top of page

మురుగుతో రాగోలు వాసులు సావాసం

  • Writer: BAGADI NARAYANARAO
    BAGADI NARAYANARAO
  • Mar 17, 2025
  • 1 min read
  • మురికి నీటి కోసం గుంత ఏర్పాటు

  • అవస్థలు పాలవుతున్న స్థానికులు

  • పట్టించుకోని పంచాయతీ అధికారులు


(సత్యంన్యూస్‌, శ్రీకాకుళం రూరల్‌)

దశాబ్ధ కాలంగా కాలనీలో మురుగు నీరు నిలిచి అనేక ఇబ్బందులు ఎదరువుతున్నా పట్టించుకొనే నాధుడే కరువయ్యాడు. శ్రీకాకుళం రూరల్‌ మండలం రాగోలు శివసాయి కాలనీవాసులు మురుగునీటితో సావాసం చేస్తున్నా పంచాయతీ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకున్న దాఖలాలు లేవు.

శ్రీకాకుళం రూరల్‌ మండలంలో రాగోలు ప్రధాన వాణిజ్య కేంద్రంగా మారిపోయింది. శ్రీకాకుళం నగరానికి అతి సమీపంలో ఉండడంతో రాగోలు శరవేగంగా అభివృద్ధి పథంలో పయణిస్తుంది. అందుకు తగ్గట్టుగా రాగోలు కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో పాలకులు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. రాగోలు గ్రామంలో మురికి కాలువలకు ఔట్‌లెట్‌ లేకపోవడం ప్రధాన సమస్యగా మారిందని స్థానికుడు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు బొణిగి భాస్కరరావు ఆవేదన వ్యక్తం చేశారు. మరుగుదొడ్ల అవుట్‌లెట్లను కొంతమంది మురికి కాలువలకు అనుసంధానం చేయడం వల్ల సమస్య మరింత జఠిలంగా మారిందని ఆయన ఆరోపించారు. మురికి కాలువ ఔట్‌లెట్‌ లేకపోవడంతో పంచాయతీ అధికారులు, స్థానిక సంస్థల ప్రతినిధులు కలిసి గ్రామంలోని ఈశ్వరాయలం పక్కన ఉన్న ప్రభుత్వ స్థలంలో పెద్ద గుంత తవ్వి అందులోకి రాగోలు గ్రామస్తులు వినియోగిస్తున్న వాడుక, మురుగునీటిని పంపించి చేతులు దులుపుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వేసవి, వర్షాకాలం తేడా లేకుండా నిత్యం ఆ గుంతలో నీరు నిలిచి దుర్వాసనభరితంగా మారినట్టు భాస్కరరావు తెలిపారు. వర్షాకాలంలో ఈ గుంతలో మురుగుతో పాటు వరదనీరు చేరడంతో శివసాయి కాలనీలోని ఆవాసాలన్నీ నీటిలో మునిగే పరిస్థితి దాపురించిందని స్థానికులు చెబుతున్నారు. ప్రతి ఏడాది ఈ సమస్య ఎదురువుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనధికారికంగా తవ్వి మురుగునీటిని నిల్వ చేయడం వల్ల సమీపంలో ఉన్న శివసాయి కాలనీలో రోడ్డుమీదకు నీరు చేరి స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారని భాస్కరరావు సోమవారం ఎంపీడీవో శైలజకు వినతి పత్రం అందించారు. 2013లో రాగోలు పంచాయతీ 7వ వార్డు సభ్యురాలుగా కొనసాగిన బొణిగి వెంకటలక్ష్మీ ఈ సమస్యపై పంచాయతీ అధికారులు, స్థానిక సర్పంచ్‌కు విన్నవించినా చర్యలు తీసుకోలేదని భాస్కరరావు తెలిపారు. సెప్టిక్‌ ట్యాంక్‌ ఔట్‌లెట్స్‌ను మురికి కాలువలకు అనుసంధానం చేయడం వల్ల సమస్య మరింత తీవ్రంగా ఉందని భాస్కరరావు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం అధికారులు స్పందించి మురుగునీరు కాలనీలో ఆవాసాల మధ్య నిల్వ లేకుండా చూడాలని ఎంపీడీవోను కోరారు. మురుగు కాలువలకు ఔట్‌లెట్‌లు ఏర్పాటుచేసి సమస్యకు పరిష్కారం చూపించాలని భాస్కరరావు కోరారు.

Comments


Subscribe to Our Newsletter

Thanks for submitting!

  • X
  • Instagram
  • Facebook
  • YouTube
bottom of page