top of page

మా నాన్న ముఖ్యమంత్రి!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Apr 6, 2024
  • 4 min read
  • `ఎన్నికల బరిలో ఆరుగురు సీఎంల వారసులు

  • `గతంలో ఎన్నడూ లేనంతగా తొమ్మిదిమంది పోటీ

  • `వైఎస్‌ కుమార్తె షర్మిల, నేదురుమల్లి కుమారుడు రామ్‌కుమార్‌ తొలిసారి

  • `ఎన్టీఆర్‌ వారసులు ముగ్గురు.. వైఎస్‌ పేరుతో ఇద్దరు

ఎన్నికల రచ్చబండ - డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి

లాయర్‌ కొడుకు లాయర్‌ కావడం.. డాక్టర్‌ కుమార్తె డాక్టర్‌ కావడం సహజం. దాన్ని ఎవరూ తప్పు పట్టలేరు. ఎందుకంటే అది చదువు, విజ్ఞానం, స్వయం ప్రతిభతో కూడిన అంశం. ఎంత లాయర్‌, డాక్టర్‌ సంతానమైనా దానికి తగిన చదువు, ప్రతిభ లేనిదే ఆయా వృత్తుల్లోకి ఎవరూ ప్రవేశించలేరు. కానీ ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే కావడం, మంత్రి కొడుకు మంత్రి కావడాన్ని సమాజం ఒకపట్టాన సానుకూలంగా స్వీకరించదు. దీన్నే వారసత్వ రాజకీయంగా విమర్శిస్తుంటుంది. ఎందుకంటే దీనికి ప్రమాణాలు, అర్హతలు అవసరంలేదు. తండ్రి వెనుక రాజకీయాల్లో తిరుగుతూ పార్టీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకుంటే చాలు.. ఏదో ఒకరోజు పోటీకి అవకాశం వచ్చేస్తుంది. వారసత్వ రాజకీయాలు వాంఛనీయం కాదని పార్టీలు, నాయకులందరూ చెబుతుంటారు. కానీ ఆచరణలో మాత్రం ఆ ఆదర్శం కనిపించదు. ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే అవుతున్నప్పుడు ముఖ్యమంత్రి వారసులు కూడా ఎన్నికల రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడంలో తప్పులేదేమో! గతంలో ముఖ్యమంత్రులుగా చేసిన వారి వారసులు పలువురు ఎన్నికల బరిలో నిలిచి ప్రజాప్రతినిధులుగా.. వీలైతే మంత్రులుగా, ఇంకా కుదిరితే ముఖ్యమంత్రి పదవికి కూడా గురిపెడుతున్నారు. గతం నుంచి ఈ సంప్రదాయం ఉన్నా.. ప్రస్తుత ఎన్నికల్లో ఎన్నడూ లేనంత అధిక సంఖ్యలో ఒకప్పడు ముఖ్యమంత్రులుగా చేసిన ఆరుగురు నేతల వారసులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆ ముఖ్యమంత్రులెవరో.. వారి వారసులుగా బరిలో ఉన్న వారెవరో తెలుసుకుందాం.

