సొమ్ములివ్వకుంటే పలకలు ఛిద్రం
ఇళ్లు, వ్యాపార సంస్థల నుంచి డబ్బులు దండేస్తున్న కాంట్రాక్టర్లు
(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
నగరంలో స్పెషల్ డ్రైవ్ పేరుతో నిర్వహిస్తున్న మురుగు కాలువల్లో సిల్ట్ తొలగింపు పనులు చేస్తున్నవారు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. నగరంలో అన్ని ప్రధాన మార్గాల్లోనూ ఆసుపత్రులో, షాపులో ఉన్నాయి. వీటి ముందున్న కాలువల మీద పలకలు తొలగించడానికి కాంట్రాక్టర్ వద్ద పని చేస్తున్న సిబ్బంది డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. స్థానిక ఫారెస్ట్ ఆఫీసు రోడ్డులో ఉన్న ఆసుపత్రుల యాజమాన్యం అడిగినంత సొమ్ములివ్వలేదని ఏకంగా పలకలన్నీ బయట పడేసి సిల్ట్‌ను తీశారు. ఆ పక్కనే మరో షాపు యజమాని సొమ్ములిచ్చారని కనీసం దాని జోలికి పోలేదు. కోటి రూపాయల కాంట్రాక్ట్‌లో కాలువల మీద పలకలు తొలగించడం, మళ్లీ వాటిని యథావిధిగా అమర్చడం కాంట్రాక్టర్ పనే. కానీ ఇష్టారాజ్యంగా పలకలు తీసి పక్కన పడేస్తున్నారు. మళ్లీ దీన్ని వేయాలంటే అదనపు సొమ్ములు డిమాండ్ చేస్తున్నారు. కొన్ని ఆసుపత్రుల వద్ద పలకలు తొలగించి పక్కన పడేయడం వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి కార్పొరేషన్‌లో ఇంతవరకు ఎప్పుడూ జరగని రీతిలో నాణ్యంగా సిల్ట్ తీయిస్తున్నారు. ప్రతీ ఏడాది వర్షాకాలానికి ముందు కాలువల్లో పూడికను తొలగించడం సర్వసాధారణమే అయినా ఈసారి ఎప్పుడూ లేనంత స్థాయిలో కాలువ చివరి వరకు వెళ్లి మొత్తం పూడికను బయట పెడుతున్నారు. ఒక్కో కాలువ నుంచి టన్నుల కొద్దీ సిల్టు బయటకు రావడమే ఇందుకు సాక్ష్యం. గురువారం నగరంలో భారీ వర్షం కురినప్పుడు కార్పొరేషన్ పరిధిలో పర్యటించిన గొండు శంకర్‌కు ఎక్కడికక్కడ నీరు నిల్వ ఉండటం కనిపించినా, ఆయన కార్యాలయానికి వెళ్లేసరికే ఎక్కడా నీరు నిలిచిపోకుండా కాలువల ద్వారా వెళ్లిపోయింది. సాధారణంగా కృష్ణాపార్క్, బాకర్‌సాహెబ్‌పేట వంటి ప్రాంతాల్లో చిన్నపాటి వర్షానికే నీరు నిల్చుండిపోతుంది. కానీ సిల్ట్‌ను పూర్తిస్థాయిలో తొలగించడం వల్ల మొన్నటి వర్షానికి నీరు నిలిచే బాధ తప్పింది. అయితే పలకలు తొలగించడం దగ్గరే కాంట్రాక్టర్లు ఓవరాక్షన్ చేస్తున్నారు.
Comentarios