జిల్లాలో జోరుగా పక్క చూపుల రాజకీయం!

స్థానిక నేతలను చేర్చుకోవడానికి ఇరు పార్టీల ప్రాధాన్యత
ప్రచారంతోపాటు సమాంతరంగా కార్యాచరణ
చేరికల వల్ల ఓట్లు వస్తాయన్న గ్యారెంటీ లేదు
హైప్ క్రియేట్ చేసి అనుకూల సంకేతాలు పంపడమే లక్ష్యం
నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ప్రచారాల కంటే బల ప్రదర్శన మీదే ప్రధాన పార్టీలు దృష్టి పెట్టాయి. ఎవరు ఎవరితో ఉన్నారన్న కన్‌ఫ్యూజన్ ఇప్పటికీ బలమైన నాయకులు తమతోనే ఉన్నారని చెప్పుకోవడానికి అటు వైకాపా, ఇటు తెలుగుదేశం కూటమి గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. ఇంతవరకు వెలువడిన సర్వేలు ఏం చెప్పినా ఓటర్లలో మాత్రం మార్పు ఉంటుందనే భావన రెండు పార్టీల్లోనూ ఉంది. సంక్షేమ పథకాలు గట్టెక్కిస్తాయని అధికార పార్టీ భావిస్తుంటే, ప్రభుత్వం మీద వ్యతిరేకత బయటకు కనిపించడంలేదు గానీ, ఓటు రూపంలో తమకే బ్యాలెట్ అనుకూలిస్తుందని ప్రతిపక్షం భావిస్తోంది. అయినా స్థానికంగా ఉన్న నాయకత్వానికి పార్టీ కండువాలు కప్పడం ద్వారా తమ బలం పెరిగిందని చెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంతో పోలిస్తే ఈసారి పార్టీలు మారినవారి సంఖ్య తక్కువగా ఉన్నా, అధినాయకుల దృష్టి మాత్రం పక్క పార్టీ నుంచి వచ్చే క్యాడర్‌పైనే ఉంది. అభ్యర్థుల వద్దనున్న నాయకులు పార్టీలో చేరేవారి కోసం విపరీతంగా గాలిస్తున్నారు. కనీసం వార్డులో పది ఓట్లను ప్రభావితం చేయగల నాయకుడు పార్టీలో చేరినా తమకు బలం పెరిగినట్లేనన్న భావనతో ఉన్నారు.
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
జిల్లావ్యాప్తంగా పార్టీల్లో చేరికలు గత కొద్ది రోజులుగా ఊపందుకున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ గెలుస్తుందని మొదట్నుంచి ప్రచారం సాగుతున్న టెక్కలి, ఆమదాలవలస నియోజకవర్గాల్లో ఆ పార్టీలోకి చేరికలు పెరిగాయి. మరీ ముఖ్యంగా టెక్కలిలో చాలామంది కింజరాపు అచ్చెన్నాయుడు నేతృత్వంలో కండువాలు మార్చుకున్నారు. ఆమదాలవలసలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు విషయంలోనూ అదే జరుగుతోంది. అధికార పార్టీ మొదట్నుంచి పార్టీని వీడినవారిపైన, తప్పులను ఎత్తిచూపే వారిపైన నిర్బంధం విధిస్తున్నందున చాలామంది పార్టీ మారడానికి ముందుకు రావడంలేదని, లేకుంటే జిల్లాలో వైకాపా చాలామేరకు ఖాళీ అవుతుందన్న భావనతో తెలుగుదేశం కూటమి ఉంది. చివరకు వైకాపాలో చాన్నాళ్లు ఉన్నా గత కొద్దిరోజులుగా స్తబ్ధుగా ఉన్నవారు సైతం అధికార పార్టీ అభ్యర్థి వైపు వెళితే.. అదో పెద్ద విజయంగా ఆ పార్టీ భావిస్తోంది. జిల్లాలో నువ్వా, నేనా అన్నట్లు పోటీ జరుగుతున్న చోట పక్క పార్టీకి చెందిన ఏ ఒక్క నాయకుడ్నీ వదులుకోడానికి ఎవరూ సిద్ధపడటంలేదు. తన పాలన వల్ల మేలు జరిగిందని భావిస్తే ఓటు వేయండి, లేదంటే అవసరంలేదని స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చెబుతున్నా క్షేత్రస్థాయిలో పక్కపార్టీ నుంచి ఆమాత్రం ఓట్లను ప్రభావితం చేయగల నాయకులను తీసుకురావడం కోసం అభ్యర్థులు తహతహలాడుతున్నారు. ఈ ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమేనన్న విషయం అభ్యర్థులకు ఇప్పటికే అర్థమైంది.