ఎన్టీఆర్‌ వారసత్వంతో ముగ్గురు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలను పెనుమలుపు తిప్పి తెలుగుదేశం పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ఘనుడు ఎన్టీరామారావు. ఆ కుటుంబం నుంచి ప్రస్తుతం ముగ్గురు క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. ఎన్టీఆర్‌ సినీవారసుడు నందమూరి బాలకృష్ణ వారిలో ఒకరు. ఇప్పుడు రాజకీయాల్లోనూ వారసుడిగానే కొనసాగుతున్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్‌ ప్రాతినిధ్యం వహించిన హిందూపురం నుంచే ఎమ్మెల్యేగా గతంలో రెండుసార్లు ఎన్నికయ్యారు. మరోసారి అక్కడే పోటీ చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్‌ కుమార్తెల్లో ఒకరైన దగ్గుబాటు పురంధేశ్వరి ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నప్పటికీ తండ్రి వారసత్వం ఆధారంగానే ఆమెకు పదవులు లభిస్తున్నాయన్నది వాస్తవం. గతంలో కాంగ్రెస్‌లో ఉన్న ఆమె కేంద్ర మంత్రిగా కూడా చేశారు. 2004లో బాపట్ల నుంచి, 2009లో విశాఖ నుంచి ఎంపీగా గెలిచారు. ఇప్పుడు బీజేపీ ఎంపీ అభ్యర్థిగా రాజమండ్రి నుంచి బరిలో ఉన్నారు. ఇక ఎన్టీఆర్‌ చిన్నల్లుడు నారా చంద్రబాబునాయుడిది కూడా ఎన్టీఆర్‌ వారసత్వమే అని చెప్పుకోవాలి. ఒకప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న ఆయన ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు పార్టీ ఆదేశిస్తే సొంత మామపైనా పోటీకి సిద్ధమేనని ప్రకటించిన చంద్రబాబు.. అనంతర పరిణామాల్లో మామ పార్టీలోనే చేరిపోయి నెంబర్‌ టూ స్థానం ఆక్రమించుకున్నారు. క్రమంగా పట్టు పెంచుకుని ఏకంగా పార్టీని, ముఖ్యమంత్రి పదవిని సొంతం చేసుకున్నారు. అయినా ఇప్పటికీ.. ముఖ్యంగా ఎన్నికల సమయాల్లో మామ ఎన్టీఆర్‌ పేరుతోనే రాజకీయాలు చేస్తుంటారు. గత ఎన్నికల్లో ఓడిపోయి సీఎం పదవికి దూరమైన చంద్రబాబు ఈసారి ఎలాగైనా పార్టీని గెలిపించి మళ్లీ సీఎం పదవి చేపట్టాలని తపిస్తున్నారు. ఈ ఎన్నికల్లో కుప్పం నుంచే మరోసారి పోటీ చేస్తున్నారు.

నారా వారసుడిగా లోకేష్‌

రాష్ట్రానికి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పోటీ చేసిన, మరోసారి ఆ పదవి కోసం పోటీ పడుతున్న నారా చంద్రబాబునాయుడి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన లోకేష్‌ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో నెంబర్‌ టూగా కొనసాగుతూ చక్రం తిప్పుతున్నారు. ఎన్నికల రాజకీయాల్లో మొదటి ప్రయత్నంలోనే ఓటమిపాలైన ఈయన రెండో ప్రయత్నంలో ఎలాగైనా విజయం సాధించి తన రాజకీయ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గతంలో టీడీపీలో తెరవెనుక రాజకీయ వ్యవహారాలు చక్కబెట్టిన లోకేష్‌ 2014లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల నుంచి ఎన్నిక కాకుండానే సీఎం హోదాలో ఉన్న తండ్రి చంద్రబాబు ఈయన్ను మంత్రిని చేసేశారు. ఎమ్మెల్సీగా శాసనమండలికి నామినేట్‌ చేయించి కీలకమైన శాఖలతో మంత్రి పదవి కట్టబెట్టారు. అయితే మంత్రి హోదాలో 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసిన లోకేష్‌, తమకు అత్యంత పట్టు ఉందనుకున్న రాజధాని ప్రాంత నియోజకవర్గంలోనే ఓడిపోవడం కలకలం రేపింది. మళ్లీ ఇప్పుడు అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న లోకేష్‌ రాష్ట్రవ్యాప్త పర్యటనలు కూడా మానేసి తన గెలుపు కోసం చెమటోడుస్తున్నారు.

నాదెండ్ల మనోహర్‌

తెలుగుదేశంలో 1984 సంక్షోభం గురించి బహుశా ఈతరం వారికి తెలియకపోవచ్చు. ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి రావడం ఎంత సంచలనమో.. 1984లో ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన్ను అప్రజాస్వామికంగా గద్దె దించడం కూడా అంతే సంచలనం సృష్టించింది. ఎన్టీఆర్‌ ప్రభుత్వంలో నెంబర్‌ టూగా ఉన్న రెవెన్యూమంత్రి నాదెండ్ల భాస్కరరావు కేంద్రంలోని ఇందిర ప్రభుత్వంతో కుమ్మక్కై గుండె చికిత్స కోసం ఎన్టీఆర్‌ ఆమెరికా వెళ్లిన సమయంలో ఎమ్మెల్యేల్లో చీలిక తీసుకొచ్చి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. దాంతో హుటాహుటిన ఆమెరికా నుంచి తిరిగివచ్చిన ఎన్టీఆర్‌ కాంగ్రెసేతర పార్టీలతో కలిసి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం నిర్వహించారు. దాంతో ఇందర నేతృత్వంలోని కాంగ్రెస్‌, కేంద్ర ప్రభుత్వాలు తోకముడిచాయి. ఫలితంగా నెలరోజుల్లోనే నాదెండ్ల భాస్కరరావు సీఎం పీఠం నుంచి దిగిపోక తప్పలేదు. నెలరోజుల ముఖ్యమంత్రిగా పేరొందిన ఆ నాదెండ్ల కుమారుడే ప్రస్తుతం జనసేన పీఏసీ ఛైర్మన్‌గా ఉన్న నాదెండ్ల మనోహర్‌. 2004, 2009 ఎన్నికల్లో రెండుసార్లు తెనాలి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన 2009లో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా, 2011లో స్పీకర్‌గా పని చేశారు. 2014, 19 ఎన్నికల్లో ఓడిపోయారు. ప్రస్తుతం మళ్లీ తెనాలి నుంచే జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

