స్క్రాప్ పేరుతో పాత సెల్‌ఫోన్ల కొనుగోలు
సాఫ్ట్‌వేర్ మార్చి వాటి ద్వారా వివిధ ప్రాంతాల్లో మోసాలు
ముగ్గురు సభ్యుల ముఠా విచారణతో వెలుగులోకి
బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన ముఠా దందా

మన ఇంట్లో పనికిరాకుండా మూలనపడి ఉన్న పాత సామాన్లను ఏదో విధంగా వదిలించుకోవడానికి చూస్తుంటాం. ఆ పాత సామాన్లకే ఎంతో కొంత డబ్బులు వస్తాయంటే అస్సలు వదిలిపెట్టం. ప్రతి ఇంట్లోనూ ఇనుము, అల్యూమినియం, స్టీల్, ప్లాస్టిక్ సామాన్లతో పాటు పాత న్యూస్‌పేపర్లు ఉండటం సహజం. వాటినే స్క్రాప్ అంటారు. ఈమధ్య కాలంలో ఇటువంటి స్క్రాప్ కొనుగోలు బిజినెస్ బాగా పెరిగింది. ప్రతిరోజూ వీధుల్లోకి వచ్చి మరీ చాలామంది వీటిని కొనుగోలు చేస్తుంటారు. కొందరు పాత సామాన్లకు బదులు డబ్బులు ఇస్తుంటే.. మరికొందరు ఉల్లిపాయలు వంటి వస్తుమార్పిడి కింద ఇచ్చి పాత సామాన్లను తీసుకుపోతుంటారు. ఇళ్లలోని ఆడవాళ్లు వచ్చిందే చాలనుకుని కొనుగోలుదారులు ఇచ్చిన తృణమో ఫణమో తీసుకుని పనికిరాని సామాన్లను వారికిచ్చేస్తుంటారు. ఇప్పుడు స్క్రాప్ జాబితాలో మొబైల్ ఫోన్లు కూడా చేరాయి. మిగతా స్క్రాప్ మాదిరిగానే పనికిరాని పాత మొబైల్ ఫోన్లను కొనుగోలు చేస్తామంటూ కొందరు వీధుల్లో తిరుగుతున్నారు. శ్రీకాకుళం నగరంలోనూ ఒక వ్యక్తి బైక్ మీద తిరుగుతూ పాత మొబైళ్లకు ప్లాస్టిక్ వస్తువులు ఇస్తామంటూ ఆఫర్ చేశాడు. అయితే పాత మొబైళ్లను స్క్రాప్ కొనుగోలుదారులకు ఇస్తే కొంపలంటుకుంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పాత ఫోన్లనే తిరిగి పనిచేసేలా చేసి సైబర్ నేరగాళ్లు తమ మోసాలకు వాడుతున్నారని అంటున్నారు. వీరు చేసే నేరాలు అమ్మేసిన పాత ఫోన్ల కారణంగా వాటి అసలు యజమానుల మీదకే వచ్చే ప్రమాదముందని అంటున్నారు.
(డి.వి.రమణ, సత్యం ప్రత్యేక ప్రతినిధి)
ఇది సెల్‌ఫోన్ల యుగం. ఇంట్లో ఉన్నా.. బయటకు వెళ్లినా.. చేతిలో సెల్‌ఫోన్ లేకపోతే చేతులు కట్టేసినట్లు ఉంటుంది. ఏ పనీ చేయలేని పరిస్థితి. దాంతో సెల్‌ఫోన్ హస్తభూషణంగా మారిపోయింది. అలాగే రకరకాల కొత్త వెర్షన్ ఫోన్లు నిత్యం మార్కెట్లోకి వస్తున్నాయి. వినియోగదారులు కూడా ఏడాది రెండేళ్లకోసారి కొత్త ఫోన్ కొని పాత మొబైళ్లను పక్కన పడేస్తుంటారు. మరోవైపు రిపేరుకు వచ్చిన ఫోన్లను వదిలేసి కొత్త ఫోన్లు కొనుక్కుంటుంటారు. ఈ క్రమంలో చాలామంది పాతబడిన తమ ఫోన్లను షోరూముల్లోనే ఎక్స్ఛేంజ్ చేసుకుని కొత్త ఫోన్లు తీసుకుంటుంటారు. మరికొందరు సెకండ్స్ సేల్స్ నిర్వహించే షాపులకు ఎంతో కొంత మొత్తానికి అమ్మేస్తుంటారు. పాడైపోయిన ఫోన్లను మాత్రం ఇళ్లలోనే మూలన పడేస్తుంటారు. ఇప్పుడు అటువంటి ఫోన్లనే తీసుకుని వాటికి బదులుగా ప్లాస్టిక్ వస్తువులు, డబ్బులు ఇస్తామంటూ కొందరు వీధుల్లో తిరుగుతున్నారు. సెకండ్స్ సేల్‌కు, ఎక్స్ఛేంజ్‌కు పాత ఫోన్లు ఇచ్చేసినా కొంత ఫర్వాలేదుగానీ.. వీధుల్లో తిరిగే స్క్రాప్ కొనుగోలుదారులకు కొద్దిపాటి డబ్బులకు ఆశపడి ఇంట్లో పనికిరాకుండా ఉన్న ఫోన్లను అప్పగిస్తే ప్రమాదంలో పడినట్లేనని పోలీసులు చెబుతున్నారు. పాత ఫోన్లు కొనే ముఠాను తెలంగాణ పోలీసులు పట్టుకోవడంతో దీని వెనుక ఉన్న సైబర్ మోసాల గుట్టు బయటపడిరది.
