top of page

మీ నోబెల్‌ నాకొద్దు!

  • Writer: DV RAMANA
    DV RAMANA
  • Oct 11
  • 3 min read
  • ప్రపంచ పురస్కారాన్ని తిరస్కరించిన ఒకే ఒక్కడు

  • ఉత్తర వియత్నాం దౌత్యవేత్త లో డక్‌ థోదే ఆ ఘనత

  • వియత్నాం యద్ధం ఆపడానికి కృషి చేసిన నేత

  • 1973లో హెన్రీ కిసంజర్‌తో సంయుక్తంగా ఎంపిక

  • శాంతి ఒప్పందం అమలు కానందుకు నిరసన

ree

(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)

నోబెల్‌ శాంతి బహుమతి.. ఇప్పుడు ప్రపంచమంతటా దీని గురించే చర్చ. ప్రపంచంలోనే అత్యున్నతమైన, ప్రతిష్టాత్మకమైన ఈ పురస్కార విజేతలను ఎంపిక చేస్తున్న తీరుపై గతంలోనూ ఒకటి రెండు వివాదాలు, చర్చలు, భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తాజాగా నోబెల్‌ బహుమతి విజేతలను ప్రకటిస్తున్న తరుణంలో మరోసారి దీని ఎంపిక ప్రక్రియపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2025 సంవత్సరానికి సంబంధించి వెనిజులాలో నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా దశాబ్దాలుగా పోరాడుతున్న ఆ దేశ ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడోకు నార్వేజియన్‌ నోబెల్‌ కమిటీ శుక్రవారం ప్రకటించింది. ఈమె ఎంపికను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, ఇజ్రాయెల్‌ ప్రధాన మంత్రి బెంజమిన్‌ నెతన్యాహు బహిరంగంగానే తప్పుపట్టారు. ఈ ఏడాది శాంతి బహుమతికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ను కాకుండా ఎంపికకు ప్రాతిపదిక అయిన శాంతి స్థాపనకు పెద్దగా కృషి చేయని వెనిజులా ప్రతిపక్ష నాయకురాలికి ప్రకటించడాన్ని వారు ఆక్షేపించారు. దీనివల్ల నోబెల్‌ శాంతి బహుమతి ప్రతిష్ట పలుచబడిపోతోందని వారు వ్యాఖ్యానించారు. దీనిపై నోబెల్‌ ఎంపిక కమిటీ కూడా స్పష్టమైన వివరణ ఇచ్చింది. ఈ పురస్కారానికి అర్హులైనవారి నామినేషన్లకు జనవరి 31 తుది గడువు కాగా.. ఆ గడువు దాటిన తర్వాతే ట్రంప్‌ పేరుతో నామినేషన్లు అందాయని, అందువల్ల నిబంధనల ప్రకారం ఆ నామినేషన్లను పరిగణనలోకి తీసుకోలేదని ఎంపిక కమిటి ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా ప్రపంచంలో ఎనిమిది యుద్ధాలు ఆపిన తనకు నోబెల్‌ శాంతి బహుమతి ఇవ్వాల్సిందేనని ట్రంప్‌ గతంలో పలుమార్లు బహిరంగంగానే డిమాండ్‌ చేశారు. అలాగే అహింసా యుత పోరాట సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చి బ్రిటీష్‌ పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్య్ర సముపార్జనకు కారణమైన గాంధీజీకి నోబెల్‌ శాంతి బహుమతి ఇవ్వకపోవడంపై కూడా చాలా కాలం క్రితమే అభ్యంతరాలు వినిపించాయి. ఇలా ఎంపిక తీరుపై అభ్యంతరాలు, ఫలానా వారికి ఇవ్వాలన్న డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ అత్యున్నత పురస్కారం వరిస్తే అందుకోని వారుండరని అనుకోవడం సహజం. దాన్ని కళ్లకద్దుకుని అందుకుంటారని అనుకోవడం కూడా కద్దు. కానీ దాన్ని వద్దనుకున్న వ్యక్తి చరిత్రలో ఒకరున్నారు. నోబెల్‌ శాంతి బహుమతిని తనకు ప్రకటించినా వద్దని తిరస్కరించిన ఆ నేత పేరు.. లె డక్‌ థో. ఉత్తర వియత్నాంకు చెందిన వర్కర్స్‌ పార్టీ నాయకుడు.

ఆయన ప్రత్యేకత ఏమిటంటే..

