top of page

మౌనమే ఆయన భాష.. ఇన్‌ఛార్జి కోసం పార్టీ ఘోష

Writer: NVS PRASADNVS PRASAD
  • శ్రీకాకుళం వైకాపాకు కొత్త నాయకత్వం

  • రేసులో వెలమలు, కాపులు

  • అర్బన్‌పైనే జగన్‌ చూపు

  • రెండేళ్ల కోసం తాత్కాలిక నియామకం

(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం)

సీనియర్‌ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇంకా మౌనం వీడకపోవడంతో శ్రీకాకుళం నియోజకవర్గానికి వైకాపా తరఫున నూతన ఇన్‌ఛార్జిని నియమించే పనికి ఉపక్రమించింది ఆ పార్టీ. కొద్ది రోజుల క్రితం ఉత్తరాంధ్ర వైకాపా ఇన్‌ఛార్జి విజయసాయిరెడ్డి ధర్మాన ప్రసాదరావు ఇంటికి వచ్చి చర్చలు జరిపినా, రెండేళ్ల పాటు తాను ఎటువంటి యాక్టివిటీలోనూ ఉండలేనని స్పష్టం చేయడంతో ఇప్పుడు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి కొత్త ఇన్‌ఛార్జి కావాల్సి వచ్చింది. ఆమదాలవలస మాదిరిగానే కొత్త ఇన్‌ఛార్జిని సూచించే బాధ్యతను కూడా ధర్మాన ప్రసాదరావుకే పార్టీ అప్పగించింది. ఆమదాలవలసలో తమ్మినేని సీతారామ్‌కు పార్లమెంట్‌కు వెళ్లమని, అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిని సూచించమని చెప్పిన వైకాపా అధిష్టానం ఆయన కుటుంబ సభ్యుల పేర్లు తప్ప వేరేవారి పేర్లు చెప్పకపోవడంతో చింతాడ రవికుమార్‌ను ఇన్‌ఛార్జిగా నియమించింది. ఇప్పుడు ధర్మాన ప్రసాదరావుకు కూడా అదే ఛాయిస్‌ ఇచ్చినట్లు భోగట్టా. రెండు రోజుల క్రితం పార్టీ తరఫున సజ్జల రామకృష్ణారెడ్డి ధర్మానకు ఫోన్‌ చేసి శ్రీకాకుళం నియోజకవర్గానికి ఇన్‌ఛార్జిను ఏర్పాటు చేస్తున్నామని, అందుకు కొందరి పేర్లు సూచించాలని కోరినట్లు తెలిసింది. అయితే ధర్మాన ఏ పేర్లు పంపించారన్నదానిపై ఇప్పటి వరకు ఎక్కడా ఊహాగానాలు కూడా జరగడంలేదు. కానీ ఆయన ఐదు పేర్లు పంపారని, అందులో నచ్చినవారిని పార్టీ ఎంపిక చేసుకుంటుందని మాత్రం కొందరు చెప్పుకుంటున్నారు. రెండేళ్ల తర్వాత ధర్మాన ప్రసాదరావు మళ్లీ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తే కొత్త ఇన్‌ఛార్జిను తప్పించి మళ్లీ ఆయనకే పగ్గాలిస్తారని పార్టీ ప్రచారం సాగుతుంది. అయితే అటువైపు ఉన్నది జగన్మోహన్‌రెడ్డి కావడంతో ఆ సమయానికి ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఇంతకీ ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం నియోజకవర్గం నుంచే 2029 ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదూ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే మరో కొత్త నియోజకవర్గం ఏర్పడుతుంది కాబట్టి అక్కడికి వెళ్తారా? అన్న మీమాంస అందరిలోనూ ఉంది. 2026లో నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి ఉంది. అదే జరిగితే టెక్కలి నియోజకవర్గంలో ఉన్న కోటబొమ్మాళి ప్రాంతం నుంచి కొంత, నరసన్నపేట నియోజకవర్గంలో సారవకోట నియోజకవర్గంలో ఉన్న ప్రాంతంలో కలిపి 1.80 లక్షల జనాభాకు కొత్త నియోజకవర్గం ఏర్పడుతుంది. ఇది పూర్తిగా వెలమల ప్రాబల్యం ఉన్న సెగ్మెంటే కానుండటంతో ధర్మాన అక్కడికి వెళ్తారన్న ప్రచారం కూడా సాగుతుంది. అయితే పునర్విభజన అనేది ఇచ్ఛాపురం నుంచి మొదలుపెడతారా? అనంతపురం నుంచి నరుక్కొస్తారా? అనేది ఇంకా తేలకపోవడం వల్ల ధర్మాన కూడా తన మనసులో మాటను ఎక్కడా బయటపెట్టడంలేదని తెలుస్తుంది. రెండేళ్ల వరకు రాజకీయ విరామం అవసరమని ఎన్నికల తర్వాత నుంచి చెప్పుకొస్తున్న ధర్మాన ఇప్పటికీ అదే మాట మీద ఉన్నారు. ఆర్గనైజేషన్‌ స్కిల్స్‌ ఉన్న ధర్మానను కాదని శ్రీకాకుళంలో వైకాపా ఎన్నికలకు వెళ్లడం సరికాదనే భావన కూడా ఆ పార్టీకి ఉంది. అందుకే పార్టీని శ్రీకాకుళంలో నడపడం కోసం ఒక కొత్త ఇన్‌ఛార్జిని సూచించమని ఆయనకే బాధ్యతలు అప్పగించారు.

