`వైకాపా హామీపత్రంపై ఆ పార్టీలోనే నిస్పృహ
`ప్రజల్లోనే అదే చర్చ.. టీడీపీ హామీలతో పోలిక
`జగన్ అతివిశ్వాసంతో కొత్త హామీలు ఇవ్వలేదన్న భావన
`సూపర్ సిక్స్ పథకాలు అమలు సాధ్యం కాదన్న ప్రచారం
`కూటమితో పోలిస్తే వైకాపా హామీలు తేలిపోతున్నట్లే
మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత వైకాపా గెలుపు గ్రాఫ్ పడిరదా? అంటే.. అవునని విశ్లేషకులు చెబుతున్నారు. 2019 ఎన్నికల నాటికి తీసుకువచ్చిన నవరత్నాలపై జరిగిన చర్చలో వందో వంతు కూడా జగన్మోహన్‌రెడ్డి ప్రకటించిన కొత్త మేనిఫెస్టోపై జరగడంలేదు సరికదా.. 175 నియోజకవర్గాల్లో 110 స్థానాలకు తగ్గవని భావించిన వైకాపా గ్రాఫ్ మేనిఫెస్టో విడుదలైన తర్వాత తగ్గిందనే భావన అందరిలోనూ ఏర్పడిరది. మరీ ముఖ్యంగా సామాజిక పింఛన్ల మొత్తాన్ని పెంచకపోవడం, పెంచిన ఆ కొద్దిపాటి మొత్తం కూడా వచ్చే ఎన్నికలకు దగ్గరలో పెంచుతామని చెప్పడం చాలామందిని నిరాశకు గురి చేసింది. అన్నింటి కంటే చెప్పుకోవాల్సింది అభివృద్ధికి సంబంధించి స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ల ఊసు తప్ప కొత్త ప్రాజెక్టుల కోసం ఎక్కడా ప్రస్తావించకపోవడంతో మళ్లీ అధికారంలోకి వస్తే పంచుడు కార్యక్రమం కూడా పెంచే విధంగా లేదన్న భావన అందరిలోనూ నెలకొంది. అదే సమయంలో టీడీపీ కూటమి ప్రకటించిన మేనిఫెస్టో ముఖ్యంగా సూపర్ సిక్స్ కార్యక్రమాలు ప్రజలకు ఆకట్టుకుంటున్నాయి. అవి అమలవుతాయా లేదా అన్నది పక్కన పెడితే ఓటర్లను ఒక్క క్షణం ఆలోచించేలా మాత్రం చేయగలుగుతున్నాయి.
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
జగన్మోహన్‌రెడ్డి మేనిఫెస్టోలో పేర్కొంటే కచ్చితంగా అమలుచేసి తీరుతారన్న నమ్మకం ప్రజల్లో ఉండటంతో ఈసారి భిన్నమైన అజెండాతో వస్తారని అంతా భావించారు. కానీ చెయ్యలేనిది తాను చెప్పలేనని, తాను ఏం చెప్పినా ప్రజల్లో విశ్వసనీయత ఉంటుందన్న ఓవర్ కాన్ఫిడెన్స్‌తో మేనిఫెస్టోను జనం ముందుకు తెచ్చినట్లు కనిపిస్తోంది. నిజంగా ఇది వైకాపా మేనిఫెస్టోయేనా అనే భావన చాలామందిలో ఉంది. అందుకే ఎన్నికల ప్రచారంలో వైకాపా అభ్యర్థులెవరూ దీన్ని ప్రస్తావించడంలేదు. ఇప్పటికే చంద్రబాబు వృద్ధాప్య పింఛన్‌ను రూ.4వేలకు, వికలాంగ పింఛను రూ.6వేలకు పెంచుతామని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఏప్రిల్ నెల నుంచే బకాయితో పాటు రూ.4వేలు అందిస్తామంటూ ప్రకటించడంపై చర్చ నడుస్తోంది. ఈ సమయంలో కూడా సామాజిక భద్రత పింఛన్ మొత్తాన్ని జగన్మోహన్‌రెడ్డి పెంచకపోవడంపై అభ్యర్థులు బయటకు కక్కలేక, మింగలేక మదనపడుతున్నారు. మేనిఫెస్టో రూపకల్పనకు ఒక ప్రత్యేక కమిటీ వేసి కసరత్తులు చేసి మరీ జనం ముందుకు తెచ్చిన ఈ వాగ్దానాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు.