వియత్నాంకు చెందిన విప్లవకారుడు, దౌత్యవేత్త, రాజకీయవేత్తగా ప్రసిద్ధుడైన లె డక్‌ థో నోబెల్‌ చరిత్రలో శాంతి బహుమతిని తిరస్కరించిన ఏకైక వ్యక్తిగా నిలిచిపోయారు. వియత్నాం రెండుగా చీలిపోయిన తర్వాత ఉత్తర వియత్నాంలో కమ్యూనిస్టులు పాలన పగ్గాలు చేపట్టగా దక్షిణ వియత్నాంలోని కమ్యూనిస్టేతర ప్రభుత్వానికి అమెరికాకు మద్దతిచ్చింది. కానీ ఉత్తర వియత్నాంలో కమ్యూనిస్టుల పాలనను చూసి ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలు కూడా కమ్యూనిస్టు పాలననే కోరుకుంటాయన్న భయం అమెరికాలో మొదలైంది. దాంతో వియత్నాంపై యుద్ధం ప్రకటించింది. ఈ యుద్ధాన్ని శాంతియుత చర్చల ద్వారా ముగించడానికి లె డక్‌ థో ఉత్తర వియత్నాం తరఫున కీలక పాత్ర పోషించారు. ఆ మేరకు ఈ క్రమంలో లె డక్‌ థో, అమెరికా విదేశాంగ కార్యదర్శి హెన్రీ కిస్సింజర్‌తో కలిసి 1973లో వియత్నాం యుద్ధం కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవడంలో కీలక పాత్ర పోషించారు. ఉభయపక్షాల మధ్య 1973 జనవరిలో శాంతి ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం కుదర్చడంలో కీలకంగా వ్యవహరించి, యుద్ధానికి ముగింపు పలికినందుకుగాను ఆ ఏడాది నోబెల్‌ శాంతి బహుమతికి అప్పటి అమెరికా విదేశాంగ కార్యదర్శి హెన్రీ కిసంజర్‌, ఉత్తర వియత్నాం నేత లె డక్‌ థోలను సంయుక్తంగా ఎంపిక చేశారు.

తిరస్కరణకు కారణాలు

అయితే అనూహ్యంగా లె డక్‌ థో ఈ అత్యున్నత పురస్కారాన్ని తిరస్కరించారు. ఆయన చర్య అప్పట్లో సంచలనం సృష్టించింది. దానికి ఆయన చెప్పిన కారణాలు కూడా ఆలోచింపజేశాయి. వియత్నాం యుద్ధం ఆపే దిశగా ప్యారిస్‌లో కుదిరిన శాంతి ఒప్పందాన్ని గౌరవించి పూర్తి స్థాయిలో అమలు చేయడంలో విఫలం కావడాన్ని తన నిర్ణయానికి కారణంగా ఆయన పేర్కొన్నారు. శాంతిని పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తేనే తాను నోబెల్‌ శాంతి బహుమతిని స్వీకరించే విషయాన్ని పరిశీలిస్తానని పేర్కొంటూ లె డక్‌ నోబెల్‌ కమిటీకి టెలిగ్రామ్‌ ద్వారా తెలిపారు. దక్షిణ వియత్నాంలో పారిస్‌ శాంతి ఒప్పందాన్ని పూర్తిస్థాయిలో ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. సంఘర్షణలు ఇంకా కొనసాగుతున్న పరిస్థితుల్లో శాంతి బహుమతిని ఎలా అంగీకరించాలని ఆయన ప్రశ్నించారు. అందుకే తాను నోబెల్‌ శాంతి పురస్కరాన్ని తిరస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ విధంగా నోబెల్‌ అవార్డుల చరిత్రలో దాన్ని తిరస్కరించిన ఏకైక వ్యక్తిగా లె డక్‌ థో నిలిచిపోయారు. కాగా ఆయనతోపాటు సంయుక్తంగా 1973 శాంతి బహుమతికి ఎంపికైన అమెరికా విదేశాంగ కార్యదర్శి హెన్రీ కిసంజర్‌ నేరుగా కాకుండా పరోక్షంగా ఈ అవార్డును స్వీకరించినా.. తర్వాత దాన్ని వాపసు చేస్తానని ప్రతిపాదించారు. అయితే నోబెల్‌ కమిటీ ఆ ప్రతిపాదనను తిరస్కరించింది. హెన్రీ కిసంజర్‌ను ఎంపిక చేయడం కూడా అప్పట్లో వివాదాలు రాజేసింది. కాంబోడియాపై బాంబు దాడుల్లో కిసంజర్‌ పాత్రను ప్రస్తావిస్తూ ఆయన్ను ఎంపిక చేయడాన్ని తప్పు పడుతూ ఇద్దరు నోబెల్‌ ఎంపిక కమిటీ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేయడం కూడా అప్పట్లో కలకలం రేపింది.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page