశం డల్లుగా మారడం.. నవ్వు రాకపోవడం.. ఇదీ వరస. కామెడీ పేలిపోతుందని ఆశించే కొన్ని సన్నివేశాలు వీక్‌ రైటింగ్‌ వల్ల సాధారణంగా మారిపోయాయి. కథలో చెప్పుకోదగ్గ మలుపులు లేకపోవడం మైనస్‌. తర్వాత ఏం జరుగుతుందో ఈజీగా ఊహించేయొచ్చు.

‘మిత్రమండలి’ కథలో హీరోయిన్‌ పాత్ర కీలకం. సోషల్‌ మీడియాలో మంచి ఎంటర్టైనర్‌ గా పేరు తెచ్చుకున్న నిహారిక ఎన్‌ఎం చేయడంతో ఆ పాత్ర మీద చాలా అంచనాలు పెట్టుకుంటాం కానీ.. ఆమె పాత్ర-పెర్ఫామెన్స్‌ నిరాశ పరుస్తాయి. తన క్యారెక్టర్ని సరిగా డిజైన్‌ చేయలేదు. మరీ సిల్లీగా అనిపించే పాత్ర తనది. ప్రియదర్శి సహా నలుగురు మిత్రుల పాత్రలు కూడా ఆశించినంత వినోదాత్మకంగా లేవు.

‘ఇంపార్టెంట్‌ క్యారెక్టర్‌’ అంటూ ప్రోమోల్లో క్రేజీగా అనిపించిన సత్య పాత్ర మిక్స్డ్‌ ఫీలింగ్‌ ఇస్తుంది. సత్య తన కామెడీ టైమింగ్‌ తో కొంత నవ్వించినా.. ఆ పాత్ర సినిమాలో ఎందుకుందో అర్థం కాదు. చివర్లో ఏదో జస్టిఫికేషన్‌ ఇచ్చినా కుదరలేదు. సమాజంలో వేళ్లూనుకుపోతున్న ‘కులం’ మీద సినిమాలో చాలా సెటైర్లే వేశారు. అవి బాగానే పేలాయి. కులాంతర వివాహాలు.. కులం చుట్టూ తిరిగే రాజకీయాలు.. లాంటి టాపిక్స్‌ తీసుకుని వాటి మీద వేసిన పంచులు బాగున్నాయి. ఈ సన్నివేశాలు కొంత ఆలోచన రేకెత్తిస్తాయి కూడా. పాటలన్నీ కూడా చాలా వరకు పేరడీలే. ?కత్తందుకో జానకి.. క్లైమాక్స్‌ లో ఫోక్‌ సాంగ్‌ వినడానికి బావున్నాయి. ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా ఒక మోస్తరు కామెడీతో సరిపెట్టుకుంటామంటే ‘మిత్రమండలి’పై ఒక లుక్కేయొచ్చు. అంతకుమించి ఆశిస్తే మాత్రం నిరాశ తప్పదు.

నటీనటులు - పెర్ఫార్మెన్స్‌ :

ఈ మధ్య కొంచెం సీరియస్‌ పాత్రలు చేసిన ప్రియదర్శి.. మళ్లీ ‘జాతిరత్నాలు’ తరహా కామెడీ రోల్‌ ట్రై చేశాడు. ఆ పాత్రకు ఫిట్‌ అనిపించాడు. తన పెర్ఫామెన్స్‌ ఓకే. కానీ ఇంతకుముందులా మాత్రం నవ్వించలేకపోయాడు. తమిళంలో ‘పెరుసు’తో ఆకట్టుకున్న సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ నిహారిక ఎన్‌ఎం.. తెలుగు డెబ్యూలో అంచనాలను అందుకోలేకపోయింది. తన అప్పీయరెన్స్‌.. పెర్ఫామెన్స్‌ జస్ట్‌ ఓకే అనిపిస్తాయంతే. రాగ్‌ మయూర్‌.. విష్ణు ఓయ్‌.. ప్రసాద్‌ బెహరా స్నేహితుల పాత్రల్లో బాగానే చేశారు. కొంతమేర నవ్వించారు. కుల నాయకుడి పాత్రలో వీటీవీ గణేష్‌ కామెడీ పెద్దగా పేలలేదు. వెన్నెల కిషోర్‌ ఉన్నాడు కదా అని ఎక్కువ ఊహించుకుంటే కష్టం. తన కామెడీ వర్కవుట్‌ కాలేదు. సత్య ప్రకాష్‌.. జీవన్‌ రెడ్డి ఓకే. సత్య బాగా పెర్ఫామ్‌ చేసినా.. తన పాత్ర అనవసరం అనిపిస్తుంది. బ్రహ్మానందం చిన్న పాత్రలో మెరిసి మాయమయ్యారు.

సాంకేతిక వర్గం - పనితీరు :

సంగీత దర్శకుడు ఆర్‌ఆర్‌ ధ్రువన్‌.. ఈ కథకు తగ్గట్లుగా ఎక్కువగా రీమిక్స్‌.. పేరడీ పాటలే అందించాడు. అవి ఎంటర్టైనింగ్‌ గా అనిపిస్తాయి. ధ్రువన్‌ నేపథ్య సంగీతం ఓకే. సిద్దార్థ్‌ ఎస్జే సినిమాటోగ్రఫీ బాగానే సాగింది. విజువల్స్‌ కలర్‌ ఫుల్‌ గా అనిపిస్తాయి. నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. ఇలాంటి సినిమాల్లో కథ గురించి ఎవరూ పెద్దగా ఆలోచించరు. ఫన్నీ సిచువేషన్లు క్రియేట్‌ చేయడం.. డైలాగుల్లో పంచ్‌ ఉండడం కీలకం. ఆ విషయంలో కొత్త దర్శకుడు విజయేందర్‌ కొంత ప్రయత్నం చేశాడు. తన సెన్సాఫ్‌ హ్యూమర్‌ కొన్ని సన్నివేశాల్లో కనిపిస్తుంది. కానీ చాలా చోట్ల రైటింగ్‌ మరీ తేలిగ్గా అనిపిస్తుంది. అందువల్లే సన్నివేశాలు పండలేదు. విజయేందర్‌ టేకింగ్‌ ఓకే.

- తుపాకి.కామ్‌ సౌజన్యంతో...


Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page