top of page

ముందు ‘నిమ్మ’ లెక్క తేల్చండి

Writer: NVS PRASADNVS PRASAD
  • పాత వీసీ, శిష్యుడిపై ఆప్షేకు ఫిర్యాదు

  • విచారణకు వీలుగా ఆధారాలు

  • అడ్డగోలు నియామకాల నుంచి నిధుల గోల్‌మాల్‌ వరకు

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

స్థానిక వర్సిటీలో ప్రస్తుత వీసీ, రిజిస్ట్రార్‌పై పలువురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారించడానికి ఉన్నత విద్యామండలి కార్యదర్శి వస్తున్నారు. నిధుల దుర్వినియోగం, అక్రమ నియామకాలు జరిగాయని కొందరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ నిర్వహించడానికి త్వరలోనే రానున్నట్లు తేలింది. అయితే ఇప్పటి వీసీ, రిజిస్ట్రార్‌లు అడ్డుగోలు నియామకాలకు, నిధుల దుర్వినియోగానికి పాల్పడితే ఎలాగూ బయటపెడతారు. పనిలో పనిగా 2021 జనవరి నుంచి 2024లో ప్రస్తుత వీసీ రజనీ వచ్చేవరకు జరిగిన అవినీతి, అవకతవకల మీద కూడా విచారణ పూర్తిచేసి నివేదిక ఇస్తే బాగుంటుందని రాష్ట్ర ఉన్నత విద్యామండలికి ఓ ఫిర్యాదు వెళ్లింది. గతంలో ఉన్నత విద్యామండలి జేడీ కృష్ణమూర్తి ఇచ్చిన నివేదిక బయటపెట్టాలని, అదే సమయంలో అప్పుడు ఉన్నత విద్యామండలి కార్యదర్శిగా పని చేసిన నజీర్‌ అహ్మద్‌ రిపోర్టును కూడా బయటపెట్టాలని కోరుతూ ఉన్నత విద్యాశాఖకు కొందరు లేఖ రాశారు. వీసీగా రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ నిమ్మ వెంకట్రావు, ఆయన శిష్యుడు ఎడ్యుకేషన్‌ ఫ్యాకల్టీ అయిన హనుమంతు సుబ్రహ్మణ్యంపై విజిలెన్స్‌ కమీషన్‌ వేసి ఎంక్వైరీని చేపట్టాలని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంజినీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌, ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌, బీసీడీయూ కోఆర్డినేటర్‌, లా కాలేజీ ఫ్యాకల్టీ బాలకృష్ణ, మన్మధరావుతో పాటు 34 మంది నాన్‌ టీచింగ్‌ సిబ్బందిని నియమించిన అంశం మీద విచారణ జరిపించాలని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి గత చైర్మన్‌ హేమచంద్రారెడ్డితో కుమ్మక్కయి ఏజీఎస్‌ మ్యాన్‌పవర్‌ అనే ఏజెన్సీని చూపించి డబ్బులు దండుకొని నోటిఫికేషన్‌, రోస్టర్‌ పద్ధతి లేకుండా కనీస అర్హతలు లేనివారిని నియమించుకున్నారని అప్పట్లోనే దళిత సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఇది కాకుండా 56 మంది సబ్జెక్ట్‌ కాంట్రాక్ట్‌ టీచర్లను రికార్డుల్లో మాత్రమే చూపించి లేనివారి, రానివారి పేరుతో యూనివర్సిటీ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసి పెద్ద మొత్తంలో సొమ్ములు తినేశారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. యాడ్జెంట్‌ ఫ్యాకల్టీ పేరుతో అర్హత లేనివారికి యూనివర్సిటీలో నియమించారని, దీనిపై విచారణ చేపట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. కోట్ల రూపాయలతో కంప్యూటర్లు కొనుగోలు చేశామని చూపించి, అందులో ఒరిజినల్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ లేకుండా నాసిరకమైన డబ్బాలు పెట్టి డిఫాల్టరైన ఒక సంస్థకు ఈ కాంట్రాక్ట్‌ను అప్పగించి సొమ్ములు చేసుకున్న అంశంపై విచారణ జరపాలని కోరారు. 