ధర్మాన కాదంటే పార్టీ పరిశీలించే పేర్లు కొన్ని ఉన్నాయి. లేదూ ధర్మానే బొట్టు పెట్టాలి అంటే మరికొందరు ఉన్నారు. ఇందులో ఎవర్ని నియమిస్తారనేదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న. వైకాపా అధికారంలో ఉన్నప్పుడు స్థానిక నేతల కోటాలో ఎమ్మెల్సీ పదవి చివరి వరకు వచ్చి తప్పిపోయిన ఎంవీ పద్మావతి వైపు ఆ పార్టీ అధినేత జగన్‌ చూస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల శ్రీకాకుళం కూడా రెండు నియోజకవర్గాలుగా మారుతుంది. ఇందులో అర్బన్‌, దానికి ఆనుకొని ఉన్న కొన్ని పంచాయతీలు కలిపి ఒక నియోజకవర్గం కానుంది. కాబట్టి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా పని చేసిన పద్మావతికి ఈ బాధ్యతలు అప్పగించాలన్న యోచన పార్టీకి ఉంది. కాకపోతే దీనికి ధర్మాన ఆమోదముద్ర వేస్తారా? లేదా? అనేది మాత్రం తెలియదు. కాపు నేతలకే ఇన్‌ఛార్జిగా నియమించాలని పార్టీ భావిస్తే బహుశా ధర్మాన ప్రసాదరావు మామిడి శ్రీకాంత్‌ పేరును సూచించే అవకాశం కూడా లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. గార, శ్రీకాకుళం మండలాల్లో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు పెద్ద సంఖ్యలోనే వైకాపాకు ఉన్నారు. అక్కడి నుంచి పార్టీ కార్యక్రమాలు నడపడానికి నాయకులకు కొదవలేదు. కానీ శ్రీకాకుళం నగరానికే ఎన్నికలయి పద్నాలుగేళ్లు గడిచిపోవడంతో ఇక్కడ కేడర్‌ జవసత్వాలు కోల్పోయింది. గడిచిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గొండు శంకర్‌కు అర్బన్‌ ఏరియా నుంచే పెద్ద మెజార్టీ రావడం ఇందుకు నిదర్శనం. అందుకే లోకల్‌గా ఉండే పద్మావతి వైపు పార్టీ చూస్తుందని భోగట్టా. మరోవైపు శ్రీకాకుళం ఎంపీపీ ప్రతినిధి అంబటి శ్రీను పేరు కూడా పరిశీలనలో ఉంది. ఈయనకు ఇన్‌ఛార్జి పదవి ఇస్తే ధర్మాన ఎప్పుడు యాక్టివేట్‌ అయితే, అప్పుడు కుర్చీ ఖాళీ చేయడానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి ఆయన పేరు అధిష్టానానికి వెళ్లుంటుందని తెలుస్తుంది. అంబటి శ్రీను ధర్మాన విధేయుడిగా మొదట్నుంచీ పని చేస్తున్నారు. ఇప్పుడు ఆయనకు పార్టీ ఇన్‌ఛార్జి పగ్గాలు అవసరం లేకపోయినా ధర్మాన కోసం తీసుకోమంటే కాదనే పరిస్థితి ఉండదు. ఇక మాజీ జిల్లాపరిషత్‌ చైర్మన్‌ వైవీ సూర్యనారాయణ తనయుడు వైవీ శ్రీధర్‌ పేరు కూడా బలంగానే వినిపిస్తుంది. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన శ్రీధర్‌కు అత్తవారి వైపు కూడా పొలిటికల్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ఉండటం కలిసొచ్చిన అంశం. ప్రస్తుతం ఆయన భార్య శ్రీకాకుళం జెడ్పీటీసీగా వ్యవహరిస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ గొండు నర్సింగరావు తనయుడు వాసు ఇటీవలే హైదరాబాద్‌ నుంచి వచ్చి శ్రీకాకుళంలో సెటిలయ్యారు. ఈయన కూడా రాజకీయ అభిలాషతోనే ఉద్యోగం మానుకొని వచ్చారని, ఈయన పేరు కూడా పరిశీలించొచ్చని చెబుతున్నా ప్రస్తుతం వైకాపాలో జరుగుతున్న పరిణామాలను బట్టి పాత చరిత్ర లేకుండా కొత్తవారికి పగ్గాలు అప్పజెప్పే పరిస్థితి కనిపించడంలేదు. మామిడి శ్రీకాంత్‌కు ఎప్పుడు ఏ పదవి వరించినా ఆయన నాన్‌లోకల్‌ అనే నినాదం తెర మీదకు వస్తోంది. పద్మావతికి రావాల్సిన ఎమ్మెల్సీ పోస్టు ఇచ్ఛాపరంనకు చెందిన నర్తు రామారావుకు వెళ్లిపోయిందన్న భావన కాపుల్లో ఉంది. ఇప్పుడు ఆమెను పార్టీ ఇన్‌ఛార్జిగా నియమిస్తే నిర్దేశించిన కార్యక్రమాలను తీసుకువెళ్లడానికి అనువుగా ఉంటారన్న వాదన కూడా వినిపిస్తుంది. వీరు మాత్రమే కాకుండా ఇటీవల జిల్లా పార్టీ కార్యదర్శిగా నియమితుడైన రాగోలుకు చెందిన గేదెల పురుషోత్తం పేరు కూడా బయట వినిపిస్తుంది. ఇందుకు కారణం ఆయన కూడా ధర్మానకు భక్తుడిగా ఉండటమే. ధర్మాన ఎప్పుడు ఖాళీ చేయమంటే అప్పుడు బేషరతుగా తప్పుకునే నాయకుడు ఇక్కడ అవసరం. అటువంటి వ్యక్తి అయితే పార్టీ కార్యక్రమాలను బలంగా జనంలోకి తీసుకువెళ్లలేరనే భావన వైకాపాది. మొత్తమ్మీద ఇక్కడ ఇన్‌ఛార్జి ఎవరనే దానిపైనే పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతోంది.

 
 
 

Opmerkingen


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page