తీగ లాగితే..
పాత మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తూ నేరాలకు పాల్పడుతున్న ముగ్గురిని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి సుమారు నాలుగువేల సెల్‌ఫోన్లు, మూడు బైకులు స్వాధీనం చేసుకున్నారు. వారిని విచారించినప్పుడు విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చింది. దీని వెనుక పెద్ద రాకెట్ నడుస్తోందని, పాత ఫోన్లను రిపేర్ చేసి సైబర్ నేరాలకు వినియోగిస్తున్నట్లు వెల్లడైంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి, ఎన్టీపీసీ పరిసర ప్రాంతాల్లో స్క్రాప్ కొనుగోలు చేస్తామంటూ తిరుగుతున్న కొందరు అనుమానితుల కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. స్క్రాప్ పేరుతో కొనుగోలు చేసిన ప్లాస్టిక్, ఇనుప వస్తువులను కొన్నవి కొన్నట్లే ఎగుమతి చేసేస్తున్న ఈ వ్యక్తులు.. తాము కొనుగోలు చేసిన పాత సెల్‌ఫోన్లను మాత్రం తమ వద్దే ఉంచేసుకోవడాన్ని గమనించారు. దాంతో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా దిగ్భ్రాంతి కలిగించే విషయాలు బయటకొచ్చాయి.
పాత ఫోన్లతో సైబర్ నేరాలు
స్క్రాప్ పేరుతో కొనుగోలు చేసే పాత మొబైల్స్‌ను జార్ఖండ్ రాష్ట్రంలోని జమ్‌తారా, దియోఘర్ ప్రాంతాలకు చెందిన సైబర్ నేరగాళ్లకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. పట్టుబడిన వారిని మహ్మద్ షమీమ్, అబ్దుల్ సలాం, మహ్మద్ ఇఫ్తికార్‌గా గుర్తించగా, వారంతా బీహార్‌లోని హతియా దియారా గ్రామాలకు చెందిన వారని తేలింది. పట్టణాల్లో వీరు బైకులపై తిరుగుతూ స్క్రాప్ కొనుగోళ్లతోపాటు ఇళ్లలో నిరుపయోగంగా ఉన్న పాత సెల్‌ఫోన్లను వస్తుమార్పిడి, డబ్బులు చెల్లించే రూపంలో సేకరిస్తున్నారు. ఇలా సేకరించే ఫోన్లను బీహార్‌లోని తమ గ్రామానికి చెందిన సహచరుడు అక్తర్‌కు, అతని ద్వారా సైబర్ మోసగాళ్లకు చేరవేస్తున్నారని నిర్ధారణ అయ్యింది. తన సహచరులు పంపించే సెల్‌ఫోన్ల మదర్ బోర్డు, సాఫ్ట్‌వేర్, ఇతర భాగాలను అక్తర్ రిపేర్ చేసిన తర్వాత వాటిని సైబర్ నేరగాళ్లకు అప్పగిస్తాడు. ఆ ఫోన్లను వారు సైబర్ మోసాలకు పాల్పడుతూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారు.
ఆపరేషన్ జముత్రా
ఫ్రాడ్ కాల్స్ చేస్తూ నేరాలకు పాల్పడే విధానాన్ని ఆపరేషన్ జముత్రా అని వ్యవహరిస్తుంటారని తెలిసింది. స్క్రాప్ పేరుతో సేకరించిన ఫోన్ల నుంచి దేశంలోని వివిధ ప్రాంతాల వారికి కాల్స్ చేసి డబ్బులు గుంజుతున్నారని తెలుస్తోంది. ఇప్పటి వరకు దేశంలో లోకేషన్స్ మార్చడం, రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న వారు పొరుగు రాష్ట్రానికి వెళ్లి నేరాలకు పాల్పడిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు పాత ఫోన్లతో నేరాలకు పాల్పడటం సంచలనంగా మారింది. ఈ సంఘటనల నేపథ్యంలో పాత మొబైల్ ఫోన్లను గుర్తుతెలియని వ్యక్తులకు అమ్మవద్దని పోలీసులు సూచిస్తున్నారు. డివైజ్ ఐడెంటిటీ కారణంగా మోసాలకు పాల్పడుతున్నవారితోపాటు ఫోన్ల యజమానులు కూడా కేసుల్లో చిక్కుకునే ప్రమాదముందంటున్నారు. అందువల్ల ప్రజలు తమ పాత ఫోన్లను విక్రయించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఒకవేళ అమ్మినా వారిని కూడా నేరస్తులుగా పరిగణించాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Comments