పోటాపోటీగా చేరికలు
జిల్లాలో సీనియర్ నాయకులైన తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాదరావులు కూడా దీనికి అతీతం కాదు. తమ్మినేని మీద అసమ్మతి శంఖారావం పూరించి ఆయనకు వ్యతిరేకంగా గ్రూపు నడిపిన కోట గోవిందరావు ఇంటికి వెళ్లి మరీ సీతారాం ఆమధ్య తనకు ఓటు వేయమని కోరారు. అలాగే ధర్మాన ప్రసాదరావు హార్డ్‌కోర్ టీడీపీ అభిమానులను కూడా తన ప్రచారంలో భాగంగా కలిసి సహకరించమని కోరుతున్నారు. అధికార పార్టీలో బలమైన నాయకుడు టీడీపీకి వెళితే.. టీడీపీలో ఉన్న మరో బలమైన నాయకుడు వైకాపా గూటికి వస్తున్నారు. గతంలో ఇటువంటి సింగిల్ చేరికలను ఏ క్యాంప్ ఆఫీస్‌లోనో, లేదంటే పార్టీ కార్యాలయంలోనో కండువా వేసి మమ అనిపించేవారు. ఇప్పుడు దీనికోసం ఏకంగా బహిరంగ వేదికలే ఏర్పాటు చేస్తున్నారు. శ్రీకాకుళం నగరానికి సంబంధించి మాజీ కౌన్సిలర్ పొందూరు రమణ గురువారం సాయంత్రం ధర్మాన సమక్షంలో వైకాపా తీర్థం పుచ్చుకుంటున్నారు. మొన్నటికి మొన్న బాదుర్లపేట నుంచి కళ్లేపల్లి సోంబాబు ధర్మాన సమక్షంలో పార్టీలో చేరారు. తాజాగా బలగ నుంచి రెడ్డి చిరంజీవులు కూడా వైకాపా గూటికి చేరిపోతారని ప్రచారం జరుగుతోంది. ఈయన ఇటీవలే లక్ష్మీదేవి నేతృత్వంలో చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. అటువి ఇటు అయినప్పుడు ఇటువి అటు మారడం కూడా సహజం. మంగువారితోట నుంచి పొందూరు రమణను వైకాపాలోకి తీసుకువస్తున్నప్పుడు, అక్కడ ఉన్న ధర్మాన అభిమానులు దాస్యం రాంబాబు, పెద్దిన మురళీల కోసం టీడీపీ గాలం వేస్తోంది. అలాగే బాదుర్లపేట, కొత్తపేట నుంచి సోంబాబు వెళ్లిపోయిన తర్వాత అక్కడ ఉన్న గంజి వాసు టీడీపీలోకి వెళ్లే అవకాశం ఉంది. టీడీపీకి సంబంధించి ఆ పార్టీ అభ్యర్థి గొండు శంకర్ వెనుక లక్ష్మీదేవి వర్గం లేదని భావించిన ఓటరు నగరంలో ఆయన బలహీనంగా ఉన్నారన్న ప్రచారాన్ని ఇంతవరకు నమ్మింది. కానీ నగరంలో అన్ని డివిజన్లలోనూ వైకాపా వైపు వెళ్లిపోయే క్యాడర్ స్థానంలో వైకాపా నుంచి నాయకులను తెచ్చుకోడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. వైకాపా తరఫున చేరికల కోసం జిల్లాలో పెద్ద ఎత్తున ఆ పార్టీ క్యాడర్ పని చేస్తోంది. నగరంలో చేరికల విషయంలో వైకాపా అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు ఒకడుగు ముందు న్నట్లు కనిపిస్తున్నా, రూరల్‌లో మాత్రం టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ ధర్మాన కంటే ముందున్నారు. గార మండలంపై రెండు పార్టీలు ఇంకా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. పాతపట్నంలో కలమట రమణకు టికెట్ లేదని తేలిపోయిన తర్వాత టీడీపీ క్యాడర్ అభ్యర్థి మామిడి గోవిందరావుతో వెళ్లడం సహజం. కానీ స్థానిక నినాదం ఎత్తుకుని ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న లోతుగడ్డ తులసీవరప్రసాద్ టీడీపీలో గురువారం చేరిపోయారు. రెండు రోజుల క్రితం చంద్రబాబు పర్యటనలో పలాసలో దువ్వాడ శ్రీకాంత్ దంపతులతోపాటు మరికొందరు వైకాపా నాయకులు టీడీపీలో చేరారు. ఇవన్నీ ఏమేరకు ఓట్లను తీసుకువస్తాయో తెలీదు గానీ తమ వెనుక ఎక్కువమంది ఉన్నారని చెప్పడం ద్వారా పాజిటివ్ సంకేతాలు పంపడానికి మాత్రం కచ్చితంగా ఉపయోగపడతాయి.
Comments