ముద్రగడ పిలుపే ప్రభంజనం
- SATYAM DAILY
- Jul 15
- 4 min read

(సత్యంన్యూస్, అమరావతి)
ఉద్యమకారుడు అనే పదానికి నిలువెత్తు నిదర్శనం ముద్రగడ పద్మనాభం. ఆయన జీవితంలో అనేక పార్టీలను వదిలేసుండొచ్చు. కానీ, కాపు ఉద్యమాన్ని మాత్రం ఆయన ఏనాడూ పక్కన పెట్టలేదు. ‘నా పిలుపే ప్రభంజనం’ అనే ఒక నినాదపు పద సమాసానికి సజీవ రూపం ఆయనదే. ప్రత్తిపాడు ప్రాంతంలో తిరుగులేని నాయకత్వ పటిమ కనపరచి ఆ నియోజక వర్గానికి రెండు పర్యాయాలు శాసన సభ్యుడిగా సేవలందించిన ముద్రగడ వీరరాఘవరావు పెద్ద కుమారుడిగా ఆయన 1978లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి జనతా పార్టీ టికెట్ మీద పోటీ చేసి అప్పటి ఇందిరా కాంగ్రెస్ ప్రభంజనంలో గాలికి ఎదురెళ్లి విజయం సాధించి కేవలం 26 ఏళ్ల వయసులో తొలిసారి శాసన సభ్యుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత కాలంలో జనతా పార్టీ అంతరించిపోయాక తెలుగుదేశం పార్టీలో రెండవసారి గెలిచి ఎన్టీఆర్ మంత్రి వర్గంలో చేరారు. ఆ మధ్యలో జరిగిన నాదెండ్ల వ్యవహారంలో చంద్రబాబు ఆధ్వర్యంలో కర్ణాటక నంది హిల్స్ క్యాంపునకు హాజరు కావాలని బాబు వర్గం కోరినప్పటికీ నేను కిర్లంపూడిలోనే ఉంటాను, ఎన్టీఆర్ గుర్తు మీద గెలిచి వేరే వాళ్లకు మద్దతు తెలిపే మనిషిని కాను, అలా మద్దతు తెలపాలనుకుంటే మీరిచ్చిన పదవిని మీకు తిరిగి ఇచ్చేసి మాత్రమే నేను వెళ్తాను తప్పా.. ఇలాంటి క్యాంపు రాజకీయాలకు నేను హాజరు కాబోను అంటూ నైతిక విలువల స్థాయిని అప్పట్లోనే ఆయన కనబరిచారు. అటుపై రామారావుతో బస్సుల విషయంలో విభేదించి తన రాజీనామాను సీల్డ్ కవర్‌లో రామారావుకు పంపించేసి తన స్వగ్రామమైన కిర్లంపూడికి వచ్చేశారు. అటుపై ఎన్టీఆర్ ఎంతమంది దూతలను పంపినా ససేమిరా అంటూ తిరిగి ఆయన దగ్గరకు వెళ్లలేదు.
తర్వాత కాలంలో వంగవీటి మోహన రంగాను ఎన్టీఆర్ ప్రభుత్వం దేవినేని మురళీ హత్య కేసులో అరెస్టు చేసినప్పుడు విజయవాడ కృష్ణానది నడిఒడ్డున జరిగిన అపూర్వ మహాసభకు ఆయనే ప్రధాన ఆకర్షణగా నిలిచారు. రాష్ట్ర నలుమూలల నుంచి దాదాపు 20 లక్షల మందికి పైగా హాజరైన సభ బహుశా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అది ఒక్కటే కావచ్చు. రంగా హత్య అనంతర పరిణామాలలో అప్పటి రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం చొరవతో 1989లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి 3వ సారి గెలిచారు. ఆ ఎన్నిక సందర్భంగా కత్తిపూడిలో రాజీవ్ గాంధీ పాల్గొన్న బహిరంగ సభ ఏర్పాట్లను చూసి రాజీవ్ గాంధీయే ఆశ్చర్యపోయారని అప్పట్లో గొప్పగా చెప్పుకున్నారు. అప్పటివరకు ఒడిశా వైపు నుంచి రోడ్డు మార్గంలో రెండు మూడు సభలలో మాట్లాడిన రాజీవ్‌కు కత్తిపూడిలో వచ్చిన జన ప్రవాహం చూసి ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. ఆ మొత్తం ముద్రగడ చలవతోనే జరిగింది. సాయంత్రం 8 గంటలకు రావలసిన రాజీవ్‌గాంధీ తెల్లవారు జామున 4 గంటలకు సభకు రాగలిగారు. రాహుల్ గాంధీ కూడా అప్పుడు తండ్రి వెంట ఉన్నారు.
