`స్పెషల్ డ్రైవ్‌ను పట్టించుకోని మున్సిపల్ అధికారులు
`పర్యవేక్షణ లేక ఇష్టారాజ్యంగా సాగుతున్న పనులు
`వర్షాల వల్ల తీసిన మురుగంతా మళ్లీ కాలువల్లోకే
కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నగరంలో పారిశుధ్య కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మురుగు కాలువల్లో నెలల తరబడి పేరుకుపోయిన సిల్ట్‌ను తొలగించే పనిని గత ప్రభుత్వంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకే అప్పగించారు. సాధారణంగా మున్సిపల్ పారిశుధ్య కార్మికులే చేయాల్సిన ఈ పనులను కాంట్రాక్టర్లకే ఇచ్చినా అవి పక్కాగా జరగడంలేదు. చాలాచోట్ల ఇళ్లు, షాపుల యజమానులు కాలువలపై సిమెంట్ పలకలు వేసి కప్పేశారు. ఇప్పుడు వాటిని తొలగించాల్సి ఉన్నా యజమానులు అభ్యంతరం చెబుతున్నారంటూ కాంట్రాక్టర్లు వాటిని వదిలేసి మిగిలిన కాలువల్లోనే సిల్ట్ తొలగిస్తున్నారు. మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లేకుండానే జరుగుతున్న ఈ పనులపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి.

(సత్యంన్యూస్, శ్రీకాకుళం)
జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ నెల 18న అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ జిల్లాలో పారిశుధ్యం అధ్వానంగా ఉందని, దీనిపై వారం రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని నగరపాలక సంస్థ, మున్సిపల్, పంచాయతీ శాఖ అధికారులను ఆదేశించారు. ఆ మేరకు నగరం పరిధిలో విలీన పంచాయతీలతో కలుపుకొని కాలువల్లో మురుగు(సిల్ట్) తొలగింపునకు 12 పనులుగా విభజించి సివిల్ కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఈ పనులకు కార్పొరేషన్ సాధారణ నిధుల నుంచి రూ.కోటి మంజూరు చేశారు. గత ప్రభుత్వ హయాంలో నగరంలో సివిల్ పనులు చేసిన వారికే ఈ పనులను టెండర్ లేకుండా అప్పగించారు. ప్రస్తుతం పనులు జరుగుతున్నా నగరపాలక సంస్థ ఇంజినీర్ల పర్యవేక్షణ కనిపించడంలేదు. అదేంటని అధికారులను అడిగితే పనులు కాంట్రాక్ట్‌కు అప్పగించామని, పూర్తిస్థాయిలో పనులు చేస్తేనే బిల్లులు చెల్లిస్తామని చెబుతున్నారు. కాలువల్లో మురుగు తొలగించే ప్రక్రియను ఆరు నెలలకోసారి ప్రాధాన్యత క్రమంలో నగరపాలక సంస్థ పారిశుధ్య సిబ్బందే నిర్వహిస్తుంటారు. అయితే ఏడాదిన్నర కాలంగా ఈ పనులు తూతూమంత్రంగా సాగాయి. ఫలితంగా కాలువల్లో సిల్ట్ చేరి మురుగునీరు రోడ్లపై పారుతున్న దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలతో ప్రత్యేక డ్రైవ్ పేరుతో సాధారణ నిధుల నుంచి రూ.కోటి ఖర్చు చేస్తున్నా ఆశించిన స్థాయిలో సిల్ట్ తొలగింపు జరగడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
పర్యవేక్షణ లోపం
