మీరెక్కడున్నారు ‘సర్ ’?!
- BAGADI NARAYANARAO

- Jul 10
- 2 min read
నగరంలో దొరకని ఓటర్ల చిరునామాలు
డిజిటలైజేషన్‌లో అట్టడుగున శ్రీకాకుళం
40వేల వరకు ఓట్లు గల్లంతు ఖాయం
వలసలు, డూప్లికేట్‌లు ఉండటమే ప్రధాన కారణం

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
ఈ నెల 14తో సర్ ప్రక్రియ సమాప్తం కానున్న నేపథ్యంలో ఆన్‌లైన్ చేసేందుకు అనేక అడ్డంకులు ప్రతిబందకంగా మారుతున్నాయి. ప్రజలు అందుబాటులో లేకపోవడంతో ఫారాలు పంపిణీ చేయడమే పెద్ద ప్రహసనంగా కొన్నిచోట్ల మారగా, మరికొన్నిచోట్ల ఫారాల పంపిణీయే పూర్తికాలేదు. తీసుకున్న ఫారాలు సైతం ప్రజలు తిరిగి ఇవ్వకపోవడం వల్ల కొన్నిచోట్ల జాప్యం జరిగితే, ఇచ్చినచోట సర్వర్ సమస్యలతో డిజిటలైజ్ ప్రక్రియకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో నియోజకవర్గాల్లో ఆన్‌లైన్ ప్రక్రియ ఆలస్యంగా సాగుతోంది. జిల్లాలో ఉన్న ఎనిమిది నియోజకవర్గాల్లో 2358 పోలింగ్ కేంద్రాల్లో 18,97,405 మంది ఎన్యుమరేషన్ ఫారాలు వెనక్కు ఇవ్వగా, ఇప్పటి వరకు 15,61,206 ఫారాలు డిజిటలైజ్ అయ్యాయి. ఇందులో ఒకే వ్యక్తికి రెండుచోట్ల ఓట్లు ఉండటం, చనిపోయినవారు కూడా ఉండటంతో పాటు శాశ్వతంగా వలస వెళ్లినవారు 39,281 మంది ఉన్నారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే జిల్లాలో 82.28 శాతం మాత్రమే సర్ ప్రక్రియలో డిజిటలైజ్ అయినట్టు. ఇంకా 3,36,199 ఓట్లు డిజిటలైజ్ కానుండగా, సమయం మాత్రం దగ్గరపడుతోంది.
శ్రీకాకుళంలో అత్యల్పం
డిజిటలైజ్ కావాల్సిన ఎన్యుమరేషన్ ఫారాల్లో 86.90 శాతంతో నరసన్నపేట అగ్రస్థానంలో ఉండగా, 74.58 శాతంతో శ్రీకాకుళం చివరి స్థానంలో ఉంది. 84.76 శాతంతో పాతపట్నం రెండో స్థానంలోను, 84.30 శాతంతో ఆమదాలవలస, 83.95తో టెక్కలి, 83.85తో ఎచ్చెర్ల, 82.38 పలాస, 79.93తో ఇచ్ఛాపురం మిగిలిన స్థానాల్లో ఉన్నాయి. బీఎల్‌వోలు ఇచ్చిన ఫారాలు పూర్తి చేసిన తర్వాత వాటిని ఆన్‌లైన్ చేస్తేనే ప్రక్రియ పూర్తయి, ఓటు భద్రంగా ఉన్నట్టు. అన్ని వివరాలు ఉండి సర్వర్ సమస్య లేకపోతే ఒక్కో బీఎల్‌వో రోజుకు 100 నుంచి 150 ఫారాలు ఆన్‌లైన్ చేయొచ్చు. ఒక్కో ఫారం రెండు నిమిషాల్లో పూర్తి చేస్తారు. కానీ సర్వర్ సమస్యలతో ఆన్‌లైన్ చేయడానికి ఆలస్యం కావడంతో ఒక్కో ఫారం పది నిమిషాల సమయం తీసుకుంటోంది. కొన్నిసార్లు గంటలపాటు సర్వర్ పని చేయడంలేదు. ఎక్కువ మంది సిబ్బంది ఉదయమంతా ఫారాలు సేకరించి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆన్‌లైన్ చేస్తున్నారు. ఈ సమయంలోనే సర్వర్ మొరాయిస్తోంది. కొన్ని సందర్భాల్లో రోజుకు 20 ఫారాలు కూడా పూర్తికావడంలేదు. సాయంత్రం 6 గంటల తర్వాత సర్వర్ వేగంగా పని చేస్తున్నా ఆ సమయంలో బీఎల్‌వోలు, బీఎలఏల సమన్వయం కుదరడంలేదు.