400 కంప్యూటర్లు కొనుగోలు చేసినట్లు రికార్డుల్లో చూపుతున్నా ఎక్కడా ఆ సంఖ్యలో కనిపించలేదని, ఇంతవరకు ఒక్క ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌ కూడా యూనివర్సిటీలో పెట్టకపోవడానికి కారణం కంప్యూటర్లు పని చేయకపోవడమేనని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. 2022 నుంచి పాలకమండలి సమావేశాలు నిర్వహించకుండా, ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ అనుమతి లేకుండా, నచ్చినవారికి ఉద్యోగాలు వేసుకోవడంపై విచారణ జరపాలని కోరారు. రూ.1.50 కోట్లు పైన ఖర్చు పెట్టి నాసిరకం ఫర్నిచర్‌ కొనుగోలు చేసి అప్పటి వీసీ నిమ్మ వెంకట్రావు, ఆయన శిష్యుడు హనుమంతు సుబ్రహ్మణ్యం ఇంటిలో వీటిని కొంతమేర సమకూర్చుకున్నారని, యూనివర్సిటీలోని పాత పేపర్లను స్క్రాప్‌గా అమ్మడంలో కుంభకోణం జరిగిందని, ఎక్కువ మొత్తం ఇస్తామని వచ్చిన కాంట్రాక్టర్‌ను భయపెట్టి క్విడ్‌ప్రో కో పద్ధతిలో సుబ్రహ్మణ్యం, నిమ్మ వెంకట్రావు, ఉదయ్‌భాస్కర్‌లు సొమ్ములు పంచుకున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. లేనిపోని కమిటీల పేరుతో యూనివర్సిటీ ఫండ్‌ను దుబారా చేసి కొందరు చక్కగా ఎంజాయ్‌ చేశారని, సొంత అజెండాతో యూనివర్సిటీలో భయాందోళనలు సృష్టించి అప్పటి వీసీ నిమ్మ వెంకట్రావు ఆయన శిష్యుడు పాశవిక ఆనందం పొందారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. గత వీసీ జాబ్‌ గ్యారెంటీ ఉన్న ఆరు డిపార్ట్‌మెంట్లను ఎత్తేసి శ్రీకాకుళం విద్యార్థులకు అన్యాయం చేశారని, స్టాఫ్‌ డెప్యుటేషన్‌ పేరుతో తనకు కావాల్సినవారిని యూనివర్సిటీకి తీసుకువచ్చి డబ్బులు స్వాహా చేశారని, దీనిపై కూడా విచారణ జరపాలని, కేవలం గార్డెనింగ్‌, బ్యూటిఫికేషన్‌ అంటూ రూ.50 లక్షలు స్వాహా చేసిన ఆధారాలను ఈ ఫిర్యాదుకు జత చేశారు. ఇక ఎగ్జామినేషన్‌ సెక్షన్‌లో ఫెయిలైన విద్యార్థులకు కూడా డిగ్రీలు అమ్ముకున్నారని, బాగా చదువుకునే విద్యార్థులను ఫెయిల్‌ చేశారంటూ కొన్ని ఉదాహరణలు జత చేశారు. బీఈడీ, బీపీఈడీ ర్యాటిఫికేషన్‌లో అవకతవకలు వీరి హయాంలో పెరిగిపోయాయని, వీటి పరీక్షలు యూనివర్సిటీలో పెట్టి ఎగ్జామ్‌ రూమ్‌కు కొంత మొత్తం ముట్టజెప్పాలని, లేదంటే పరీక్షలు పకడ్బంధీగా నిర్వహించి ఫెయిల్‌ చేస్తామని భయపెట్టడంతో ఒక్కొక్కరి నుంచి రూ.6వేలకు పైగా వసూలు చేశారని ఉన్నత విద్యామండలికి పంపిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బీఈడీ, యూజీ కాలేజీల నుంచి రేషనలైజేషన్‌ చేయడానికి లేనిపోని కొర్రీలు పెట్టి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని, వర్సిటీ పరిధిలో టీచర్‌ ఎడ్యుకేషన్‌ మొత్తం నాశనం చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆడిట్‌లో వచ్చిన అభ్యంతరాలను కప్పిపుచ్చడానికి రిటైర్డ్‌ ఆడిటర్‌ జనార్థనరావుతో సెపరేట్‌ వింగ్‌ ఏర్పాటుచేసి నిమ్మ వెంకట్రావు అన్ని ఆడిట్‌ శాఖలను మేపారని, ఆడిట్‌లోనే అనేక అభ్యంతరాలు ఉన్నాయని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అసలు స్పోర్ట్సే నిర్వహించకుండా పెద్ద ఎత్తున నిధులు మింగేశారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ముందు నిమ్మ వెంకట్రావు హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై దర్యాప్తు జరిపి, ఆ తర్వాత కొత్త ఫిర్యాదులపై విచారణ చేపట్టాలని దళిత సంఘాలు కోరుతున్నాయి.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page