1989లో చెన్నారెడ్డి మంత్రి వర్గంలో చేరిన తర్వాత కొద్ది కాలానికి ఆయన పదవి నుంచి దిగిపోవడం, తర్వాత జరిగిన మార్పుల్లో ఈయన శాసనసభ్యుడిగా మిగిలిపోవడం, ఆపైన 1993లో అప్పటి ముఖ్యమంత్రి విజయభాస్కర రెడ్డి రావులపాలెం వస్తే కాపు యువత చేపట్టిన నిరసన కార్యక్రమంలో కొంతమందికి లాఠీ దెబ్బలు తగలడం, దానిపై ముద్రగడ ఉద్యమం చేపట్టి రాష్ట్రమంతా సైకిల్ యాత్ర, అటుపైన ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి 1994 జులై 25న కాపులను, 13 ఇతర కులాలకు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ కలిపిస్తూ, తర్వాత వచ్చే కమిషన్ రిపోర్టును బట్టి కాపు కులాలను బీసీలలో చేరుస్తామంటూ ఒక జీవో ఇచ్చింది. సహజంగానే ఫలితాన్ని సంగ్రహించలేని ఆ వర్గం ఆ అవకాశాన్ని తర్వాత కాలంలో ఎన్టీఆర్ ప్రభంజనం, తర్వాత చంద్రబాబు పదవిలోకి రావడంతో జారవిడుచుకొంది. తర్వాత జరిగిన పరిణామాలలో ముద్రగడ తిరిగి చంద్రబాబు ఆహ్వానం మేరకు తెలుగు దేశంలో చేరి 1999లో కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1999 నుంచి 2004 వరకు నిర్వహించిన పార్లమెంట్ సభ్యుడి పదవే ఆయన జీవితంలో చివరిగా నిర్వహించ అధికారిక పదవి.
ఒక్క పిలుపుతో లక్షలాది మందిని కదిలించిన వ్యక్తిత్వం ఆయన సొంతం. తగినంత చదువు లేకపోవడం, పట్టిన మొండి పట్టును వీడకపోవడం, రాజకీయ లౌక్యం తెలుసుకోలేకపోవడం, మొదలైన కారణాలతోనైతేనేమి, అనవసరమైన మార్పిడిల వల్లనైతేనేమి రాజకీయంగా ఆయన తగినంత స్థాయిలోకి రాలేకపోయారేమో గానీ అంత ప్రజాకర్షణ కలిగిన నాయకుడు మరొకరు లేరు. జీవితం మొత్తం మీద అవినీతి మరక అంటని సచ్ఛీలత ఆయన సొంతం. ఆయన జీవిత చరమాంకంలో వైభవం తగ్గడం, ప్రాభవం తగ్గిపోవడం, అనారోగ్యం బారిన పడటం, చివరగా ఇంకా వయసు ఉండగానే అకాల మరణం పొందటం దురదృష్టకరం.
సమకాలీనుల ప్రస్థానం.. వ్యూహాత్మక లోపాలు తెచ్చిన సందిగ్ధత
ముద్రగడ రాజకీయ జీవితం ఆసక్తికరమైన మలుపులతో నిండినది. 1978లో వై.ఎస్.రాజశేఖర రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, ముప్పవరపు వెంకయ్యనాయుడు వంటి దిగ్గజాలతో కలిసి రాజకీయ ప్రస్థానం ప్రారంభించినా, అలాగే తెలంగాణ ఉద్యమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కంటే ఐదేళ్ల ముందే శాసనసభలో అడుగుపెట్టినా, వారి స్థాయిలో ఆయన జాతీయ లేదా రాష్ట్ర రాజకీయ శిఖరాలను అందుకోలేకపోవడానికి ఆయన తీసుకున్న కొన్ని తొందరపాటు నిర్ణయాలే కారణమని విశ్లేషకులు భావిస్తారు. రాజకీయాలలో వ్యూహాత్మక చతురత కంటే భావోద్వేగాలకే పెద్దపీట వేయడం, నిరంతరం రాజీనామాలకు సిద్ధపడటం ఆయన రాజకీయ ఎదుగుదలకు కొంతవరకు అవరోధంగా మారాయి.
1982లో నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ముద్రగడ అందులో చేరి 1983, 1985 ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి విజయం సాధించారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో విజయవాడ నగర బస్సుల వివాదంపై అసంతృప్తితో పదవికి రాజీనామా చేసి కిర్లంపూడి వెళ్లిపోయారు. ఆ తర్వాత పెద్దలు నచ్చజెప్పడంతో తిరిగి వచ్చి ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అయినప్పటికీ, 1987 నాటి సహకార బ్యాంకు ఎన్నికలలో అభ్యర్థుల ఎంపిక విషయంలో వచ్చిన విభేదాల కారణంగా తిరిగి అసంతృప్తికి గురయ్యారు. ఇటువంటి వరుస నిర్ణయాలు ఆయన రాజకీయ ప్రయాణంలో నిలకడలేమిని ప్రదర్శించాయనే విమర్శలను కూడా తెచ్చిపెట్టాయి.