శ్రీకాకుళంలోనే ఎందుకు తక్కువ?
గ్రామీణ ప్రాంతాల్లో సర్ ప్రక్రియ త్వరితగతిన జరుగుతోంది. కానీ శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో నత్తనడకన సాగుతోంది. ఇందుకు చిరునామాలు కనుక్కోవడం ఇబ్బందిగా మారడం, అద్దెలు ఇళ్లు మారిపోవడం, ఇతర నగరాలకు వెళ్లిపోవడం వంటి అనేక కారణాలు ఉన్నాయి. ఓటరు జాబితాలో ఉన్న చిరునామాలో ప్రస్తుతం చాలామంది లేరు. ఫోన్ నెంబర్లు ఉన్నవారికి సమాచారం అందిస్తున్నారు. లేనివారిని పట్టుకోవడం కష్టంగా మారుతోంది. అందుకే శ్రీకాకుళం అర్బన్‌లో 1,49,139 మందికి ఫారాలు పంచామని చెబుతున్నా డిజిటలైజ్ అయినవి మాత్రం 1,05,169 మందే. ఇంకా 43,970 ఓట్లు డిజిటలైజ్ కాలేదు. వీరు ఇక దొరకడం కూడా కష్టమే. సర్ ప్రక్రియ పూర్తయ్యే నాటికి నగరంలో సుమారు 30వేలకు పైగా ఓట్లు తొలగించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చాలాచోట్ల ఓటరు ఉన్నా, లేకపోయినా వారి పాత చిరునామాలతో ఉన్న దరఖాస్తులను పంపిణీ చేశామని బీఎల్‌వోలు ప్రకటించేశారు. వీరిలో పైన పేర్కొన్న శాతం మాత్రమే వెనక్కు ఫారాలు ఇచ్చారంటే, మిగిలినవారు లేనట్టే లెక్క. పోనీ ఆన్‌లైన్ ప్రక్రియలో ఓటును బతికించుకున్నారా? అంటే.. దీనిపై శ్రీకాకుళంలో పెద్దగా అవగాహన కల్పించలేదు. అలాగే నిబంధనలు కూడా సరళంగా లేకపోవడంతో చాలామంది ఆన్‌లైన్‌లో సర్ ప్రక్రియను పూర్తి చేయలేకపోయారు.
శ్రీకాకుళం నియోజకవర్గంలో
శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం మొత్తంలో పోలింగ్ కేంద్రాలు 279 ఉండగా, అందులో 2,75,852 మంది ఓటర్లు ఉన్నారు. కానీ ఇప్ప్పుడు ఓటు కోసం డిజిటలైజ్ అయినవి మాత్రం 2,05,717 మాత్రమే. అంటే నియోజకవర్గంలో 74.58 శాతం డిజిటలైజ్ అయినట్టు లెక్క. గార మండలంలో 67వేల పైచిలుకు ఓటర్లుంటే, 53వేల పైచిలుకు డిజిటలైజ్ అయ్యాయి. రూరల్ మండలంలో 59వేల పైచిలుకు ఓటర్లు ఉంటే, దాదాపు 47వేలు డిజిటలైజ్ అయ్యాయి. అర్బన్‌కు ఆనుకొని ఉన్న రూరల్‌లో కూడా ఓటర్లు కొంతమేరకు దొరకడంలేదు. అయితే చాలామంది నగరానికి వలస రావడం వల్ల వారి సొంత గ్రామాల్లో కూడా ఓట్లు ఉన్నాయి. బహుశా ఇవన్నీ అక్కడ ఎన్‌రోల్ చేసుంటారు. ఎలా చూసినా శ్రీకాకుళం నియోజకవర్గం మొత్తం మీద ఓ 40 వేల ఓట్లు సర్‌లో లేచిపోనున్నాయి.






Comments