మంత్రి పేరుతో చిల్లర పనులు
- Prasad Satyam
- Mar 24
- 1 min read
హైదరాబాద్ యువతి నుంచి సొమ్ములు వేయించుకున్న నకిలీ నాయకుడు
టెక్కలికి చెందిన తరుణ్‌గా గుర్తించిన టీడీపీ వర్గాలు

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
కేంద్ర పౌరవిమాన యాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేరుతో ఒక ఫేక్ ఐడీని ఫేస్బుక్లో క్రియేట్ చేసి, హైదరాబాద్‌కు చెందిన ఒక యువతిని ఆర్థికంగా మోసం చేసిన కేసును ప్రాథమికంగా టీడీపీ శ్రేణులు, ముఖ్యంగా కేంద్రమంత్రి కార్యాలయం గుర్తించింది. శ్రీకాకుళానికి చెందిన మహిళ హైదరాబాద్‌లో స్థిరపడి, ఒక పని కోసం రామ్మోహన్ నాయుడుకు సోషల్ మీడియాలో ఫిర్యాదు చేయాలనుకున్నప్ప్పుడు ఈ ఫేక్ ఐడీకీ కాంటాక్ట్ అయింది. అప్పట్నుంచి తానే రామ్మోహన్నాయుడినంటూ ఆయన ఫొటోలతో కూడిన సామాజిక మాధ్యమంలో ఆమెతో పరిచయం పెంచుకొని విడతలవారీగా సొమ్ములు వసూలు చేశాడు. ఈ విషయం మంగళవారం ఉదయం ఈనాడు పత్రికలో ప్రచురితమైంది. దీంతో అలర్ట్ అయిన తెలుగుదేశం వర్గాలు ఈ ఫేక్‌గాడు ఎవడని ఆరా తీస్తే.. టెక్కలికి చెందిన తరుణ్‌గా గుర్తించారు. గతంలో కూడా మంత్రి పీఏనంటూ కొందరికి, తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్నానంటూ మరికొందరికి.. ఇలానే మోసం చేయడంతో మంత్రి కార్యాలయ వర్గాలు ఈయన్ను దూరంపెట్టాయి. ఆమధ్య టెక్కలి పోలీస్‌స్టేషన్‌లో ఓ వ్యవహారంపై తన మనుషులకు అనుకూలంగా వ్యవహరించాలంటూ పోలీసులపై ఒత్తిడి తేవడంతో అప్పట్లోనే పోలీసు అధికారి ఒకరు మంత్రి కార్యాలయానికి ఈ విషయం తెలియజేశారు. తరుణ్ గత చరిత్ర కూడా దీనికి అనుగుణంగానే ఉండటంతో పోలీస్‌స్టేషన్ వ్యవహారాన్ని సీరియస్‌గానే తీసుకున్నారు. వాస్తవానికి 2024 ఎన్నికలకు ముందు నుంచి తరుణ్‌ను పక్కన పెట్టారు. అయితే మొదట్నుంచి తెలుగుదేశం సానుభూతిపరుడిగాను, రామ్మోహన్ నాయుడికి వీరాభిమానిగా ఉన్న తరుణ్ 2024 ఎన్నికల తర్వాత కూడా ఇలాగే వ్యవహరించడంతో పార్టీ నుంచి కూడా ఆయనకు ఎటువంటి సమాచారం ఇవ్వడం మానేశారు. అయితే సామాజిక మాధ్యమం ద్వారా యువతిని ఆర్థికంగా మోసం చేసిన వ్యవహారం టెక్కలి పోలీస్‌స్టేషన్ కంటే ముందుదని తెలుస్తుంది. స్వయంగా రామ్మోహన్నాయుడు పేరు చెప్పే సొమ్ములిచ్చిన ఆ యువతి అవగాహన రాహిత్యంపై కూడా పలువురు చర్చించుకుంటున్నారు. కేంద్రమంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు హైదరాబాద్‌లో ఉన్న యువతికి తాను చెప్పినవారికి డబ్బులివ్వాలని కోరడమేమిటన్న అనుమానం ఆ యువతికి రాకపోవడం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. ఏది ఏమైనా ఈ కేసులో నిందితుడెవరనేది తెలిసినా, బాధితురాలు ఫిర్యాదు చేయనందున ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.






Comments