మార్పులు చేస్తారా?
ఇప్పుడు దీని మీదే జగన్మోహన్‌రెడ్డి టీమ్ తాజాగా ఓ కొత్త సర్వే నిర్వహిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా ఉన్నవారి వద్దకు వెళ్లి చంద్రబాబు నాయుడు రూ.4వేలు పింఛను ఇస్తానంటున్నారు, నమ్ముతారా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఇందులో బ్యాడ్ ఫీడ్‌బ్యాక్ వస్తే మేనిఫెస్టోలో మార్పులుంటాయని కూడా తెలుస్తోంది. అయితే టీడీపీ కూటమి మేనిఫెస్టో విడుదలైన తర్వాత దాన్ని అమలుచేయడం సాధ్యం కాదనే ప్రచారాన్ని ఉధృతం చేసి అప్పటికీ పాజిటివ్‌గా రిపోర్టులు రాకపోతే వైకాపా మేనిఫెస్టోలో మరికొన్ని అంశాలను చేరుస్తారనే ప్రచారం జరుగుతోంది. మంగళవారం మధ్యాహ్నం టీడీపీ మేనిఫెస్టో విడుదలైన తర్వాత సాధ్యాసాధ్యాల ప్రచారం ప్రారంభం కానుంది. ఇప్పటికే సూపర్‌సిక్స్ పేరుతో మినీ మేనిఫెస్టోను టీడీపీ ప్రచారంలో పెట్టింది. వీటి అమలు అయ్యే ఖర్చును రాష్ట్రం భరించలేదన్న ప్రచారాన్ని అంకెలతో సహా వైకాపా తెర పైకి తెచ్చింది. దీనికితోడు ఏడాదికి మూడు సిలెండర్లు ఉచితం, ఆడబిడ్డ నిధి కింద 18`59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18వేలు అందజేయడం, తల్లికి వందనం పేరిట ఎంతమంది పిల్లలు ఉన్నా, ఒక్కొక్కరికి రూ.15వేలు చొప్పున ఆర్థిక సాయం అందించే విషయాలు టీడీపీ మేనిఫెస్టోలో ఉండటంతో ఆకట్టుకునే అవకాశం ఉందన్న భావన అందరిలోనూ ఉంది.
నిధులు సమస్య కాదంటున్న టీడీపీ
జగన్మోహన్‌రెడ్డి గత ఎన్నికల్లో నవరత్నాలు ప్రకటించినప్పుడు ఇది సాధ్యంకాదని అప్పట్లో టీడీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. కానీ మద్యనిషేధం, సీపీఎస్ రద్దు వంటి కొన్ని మినహా నవరత్నాల్లో పేర్కొన్న హామీలన్నింటినీ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేసి చూపించింది. కాబట్టి రాష్ట్ర రెవెన్యూ చంద్రబాబు ప్రకటించిన పథకాలకు కూడా సరిపోతుందని, కేవలం రాజకీయంలో భాగంగానే ఇవ్వలేరు అన్న ప్రచారం చేస్తున్నారని ఓటరు భావిస్తే ఎన్నికలకు దగ్గరలో మేనిఫెస్టోను మార్చాల్సిన అవసరం వైకాపాకు ఉంటుంది. అలా కాదు.. తన విశ్వసనీయత ప్రజలకు తెలుసన్న కోణంలో ముందుకు వెళితే.. 2014 మాదిరిగానే జగన్మోహన్‌రెడ్డి తక్కువ ఓటు తేడాతో అధికారానికి దూరమవుతారన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికలు కూడా ఉన్నాయి. రైతు రుణమాఫీ చేయడం వీలుకాదని చెప్పడం వల్లే 2014లో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయారు. ఇప్పుడు జగన్మోహన్‌రెడ్డి మేనిఫెస్టో అమలు కోసమైతే కొత్తగా నిధులేవీ తేనక్కరలేదు. టీడీపీ కూటమి మేనిఫెస్టో అమలుచేయాలంటే సొమ్ములెక్కడి నుంచి వస్తాయో చెప్పగలిగితే ఆదరించే అవకాశం లేకపోలేదు.
Comments