ఉత్తరకంచి ఘర్షణ.. కాపు సామాజిక వర్గ నేతగా ఆవిర్భావం
ముద్రగడ పద్మనాభాన్ని కేవలం ఒక ప్రాంతీయ నాయకుడి నుంచి సామాజిక వర్గ ప్రతినిధిగా నిలబెట్టిన ఘట్టం 1988లో ప్రత్తిపాడు మండలంలోని ఉత్తరకంచి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక దళితులు, బలహీన వర్గాలకు చెందిన కొందరు యువకులను పోలీసులు అరెస్ట్ చేయడంతో, ఆ విషయం తెలుసుకున్న ముద్రగడ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. పోలీసులు ఆయనను లోపలికి అనుమతించకపోవడంతో ఆగ్రహించిన ముద్రగడ, స్టేషన్ ముందే టెంట్లు వేసి నిరసనకు దిగారు. ఐదు రోజుల పాటు నిరసన సాగినా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆయన ఆమరణ నిరాహార దీక్ష ప్రకటించారు. ఈ దీక్షతో ఉమ్మడి గోదావరి జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా కోనసీమ ప్రాంతం నుంచి వేలాది మంది ప్రజలు ఉత్తరకంచికి తరలివచ్చారు. శాంతిభద్రతల సమస్య తలెత్తే పరిస్థితి రావడంతో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఆ యువకులను బేషరతుగా విడుదల చేయించారు. ఈ విజయం ముద్రగడను సామాజిక వర్గ అస్తిత్వ పోరాటాల వైపు మళ్లించింది.
రిజర్వేషన్ల పోరాటం.. సామాజిక సందిగ్ధత
కొంతకాలం ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న ముద్రగడను 2014 నాటి రాజకీయ పరిణామాలు తిరిగి సామాజిక ఉద్యమం వైపు నడిపించాయి. కాపు సామాజిక వర్గాన్ని వెనుకబడిన తరగతుల (బీసీ) జాబితాలో చేర్చాలనే సుదీర్ఘ డిమాండ్‌ను పునరుద్ధరిస్తూ 2016 జనవరి 31న తూర్పుగోదావరి జిల్లా తునిలో భారీ ఎత్తున ‘కాపు ఐక్యగర్జన’ సభను నిర్వహించారు. ఈ సభ ముగిసే సమయానికి చెలరేగిన హింస, రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలు దహనం వంటి ఘటనలు రాష్ట్ర రాజకీయాలను కుదిపేశాయి. ఈ ఉద్యమ క్రమంలో ఆయన తన నివాసంలో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు.
భావోద్వేగాల ఆధారంగా సాగిన ఈ ఉద్యమం వల్ల తదుపరి కాలంలో అనేక మంది సామాజిక వర్గ యువకులు పోలీస్ కేసులు, కోర్టుల చుట్టూ తిరగాల్సి రావడం ఒక ప్రధాన లోపంగా నిలిచింది. అంతేకాకుండా, సామాజిక వర్గ ప్రయోజనాల కోసం పోరాడుతున్నట్లు ప్రకటించినా, అదే సామాజిక వర్గానికి చెందిన చిరంజీవి, దాసరి నారాయణరావు, తులసి రామచంద్రప్రభు వంటి ఉన్నత స్థాయి వ్యక్తులు తనను సంప్రదించినప్పుడు వారిని ప్రోత్సహించలేదనే విమర్శలు కూడా ఆయనపై ఉన్నాయి.
2005లో పోలవరం ఎడమకాలువ, పుష్కరం ఎత్తిపోతల కోసం ప్రత్తిపాడు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో భూములు కోల్పోతున్న రైతులకు అండగా.. భూమికి భూమి అనే నినాదంతో సొంత ఇంట్లో పక్కన ఒక తుపాకీ, తలకు రివాల్వర్ పెట్టుకొని ఆమరణ నిరహార దీక్ష చేసి రైతులకు మేలు చేసిన ఉద్యమం అజరామరం. జానారెడ్డి, కె.ఇ.కృష్ణమూర్తి, వసంత నాగేశ్వరరావులతో కలిసి ముద్రగడ తెలుగునాడు అనే పార్టీని స్థాపించి 1989 ఎన్నికల ముందు కాంగ్రెసులో విలీనం చేశారు. గడిచిన ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడం ద్వారా తన పేరు వెనుక రెడ్డిని చేర్చుకుంటానన్న శపథం మేరకు చివరి వరకు అలాగే బతికిన ముద్రగడను గెలుపు ఓటములకు అతీతంగా చరిత్ర గుర్తు పెట్టుకుంటుంది.






Comments