నగరంలోని చిన్నబజార్ రోడ్డులో వారం రోజులుగా సిల్ట్ తొలగింపు పనులు జరుగుతున్నాయి. ప్రతి షాపు, ఇంటి ముందు కాలువపై ఉన్న పలకలు తొలగించి జేసీబీతో సిల్ట్ తొలగించాలి. ఈ క్రమంలో కొందరు పలకలు తొలగించనీయకుండా అడ్డుకుంటుండటంతో అక్కడక్కడా పలకలు తొలగించడం లేదు, సిల్ట్ తీయడం లేదు. అలా ప్రతి వంద మీటర్లలో సుమారు 30 మీటర్ల మేరకు కాలువల్లో సిల్ట్ తీయని పరిస్థితి నెలకొంది. పలకలు తీసినా సిల్ట్ తీయకుండా విడిచిపెడుతున్నారు. కొన్నిచోట్ల షాపులు, ఇంటి యజమానులు నిరాకరిస్తున్నారని విడిచిపెట్టి వెళ్లిపోతున్నారు. మరికొందరు నగరపాలక సంస్థలో పరిచయం ఉన్న ఇంజినీరింగ్ అధికారులతో ఫోన్ చేయించి పలకలు, కాంక్రీట్ స్లాబ్‌లు తొలగించకుండా అడ్డుకుంటున్నారు. దీనిపై మున్సిపల్ ఇంజినీర్‌ను వివరణ అడిగితే కాలువలపై స్లాబ్‌లు ఉన్నచోట విడిచిపెడుతున్నామని చెబుతున్నారు. వీటిని తొలగించడానికి ప్రొక్లెయినర్ అవసరమంటున్నారు. మరోవైపు స్లాబ్‌లను తొలగించి సిల్ట్ తీయాలని సివిల్ కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించాం, ఆ మేరకు వాటిని తొలగించి సిల్ట్ తీయాల్సింది వారేనంటూ ముక్తాయింపు ఇస్తున్నారు. యంత్రాలు వెళ్ల్లలేని చోట మ్యాన్‌పవర్ పెట్టి సిల్ట్ తొలగించాలని కాంట్రాక్టర్లను ఆదేశించినట్లు చెబుతున్నారు. కార్పొరేషన్ అధికారులు మాత్రం పనులు జరుగుతున్న తీరును పరిశీలించకుండా కార్యాలయాల్లో కూర్చొని పారిశుధ్య సిబ్బంది ద్వారానే పరిస్థితి తెలుసుకుంటున్నారు. ఇదిలా ఉండగా రెండు రోజులుగా భారీ వర్షాలు పడుతుండటం, కాలువల నుంచి తీసిన సిల్ట్ అక్కడే విడిచిపెట్టడం వల్ల తీసిన సిల్ట్ మళ్లీ కాలువల్లోకి వెళ్లిపోతోంది. సాధారణంగా కాలువల్లో తీసిన సిల్ట్‌ను పక్కనే వేసి, అందులో తడి ఎండిన తర్వాత తీసుకుపోతారు. కానీ వర్షాలు ప్రారంభానికి ముందు ఈ పనులు చేపడుతున్నందున ఏ రోజు మురుగును ఆ రోజు తరలించకపోతే మళ్లీ కాలువల్లోకే తొలగించిన మురుగు చేరిపోయే ప్రమాదముందని ఇంజినీరింగ్ అధికారులకు తెలిసినా ఆ మేరకు పర్యవేక్షించకపోవడం వల్ల గురువారం కురిసిన భారీ వర్షానికి తొలగించినది మొత్తం మళ్లీ కాలువల్లోకే చేరిపోయింది. మొత్తం 50 డివిజన్లలో సిల్ట్ తొలగింపు కోసం 12 మందికి కాంట్రాక్ట్ ఇవ్వడం కేవలం పని వేగంగా సాగడానికి, ప్రజలకు వెసుసుబాటు కల్పించడానికి. కానీ ఒక్కరికే ఒకటికి మించిన వర్క్‌లు రావడం వల్ల ఒకదాని తర్వాత ఒకటి పూర్తిచేయడంతో పనులన్నీ వర్షార్పణమైపోయాయి. కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాం, అంతా వారే చూసుకుంటారన్న మున్సిపల్ ఇంజినీర్ల ధీమా కారణంగా పారిశుధ్యం కోసం వెచ్చించిన రూ.కోటి నిధులు కాలువలో పోసిన పన్నీరుగానే మిగిలిపోనుంది.
Comments