కోట్ల వారసత్వం

రాయలసీమ రాజకీయాల్లో ప్రముఖంగా చెప్పుకోవలసిన నేత కర్నూలు జిల్లాకు చెందిన కోట్ల విజయభాస్కర్‌రెడ్డి. రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన ఆయన కేంద్రమంత్రిగానూ వ్యవహరించారు. ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి కర్నూలు నుంచి ఎంపీగా ఎన్నికై 2012`14 మధ్య యూపీఏ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పని చేశారు. రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశంలో చేరారు. 2014, 19 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఆయన ఈ ఎన్నికల్లో కర్నూలు జిల్లా డోన్‌ నుంచి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి

నెల్లూరు రాజకీయాల్లో ప్రముఖుడు, కాంగ్రెస్‌లో కీలకనేత నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 1992లో ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయన రాజకీయ వారసుడే నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి. ప్రస్తుతం వైకాపాలో ఉన్న ఈయన తొలిసారి ఎన్నికల బరిలో నిలిచారు. 2014లో అప్పటికి కాంగ్రెస్‌లో ఉన్న ఆ ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రయత్నించినా అవకాశం లభించలేదు. దాంతో బీజేపీలో చేరిన ఆయన 2018లో జగన్‌ ప్రజాసంకల్ప యాత్ర నిర్వహిస్తున్న సమయంలో వైకాపాలో చేరారు. అయితే 2019లో పోటీ చేసే అవకాశం లభించలేదు. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం తన తండ్రి జనార్ధనరెడ్డి, తల్లి రాజ్యలక్ష్మిలు ఒకప్పుడు ప్రాతినిధ్యం వహించిన వెంకటగిరి నియోజకవర్గం నుంచే వైకాపా అభ్యర్థిగా తొలిసారి పోటీ చేస్తున్నారు.

వైఎస్‌ కుటుంబం నుంచి ఇద్దరు

ఇక ముఖ్యమంత్రిగా రాష్ట్రంపై బలమైన ముద్ర వేసిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి వారసత్వం కోసం ఇప్పుడు ఉత్కంఠ పోరాటం జరుగుతోంది. వైఎస్‌ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చి, ఆయన జీవించి ఉన్న సమయంలోనే కడప ఎంపీగా ఎన్నికైన జగన్మోహన్‌రెడ్డి.. వైఎస్‌ మరణానంతర రాజకీయా పరిణమాల్లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి వైకాపా పార్టీ పెట్టారు. 2014 ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినా, ఏమాత్రం నిరుత్సాహ పడకుండా పనిచేసి 2019లో టీడీపీని ఓడిరచి వైకాపా ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అప్పట్లో సోదరుడు జగన్‌కు సహకరించిన వైఎస్‌ కుమార్తె షర్మిల ఆ తర్వాత హైదరాబాద్‌కు షిఫ్ట్‌ అయ్యి అక్కడ పార్టీ పెట్టారు. కానీ కాంగ్రెస్‌తో కుదిరిన ఒప్పందం మేరకు తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి తిరిగి ఏపీకి వచ్చి రాష్ట్ర కాంగ్రెస్‌ సారధ్య బాధ్యతలు చేపట్టారు. తానే నిజమైన వైఎస్‌ వారసురాలినంటూ జగన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు.

కొసమెరుపు: ఒకప్పటి ముఖ్యమంత్రుల వారసులుగా ఇంతమంది ఈ ఎన్నికల బరిలో నిలిచినా వారిలో ఇద్దరు మాత్రమే సీఎం పదవులు అందుకోగలిగారు. ఇప్పుడు కూడా వారికి మాత్రమే అవకాశం ఉంది. వారే ప్రస్తుతం సీఎం జగన్‌, మాజీ సీఎం చంద్రబాబునాయుడు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page